రక్షణ మంత్రిత్వ శాఖ
ఫిలిప్పీన్స్‌లో ఏడీఎంఎం ప్లస్ సమావేశం సందర్భంగా జపాన్ రక్షణ మంత్రితో కేంద్ర రక్షణ మంత్రి భేటీ
భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త మార్గాల అన్వేషణ
స్వేచ్ఛాయుత, బహిరంగ, శాంతియుత ఇండో-పసిఫిక్ కోసం భారత్, జపాన్‌ల ఉమ్మడి నిబద్ధత కీలకం: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
28 OCT 2026 3:44PM by PIB Hyderabad
2026 అక్టోబర్ 28న ఫిలిప్పీన్స్‌లోని సెబూలో జరిగిన ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం (ఏడీఎంఎం-ప్లస్) సందర్భంగా భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి శ్రీ షింజిరో కొయిజుమితో సమావేశమయ్యారు. గత ఆగస్టులో జరిగిన సమావేశంలో అంగీకరించిన దిశానిర్దేశాలకు అనుగుణంగా.. ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన పురోగతిని ఇరువురు మంత్రులు స్వాగతించారు.
-
రెండు దేశాల వ్యూహాత్మక, కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా నౌకా వాణిజ్య భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు పురోగమించినట్లు మంత్రులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా గని నిరోధక సామర్థ్యాలను పెంపొందించడం, జపాన్ సాంకేతిక నైపుణ్యాన్ని, దేశ ఉత్పత్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని నౌకా నిర్మాణం, రూపకల్పన రంగాల్లో ఉమ్మడి అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించడం వంటివి ఉన్నాయి. భారత నౌకాదళ ఉపాధిపతి జపాన్‌లో పర్యటించడం ద్వారా ఇరు దేశాల మధ్య సహకారానికి మరిన్ని అవకాశాలు ఏర్పడ్డాయి.
-
భారత్-జపాన్ వైమానిక దళాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు జరుగుతున్న చర్చల్లోనూ పురోగతి సాధించారు. భారత్-జపాన్ వైమానిక దళాల విన్యాసం ‘వీర్ గార్డియన్-26’లో పాల్గొనేందుకు జపాన్ వైమానిక స్వీయరక్షణ దళానికి చెందిన యుద్ధ విమానాలు తొలిసారిగా భారత్‌ను సందర్శించాయి. ఈ విన్యాసంతో పాటు జపాన్ వైమానిక స్వీయరక్షణ దళ అధిపతి కూడా భారత్‌లో పర్యటించారు. ఈ పరిణామాలు ఇరు దేశాల వైమానిక దళాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే చర్చలకు ఊతమిచ్చాయి.
-
టోక్యోలోని భారత రాయబార కార్యాలయంలో భారత్-జపాన్ రక్షణ పరిశ్రమల వేదిక సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరు దేశాలకు చెందిన సుమారు 40 కంపెనీలు పాల్గొన్నాయి.
ఈ ఏడాది చివర్లో టోక్యోలో నాలుగో భారత్-జపాన్ విదేశాంగ, రక్షణ మంత్రుల స్థాయి సమావేశం (2+2), భారత్-జపాన్ రక్షణ మంత్రుల సమావేశం నిర్వహణకు సంబంధించిన చర్చలను వేగవంతం చేయాలని ఇరువురు మంత్రులు అంగీకరించారు.
సమావేశం అనంతరం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త మార్గాలపై చర్చించినట్లు తెలిపారు. స్వేచ్ఛాయుత, బహిరంగ, శాంతియుత ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, జపాన్‌ల ఉమ్మడి నిబద్ధత ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2329877)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3