కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

11 నగరాలకు వెళ్లే 15 ఇండిగో విమానాల్లో ‘డిజిటల్‌ డీటాక్స్‌ 2.0’ కార్యక్రమం - చేత్తో రాసే పోస్టుకార్డుల ద్వారా పండుగ ఉత్సాహాన్ని పంచిన ఇండియా పోస్ట్‌, ఇండిగో


డిజిటల్ యుగంలోనూ పండుగ శుభాకాంక్షలకు వ్యక్తిగత ఆత్మీయతను జోడిస్తూ దీపావళి విశిష్టతను చాటిచెప్పే వినూత్న ప్రచారం

నాడు పోస్టు చేయడమైనది: 10 NOV 2026 5:17PM by PIB Hyderabad

కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ ఇండిగో విమానయాన సంస్థతో కలిసి ‘డిజిటల్‌ డీటాక్స్‌ 2.0’ కార్యక్రమాన్ని నిర్వహించింది. విమాన ప్రయాణంలో పోస్టుకార్డులు రాసే తొలి విడత కార్యక్రమానికి లభించిన విశేష స్పందన నేపథ్యంలో దీన్ని మరోసారి నిర్వహించారు. పండుగల సీజన్‌ను పురస్కరించుకుని చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణికులు తమ ఆత్మీయులకు చేతిరాతతో కూడిన పోస్టుకార్డుల ద్వారా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేసే అరుదైన అవకాశాన్ని పొందారు.

ఈ కార్యక్రమాన్ని 11 చోట్లకు వెళ్లే 15 ఇండిగో విమానాల్లో నిర్వహించారు. వీటిలో చండీగఢ్‌, రాంచీ, బాగ్‌డోగ్రా, ఢిల్లీ, ముంబై, గోవా, పుణె, అహ్మదాబాద్‌, కోల్‌కతా, వారణాసి, జైపూర్‌ ఉన్నాయి. ప్రయాణికులకు ప్రత్యేకంగా రూపొందించిన ‘డిజిటల్‌ డీటాక్స్‌’ కిట్‌లను అందజేశారు. వీటిలో పోస్టుకార్డులు, శుభాకాంక్షల కార్డులు, స్వయంగా తయారు చేసుకునే పోస్టుకార్డులతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన దీపావళి స్టిక్కర్లు ఉన్నాయి. మొబైల్‌ తెరలకు కొంతసేపు దూరంగా ఉంటూ, తమ ఆత్మీయుల కోసం వ్యక్తిగత సందేశాలతో పండుగ శుభాకాంక్షలను చేతిరాతతో తెలియజేయాలని ఈ కిట్‌ల ద్వారా ప్రయాణికులను ఉత్సాహపరిచారు. 

తొలి విడత విజయవంతం కావడంతో, చేతిరాత ఉత్తరాల సంప్రదాయానికి మళ్లీ ప్రాచుర్యం కల్పించడంతో పాటు, సాంకేతిక పరికరాల వినియోగంలో విచక్షణ, సమతుల్యతను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.  విమాన ప్రయాణికులకు ఉత్తరాలు రాసే అనుభూతిని పరిచయం చేయడం ద్వారా, డిజిటల్‌ ప్రపంచం వేగంగా విస్తరిస్తున్న నేటి కాలంలోనూ వ్యక్తిగత ఉత్తర ప్రత్యుత్తరాలకు ఉన్న ప్రత్యేకత, చిరస్థాయిగా నిలిచే ఆకర్షణను ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

ఈ కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ఇందులో పాల్గొన్న పలువురు తమ మధురానుభూతులను పంచుకున్నారు. ఒక ప్రయాణికుడు మాట్లాడుతూ, “30 వేల అడుగుల ఎత్తులో విమానంలో కూర్చుని పోస్టుకార్డు రాయడం అద్భుతమైన అనుభూతి. జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం ఇది” అన్నారు. మరో ప్రయాణికుడు తన అనుభవాన్ని వివరిస్తూ, “నేను తొలిసారిగా పోస్టుకార్డు రాశాను. తక్షణమే డిజిటల్‌ సందేశాలు పంపుకునే ఈ కాలంలోనూ చేతిరాత సందేశాలకు ఎంత ప్రత్యేకత ఉంటుందో ఈ అనుభవం నాకు తెలియజేసింది” అని పేర్కొన్నారు. పండుగ శుభాకాంక్షలకు ఈ కార్యక్రమం అందించిన ప్రత్యేకతను ప్రశంసిస్తూ మరో ప్రయాణికుడు, “డిజిటల్‌ సందేశం పంపడం కంటే చేతిరాతతో కూడిన పోస్టుకార్డు ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం మరింత ఆత్మీయంగా, అర్థవంతంగా అనిపించింది” అని అన్నారు. 

‘డిజిటల్‌ డీటాక్స్‌ 2.0’ కార్యక్రమం ద్వారా తపాలా శాఖ వినూత్న ప్రజా సంబంధ కార్యక్రమాల పట్ల తన నిబద్ధతను మరోసారి చాటిచెప్పింది. ఉత్తరాల ద్వారా ప్రజల మధ్య అనుబంధాలను పెంపొందించే చిరకాల సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తూ, దీపావళి వేడుకలకు మరింత ఆత్మీయతను జోడించింది.

దీపావళికి సొంతూళ్లకు వెళ్లే విమాన ప్రయాణికులకు ఇండియా పోస్ట్ ఈ కార్యక్రమం ద్వారా ఒక మరుపురాని అనుభవాన్ని అందించింది. చండీగఢ్, ముంబై, పుణే, జైపూర్, అహ్మదాబాద్, గోవా మార్గాల్లో ప్రయాణించే విమానాల్లో ప్రయాణికులు కొంతసేపు డిజిటల్ పరికరాలకు దూరంగా (డిజిటల్ డిటాక్స్) ఉంటూ, చేత్తో ఉత్తరాలు రాసే పాతకాలపు ఆత్మీయ సంస్కృతిని పునరుద్ధరించారు. డిజిటల్ స్క్రీన్‌లకంటే చేతిరాతతో పంపే పండుగ శుభాకాంక్షలే మనుషులను నిజంగా దగ్గర చేస్తాయని ఈ వినూత్న కార్యక్రమం నిరూపించింది.

#DigitalDetox #DiwaliWithIndiaPost #IndiaPost #DakSewaJanSewa @IndiGo6E @cpmggujarat @cpmgmaharashtra @cpmgdelhi @cpmgrajasthan @cpmgpunjab

— India Post (@IndiaPostOffice) November 7, 2026

 

***


(రిలీజ్ ఐడి: 2334831) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Kannada , Malayalam