నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘బీఆర్ఈ శిఖరాగ్ర సదస్సు, ప్రదర్శన-2026’... పాల్గొన్న అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమ రంగ ప్రముఖులు

పెట్టుబడి అవకాశాలను, సహకార అవకాశాలను చాటిన
13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కంట్రీ పార్ట్‌నర్స్

రూ.1.17 లక్షల కోట్ల విలువైన 18 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న ఒడిశా

నాడు పోస్టు చేయడమైనది: 03 NOV 2026 8:00PM by PIB Hyderabad

‘బీఆర్ఈ శిఖరాగ్ర సదస్సు, ప్రదర్శన-2026’లో రెండో రోజున ‘‘ది నెక్స్‌ట్ టెరావాట్’’ అంశంపై మంత్రులతో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి చర్చలో కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషీ, కేంద్ర విద్యుత్తు, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్‌తో పాటు నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపద్ యసో నాయక్ పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి చర్చను అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్.. ఐఎస్ఏ), సీఈఈడబ్ల్యూ, ఎనర్జీవా వెంచర్స్ కలసి ఏర్పాటు చేశాయి. రాబోయే దశాబ్ద కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ స్థాయిలో అమలుపరిచే ఉద్దేశంతో పునరుత్పాదక ఇంధన కార్యాచరణ ప్రణాళికకు రూపురేఖలు దిద్దడానికి ప్రభుత్వ, పారిశ్రామిక రంగ ప్రముఖ ప్రతినిధులను ఈ వేదిక ద్వారా సమావేశపరిచారు.
ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన విస్తరణతో ముడిపడిన తదుపరి దశకు వేగాన్ని అందించడానికిగాను నాలుగు కీలక ప్రాధాన్య రంగాలపై దృష్టిని కేంద్రీకరించారు. ఆ నాలుగు ప్రాధాన్య రంగాలలో.. ఏకీకృత ఇంధన ప్రణాళిక, సరఫరా-నిల్వ, ఇంధన సంబంధిత మౌలిక సదుపాయాల కల్పనను విస్తరించడం, ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొనే వ్యవస్థను రూపొందించడం, టెరావాట్ స్థాయి గల ప్రాజెక్టులు, తత్సంబంధిత ప్రణాళికలకు ఆర్థిక సహాయాన్ని అందించడం, సురక్షితం, తక్కువ ధరలో ఇంధనాన్ని ఉత్పత్తి చేసే లక్ష్యంతో డిజిటలీకరణ మార్గాన్ని అనుసరించడం, కృత్రిమ మేధ అండను వినియోగించుకోవడం.. ఉన్నాయి. చర్చల తరువాత ఇప్పటి నుంచి 2050వ సంవత్సరం వరకు అనుసరించవలసిన ఒక వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఇది 2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్ (‘వికసిత్ భారత్’)ను నిర్మించాలన్న భారత్ దార్శనికతకు అనుగుణంగా ఉంది.  
పద్దెనిమిది అవగాహన ఒప్పందాలను (ఎమ్ఓయూస్) ఒడిశా కుదుర్చుకుంది. వీటి మొత్తం పెట్టుబడి విలువ రూ.1.17 లక్షల కోట్లు. ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీతో పాటు ఉప ముఖ్యమంత్రి శ్రీ కనక్ వర్ధన్ సింగ్ దేవ్ పాల్గొన్నారు.
గోవాలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను స్థాపించే ఉద్దేశంతో ఒక ఎమ్ఓయూను గోవా పెట్టుబడి ప్రోత్సాహక, సౌకర్యాల కల్పన మండలి (గోవా-ఐపీబీ)తో బొండాడ గ్రూపునకు చెందిన బొండాడ ఇంజినీరింగ్ సంస్థ కుదుర్చుకుంది. దీనిలో భాగంగా సుమారు రూ.3,000 కోట్ల పెట్టుబడిని పెట్టాలని ప్రతిపాదించారు.
బీఆర్ఈ సమిట్, ఎక్స్‌పో-2026లో 130 కన్నా ఎక్కువ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. వారిలో 40 మందికి పైగా మంత్రులే కాకుండా అనుభవజ్ఞ‌ులైన విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, ఆర్థిక సహాయ సంస్థలు, పరిశ్రమ రంగ ప్రముఖులు కూడా ఉన్నారు. కంట్రీ పార్ట్‌నర్స్ హోదాలో ఆస్ట్రేలియా, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, బ్రిటన్ పాలుపంచుకుంటున్నాయి. ఇది ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకొనేందుకు అవకాశాలను కల్పించడంతో పాటు స్వచ్ఛ ఇంధన సంబంధిత వేల్యూ చైన్‌లో పెట్టుబడి ప్రధాన భాగస్వామ్యాలను, సాంకేతిక భాగస్వామ్యాలను పెంపొందించేందుకు కూడా మార్గాన్ని సుగమం చేయనుంది.
పదమూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా పునరుత్పాదక ఇంధన రంగంలో తమకు ఉన్న సామర్థ్యాన్ని, త్వరలో అమలు చేయదలుస్తున్న ప్రాజెక్టులను, తయారీ రంగంలో ఉన్న అవకాశాలను, అమలు చేస్తున్న ప్రత్యేక విధానాలను ఈ సదస్సులో కళ్లకు కడుతున్నాయి. దీంతో భారత్ అంతటా పెట్టుబడికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్న అంశం స్పష్టమవుతోంది.
సదస్సులో రెండో రోజున బ్లూంబర్గ్ఎన్ఈఎఫ్ సహకారంతో అభిప్రాయాల వెల్లడికి ఒక వేదికను ఏర్పాటు చేశారు. దీనికి ‘వాట్స్ నెక్స్‌ట్: ఇన్నొవేటర్స్ ఐడియాస్ ఫర్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ, అజెండా 2047’ అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో మొదటి దశను విజయవంతంగా పూర్తి చేశారు. సాంప్రదాయిక బృంద చర్చలకు భిన్నంగా, ఈ కార్యక్రమంలో అగ్రగామి నూతన ఆవిష్కర్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, పారిశ్రామిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు. వారు సాంకేతికత, ఆర్థిక సహాయం, విధాన రూపకల్పనతో ముడిపడిన సాహసిక, ఆచరణాత్మక ఆలోచనలను వెల్లడిస్తున్నారు. ఆయా ఆలోచనలు.. స్వతంత్ర భారతదేశం త్వరలో వంద సంవత్సరాల మజిలీకి చేరుకోనుండగా, దేశ ఇంధన వ్యవస్థ భావి రూపురేఖలను తీర్చిదిద్దడంలో తమ వంతు తోడ్పాటును అందిస్తాయని భావిస్తున్నారు. కార్యక్రమంలో ప్రసంగించిన వారిలో రిన్యూ వ్యవస్థాపకుడు, చైర్మన్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ సుమంత్ సిన్హా , సోలార్ స్క్వేర్ సహ వ్యవస్థాపకురాలు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రేయ మిశ్రా,  సుజ్లాన్ గ్రూపు సహ వ్యవస్థాపకుడు శ్రీ గిరీశ్ ఆర్. తంతి, ఐఐటీ మద్రాసుకు చెందిన ప్రొఫెసర్ అశోక్ ఝుంఝున్‌వాలాతో పాటు బ్లూంబర్గ్ఎన్ఈఎఫ్‌లో క్లీన్ పవర్ రిసర్చ్ విభాగ సారథి మెరెడిత్ అనెక్స్ ఉన్నారు.
భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగ కార్యకలాపాల విస్తరణకు ఉత్పాదన సామర్థ్యం, ఇంధన నిల్వ, ఇంధన పంపిణీ నెట్‌వర్కులు, దేశీయ తయారీ, సహాయక మౌలిక సదుపాయాల కల్పనకు నిలకడగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ శిఖరాగ్ర సదస్సు ప్రభుత్వ, ప్రయివేటు రంగాలకు చెందిన ఆసక్తిదారు వర్గాలకు నవీన ఆర్థిక సహాయ నమూనాలను అన్వేసించడానికి, పెట్టుబడి భాగస్వామ్యాలను పటిష్టపరుచుకోవడానికి, ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడానికి తగిన పరిష్కారాలను కనుగొనే వేదికను అందిస్తున్నది.
రెండో రోజు నాటి ముఖ్య ఘట్టాలు..

***


(రిలీజ్ ఐడి: 2332448) సందర్శకుల సూచీ సంఖ్య : : 23
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam