నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
03 NOV 2026 4:31PM by PIB Hyderabad
అంతర్జాతీయ సౌర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం, అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందేలా చూడటంలో భారత్ నిబద్ధతను కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ, విద్యాశాఖ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి పునరుద్ఘాటించారు. ఇక్కడ జరుగుతున్న భారత్ రెన్యువబుల్ ఎనర్జీ సమ్మిట్, ఎక్స్పో - 2026 సందర్భంగా ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీ ప్రహ్లాద్ జోషి మాట్లాడారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో అంతర్జాతీయ సౌర సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భారత్ తన నిబద్ధతను నిలకడగా కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. సాధికారత కోసం విద్యుత్, ఒకే సూర్యుడు - ఒకే ప్రపంచం - ఒకే గ్రిడ్ అనే సూత్రాలు ఈ ప్రయత్నాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) అధ్యక్ష పదవికి భారత్ వరుసగా మూడోసారి ఎన్నికైందని వెల్లడించారు.
ఈ దృఢమైన సంకల్పమే 2015లో అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) ఏర్పాటుకు భారత్, ఫ్రాన్స్ దేశాలను ఏకం చేసిందని ఆయన గుర్తుచేశారు. నేడు 130 దేశాలు ఐఎస్ఏ ఒప్పందంపై సంతకాలు చేసి సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల మధ్య అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే శక్తిమంతమైన వేదికగా ఈ దార్శనిక ఆలోచన మార్పు చెందిందని పేర్కొన్నారు.
భారత్ రెన్యువబుల్ ఎనర్జీ (బీఆర్‌ఈ) సదస్సు, ఎక్స్పో - 2026ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 నవంబర్ 2న ప్రారంభించగా, నవంబర్ 5న ముగియనుంది. గత రెండు రోజులుగా, రాబోయే రెండు రోజుల్లో జరిగే చర్చలు సౌర ఇంధన రంగంలో కీలక ప్రాధాన్యాలను మరింత స్పష్టం చేస్తాయని శ్రీ జోషి తెలిపారు. సౌర ఇంధనంపై నిబద్ధతలను పెట్టుబడులుగా, భాగస్వామ్యాలను ప్రాజెక్టులుగా, ఆశయాలను ఆచరణాత్మక ఫలితాలుగా మార్చడంపై ఈ చర్చలు దృష్టి సారిస్తాయని పేర్కొన్నారు.
అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) ప్రాధాన్య లక్ష్యాలను ప్రస్తావిస్తూ, అత్యంత అవసరమైన ప్రాంతాల్లో సౌర విద్యుత్ విస్తరణకు ఆర్థిక సహకారం అందించడం కీలకమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆఫ్రికాలో వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు 200 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేసిన ‘ఆఫ్రికా సోలార్ ఫెసిలిటీ’ ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. అందరికీ అందుబాటు ధరల్లో సౌర విద్యుత్ అందించాలనే భారత్ సంకల్పానికి అనుగుణంగా, ముఖ్యంగా తగినంత విద్యుత్ సదుపాయాలు లేని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు సుమారు రూ.225 కోట్లు (25 మిలియన్ డాలర్లు) కేటాయించినట్లు తెలిపారు. ఈ విధానాన్ని ఆఫ్రికా ఖండవ్యాప్తంగా విస్తరించేందుకు 300 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేసిన ‘నైజీరియా డిస్ట్రిబ్యూటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ఫండ్’ ఒక నమూనాగా నిలుస్తుందని ఆయన వివరించారు.
సౌర విద్యుత్ ప్రజల జీవితాల్లో తీసుకురాగల మార్పును ప్రస్తావిస్తూ, విస్తృత స్థాయిలో ఆచరణాత్మక పరిష్కారాలను అందించడం ఎంతో ముఖ్యమని శ్రీ జోషి పేర్కొన్నారు. ఫిజీ, మడగాస్కర్, కొమొరోస్, సీషెల్స్ దేశాల్లో ఐఎస్ఏ సహకారంతో చేపట్టిన కార్యక్రమాలు సౌర విద్యుత్ ద్వారా ప్రజల జీవనోపాధిని, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని ఎలా బలోపేతం చేయవచ్చో నిరూపిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య కేంద్రాలకు, పాఠశాలలకు విద్యుత్ అందించడం, స్వచ్ఛమైన తాగునీటి సదుపాయాలు కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తుల శీతల నిల్వకు తోడ్పడటం వంటి చర్యలు ఇందులో భాగమని వివరించారు. చిన్న ద్వీప అభివృద్ధి చెందుతున్న దేశాల (ఎస్ఐడీఎస్) అవసరాలకు అనుగుణంగా, విస్తృత స్థాయిలో అమలు చేయగల నమూనాలను రూపొందించేందుకు ఐఎస్ఏ సమష్టి సౌర విద్యుత్, నిల్వ సామర్థ్యాల అవకాశాలను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మారిషస్ నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
సౌర విద్యుత్ ద్వారా 30 లక్షల మంది రైతులకు సాధికారత కల్పించడం, వ్యవసాయ క్షేత్రాల్లో సౌర ఫలకాల ఏర్పాటు (అగ్రి-పీవీ)ను విస్తరించడం కూడా ఎంతో ముఖ్యమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. సౌర విద్యుత్ ఆధారిత వ్యవసాయం ద్వారా సాగునీటి ఖర్చులను తగ్గించడంతో పాటు, రైతులకు అదనపు ఆదాయ అవకాశాలను కల్పించవచ్చని భారత్ చేపట్టిన ప్రధానమంత్రి - కుసుమ్ (పీఎం - కుసుమ్) పథకం నిరూపించిందని తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) ద్వారా ఈ నమూనాను సభ్య దేశాల్లో, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో అమలు చేసేందుకు తగిన విధంగా అనుసరణ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఇంధన మార్పు ప్రక్రియలో రైతులను కేంద్రబిందువుగా నిలపడమే ఈ ప్రయత్నాల లక్ష్యమని పేర్కొన్నారు.
జాతీయ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా 17 సౌర సాంకేతిక అనువర్తన వనరుల కేంద్రాల (సోలార్ టెక్నాలజీ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్స్) ఏర్పాటు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ - షైన్ (ఆవిష్కరణలు, అమలు కోసం వ్యూహాత్మక కేంద్రం), కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఐఎస్ఏ అకాడమీ స్థాపన వంటి చర్యలను శ్రీ జోషి ప్రస్తావించారు. సౌర విద్యుత్ విస్తరణను వేగవంతం చేసేందుకు సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను సమర్థంగా వినియోగించుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపారు.
సాంకేతిక రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న పురోగతి నేపథ్యంలో స్వచ్ఛ ఇంధనానికి ప్రాధాన్యం మరింత పెరుగుతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కృత్రిమ మేధ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల స్వరూపాన్ని మారుస్తున్న తరుణంలో, అందుబాటు ధరల్లో విశ్వసనీయమైన, స్వచ్ఛమైన విద్యుత్‌ను అందుబాటులో ఉంచడం మరింత కీలకమైన వ్యూహాత్మక అవసరంగా మారుతుందని తెలిపారు.
సౌర ఇంధన భవిష్యత్తును ఉమ్మడి బాధ్యత, నిరంతర పెట్టుబడులు, సమష్టి కార్యాచరణతో నిర్మించుకోవాలన్న స్పష్టమైన సందేశం ఈ సదస్సు ద్వారా వెలువడిందని శ్రీ జోషి చెప్పారు.
భారత ప్రభుత్వం తరఫున అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) అధ్యక్ష బాధ్యతలకు వరుసగా మూడోసారి భారత్‌ను ఎన్నుకుని, తమపై విశ్వాసం ఉంచిన సభ్య దేశాలన్నింటికీ శ్రీ జోషి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఐఎస్ఏ సహాధ్యక్ష పదవికి ఫ్రాన్స్ మరోసారి ఎన్నికైన సందర్భంగా ఆ దేశానికి, ఆ దేశ మంత్రికి ఆయన అభినందనలు తెలియజేశారు.
భారత్ కొత్త పదవీకాలాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో పెట్టుబడులను సమీకరించడం, సౌర విద్యుత్ విస్తరణను వేగవంతం చేయడం, సమష్టి ఆశయాలను ప్రజలకు, దేశాలకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూర్చే స్పష్టమైన ఫలితాలుగా మలచడంపై దృష్టి కొనసాగుతుందని శ్రీ జోషి తన ప్రసంగాన్ని ముగిస్తూ పేర్కొన్నారు. తమపై నిరంతరం విశ్వాసం ఉంచుతూ, భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న సభ్య దేశాలన్నింటికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంతోష్ కుమార్ సారంగి, అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) డైరెక్టర్ జనరల్ ఆశిష్ ఖన్నా, ఫ్రాన్స్ పర్యావరణ మార్పు శాఖ సహాయ మంత్రి మాథ్యూ లెఫెవ్రే, డెన్మార్క్ వ్యాపార, పోటీ వ్యవహారాల శాఖ మంత్రి మార్టిన్ లిడెగార్డ్, సురినామ్ సహజ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి డేవిడ్ అబియామోఫో, సీషెల్స్ పరిశ్రమ, సంస్థల మంత్రిత్వ శాఖ మంత్రి గెరాల్డా డెసౌబిన్, శ్రీలంక ఇంధన మంత్రిత్వ శాఖ ఉపమంత్రి మహమ్మదు అర్కమ్ ఇలియాస్ పాల్గొన్నారు.
***