పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాతావరణం విషయంలో అంతర్జాతీయ సహకారానికి, న్యాయమైన, ప్రతిష్ఠాత్మకమైన ఫలితం సాధించేందుకు అంటాల్య (టర్కీ)లో జరిగే యూఎన్ఎఫ్‌సీసీసీ కాప్-31లో నిబద్ధతను స్పష్టం చేసిన భారత్

పారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 9.1 ద్వారా అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ ఆర్థిక వనరుల బాధ్యతలను నెరవేర్చాలని స్పష్టం చేసిన భారత్

గ్లోబల్ సౌత్ దేశాల విషయంలో వాతావరణ మార్పులను ఎదుర్కోవటంలో సమానత్వం, న్యాయపరమైన మార్పు, అనుకూలత కీలకమన్న భారత్

నాడు పోస్టు చేయడమైనది: 10 NOV 2026 1:11PM by PIB Hyderabad

వాతావరణ అంశంలో అంతర్జాతీయ సహకారానికి, సమానత్వం, ఉమ్మడి అయినప్పటికీ భిన్నమైన బాధ్యతలు, సామర్థ్యానికి తగినట్లుగా వ్యవహరించటం (సీబీడీఆర్-ఆర్‌సీ) వంటి సూత్రాల పట్ల భారత్ నిబద్ధతను మరోసారి స్పష్టం చేసింది. టర్కీలోని అంటాల్యలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల వ్యవస్థ సదస్సు (యూఎన్ఎఫ్‌సీసీసీ) 31వ పక్షాల సమావేశం (కాప్-31)లో న్యాయమైన, సమానమైన, ప్రతిష్టాత్మకమైన ఫలితాల సాధనకు పిలుపునిచ్చింది.

 

కాప్-31 సదస్సులో భారత్ తరఫున కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ నరేంద్ర భూషణ్ ప్రారంభోత్సవ ప్రసంగం చేశారు. కాప్-31కి నాయకత్వం వహిస్తున్న టర్కీ, ఆస్ట్రేలియాకు కృతజ్ఞతలు తెలిపారు. వాతావరణ అంశంలో అంతర్జాతీయ సహకరాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేసిన అన్ని పక్షాలను, చర్చల బృందాలను ఆయన అభినందించారు. జీ-77, చైనా, ఎల్‌ఎండీసీ, బేసిక్ దేశాలు చేసిన ప్రకటనలతో భారత్ ఏకీభవిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

 

అంతర్జాతీయ సహకార ప్రాముఖ్యతను తెలియజేస్తూ... యూఎన్‌ఎఫ్‌సీసీసీ, పారిస్ ఒప్పందం వంటివి దేశాలకు గళం వినిపించే సమగ్ర వేదికలని భారత్ స్పష్టం చేసింది. సమానత్వం, సీబీడీఆర్-ఆర్‌సీ సూత్రాలపై ఆధారపడి ఈ ప్రక్రియపై అచంచలమైన విశ్వాసం ఉందని భారత్ పేర్కొంది. చర్చలు, ఏకాభిప్రాయం, చర్య అనే మార్గదర్శకాలతో కూడిన 'అమలుకు సంబంధించిన కాప్' అధ్యక్షతా దృక్పథాన్ని భారత్ స్వాగతించింది. చర్చల ద్వారా నమ్మకం కుదురుతుందని, ఏకాభిప్రాయం వల్ల ఫలితాలపై ఉమ్మడి బాధ్యత కలుగుతుందని, వాగ్దానాలను క్షేత్రస్థాయిలో ఆచరణలోకి తీసుకువచ్చేందుకు చర్యలు దోహదపడతాయని భారత్ పేర్కొంది.

 

ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్‌ను దాటితే భవిష్యత్తులో సవాళ్లు మరింత పెరుగుతాయని భారత్ స్పష్టం చేసింది. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ఉమ్మడి ప్రయత్నాల్లో ఎవరూ వెనుకబడిపోకుండా చూసేందుకు సమానత్వం ఆవశ్యకమని చెప్పింది. ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తూనే.. ప్రపంచ వాతావరణ చర్యలకు తగిన భాగస్వామ్యాన్ని అందించాలన్న నిబద్ధతను భారత్ స్పష్టం చేసింది. కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాలకే కాక ప్రత్యేకించి గ్లోబల్ సౌత్ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు న్యాయమైన పరివర్తన, అనుకూలమైన అవసరాలను తీర్చటం వంటివి అభివృద్ధి సవాలుతో ముడిపడున్నట్లు భారత్ పేర్కొంది.

 

వాతావరణ ఆర్థిక సహాయం అంశంపై మాట్లాడుతూ... అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ చర్యలను వేగవంతం చేసేందుకు, బలహీనతలను ఎదుర్కొనేందుకు అనుకూల ఆర్థిక పెట్టుబడులను బలోపేతం చేయటంలో అభివృద్ధి చెందిన దేశాల నుంచి వచ్చే ప్రభుత్వ నిధులే ప్రధానమని భారత్ స్పష్టం చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక వనరులను సమకూర్చాల్సిన అభివృద్ధి చెందిన దేశాల బాధ్యతను నిర్దేశించే పారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 9.1 ప్రాథమిక ప్రాముఖ్యతను గుర్తుచేసింది. కాప్-31 వద్ద నిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని భారత్ స్పష్టం చేసింది. అందరికీ ఆమోదయోగ్యమైన, న్యాయమైన, ప్రతిష్ఠాత్మకమైన ఫలితాలను సాధించే దిశగా అన్ని పక్షాలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేసింది.

***

 


(రిలీజ్ ఐడి: 2335275) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada