ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రూ.21,800 కోట్ల విలువైన పుణె మెట్రో ప్రాజెక్టులకు నవంబర్‌ 3న ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి


రూ.8,300 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పుణె మెట్రో లైన్‌ - 3 (పింక్‌ లైన్‌ను) ప్రారంభించనున్న ప్రధానమంత్రి
పింక్‌ లైన్‌ ద్వారా హింజేవాడి ఐటీ హబ్‌ నుంచి శివాజీనగర్‌ వరకు మెట్రో అనుసంధానం

పూర్తిగా మహిళా రైలు ఆపరేటర్లే నిర్వహించనున్న పుణె మెట్రో లైన్‌ - 3; సౌర విద్యుత్‌తో సుమారు 30 శాతం విద్యుత్‌ అవసరాలు

సుమారు రూ.13,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పుణె మెట్రో రెండో దశలోని 2ఏ, 2బీ, 4, 4ఏ లైన్లకు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి

ప్రధాన నివాస, వాణిజ్య, ఐటీ కేంద్రాలకు మెట్రో అనుసంధానాన్ని విస్తరించనున్న పుణె మెట్రో రెండో దశ
ప్రస్తుత పుణె మెట్రో నెట్‌వర్క్‌,తోనూ, అంతర్రాష్ట్ర బస్సు సేవలతోనూ అనుసంధానం కానున్న కొత్త మెట్రో మార్గాలు.. మరింత మెరుగుపడనున్న నగర రవాణా వ్యవస్థ

నాడు పోస్టు చేయడమైనది: 02 NOV 2026 3:58PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 నవంబర్‌ 3వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సుమారు రూ.21,800 కోట్ల విలువైన పుణె మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఆయన సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

రూ.8,300 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పుణె మెట్రో లైన్‌ - 3 (పింక్‌ లైన్‌)ను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. సాంకేతిక ఆవిష్కరణలు, ఆధునిక రవాణా పరిష్కారాల ద్వారా పుణె నగర ప్రజా రవాణా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా ఈ ప్రాజెక్టు కీలక ముందడుగుగా నిలవనుంది.

సుమారు 23 కిలోమీటర్ల పొడవున విస్తరించిన పింక్‌ లైన్‌ మాన్‌ నుంచి డిస్ట్రిక్ట్‌ కోర్టు మెట్రో స్టేషన్‌ వరకు అనుసంధానం కల్పిస్తుంది. ఈ మార్గం ద్వారా హింజేవాడి ఐటీ హబ్‌ నుంచి శివాజీనగర్‌ వరకు మెట్రో ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో పుణెలోని ప్రధాన ఉద్యోగ కేంద్రాల్లో ఒకటైన హింజేవాడికి రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు వేలాది మంది ఐటీ నిపుణులు, ఇతర ప్రయాణికుల రోజువారీ ప్రయాణానికి సౌకర్యం కలగనుంది. ఈ మెట్రో మార్గం ఇప్పటికే ఉన్న మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధానమై పుణె నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య నిరంతర రవాణా సదుపాయాన్ని కల్పించనుంది. ప్రైవేటు వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, ట్రాఫిక్‌ రద్దీని, వాహనాల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలను తగ్గించడం, ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి.

పింక్‌ లైన్‌లో మహిళా సాధికారతకు, లింగ సమానత్వంతో కూడిన ప్రజా రవాణా వ్యవస్థకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వడం విశేషం. దేశంలోనే తొలిసారిగా చేపడుతున్న వినూత్న ప్రయత్నంగా ఈ మెట్రో మార్గాన్ని పూర్తిగా మహిళా రైలు ఆపరేటర్లే నిర్వహించనున్నారు. పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ ప్రాజెక్టు ప్రాధాన్యమిస్తోంది. దీనికి అవసరమైన మొత్తం విద్యుత్‌లో సుమారు 30 శాతాన్ని సౌర విద్యుత్‌ ద్వారా సమకూర్చాలని లక్ష్యంగా నిర్దేశించారు.

సుమారు రూ.13,500 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్న పుణె మెట్రో రెండో దశకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ దశలో మెట్రో లైన్లు 2ఏ, 2బీ, 4, 4ఏ ఉన్నాయి. వీటి నిర్మాణంతో నగర మెట్రో నెట్‌వర్క్‌ గణనీయంగా విస్తరించడంతో పాటు, ప్రధాన నివాస, వాణిజ్య, ఐటీ కేంద్రాల మధ్య రవాణా అనుసంధానం మరింత బలోపేతం కానుంది.

రెండో దశలోని 2ఏ, 2బీ మెట్రో లైన్లు మొత్తం సుమారు 12.75 కిలోమీటర్ల పొడవున విస్తరించనున్నాయి. లైన్‌ 2ఏ వనాజ్‌ నుంచి చాందనీ చౌక్‌ వరకు, లైన్‌ 2బీ రామ్‌వాడీ నుంచి విఠల్‌వాడీ వరకు అనుసంధానం కల్పిస్తాయి. దీంతో ప్రస్తుతం ఉన్న తూర్పు, పశ్చిమ మెట్రో నెట్‌వర్క్‌ మరింత విస్తరించనుంది. సుమారు 25.52 కిలోమీటర్ల పొడవైన లైన్‌ - 4 ఖరాడీ నుంచి ఖడక్‌వాస్లా వరకు అనుసంధానం కల్పిస్తుంది. 6.12 కిలోమీటర్ల పొడవైన లైన్‌ - 4ఏ నల్‌ స్టాప్‌ నుంచి మాణిక్‌ బాగ్‌ వరకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.

కొత్త మెట్రో మార్గాలు ఖరాడీ, మగర్‌పట్టా, హడప్సర్‌, స్వర్గేట్‌, మాణిక్‌ బాగ్‌, నాందేడ్‌ సిటీ, పుణె కంటోన్మెంట్‌, వార్జే వంటి పలు కీలక ప్రాంతాలను అనుసంధానించనున్నాయి. రామ్‌వాడీ నుంచి విఠల్‌వాడీ వరకు చేపట్టనున్న తూర్పు వైపు విస్తరణతో ఖరాడీ, వాఘోలీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస, వాణిజ్య, ఐటీ కేంద్రాలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. స్వర్గేట్‌, నల్‌ స్టాప్‌, ఖరాడీ బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసే ఇంటర్‌చేంజ్‌ సదుపాయాల ద్వారా ఈ మెట్రో మార్గాలు అంతర్రాష్ట్ర బస్సు సేవలతో పాటు, ప్రస్తుతం ఉన్న పుణె మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధానం కానున్నాయి. తద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణం మరింత సులభతరం కానుంది.

ఈ ప్రాజెక్టులు పుణె ప్రజా రవాణా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచనున్నాయి. ప్రయాణికులకు సమర్థవంతమైన, సమగ్ర పట్టణ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2331654) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , Bengali-TR , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Gujarati , Tamil , Kannada , Malayalam