నాడు పోస్టు చేయడమైనది:
09 NOV 2026 5:11PM by PIB Hyderabad
యమునా నదిపై వినోదాత్మక క్రూయిజ్ సేవలను ప్రారంభించడం ద్వారా ఢిల్లీ పర్యాటక రంగంలో మరో కొత్త ఆకర్షణ అందుబాటులోకి రానుంది. కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ రేపు (మంగళవారం, 2026 నవంబర్ 10) ఢిల్లీలోని సోనియా విహార్ వద్ద ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సర్దార్ తరంజిత్ సింగ్ సంధు, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా పాల్గొననున్నారు. యమునా నదిలోని సోనియా విహార్–జగత్‌పూర్ మార్గంలో ఈ సేవలను అభివృద్ధి చేశారు. నదీ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, దేశ రాజధానిలో సందర్శకులకు సరికొత్త వినోద అనుభూతిని అందించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీ శాంతను ఠాకూర్, రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష్ మల్హోత్రా హాజరుకానున్నారు. ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు, ప్రజాపనుల శాఖ, నీటిపారుదల, వరద నియంత్రణ శాఖ మంత్రి శ్రీ ప్రవేశ్ సాహిబ్ సింగ్, పర్యాటకశాఖ మంత్రి శ్రీ కపిల్ మిశ్రా, పార్లమెంటు సభ్యుడు శ్రీ మనోజ్ తివారీతో పాటు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాల ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
జాతీయ జలమార్గాల చట్టం- 2016 కింద యమునా నదిని జాతీయ జలమార్గం-110గా గుర్తించారు. ఢిల్లీలోని యమునా నదిపై సోనియా విహార్-జగత్‌పూర్ మార్గంలో వినోదాత్మక క్రూయిజ్ సేవలను అభివృద్ధి చేయడం, ఈ జాతీయ జలమార్గాన్ని వినోద నౌకాయానం, నదీ పర్యాటకానికి వినియోగించుకునే దిశగా కీలక ముందడుగు. ఈ సేవల ప్రారంభానికి ముందు.. గత నెలలో భారత అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ (ఐడబ్ల్యూఏఐ), ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో క్రూయిజ్ నౌకకు విజయవంతంగా ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించారు.
కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ (ఐడబ్ల్యూఏఐ) ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తోంది. సుస్థిర అంతర్గత జల రవాణాను ప్రోత్సహించడం, పట్టణ రవాణా, పర్యాటక మౌలిక సదుపాయాల్లో జలమార్గాలను కీలక భాగంగా అభివృద్ధి చేయాలన్న ప్రాధికార సంస్థ నిబద్ధతకు ఈ కార్యక్రమం అద్దం పడుతోంది.
ఈ క్రూయిజ్ సేవలు ఢిల్లీ వాసులు, పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించడంతో పాటు యమునా నదితో ప్రజల అనుబంధాన్ని మరింత పెంచుతాయని భావిస్తున్నారు. విద్యుత్ ఆధారిత క్రూయిజ్ నౌకల వినియోగం ద్వారా స్వచ్ఛమైన, సుస్థిర రవాణాను ప్రోత్సహించడంలో అంతర్గత జలమార్గాల సామర్థ్యాన్ని కూడా చాటిచెప్పనుంది. అదే సమయంలో జాతీయ రాజధాని ప్రాంతానికి మరో వినోదాత్మక పర్యాటక ఆకర్షణను జోడించనుంది.
వినోదాత్మక యమునా నదీ క్రూయిజ్ సేవలను కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ (ఐడబ్ల్యూఏఐ) అభివృద్ధి చేస్తోంది. ఢిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ (డీడీఏ), ఢిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ (డీటీటీడీసీ), ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ), ఢిల్లీ ప్రభుత్వ నీటిపారుదల, వరద నియంత్రణశాఖ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు.
***