ఔషధాల విభాగం
azadi ka amrit mahotsav

క్యాన్సర్ నిరోధక మందులపై సవరించిన ధరలు ఈ నెల 9 నుంచి అమలు

గణనీయంగా తగ్గిన పలు బ్రాండ్‌లకు చెందిన 1000కి పైగా మందుల ధరలు
వినియోగదారులకు ఏటా సుమారు రూ. 3500 కోట్లకు పైగా ఆదా అయ్యే అవకాశం

నాడు పోస్టు చేయడమైనది: 07 NOV 2026 3:51PM by PIB Hyderabad

రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ఔషధ విభాగం పరిధిలోని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ)... 137 క్యాన్సర్ నిరోధక ఔషధాల గరిష్ట విక్రయ ధరపై వాణిజ్య మార్జిన్లను పరిమితం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఔషధాల సవరించిన ధరలు ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయి.

 

నేటి వరకు మొత్తం 76 ఫార్మాస్యూటికల్ కంపెనీలు 121 ఔషధాలకు చెందిన 1225 క్యాన్సర్ నిరోధక ఫార్ములేషన్ల కోసం సవరించిన ఎంఆర్‌పీని నివేదించాయి. క్యాన్సర్ నిరోధక మందులకు సంబంధించిన 1031 ఫార్ములేషన్ల కోసం ఎంఆర్‌పీని తగ్గిస్తున్నట్లు కంపెనీలు నివేదించాయి. వీటిలో 600 బ్రాండ్లు 50 శాతం కంటే ఎక్కువ తగ్గింపును నివేదించగా, అత్యధిక తగ్గింపు 96.45 శాతంగా ఉంది. గుర్తింపు పొందిన 137 క్యాన్సర్ నిరోధక ఔషధాలకు గానూ... మరో 10-15 ఔషధాలు దేశంలో ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఈ ఔషధాలు విడుదలైనప్పుడు, వాటికీ ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ (టీఎంఆర్) వర్తిస్తుంది.

 

ఈ నెల 9 నుంచి అమల్లోకి రానున్న ధరల తగ్గింపు కారణంగా వినియోగదారులకు ఏడాదికి సుమారు రూ. 3,502.31 కోట్ల మేర ఆదా అవుతుందని అంచనా.

 

సవరించిన ధరలతో కూడిన ప్రధాన క్యాన్సర్ నిరోధక ఔషధ బ్రాండ్‌ల జాబితా

క్యాన్సర్ సంరక్షణ కోసం అవసరమైన క్యాన్సర్ నిరోధక మందుల అందుబాటు ధరలను, లభ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో... షెడ్యూల్ చేయని క్యాన్సర్ నిరోధక మందుల టీఎంఆర్ ఒక కీలక ముందడుగు.

 

తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు... 2026 అక్టోబరు 17 నాటి నోటిఫికేషన్ ఎస్‌వో 5690 (E) అమల్లో ఉంటుంది. 'డ్రగ్స్ (ధరల నియంత్రణ) ఉత్తర్వులు-2013' లోని పేరా 20(1) నిబంధనలకు అనుగుణంగా తయారీదారులు వార్షిక ధరల పెంపును చేపట్టవచ్చు. అయితే, గరిష్టంగా అనుమతించే 30 శాతం వాణిజ్య మార్జిన్ నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

 

ప్రతి రిటైలర్, డీలర్, ఆసుపత్రి, సంస్థ క్యాన్సర్ నిరోధక మందుల సవరించిన ఎంఆర్‌పీ జాబితాను తమ వెబ్‌సైట్‌లలో, తమ ప్రాంగణాల్లో ప్రముఖంగా ప్రదర్శించవలసి ఉంటుంది. ఎన్‌పీపీఏ నోటిఫికేషన్ ప్రకారం... తయారీదారులు, డీలర్లు, ఆసుపత్రులు, వైద్య సంస్థలు దీనిని పాటిస్తున్నాయో లేదో రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. వినియోగదారులు ఫార్మా సహీ దామ్ మొబైల్ అప్లికేషన్, ఎన్‌పీపీఏ వెబ్‌సైట్ (www.nppa.gov.in) ద్వారా వర్తించే ధరలను తనిఖీ చేసుకోవచ్చు. సవరించిన ధరల ఉల్లంఘన లేదా నిబంధనల ఉల్లంఘన గురించి సంబంధిత అధికార సంస్థకు నివేదించవచ్చు.

కింది మార్గాల్లో ఫిర్యాదులను సమర్పించవచ్చు:

ఈమెయిల్: monitoring-nppa[at]gov[dot]in

హెల్ప్‌లైన్: 1800-11-1255

పోస్ట్: డిప్యూటీ డైరెక్టర్, పర్యవేక్షణ విభాగం, ఎన్‌పీపీఏ, 3వ అంతస్తు, వైఎంసీఏ కల్చరల్ సెంటర్ భవనం, 1 జై సింగ్ మార్గ్, న్యూఢిల్లీ – 110001.


(రిలీజ్ ఐడి: 2334220) సందర్శకుల సూచీ సంఖ్య : : 36
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam