నాడు పోస్టు చేయడమైనది:
04 NOV 2026 3:34PM by PIB Hyderabad
ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాల (ఎఫ్‌టీఎస్‌సీలు), ప్రత్యేక పోక్సో న్యాయస్థానాల కేంద్ర ప్రాయోజిత పథకాన్ని మరో ఐదేళ్లపాటు - 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు కొనసాగించేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ పథకానికి మొత్తం రూ.3,788.04 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2,353.15 కోట్లు కాగా, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వాటా రూ.1,434.89 కోట్లు. కేంద్ర ప్రభుత్వ వాటాను నిర్భయ నిధి నుంచి సమకూర్చనున్నారు.
ఆమోదం పొందిన పథకంలోని ప్రధాన అంశాలు:
-
పథకాన్ని 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు మరో ఐదేళ్లపాటు కొనసాగిస్తారు.
-
పథకం కింద భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక పోక్సో న్యాయస్థానాలు సహా మొత్తం 850 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసి, నిర్వహించనున్నారు.
-
అత్యాచారం, 2012 నాటి బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో) కింద నమోదై పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేసి, సత్వర పరిష్కారానికి ప్రత్యేక న్యాయాధికారి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆరుగురు సహాయక సిబ్బందిని నియమిస్తారు.
-
కేంద్ర ప్రాయోజిత పథకాలకు వర్తించే నిధుల కేటాయింపు విధానం ప్రకారం, ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాల నిర్వహణ వ్యయాల కోసం భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందిస్తారు.
ప్రధాన ప్రయోజనాలు:
ఈ పథకం కొనసాగింపు వల్ల కింది ప్రధాన ప్రయోజనాలు చేకూరనున్నాయి:
-
సత్వర న్యాయం: లైంగిక నేరాల బాధితులకు కేసుల త్వరిత విచారణ ద్వారా సకాలంలో న్యాయం అందించడం.
-
పెండింగ్ కేసుల తగ్గింపు: అత్యాచారం, పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో పెండింగ్‌లో ఉన్న వాటి సంఖ్యను తగ్గించడం.
-
పిల్లలకు, బాధితులకు అనుకూలమైన వాతావరణం: బాధితులు మరింత మానసిక వేదనకు గురికాకుండా, తమ వాంగ్మూలాలను నమోదు చేసేందుకు వీలుగా సున్నితమైన సాక్షుల వాంగ్మూల కేంద్రాలు (వీడబ్ల్యూడీసీలు), పిల్లలకు అనుకూలమైన న్యాయస్థాన ప్రాంగణాలను ఏర్పాటు చేయడాన్ని ఈ పథకం ప్రోత్సహిస్తుంది.
-
అసమానతల తగ్గింపు: మహిళలు, బాలలు వంటి బలహీన వర్గాలకు చెందిన బాధితుల కేసులకు ప్రాధాన్యమివ్వడం ద్వారా న్యాయం పొందడంలో ఉన్న అసమానతలను తగ్గించడం ఈ పథకం లక్ష్యం.
అమలు వ్యూహం, లక్ష్యాలు:
ఈ పథకాన్ని న్యాయశాఖ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగాల సమన్వయంతో అమలు చేస్తారు. ఇందుకు సంబంధించిన ప్రధాన అమలు వ్యూహాలు, లక్ష్యాలు కిందివిధంగా ఉన్నాయి:
-
ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాల విస్తరణ: ప్రస్తుతం ఉన్న 779 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాల సంఖ్యను 850కి పెంచడం ద్వారా మరిన్ని జిల్లాలకు ఈ న్యాయస్థానాల సేవలను విస్తరించనున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని ఈ విస్తరణ చేపడతారు.
-
ప్రత్యేక న్యాయ సహాయం: కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ప్రతి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానానికి ప్రత్యేకంగా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తారు.
-
న్యాయస్థానాల్లో సిబ్బంది నియామకం: పరిపాలనా పనిభారాన్ని తగ్గించి, పాత కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానానికి ఒక న్యాయాధికారి, ఆరుగురు సహాయక సిబ్బందిని కేటాయిస్తారు.
-
ఆర్థిక సహాయం: ఆమోదించిన నిధుల కేటాయింపు విధానం, నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది.
-
పర్యవేక్షణ, మదింపు: ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాల పనితీరును న్యాయశాఖ ఎఫ్‌టీఎస్‌సీ డ్యాష్‌బోర్డు, ఎప్పటికప్పుడు సమర్పించే పురోగతి నివేదికలు, రాష్ట్రాల వ్యయ వివరాల ద్వారా పర్యవేక్షిస్తుంది. పథకం సమర్థంగా అమలయ్యేలా హైకోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, వారి అభిప్రాయాలు, సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.
-
పనితీరు లక్ష్యాలు: అత్యాచారం, పోక్సో చట్టం కింద నమోదైన పెండింగ్ కేసుల పరిష్కార రేటును పెంచడం, వాటి సంఖ్యను తగ్గించడం, నిర్దేశిత గడువులోగా విచారణ పూర్తయ్యేలా చూడటం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు.
ఈ పథకం ద్వారా ప్రధానంగా అత్యాచారం, బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో), 2012 కింద నేరాలకు గురైన మహిళలు, బాలలు లబ్ధి పొందుతారు.
ఈ పథకం కింద ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాల సంఖ్యను 850 వరకు పెంచాలని ప్రతిపాదించారు. అత్యాచారం, పోక్సో చట్టం కింద నమోదైన పెండింగ్ కేసుల సంఖ్య ఆధారంగా గుర్తించిన మరిన్ని జిల్లాలకు ఈ న్యాయస్థానాల సేవలను విస్తరించనున్నారు.
నేపథ్యం:
ఈ పథకం 2019 అక్టోబర్ 2 నుంచి అమల్లో ఉంది. అత్యాచారం, పోక్సో చట్టం కింద నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాల సేవలు నిరంతరాయంగా కొనసాగించే ఉద్దేశంతో, ఈ పథకాన్ని వరుసగా పొడిగిస్తూ వచ్చారు. పథకం ప్రస్తుత పరిస్థితి వివరాలు ఇలా ఉన్నాయి:
|
వివరాలు
|
|
|
ప్రారంభ తేదీ
|
02-10-2019
|
|
భాగస్వామ్య రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు
|
29
|
|
ప్రత్యేక ఫోక్సో న్యాయస్థానాలతో కలిపి ప్రస్తుతం పని చేస్తున్న ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్నాయస్థానాల సంఖ్య
|
399 ప్రత్యేక పోక్సో న్యాయస్థానాలతో కలిపి మొత్తం 779 న్యాయస్థానాలు
|
|
ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి పరిష్కారమైన మొత్తం కేసుల సంఖ్య
|
4.02,457
|
|
పొడిగించిన పథకం కింద ప్రతిపాదించిన ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్నాయస్తానాల సంఖ్య b
|
850
|
|
ఆమోదించిన పొడిగింపు కాలపరిమితి
|
01-04-2026 నుంచి 31-03-31
|
అత్యాచారం, పోక్సో చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం ద్వారా లైంగిక నేరాలపై న్యాయవ్యవస్థ స్పందనను బలోపేతం చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాల పనితీరును ఎఫ్‌టీఎస్‌సీ డ్యాష్‌బోర్డు, హైకోర్టుల నుంచి ఎప్పటికప్పుడు సేకరించే సమాచారం, సంబంధిత భాగస్వామ్య పక్షాలతో నిర్వహించే సమీక్షా సమావేశాల ద్వారా న్యాయశాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ పథకాన్ని మరో ఐదేళ్లపాటు కొనసాగించడం ద్వారా న్యాయవ్యవస్థ సంస్థాగత సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. లైంగిక నేరాలకు సంబంధించిన పెండింగ్ కేసుల సంఖ్య తగ్గడంతో పాటు, బాధితులకు, ముఖ్యంగా మహిళలు, బాలలకు సకాలంలో న్యాయం అందించేందుకు దోహదపడుతుంది.
2018 నాటి క్రిమినల్ లా (సవరణ) చట్టం ప్రకారం సుప్రీంకోర్టు 2019 జూలై 25న సుమోటో రిట్ (క్రిమినల్) నంబర్ 1/2019లో జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా, ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాల కేంద్ర ప్రాయోజిత పథకాన్ని 2019 అక్టోబర్ 2న ప్రారంభించారు. బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో) 2012 కింద 100కు మించి కేసులు పెండింగ్‌లో ఉన్న జిల్లాల్లో ప్రత్యేక పోక్సో న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో, ప్రత్యేక పోక్సో న్యాయస్థానాలతో సహా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అత్యాచారం, 2012 నాటి పోక్సో చట్టం కింద నమోదైన పెండింగ్ కేసులను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంపై ఈ పథకం ప్రధానంగా దృష్టి సారించింది.
ఈ పథకాన్ని తొలుత ఏడాది కాలానికి ప్రారంభించారు. అనంతరం దాని గడువును 2026 మార్చి 31 వరకు పొడిగించారు. తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో ఈ పథకం మరో ఐదేళ్లపాటు, అంటే 2031 మార్చి 31 వరకు కొనసాగనుంది.
***