ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్‌లోని మౌ జల్లాలో మెఫెడ్రోన్‌ తయారీ రహస్య కేంద్రాన్ని ఛేదించిన కేంద్ర నార్కోటిక్స్‌ బ్యూరో

ఆపరేషన్‌ వజ్ర 3.0లో భాగంగా 11.7 కిలోల మెఫెడ్రోన్‌, ముడి రసాయనాలు, ప్రయోగశాల పరికరాలు స్వాధీనం, ఇద్దరు అనుమానితుల అరెస్టు

నాడు పోస్టు చేయడమైనది: 11 NOV 2026 3:51PM by PIB Hyderabad

అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల తయారీ, సరఫరా వ్యవస్థపై కేంద్ర నార్కోటిక్స్‌ బ్యూరో (సీబీఎన్‌) కీలక చర్యలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లా తాజోపూర్‌ పారిశ్రామిక ప్రాంతంలో మెఫెడ్రోన్‌ (ఎండీ)ను రహస్యంగా తయారు చేస్తున్న ప్రయోగశాలను గుర్తించి ధ్వంసం చేసింది. ఆపరేషన్‌ వజ్ర 3.0లో భాగంగా ఈ చర్యలు చేపట్టింది.

 

సీబీఎన్‌ మధ్యప్రదేశ్‌ విభాగం సేకరించిన నిర్దిష్ట నిఘా సమాచారంతో.. సీబీఎన్‌ మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ విభాగాలకు చెందిన సంయుక్త బృందం 2026 నవంబర్‌ 8న దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా క్రియాశీలంగా పనిచేస్తున్న రహస్య సింథటిక్‌ మాదకద్రవ్యాల తయారీ కేంద్రాన్ని గుర్తించి ఛేదించింది.

 

ఈ ఆపరేషన్‌లో వివిధ తయారీ దశల్లో ఉన్న 11.7 కిలోల మెఫెడ్రోన్‌ (ఎండీ)ను స్వాధీనం చేసుకున్నారు. మెఫెడ్రోన్‌ తయారీలో కీలకంగా ఉపయోగించే 20.9 కిలోల 2-బ్రోమో-4-మిథైల్‌ప్రొపియోఫెనోన్‌తో పాటు, 3.5 కిలోల ఎసిటిక్‌ అన్‌హైడ్రైడ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే డైక్లోరోమీథేన్‌, హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌, సోడియం బైకార్బొనేట్‌, సోడియం క్లోరైడ్‌, ఆర్గానిక్‌ అమైన్‌లతో సహా సుమారు 119.9 కిలోలు/లీటర్ల వివిధ రకాల రసాయనాలు, ద్రావకాలు, తయారీ ప్రక్రియలో ఉపయోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ ఆపరేషన్‌లో రహస్య ప్రయోగశాలకు సంబంధించిన పూర్తి మౌలిక సదుపాయాలను కూడా స్వాధీనం చేసుకుని, వాటిని ధ్వంసం చేశారు. వీటిలో పారిశ్రామిక గ్రైండర్లు, మిక్సర్లు, స్టీల్‌ ట్యాంకులు, పాత్రలు, వేడి చేసే పరికరాలు, గాజుతో తయారు చేసిన రియాక్షన్‌, డిస్టిలేషన్‌ ఉపకరణాలు, ఉష్ణోగ్రతను కొలిచే పరికరాలు, వోల్టేజ్‌ బ్యాలెన్సర్లు, సింథటిక్‌ మాదకద్రవ్యాల అక్రమ తయారీకి ఉపయోగించే ఇతర పరికరాలతోపాటు వ్యక్తిగత రక్షణ పరికరాలు ఉన్నాయి. 

 

ఈ దాడుల్లో అక్రమ మాదకద్రవ్యాల తయారీ వ్యవస్థతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను ఎన్‌డీపీఎస్‌ చట్టం 1985 కింద అరెస్టు చేశారు. ఈ వ్యవస్థ ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించిందా, ముడి రసాయనాల సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది, ఆర్థిక లావాదేవీల సంబంధాలు, మాదకద్రవ్యాల పంపిణీకి ఉద్దేశించిన మార్గాలు ఏమిటన్న అంశాలపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. 

 

ఈ మొత్తం స్వాధీనం, తదుపరి విచారణకు సంబంధించిన ప్రక్రియలన్నింటినీ ఎన్‌డీపీఎస్‌ చట్టం 1985 నిబంధనలకు అనుగుణంగా, నిర్దేశిత చట్టపరమైన విధానాలను అనుసరించి నిర్వహించారు. 

 

ఈ రహస్య ప్రయోగశాలను ధ్వంసం చేయడం ద్వారా పెద్ద మొత్తంలో మెఫెడ్రోన్‌ అక్రమ తయారీ, పంపిణీని అడ్డుకోగలిగారు. అంతర్రాష్ట్ర సింథటిక్‌ మాదకద్రవ్యాల వ్యవస్థకు ఈ చర్య గట్టి ఎదురుదెబ్బగా నిలిచింది. 

 

2026లో ఇప్పటివరకు సీబీఎన్‌ ఆరు రహస్య ప్రయోగశాలలను ఛేదించి, 130.2 కిలోల మెఫెడ్రోన్‌ (ఎండీ), 1,465.4 కిలోలు/లీటర్ల మాదకద్రవ్యాల తయారీకి ఉపయోగించే రసాయనాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులకు సంబంధించి 20 మంది అనుమానితులను అరెస్టు చేసింది.

 

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల రహస్య తయారీని అరికట్టేందుకు కేంద్ర నార్కోటిక్స్‌ బ్యూరో (సీబీఎన్‌) నిరంతరం అప్రమత్తతతో, అంకితభావంతో, నిబద్ధతతో పనిచేస్తోందని ఈ ఆపరేషన్‌ ప్రతిబింబిస్తోంది. 

రహస్య మాదకద్రవ్యాల తయారీ వ్యవస్థలను ఛేదించడం, మాదకద్రవ్యాల తయారీకి ఉపయోగించే రసాయనాలు దారి మళ్లకుండా నిరోధించడం, అంతర్రాష్ట్ర అక్రమ రవాణా ముఠాలను గుర్తించి వాటి కార్యకలాపాలను అడ్డుకోవడం, ఎన్‌డీపీఎస్‌ చట్టం 1985 నిబంధనలను అమలు చేయడం వంటి చర్యలను సీబీఎన్‌ నిరంతరం కొనసాగిస్తోంది. ‘నషా ముక్త్‌ భారత్‌, వికసిత్‌ భారత్‌’ జాతీయ లక్ష్య సాధనకు కూడా తన వంతు కృషి చేస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 2335274) సందర్శకుల సూచీ సంఖ్య : : 26
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Tamil