నాడు పోస్టు చేయడమైనది:
04 NOV 2026 10:20AM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ సహాయ మంత్రి, శ్రీ జితిన్ ప్రసాద 2026 నవంబర్ 2, 3వ తేదీల్లో పోలెండ్‌లో పర్యటించారు. 12 భారతీయ కంపెనీలకు చెందిన వాణిజ్య ప్రతినిధి వర్గం కూడా మంత్రి వెంట ఈ పర్యటనలో పాల్గొంది. పోలెండ్ ప్రధాని శ్రీ డొనాల్డ్ టస్క్ కిందటి నెలలో భారతదేశ పర్యటనకు విచ్చేశారు. ఆయన పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబధాలు పుంజుకోవడాన్ని ప్రతిబింబించింది. 2026లో కొనసాగుతున్న ఉన్నత స్థాయి రాజకీయ పర్యటనలు.. భారత్, పోలెండ్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత శక్తిమంతంగా మారుతుండటాన్ని సూచిస్తున్నాయి. 2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోలెండ్‌లో పర్యటించినప్పుడు, ఈ భాగస్వామ్యానికి పునాది పడింది.
శ్రీ ప్రసాద తన పర్యటనలో భాగంగా పోలెండ్ ఉప ప్రధాని, డిజిటల్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ క్రిస్టోఫ్ గావ్‌కోస్కీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, సైబర్ భద్రత వంటి సరికొత్త సాంకేతికతలలో ద్వైపాక్షిక సహకార విస్తరణపై చర్చించారు.
పోలెండ్ విదేశీ వ్యవహారాల శాఖ ఉప మంత్రి శ్రీ ఇగ్నేసీ నీమ్‌చిక్కితో కూడా శ్రీ ప్రసాద భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) వల్ల లభించే అవకాశాలపై చర్చించారు. వచ్చే ఆరు నెలల్లో ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. వ్యవసాయ రంగంలో సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడంతో పాటు ఆహార శుద్ధి రంగంలో మరింత ఎక్కువగా సహకరించుకోవడానికి ఉభయ పక్షాలకూ అవకాశాలు ఉన్నాయని శ్రీ ప్రసాద చెప్తూ, మరీ ముఖ్యంగా చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థలకు గతం కన్నా ఎక్కువ అవకాశాలను కల్పించవలసి ఉందన్నారు.
పోలెండ్ ఆర్థికాభివృద్ధి, సాంకేతికత శాఖ సహాయ మంత్రి శ్రీ మైకల్ బారానోవ్‌స్కీతోనూ శ్రీ ప్రసాద సమావేశమయ్యారు. కీలక ఖనిజాలు, సెమీకండక్టర్లు, అంకుర సంస్థల భాగస్వామ్యం రంగాలలో సహకారాన్ని ఇప్పటి కన్నా విస్తరించుకోవడానికి ఉన్న అవకాశాలపై మంత్రులిద్దరూ చర్చించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ ఇవ్వజూపుతున్న అవకాశాలను శ్రీ ప్రసాద ప్రస్తావించారు. సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులో సహాయాన్ని పరస్పరం అందించుకోవడం ద్వారా కలిసికట్టుగా అభివృద్ధి, నిర్మాణ రంగాల్లో ముందడుగు వేయడంపై దృష్టి సారించాలని ఆయన అన్నారు.
నవంబర్ 3న వార్సాలోని పోలిష్ నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ (కేఐజీ)లో నిర్వహించిన భారత్, పోలెండ్ వాణిజ్య వేదిక కార్యక్రమంలో శ్రీ జితిన్ ప్రసాద పాల్గొని ప్రారంభోపన్యాసాన్నిచ్చారు. వాణిజ్య ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ, కొత్త వాణిజ్య అవకాశాలు, బలమైన భాగస్వామ్యాలు, ఇతోధిక ఆర్థిక సహకారం మార్గాలను అనుసరిస్తూ రెండు దేశాల వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో పూర్తి స్థాయిలో సహకరించుకోవాలని భారతీయ, పోలిష్ కంపెనీలకు పిలుపునిచ్చారు. భారత్, ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫలితంగా అందివచ్చే అవకాశాలను గురించి ఆయన ప్రస్తావిస్తూ, మార్కెట్టు లభ్యతను విస్తరించుకోవడానికి, వాణిజ్య-పెట్టుబడి సంబంధాలను బలపరుచుకోవడానికి, సహకారానికి సంబంధించి కొత్త అవకాశాలను అన్వేషించడానికి ఈ ఒప్పందం తాలూకు పూర్తి ప్రయోజనాలను అందుకోవాల్సిందిగా రెండు దేశాల వాణిజ్య సంస్థలను ప్రోత్సహించారు.
మంత్రి పోలెండ్‌లో భారతీయ వాణిజ్య రంగ ప్రముఖులతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టపరచడానికి వారు కీలక తోడ్పాటును అందిస్తున్నారని ఆయన అన్నారు. పోలెండుకు చెందిన పెట్టుబడిదారులతోనూ ఆయన సమావేశమయ్యారు. భారతదేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను గుర్తించాల్సిందిగా మంత్రి వారికి సూచించారు.
పోలెండ్‌లో ఐటీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కంపెనీ ట్రాంజిషన్ టెక్నాలజీస్‌నూ, రక్షణ రంగ కంపెనీ డబ్ల్యూబీ ఎలక్ట్రానిక్స్‌నూ శ్రీ ప్రసాద సందర్శించారు. ఈ రెండు కంపెనీలూ భారతదేశంతో వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
పోలెండ్2తో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకొనేందుకు భారత్ కనబరుస్తున్న ఆసక్తిని మంత్రి పర్యటన మరోసారి స్పష్టం చేసింది. ఆటుపోట్లకు తట్టుకొని నిలవగల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను నిర్మించడంలో పోలెండ్ ప్రభుత్వంతో, వాణిజ్య సంస్థలతో కలసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉంది. భారత్, యూరోపియన్ యూనియన్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవడానికి కూడా ఈ పర్యటన దోహదం చేస్తుంది.
***