సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

మహిళల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈలకు మద్ధతిచ్చేందుకు ఎస్‌ఆర్‌ఐ నిధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ


యశస్విని ప్రచార కార్యక్రమం కింద మహిళా పారిశ్రామికవేత్తల సంస్థలకు వృద్ధి మూలధనాన్ని సమీకరించడంలో ఎస్‌ఆర్‌ఐ నిధి పాత్రను వివరించిన మంత్రిత్వ శాఖ

ప్రైవేటు పెట్టుబడుల రూపంలో దాదాపు రూ.48,000 కోట్ల సమీకరణకు తోడ్పడిన ఎస్‌ఆర్‌ఐ నిధి.. 824 ఎంఎస్‌ఎంఈలకు మద్దతు

నాడు పోస్టు చేయడమైనది: 05 NOV 2026 1:37PM by PIB Hyderabad

మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే యశస్విని ప్రచార కార్యక్రమంలో భాగంగా మహిళల నేతృత్వంలోని ఎంఎస్‌ఎంఈలకు మద్దతిచ్చేందుకు ఆత్మనిర్భర్ భారత్‌ (ఎస్‌ఆర్‌ఐ) నిధిపై అవగాహన కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2026 నవంబర్‌ 4న న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్‌-3లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎంఎస్‌ఎంఈ శాఖ కార్యదర్శి శ్రీ భరత్‌ ఖేరా అధ్యక్షత వహించారు.

ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 60 మందికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వీరితో పాటు ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులు, ఎన్‌ఎస్‌ఐసీ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ లిమిటెడ్‌ (ఎన్‌వీసీఎఫ్‌ఎల్‌), ఎస్‌బీఐ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌వీఎల్‌), ఎస్‌ఆర్‌ఐ నిధి కింద ఉన్న అనుబంధ నిధులు, నీతి ఆయోగ్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్తల వేదిక(డబ్ల్యూఈపీ), అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌-అలీప్‌ మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, అభివృద్ధి కమిషనర్‌ డాక్టర్‌ రజనీష్‌ ఎస్‌ఆర్‌ఐ నిధి ప్రస్థానాన్ని వివరించారు. సంప్రదాయ రుణాలకే పరిమితం కాకుండా, ఎంఎస్‌ఎంఈలకు ఈక్విటీ పెట్టుబడి రూపంలో మద్దతు అందించాలనే ఉద్దేశంతో ఈ నిధిని రూపొందించినట్లు తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్ల నిధుల కేటాయింపునకు కట్టుబడి ఉండగా, ప్రైవేటు పెట్టుబడిదారులు అంతకు నాలుగు రెట్లు పెట్టుబడులు సమకూరుస్తారని అంచనా వేసినట్లు వివరించారు. ఎస్‌ఆర్‌ఐ నిధి ద్వారా పెట్టుబడులు పొందిన పలు సంస్థల టర్నోవర్‌ కేవలం రెండు నుంచి మూడేళ్ల వ్యవధిలోనే మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆ సంస్థలు ప్రైవేటు వనరుల నుంచి మరిన్ని పెట్టుబడులను కూడా సమీకరించుకున్నాయని తెలిపారు. ఈ ఫండ్‌ గురించి తమ సభ్యులకు తెలియజేయాలని కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమల సంఘాల ప్రతినిధులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

 

ప్రారంభోపన్యాసంలో ఎంఎస్‌ఎంఈ శాఖ కార్యదర్శి శ్రీ భరత్‌ ఖేరా మాట్లాడుతూ.. 2026 అక్టోబర్‌ 30 నాటికి ఉద్యమ్‌, ఉద్యమ్‌ అసిస్ట్‌ వేదికల్లో నమోదు అయిన వారి సంఖ్య 10 కోట్లు దాటిందని తెలిపారు. దీనివల్ల సంస్థలను అధికారిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ఉన్న అంతరం తొలగిందని పేర్కొన్నారు. ఈ నమోదుల్లో మహిళల యాజమాన్యంలోని సంస్థలు 37.6 శాతం ఉన్నాయని, ఈ వాటాను 50 శాతానికి పెంచే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంస్థల అధికారిక నమోదు ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో, ఎంఎస్‌ఎంఈలు మరింత విస్తరించేలా సహకరించాల్సిన బాధ్యత మంత్రిత్వ శాఖపై పెరిగిందని, ఇందుకు వృద్ధి మూలధనం అత్యంత కీలకమని ఆయన అన్నారు.

ఎస్‌ఆర్‌ఐ నిధి కింద రూ.10,000 కోట్ల నిధిలో ఇప్పటివరకు రూ.8,305 కోట్ల నిధుల సమీకరణ జరిగిందని, ప్రైవేటు వెంచర్‌ క్యాపిటల్‌, ప్రైవేటు ఈక్విటీ ఫండ్ల ద్వారా దాదాపు రూ.48,000 కోట్ల పెట్టుబడులు సమీకరించినట్లు శ్రీ ఖేరా వివరించారు. ఈ ఫండ్‌ పరిధిలో 72 డాటర్‌ ఫండ్స్‌ ఎంప్యానెల్‌ అయ్యాయని తెలిపారు. ఇప్పటికే 824 ఎంఎస్‌ఎంఈల్లో రూ.21,330 కోట్ల పెట్టుబడులు పెట్టగా, వాటిలో సుమారు 74 శాతం సూక్ష్మ సంస్థలేనని పేర్కొన్నారు. మద్దతు పొందిన సంస్థల్లో 77 పెద్ద కేటగిరీకి ఎదగగా, ఆరు సంస్థలు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయని, 32 సంస్థల్లో లాభాలతో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. డాటర్‌ ఫండ్స్‌ వాణిజ్యపరమైన ప్రాతిపదికన పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటాయని ఆయన వివరించారు. సంస్థల సాధ్యాసాధ్యాలు, గత మూడేళ్ల వృద్ధి ధోరణి, సానుకూల నగదు ప్రవాహాలు కలిగిన వ్యాపార ప్రణాళికలను పరిశీలించి పెట్టుబడులు పెడతాయని తెలిపారు. ఈ ఫండ్ల రోజువారీ కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని, వాటి పెట్టుబడి నిర్ణయాల్లో ఎలాంటి పాత్ర పోషించదని స్పష్టం చేశారు.

రుణాలు, ఈక్విటీ పెట్టుబడులు రెండూ సమాంతరంగా ఉండాలని కార్యదర్శి తెలిపారు. 2014లో సుమారు రూ.10 లక్షల కోట్లుగా ఉన్న ఎంఎస్‌ఎంఈ రుణ బకాయిలు ప్రస్తుతం రూ.40 లక్షల కోట్లకు పైగా పెరిగాయని చెప్పారు. అదే సమయంలో ఎంఎస్‌ఎంఈ రంగంలో నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) సుమారు 3.5 శాతానికి తగ్గాయని పేర్కొన్నారు. సూక్ష్మ సంస్థల కోసం కేంద్ర బడ్జెట్‌ 2026–27లో ఎస్‌ఆర్‌ఐ ఫండ్‌కు అదనంగా రూ.2,000 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. చిన్న, మధ్యతరహా సంస్థల్లో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు కొత్తగా ప్రారంభించిన రూ.10,000 కోట్ల ఎస్‌ఎంఈ గ్రోత్‌ ఫండ్‌ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. పారిశ్రామికవేత్తలు సరైన ఆర్థిక రికార్డులను నిర్వహించాలని, తమ వ్యాపారానికి తగిన చట్టపరమైన సంస్థాగత నిర్మాణాన్ని ఎంచుకోవాలని సూచించారు. సంస్థలో ఈక్విటీ పెట్టుబడులను సమీకరించడం వల్ల రుణ సదుపాయాలు పొందే అవకాశాలు కూడా మెరుగుపడతాయని తెలిపారు.

‘మహిళల నేతృత్వంలోని ఎంఎస్‌ఎంఈల వృద్ధి ప్రస్థానం-వృద్ధి మూలధనం ఎందుకు అవసరం?’ అనే అంశంపై జరిగిన మొదటి సమావేశంలో పరిశ్రమల సంఘాల ప్రతినిధులు మహిళా పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేసిన తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రారంభ దశలో ఉన్న మహిళల నేతృత్వంలోని అనేక సంస్థలకు చిన్న మొత్తాల్లో పెట్టుబడులు, రెండో, మూడో శ్రేణి నగరాల్లో పెట్టుబడులకు సిద్ధం చేసే కార్యక్రమాలు, అకౌంటింగ్‌, వ్యాపార విలువ నిర్ధారణలో సహకారం అవసరమని వారు పేర్కొన్నారు. తాకట్టు పెట్టేందుకు ఆస్తులు లేదా సుదీర్ఘ ఆర్థిక లావాదేవీల రికార్డులు లేని మహిళా పారిశ్రామికవేత్తలకు అనువైన వెసులుబాటు కల్పించాల్సిన అవసరాన్ని కూడా వివరించారు. ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్‌ (జీఈఎం), ఓఎన్‌డీసీ, ఎగుమతుల ద్వారా మార్కెట్‌ అవకాశాలను కల్పించడంతో పెట్టుబడులను అనుసంధానించాలని సూచించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించడం కూడా ముఖ్యమని చెప్పారు.

 

 

‘ఎస్‌ఆర్‌ఐ ఫండ్‌ స్వరూపం, డాటర్‌ ఫండ్స్‌ పాత్ర’ అనే అంశంపై జరిగిన రెండో సమావేశలో ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ అదనపు అభివృద్ధి కమిషనర్‌ శ్రీ ప్రవీణ్‌ కుమార్‌ ఈ ఫండ్‌ నిర్మాణాన్ని వివరించారు. మదర్‌ ఫండ్‌ నేరుగా కాకుండా డాటర్‌ ఫండ్స్‌ ద్వారా మాత్రమే పెట్టుబడులు పెడుతుందని, డాటర్‌ ఫండ్స్‌ ఎంఎస్‌ఎంఈల్లో పెట్టుబడులు పెడతాయని తెలిపారు. ఎన్‌ఎస్‌ఐసీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ సుభ్రాన్షు శేఖర్‌ ఆచార్య ఎంఎస్‌ఎంఈ వ్యవస్థలోని లోటుపాట్లను వివరించడంతో పాటు, ఈక్విటీ నిధుల సమీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను పారిశ్రామికవేత్తలకు తెలియజేశారు. ఎస్‌ఆర్‌ఐ నిధి పెట్టుబడి నిర్వాహక సంస్థ అయిన ఎస్‌బీఐ వెంచర్స్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈఓ శ్రీ ప్రేమ్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ.. వృద్ధి చెందుతున్న సంస్థలకు ఈక్విటీ పెట్టుబడులు వ్యూహాత్మకంగా ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఎందుకంటే దీనికి పూచీకత్తు అవసరం లేదని, పెట్టుబడిదారులు సంబంధిత రంగంలో ప్రత్యేక మార్గదర్శకత్వం, నిరంతర సహకారం అందిస్తారని వివరించారు. డాటర్‌ ఫండ్స్‌ ప్రతినిధులు పెట్టుబడులకు సంబంధించిన ప్రమాణాలను వివరించారు. బలమైన మార్కెట్‌, సమర్థవంతమైన బృందం, విస్తరించగల వ్యాపార నమూనా, ఆడిట్‌ చేసిన ఆర్థిక నివేదికలు, ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ వంటి తగిన సంస్థాగత నిర్మాణంతో కూడిన పాలనా సంసిద్ధత, పెట్టుబడి మొత్తాన్ని వినియోగించే విధానంపై స్పష్టత వంటి అంశాలను పరిశీలిస్తామని తెలిపారు. పెట్టుబడుల కోసం దరఖాస్తుల పరిశీలన నుంచి సమగ్ర తనిఖీ, పత్రాల సమర్పణ వరకు అనుసరించాల్సిన సాధారణ దశలపై పారిశ్రామికవేత్తలకు సూచనలు ఇచ్చారు.

వ్యవస్థాగత భాగస్వాముల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్న సహకారంపై మూడో సమావేశం దృష్టి సారించింది. అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌-అలీప్‌ మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం, నీతి ఆయోగ్‌కు చెందిన మహిళా పారిశ్రామిక వేత్తల వేదిక(డబ్ల్యూఈపీ) ప్రతినిధులు మహిళా పారిశ్రామికవేత్తలకు అందించే వివిధ సేవలను వివరించారు. వీటిలో ఇంక్యుబేషన్‌, మార్గదర్శకత్వం, మార్కెట్‌ అవకాశాలు, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పొందడం, నిబంధనల అమలుకు సంబంధించిన సహకారం ఉన్నాయి. ఈ వర్క్‌షాప్‌ రూపకల్పన, ప్రణాళిక, నిర్వహణకు సంబంధించిన సాంకేతిక సహకారాన్ని వ్యవస్థాగత భాగస్వామి మైక్రోసేవ్‌ కన్సల్టింగ్‌ (ఎంఎస్‌సీ) అందించింది.

 

చివరి సమావేశంలో నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమం పరస్పర చర్చకు వేదికగా నిలిచింది. ఇందులో పాల్గొన్నవారు డాటర్‌ ఫండ్స్‌ను ఎలా సంప్రదించాలి, వ్యక్తిగత యాజమాన్య సంస్థలకు పెట్టుబడులు పొందేందుకు అవసరమైన సంసిద్ధత, రంగాలవారీగా ప్రత్యేకంగా పనిచేసే ఫండ్స్‌, సాంకేతికత, మౌలిక సదుపాయాల సహకారం వంటి అంశాలను ప్రస్తావించారు. ఎస్‌ఆర్‌ఐ నిధి ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పీవీ) అయిన ఎన్‌ఎస్‌ఐసీ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ లిమిటెడ్‌ వెబ్‌సైట్‌లో 72 డాటర్‌ ఫండ్స్‌ వివరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆయా ఫండ్స్‌ దృష్టి సారించే రంగాలు, సంప్రదింపు వివరాలు కూడా అందులో పొందుపరిచినట్లు వెల్లడించారు. భవిష్యత్తులోనూ యశస్విని ప్రచార కార్యక్రమం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు తమ మంత్రిత్వ శాఖ నిరంతర సహకారం అందిస్తుందని హామీ ఇవ్వడంతో  ఈ వర్క్‌షాప్‌ ముగిసింది.

 

***


(రిలీజ్ ఐడి: 2333179) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Tamil