నాడు పోస్టు చేయడమైనది:
01 NOV 2026 12:37PM by PIB Hyderabad
హర్యానా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా, ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు. వైభవోపేత చరిత్ర, అసాధారణ పరాక్రమం, సుసంపన్న సాంస్కృతిక వారసత్వాలతో దేశానికి గర్వకారణంగా హర్యానా నిలుస్తోందని శ్రీ మోదీ అన్నారు. ఈ రాష్ట్ర జానపద సంప్రదాయాలు, చైతన్యవంతమైన గ్రామీణ సంస్కృతి భారత్ సాంస్కృతిక వారసత్వాన్ని ఎల్ల వేళలా సమృద్ధం చేస్తున్నాయని ఆయన అన్నారు.
‘‘హర్యానా ప్రజలు కష్టపడి పనిచేసే తత్వంతో, అంకితభావంతో వ్యవసాయం, క్రీడలు, రక్షణ సేవలు, పరిశ్రమలు, విద్య, అంకుర సంస్థలు సహా వివిధ రంగాలలో తమ ప్రతిభను, దృఢసంకల్పాన్ని చాటారు. మువ్వన్నెల జెండా గౌరవాన్ని ఈ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు పెంపొందింప చేస్తున్నారు. దేశ ఆహార భద్రతను ఈ రాష్ట్ర రైతులు బలోపేతం చేస్తున్నారు’’ అని శ్రీ మోదీ ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘హర్యానా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నా కుటుంబ సభ్యులందరికి అనేకానేక అభినందనలు, శుభాకాంక్షలు.
వైభవోపేత చరిత్ర, అద్భుత పరాక్రమం, సంపన్న సంస్కృతితో అలరారుతున్న మన ఈ రాష్ట్రం.. దేశానికి గర్వకారణంగా నిలుస్తోంది. ఇక్కడి జానపద సంప్రదాయాలు, చైతన్యం ఉట్టిపడే గ్రామీణ సంస్కృతి.. మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సదా సుసంపన్నం చేస్తున్నాయి.
హర్యానా ప్రజలు తమ కష్టించే తత్వంతో, అంకితభావంతో, ప్రతిభతో, దృఢసంకల్పంతో వ్యవసాయం, క్రీడలు, రక్షణ సేవలు మొదలు పరిశ్రమ, విద్య, అంకుర సంస్థల వరకు చూస్తే వివిధ రంగాలలో రాణిస్తున్నారు. ఇక్కడి క్రీడాకారులు త్రివర్ణ పతాక గౌరవాన్ని ఇనుమడింప చేస్తున్నారు. ఇక్కడి అన్నదాతలు దేశ ఆహార భద్రతను పటిష్టపరచడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు.
ఈ విశిష్ట సందర్భం ఇక్కడి ప్రజలందరి జీవితంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను.’’
***