పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే... ఓఎంసీలు సరఫరా చేసిన ఈ20 పెట్రోల్


27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 893 నమూనాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారణ

ఐఎస్-17021 ప్రమాణాలకు అనుగుణంగానే కర్ణాటకలో పరీక్షించిన మొత్తం 56 నమూనాలు

వీటిలో 19 శాతం నుంచి 20 శాతం వరకు మాత్రమే ఇథనాల్

కర్ణాటకలో నివేదించిన ఇథనాల్ స్థాయిల ధ్రువీకరణ... నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఉమ్మడి నమూనా సేకరణ, స్వతంత్ర పరీక్షను కోరుతున్న మార్కెటింగ్ కంపెనీలు

నాడు పోస్టు చేయడమైనది: 07 NOV 2026 1:18PM by PIB Hyderabad

కర్ణాటక ప్రభుత్వానికి చెందిన ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ విభాగం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పందించింది. రాష్ట్రంలోని కొన్ని రిటైల్ విక్రయ కేంద్రాల్లో విక్రయిస్తున్న పెట్రోల్‌లో 26 శాతం నుంచి 31 శాతం వరకు ఇథనాల్ కలిసి ఉందని ఆ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ప్రకటనలో నివేదించిన వాదనలకు నిర్దేశిత చట్టబద్ధమైన, సాంకేతిక ప్రక్రియలకు అనుగుణంగా నిర్వహించిన పరీక్షల మద్దతు లేదని మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన (ఓఎంసీలు) — ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) లు స్పష్టం చేశాయి. కర్ణాటకతో సహా దేశవ్యాప్తంగా ఈ మూడు ఓఎంసీలు సరఫరా చేసే ఈ20 పెట్రోల్... ఇథనాల్-మిశ్రిత మోటార్ గ్యాసోలిన్ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ఐఎస్ 17021 ప్రమాణానికి అనుగుణంగా ఉంది.

అక్టోబర్ 2026 ప్రక్రియ కోసం అనుసరించిన నమూనా సేకరణ విధానం, పరీక్షా పద్ధతులపైనా వారు ఆందోళన వ్యక్తం చేశారు.

నమూనా సేకరణ, పరీక్షా పద్ధతికి సంబంధించిన ఆందోళనలు

నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద జారీ చేసిన మోటార్ స్పిరిట్, హై స్పీడ్ డీజిల్ (సరఫరా, పంపిణీ నియంత్రణ, అవకతవకల నివారణ) ఉత్తర్వులు-2005, మార్కెటింగ్ క్రమశిక్షణ మార్గదర్శకాలు (ఎండీజీ)- 2024తో కలిపి చదివినప్పుడు... అది నమూనా సేకరణ, రిటెన్షన్, పరీక్ష, ఫలితాల కమ్యూనికేషన్ కోసం ఒక నిర్దిష్ట విధానాన్ని నిర్దేశిస్తుంది.

నిర్దేశించిన విధానం ప్రకారం ఒక-లీటరు నమూనాలు ఆరింటిని సేకరించాలి. వాటిలో రెండు నమూనాలను డీలర్‌కు రసీదుపై అందజేయాలి. రెండు నమూనాలను చమురు కంపెనీ లేదా విభాగం వద్ద ఉంచాలి. మరో రెండు నమూనాలను నియంత్రణ ఉత్తర్వుల షెడ్యూల్ III కింద నిర్దేశించిన లేదా అధికారిక గెజిట్‌లో తెలియజేసిన ప్రయోగశాలకు పంపాలి. నమూనా లేబుళ్లపై ఉమ్మడిగా సంతకం చేయాలి. పరీక్ష ఫలితాలను నిర్దేశించిన కాలపరిమితిలోగా డీలర్‌కు, చమురు కంపెనీకి తెలియజేయాలి.

సెప్టెంబర్-2026 కార్యక్రమంలో సేకరించిన నమూనాలను రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ ద్వారా నిర్దేశిత ఓఎంసీ ప్రయోగశాలలకు పంపి, ఎండీజీ-2024 కింద కోరిన నాణ్యతా ప్రమాణాల కోసం పరీక్షించారు. అయితే అక్టోబర్‌లో జరిగిన తదుపరి కార్యక్రమంలో ఓఎంసీ ప్రతినిధుల భాగస్వామ్యం లేకుండానే నమూనాలను సేకరించినట్లు సమాచారం. రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ ద్వారా కోరినప్పటికీ... ఓఎంసీలకు సంబంధిత రిటెన్షన్ నమూనాలు, అవుట్‌లెట్‌ల వారీగా పూర్తి వివరాలు లేదా ప్రయోగశాల నివేదికలనూ అందించలేదు.

నియంత్రణ ఉత్తర్వుల కింద నిర్దేశించిన ప్రయోగశాల్లో నిర్వహించిన పరీక్షలకు బదులుగా... ఒక థర్డ్-పార్టీ ప్రయోగశాల జారీ చేసిన సర్టిఫికేట్లపైనే ఈ నివేదిక ఫలితాలు ఆధారపడి ఉన్నాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పేర్కొన్నాయి. నివేదించిన ఇథనాల్ కంటెంట్‌ను స్వతంత్రంగా ధ్రువీకరించడానికి అవసరమైన పూర్తి సాంకేతిక వివరాలను ఆ సర్టిఫికేట్లు అందించడం లేదు. దానికి సమానమైన నమూనాలు, నిర్దేశించిన డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల... ధ్రువీకరణ లేదా పునఃపరీక్ష కోరే అవకాశాన్నీ ఓఎంసీలు, సంబంధిత డీలర్లు కోల్పోయారు.

పరీక్షా పద్ధతులు ఐఎస్ 17021కి అనుగుణంగా ఉండాలి

ఓఎంసీలు నిర్వహించిన ప్రాథమిక సాంకేతిక అంచనాలో... ధ్రువీకరణ పత్రాల్లో పేర్కొన్న ఇథనాల్ పరీక్ష పద్ధతికి సంబంధించీ కొన్ని ఆందోళనలు వెల్లడయ్యాయి.

ఐఎస్ 17021:2018 (సవరణ సంఖ్య 3, ఆగస్టు-2025) ప్రకారం, ఈ20 ఇంధనంలోని ఇథనాల్ శాతాన్ని నిర్ణయించడానికి నిర్దేశిత పద్ధతులను అనుసరించాలి. అవి – ఏఎస్‌టీఎం డీ5845 ప్రమాణం కింద 'ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ' (ఎఫ్‌టీఐఆర్)... అనుబంధం C లో పేర్కొన్న 'వాటర్ ఎక్స్‌ట్రాక్షన్' (నీటి ద్వారా సంగ్రహణ) పద్ధతి, లేదా ఏఎస్‌టీఎం డీ4815/డీ6839 ప్రమాణాల కింద 'గ్యాస్ క్రోమాటోగ్రఫీ' పద్ధతి.

ముఖ్యంగా, ఏఎస్‌టీఎం డీ4815/డీ6839 ప్రకారం గ్యాస్ క్రోమాటోగ్రఫీని ఉపయోగించినప్పుడు, నమూనాను మొదట ఆక్సిజనేట్-రహిత పెట్రోల్‌తో 1:1 నిష్పత్తిలో విలీనం చేయాలి. ఫలితాన్ని ఈ10 ధ్రువీకరించిన రిఫరెన్స్ మెటీరియల్‌ ఉపయోగించి సరిదిద్దాలి.

కర్ణాటక పత్రికా ప్రకటనలో ఉదహరించిన ధ్రువపత్రాలు... వర్తించే ప్రామాణిక పరీక్ష పద్ధతిని, సూచించిన విలీనీకరణ విధానాన్ని లేదా సవరణ కోసం ఉపయోగించిన రిఫరెన్స్ మెటీరియల్‌ను పేర్కొనకుండా, కేవలం “గ్యాస్ క్రోమాటోగ్రఫీ ద్వారా ఇథనాల్ శాతం” అని మాత్రమే ప్రస్తావిస్తున్నాయి. ఈ ముఖ్యమైన వివరాలు లేకపోవడం వల్ల, నివేదించిన 26–31 శాతం ఇథనాల్ గణాంకాలను ఐఎస్ 17021 కింద సూచించిన పద్ధతితో స్వతంత్రంగా ధ్రువీకరించడం సాధ్యం కాదు.

నివేదించిన సాంద్రత రీడింగులూ పరిశీలనకు అర్హమైనవే. 26–31 శాతం ఇథనాల్‌ను కలిగి ఉన్నాయని పేర్కొన్న నమూనాల విషయంలో సంబంధిత ధ్రువపత్రాలు సాంద్రతను 0.742 నుంచి 0.749 గ్రా/సిసి వరకు సూచిస్తున్నాయి. ఇది క్యూసీసీ-1, క్యూసీసీ-2 సర్వేల కింద ఓఎంసీలు పరీక్షించిన ఈ20 నమూనాల కోసం నమోదైన సాంద్రతలు 0.752–0.760 గ్రా/సిసి కంటే తక్కువ. పెట్రోల్ కంటే ఇథనాల్‌కు అధిక సాంద్రత ఉన్నందున... ఇథనాల్ నిష్పత్తి ఎక్కువగా ఉంటే మిశ్రమం సాంద్రత సాధారణంగా పెరుగుతుందని భావించవచ్చు. నిర్దేశిత పద్ధతి ద్వారా పరీక్షించడం, తగిన రిఫరెన్స్ నమూనాలతో ధ్రువీకరించాల్సిన ఆవశ్యకతను ఈ వ్యత్యాసం మరింత స్పష్టం చేస్తోంది.

ఓఎంసీల సీహెచ్‌టీ నాణ్యత పర్యవేక్షణ ద్వారానే నిబంధనల పాటింపు ధ్రువీకరణ

పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్‌టీ)... ఓఎంసీ రిటైల్ అవుట్‌లెట్‌ల వ్యాప్తంగా ఇథనాల్ మిశ్రమాన్ని, ఇంధన నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తోంది.

ఓఎంసీ / సీహెచ్‌టీ క్వాలిటీ కోఆర్డినేషన్ సెల్ (క్యూసీసీ) ప్రక్రియలో భాగంగా... 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఐవోసీఎల్ (330), బీపీసీఎల్ (280), హెచ్‌పీసీఎల్ (283) డిపోలు, రిటైల్ అవుట్‌లెట్ల నుంచి 893 ఈ20 నమూనాలను సేకరించారు. రిఫైనరీ, ఓఎంసీ  క్వాలిటీ-కంట్రోల్ ప్రయోగశాలల్లో ఐఎస్ 17021, అనుబంధం C ప్రమాణాల ప్రకారం ఈ నమూనాల్లోని ఇథనాల్ శాతం కోసం పరీక్షించారు. ఈ 893 నమూనాలన్నింటిలోనూ ఇథనాల్ శాతం నిర్దేశిత పరిధి 19–21 శాతం మధ్యే ఉన్నట్లు తేలింది.

వివిధ ప్రాంతాల నుంచి, మూడు చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) నుంచి సేకరించిన మొత్తం 56 నమూనాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయి. వీటిలో ఇథనాల్ శాతం 19 శాతం నుంచి 20 శాతం మధ్య ఉండగా, సగటున ఇది 19.30 శాతంగా నమోదైంది.

ఓఎంసీ రిటైల్ అవుట్‌లెట్లలో ఇథనాల్ మిశ్రమాన్ని నిర్దేశించిన ప్రమాణాల పరిధిలోనే పర్యవేక్షిస్తున్నారని, నియంత్రిస్తున్నారని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. గణనీయంగా అధిక స్థాయిలో ఇథనాల్ ఉన్నట్లు చూపిన కర్ణాటక పత్రికా ప్రకటన... వాస్తవ ఫలితాలతో పొంతన లేకుండా ఉంది. పారదర్శకమైన, సాంకేతికంగా పటిష్ఠమైన, ఉమ్మడిగా ధ్రువీకరించదగిన పరీక్షా ప్రక్రియ ఆవశ్యకతను ఇవి బలపరుస్తున్నాయి.

ఇథనాల్‌ ను కలపడం నియంత్రిత, స్వయంచాలక ప్రక్రియ

చమురు మార్కెటింగ్‌ సంస్థల (ఓఎంసీలు) రిఫైనరీలు, డిపోల్లో పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపే ప్రక్రియ ( బ్లెండింగ్)ను నిర్దేశిత ప్రమాణాలు, నియంత్రిత, స్వయంచాలక వ్యవస్థల ద్వారా నిర్వహిస్తారు. రిఫైనరీ, డిపో స్థాయుల్లో నిర్దేశిత ప్రమాణాలు, నాణ్యత నియంత్రణ నిబంధనలకు కట్టుబడి ఆటోమేటిక్ కాలిబ్రేషన్, నిష్పత్తి ఆధారిత పరికరాల ద్వారా ఈ బ్లెండింగ్ చేపడుతున్నారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం అనేది మ్యాన్యువల్‌గా (చేతితో) లేదా ఇష్టారాజ్యంగా చేసే ప్రక్రియ కాదు.

మిశ్రమ ఇంధనం వినియోగదారులకు చేరే ముందే, అది భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌) నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించేందుకు చమురు మార్కెటింగ్‌ సంస్థలు (ఓఎంసీలు) తమ సరఫరా, పంపిణీ వ్యవస్థలన్నింటిలో పటిష్ఠమైన నాణ్యతా హామీ విధానాలను అమలు చేస్తున్నాయి.

వినియోగదారులపై ప్రభావానికి సంబంధించిన వాదనలను శాస్త్రీయంగా పరిశీలించాలి

వినియోగదారుల వాహన మైలేజీ తగ్గడం వల్ల ఏటా సుమారు రూ.62,000 కోట్ల నష్టం వాటిల్లుతోందని, వాహనాల మరమ్మతుల కోసం సుమారు రూ.39,000 కోట్లు ఖర్చవుతున్నాయనే వాదనలను కూడా ఇప్పటికే అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాల ప్రాతిపదికన క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ఖర్చులను కలిపితే మొత్తం సుమారు రూ.1.01 లక్షల కోట్లుగా పేర్కొంటున్నారు.

30 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 4 కోట్ల నాలుగు చక్రాల వాహనాలు మూడేళ్లకు పైగా ఈ20 ఇంధనంతో నడుస్తున్నాయి. ప్రతిరోజూ 6 కోట్ల మందికి పైగా తమ వాహనాల్లో ఇంధనం నింపుకునేందుకు పెట్రోల్‌ బంకులను సందర్శిస్తున్నారు. ఈ20 ఇంధన నాణ్యతలో ఏవైనా ప్రధాన లోపాలు ఉంటే, ఇంత భారీ సంఖ్యలో ఉన్న వాహన రంగంలో విస్తృతమైన మైలేజ్ లోపాలు లేదా ఇంజన్ వైఫల్యాలు బయటపడి ఉండేవి. అయితే దేశవ్యాప్తంగా అటువంటి నివేదికలేవీ నమోదు కాలేదు. ప్రచారంలో ఉన్న వదంతులకు భిన్నంగా, క్షేత్రస్థాయిలో విస్తృతంగా జరుగుతున్న ఈ వాస్తవ వినియోగమే ఇంధన నాణ్యత, వాహనాల పనితీరుకు నిదర్శనం. 

ఈ20 ఇంధనం వల్ల వాహనాల పనితీరు, మైలేజీపై కలిగే ప్రభావాలను అంతర్‌ మంత్రిత్వ శాఖల కమిటీ పరిశీలించింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌), ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్ఏఐ), సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించిన అధ్యయనాల్లోనూ ఈ అంశాలను విశ్లేషించారు.

పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం (ఈ20) వినియోగం, వాహనాల పనితీరుపై వ్యక్తమవుతున్న అపోహలకు సమాధానంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ద్వారా విడుదల చేసిన అధికారిక నివేదికలో స్పష్టత ఇచ్చింది. ఈ20 ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా కాలిబ్రేట్ చేసిన వాహనాలలో మైలేజ్ తగ్గుదల కేవలం 1 నుంచి 2 శాతం మాత్రమే ఉంటుందని వెల్లడించింది. అలాగే వాహనాల కేటగిరీ, తయారీ కాలిబ్రేషన్‌ను బట్టి ఇతర కొన్ని వాహనాల్లో మైలేజ్ 3 నుంచి  6 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. 

అందువల్ల, దేశంలోని అన్ని వాహనాల్లో మైలేజీ 10 శాతం తగ్గుతుందని ఏకపక్షంగా అంచనా వేసి, దాని ఆధారంగా వినియోగదారులకు జాతీయ స్థాయిలో రూ.62,000 కోట్ల నష్టం వాటిల్లుతోందని లెక్కించడం శాస్త్రీయంగా నిరూపితమైన అంచనా కాదు. అదేవిధంగా, వాహనాల మరమ్మతుల కోసం రూ.39,000 కోట్లు ఖర్చవుతుందనే అంచనాకు కూడా వాహనాల వాస్తవ పనితీరు సమాచారం, వాహన తయారీలో ఉపయోగించే పదార్థాల ఇంధన అనుకూలతపై అధ్యయనాలు, నమోదైన మరమ్మతుల వ్యయాల ఆధారంగా పారదర్శకమైన మూల్యాంకనం ద్వారా తగిన ఆధారాలు చూపాల్సి ఉంటుంది.

వాహనాల తయారీలో ఉపయోగించే పదార్థాల ఇంధన అనుకూలత, వాహనాల పనితీరుకు సంబంధించిన ఆందోళనలను సాంకేతిక సంస్థలు, ఆటోమొబైల్‌ పరిశ్రమ భాగస్వామ్యంతో ఇప్పటికే అధ్యయనాల ద్వారా పరిశీలించారు. కాబట్టి, ఈ కార్యక్రమం ప్రభావాన్ని అంచనా వేసేటప్పుడు అన్ని వాహనాలకూ ఒకే విధమైన అంచనాలను వర్తింపజేయకుండా  వాహనాల రకం, తయారీ ప్రమాణాలు, ఇంధన అనుకూలత, ఈ సాంకేతిక అధ్యయనాల ఫలితాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమంతో ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలు 

భారత్‌లో ఇథనాల్‌ మిశ్రమ ఇంధన వినియోగ ప్రయాణం రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతోంది. 2001లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ ప్రయాణం... రెండు దశాబ్దాలకు పైగా నిరంతర విధానపరమైన నిర్ణయాల ద్వారా గణనీయమైన పురోగతిని సాధించింది. ‘నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయెల్స్ 2018'తో పాటు, భాగస్వామ్య వర్గాలతో సంప్రదించి నీతి ఆయోగ్ రూపొందించిన 'రోడ్‌మ్యాప్ ఫర్ ఇథనాల్ బ్లెండింగ్ 2025' వంటి కీలక విధానాలు దేశీయ ఇంధన మార్పు, స్థిరమైన ఆర్థిక వృద్ధికి బలమైన పునాది వేశాయి.

పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపి వినియోగించే కార్యక్రమం (ఈబీపీ) దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయ వ్యవసాయ ఆధారిత విలువ జోడింపు వ్యవస్థలను బలోపేతం చేయడం, ఇంధన భద్రతను పెంపొందించడం వంటి భారతదేశ ప్రయత్నాల్లో కీలకమైన భాగం.

2014 - 15 ఇథనాల్‌ సరఫరా సంవత్సరం (ఈఎస్‌వై) నుంచి ఇథనాల్‌ మిశ్రమ ఇంధన కార్యక్రమం ద్వారా సాధించిన ప్రయోజనాలు:

·  రూ.1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్య ఆదా.

·  సుమారు 316 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడి చమురు దిగుమతులకు ప్రత్యామ్నాయం.

·  సుమారు 952 లక్షల మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ (సీఓ₂) ఉద్గారాల తగ్గింపు.

·  రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు.

ఈ స్పష్టమైన ఫలితాలు ఈ కార్యక్రమం ద్వారా కలిగే విస్తృత ఆర్థిక, పర్యావరణ, వ్యవసాయ ప్రయోజనాలను తెలియజేస్తున్నాయి. చమురు మార్కెటింగ్‌ సంస్థల లాభదాయకత, వినియోగదారులకు వాటిల్లుతోందని పేర్కొంటున్న వ్యయాలను మాత్రమే ఎంపిక చేసుకుని పోల్చడం ద్వారా ఈ కార్యక్రమం మొత్తం ప్రభావాన్ని అంచనా వేయలేము.

2025- 26 ఇథనాల్‌ సరఫరా సంవత్సరం (ఈఎస్‌వై) లో 2026 అక్టోబర్‌ 31తో ముగిసిన కాలానికి, జాతీయంగా నిర్దేశించిన 20 శాతం ఇథనాల్‌ మిశ్రమ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు (పీఎస్‌యూ ఓఎంసీలు) 1,089 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను కొనుగోలు చేశాయి. సుమారు 5,673 కోట్ల లీటర్ల పెట్రోల్‌ విక్రయాలకు అనుగుణంగా 1,134 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలిపాయి. ఈ కార్యక్రమం నిర్దిష్ట జాతీయ విధాన ప్రణాళిక ప్రకారం అమలవుతోంది. సరఫరా వ్యవస్థలోని అన్ని దశల్లో ఇథనాల్‌ మిశ్రమ స్థాయులను, నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారు. వ్యక్తిగతపరంగా ఇథనాల్‌ మిశ్రమం నిర్దేశిత స్థాయి కంటే చాలా ఎక్కువగా లేదా తక్కువగా ఉందంటూ చేసే నిరాధార, ధ్రువీకరించని ఆరోపణల ఆధారంగా మొత్తం కార్యక్రమ పనితీరును అంచనా వేయడం సమంజసం కాదు.

నిర్దేశించిన లక్ష్యానికి మించి ఇథనాల్‌ను కలపడం ద్వారా చమురు మార్కెటింగ్‌ సంస్థలకు వాణిజ్యపరమైన ప్రయోజనం ఉంటుందనే వాదన కూడా సరైనది కాదు. ఇథనాల్‌ కొనుగోలుకు గణనీయమైన వ్యయం అవుతుంది. నిర్దేశించిన నిష్పత్తికి మించి ప్రతి అదనపు లీటరు ఇథనాల్‌ను కలపడం వల్ల ఓఎంసీల కొనుగోలు వ్యయం మరింత పెరుగుతుంది. కాబట్టి, ఎలాంటి నిర్దిష్ట ప్రమాణాలు లేకుండా లేదా నిర్ణీత పరిమాణానికి మించి ఇథనాల్‌ను కలపడానికి ఓఎంసీలకు వాణిజ్యపరమైన ప్రేరణ ఏదీ లేదు.

పారదర్శకత, స్వతంత్ర ధ్రువీకరణ కోరుతున్న చమురు మార్కెటింగ్‌ సంస్థలు

వ్యక్తమైన ఆందోళనల నేపథ్యంలో, మూడు చమురు మార్కెటింగ్‌ సంస్థలు కర్ణాటక ప్రభుత్వాన్ని పూర్తి స్థాయి నమూనా సేకరణ పత్రాలు, పెట్రోల్‌ బంకుల వారీగా ప్రయోగశాల పరీక్షల నివేదికలు, వెల్లడించిన ఫలితాల కోసం అనుసరించిన పరీక్ష విధానం వివరాలను అందించాలని కోరాయి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం, ఓఎంసీల ప్రతినిధుల సమక్షంలో, నిర్దేశిత రిఫరీ పరీక్ష పద్ధతిని అనుసరించి, అధీకృత ప్రయోగశాలలో స్వతంత్రంగా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా సంబంధిత ప్రతినమూనాలను (కౌంటర్‌ శాంపిల్స్‌) అందుబాటులో ఉంచాలని కూడా విజ్ఞప్తి చేశాయి.

నియంత్రణ ఉత్తర్వులు, 2024 నాటి మార్కెటింగ్‌ క్రమశిక్షణ మార్గదర్శకాలకు (ఎండీజీ) అనుగుణంగా సంయుక్తంగా నమూనాల సేకరణ, పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతోనూ, ఇతర సంబంధిత అధికారులతోనూ సహకరించడానికి చమురు మార్కెటింగ్‌ సంస్థలు (ఓఎంసీలు) కట్టుబడి ఉన్నాయి. నిర్దేశిత విధానంలో ఏవైనా ఉల్లంఘనలు ఉన్నట్లు నిర్ధారణ అయితే, సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు.

వినియోగదారులకు సరఫరా చేసే పెట్రోలియం ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించడం, నిబంధనల అమలును పర్యవేక్షించడం, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం పట్ల పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్‌ సంస్థల ద్వారా సరఫరా, పంపిణీ వ్యవస్థల్లో ఇప్పటికే అమలులో ఉన్న పటిష్ఠమైన నాణ్యతా హామీ, పర్యవేక్షణ యంత్రాంగాలు ఇందుకు తోడ్పడుతున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2333956) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Tamil , Kannada , Malayalam