మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2026–27 విద్యా సంవత్సరానికి జాతీయ ప్రతిభా ఆధారిత ఉపకార వేతన పథకం దరఖాస్తుల సమర్పణ గడువు నవంబర్‌ 15 వరకు పొడిగింపు

నాడు పోస్టు చేయడమైనది: 31 OCT 2026 5:57PM by PIB Hyderabad

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2026–27 విద్యా సంవత్సరానికి జాతీయ ప్రతిభా ఆధారిత ఉపకార వేతన పథకం (నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్-ఎన్‌ఎంఎంఎస్‌ఎస్‌) కింద దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని 2026 నవంబర్‌ 15 వరకు పొడిగించింది. ఈ గడువు పొడిగింపుతో అర్హులైన విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాల వేదిక (ఎన్‌ఎస్‌పీ)లో తమ దరఖాస్తులను పూర్తి చేసేందుకు అదనపు సమయం లభిస్తుంది. సంబంధిత అధికారులు దరఖాస్తులను సకాలంలో పరిశీలించి ధ్రువీకరించేందుకు కూడా ఇది వీలు కల్పిస్తుంది.

 

సవరించిన షెడ్యూల్‌ ఈ విధంగా ఉంది.

 

 

ప్రక్రియ

చివరి తేది

దరఖాస్తుల సమర్పణ

నవంబర్‌ 15, 2026

సంస్థ నోడల్‌ అధికారి (ఎల్‌1) ద్వారా దరఖాస్తుల ధ్రువీకరణ

నవంబర్‌ 30, 2026

జిల్లా నోడల్‌ అధికారి (ఎల్‌2) ద్వారా దరఖాస్తుల ధ్రువీకరణ

డిసెంబర్‌ 15, 2026

  

జాతీయ ఉపకార వేతనాల వేదిక (ఎన్‌ఎస్‌పీ)లో విద్యార్థుల దరఖాస్తుల స్వీకరణ 2026 జూన్‌ 1 నుంచి ప్రారంభమైంది. ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకునే ముందు విద్యార్థులు వేదికలో వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) పూర్తి చేయాలి. 2026 అక్టోబర్‌ 30 నాటికి కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు 90,483 మంది కాగా, పునరుద్ధరణ కోసం 1,99,531 దరఖాస్తులు సమర్పించారు.

 

ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన విద్యార్థులు వాటిని సంబంధిత సంస్థ నోడల్‌ అధికారి (ఎల్‌1) ద్వారా నవంబర్‌ 30లోగా, జిల్లా నోడల్‌ అధికారి (ఎల్‌2) ద్వారా 2026 డిసెంబర్‌ 15లోగా ధ్రువీకరించేలా చూసుకోవాలి.

 

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయం అందించడం, ఎనిమిదో తరగతి తర్వాత కూడా 12వ తరగతి వరకు విద్యను కొనసాగించేలా ప్రోత్సహించడం ఈ జాతీయ ప్రతిభా ఆధారిత ఉపకార వేతన పథకం లక్ష్యం.

 

ఈ పథకం కింద ప్రతి సంవత్సరం అర్హులైన తొమ్మిదో తరగతి విద్యార్థులకు లక్ష కొత్త ఉపకార వేతనాన్ని అందజేస్తారు. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్వహించే ఎంపిక పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు వీటికి ఎంపికవుతారు. నిర్దేశించిన విద్యా ప్రమాణాలను కొనసాగించినట్లయితే, పదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉపకార వేతనాన్ని పునరుద్ధరణ ద్వారా కొనసాగిస్తారు.

 

రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే పాఠశాలలు, స్థానిక స్వపరిపాలన సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.12,000 చొప్పున ఉపకార వేతనం అందిస్తారు. ఈ మొత్తాన్ని ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) విధానం ద్వారా నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

 

ఎంపిక పరీక్షకు హాజరయ్యేందుకు విద్యార్థులు ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు లేదా దానికి సమానమైన గ్రేడ్‌ సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇందులో 5 శాతం పాయింట్ల మినహాయింపు ఉంటుంది. దరఖాస్తుదారుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలకు మించకూడదు.

***


(రిలీజ్ ఐడి: 2331361) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , Assamese , English , हिन्दी , Marathi , Gujarati , Malayalam