నాడు పోస్టు చేయడమైనది:
28 OCT 2026 2:44PM by PIB Hyderabad
ఫిలిప్పీన్స్‌లోని సెబులో అక్టోబర్ 28, 2026న ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం-ప్లస్ (ఏడీఎంఎం-ప్లస్) సందర్భంగా అమెరికా యుద్ధ కార్యదర్శి శ్రీ పీట్ హెగ్సెత్‌తో రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. భారత్-అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామ్యం ద్వారా సాధించిన పురోగతిని సమీక్షించేందుకు ఈ సమావేశం ఎంతగానో దోహదపడింది. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని కొనియాడుతూ.. ప్రాథమిక భద్రతా ఒప్పందాల అమలు తీరును ఇరువర్గాలు పరిశీలించాయి. అలాగే సైనిక సన్నద్ధతను వేగవంతం చేయటం, సాంకేతిక పరిజ్ఞానాన్నిపంచుకోవటం, రక్షణ పారిశ్రామికీకరణలో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే నూతన మార్గాలపై చర్చించారు.
ప్రాంతీయ భద్రతను సమీక్షించటం ఈ చర్చల్లో ప్రధాన అంశం. ప్రపంచాన్ని పీడిస్తున్న ఉగ్రవాద మహమ్మారిని రూపుమాపేందుకు ఇరుదేశాలు బలమైన సంకల్పాన్ని స్పష్టం చేశాయి. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్న, శిక్షణ ఇస్తున్న, నిధులు సమకూరుస్తున్న దేశాల పట్ల ప్రపంచ దేశాలు ఎలాంటి ఉదాసీనత చూపకుండా రాజీలేని వైఖరిని అవలంబించాలని రక్షణమంత్రి పిలుపునిచ్చారు. సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ సాగిస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని, సంపూర్ణ మద్దతును అందిస్తుందని అమెరికా కార్యదర్శి హెగ్సెత్ తెలిపారు. అమెరికా అందిస్తున్న బలమైన, స్థిరమైన మద్దతుకు భారత్ తరఫున రక్షణమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
పదేళ్ల భారత్-అమెరికా రక్షణ విధానం అమలు తీరును ఇరుదేశాల నేతలు సమీక్షించారు. రక్షణ సంబంధాలను మరింత వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లేందుకు ఉమ్మడి నిబద్ధతను స్పష్టం చేస్తూ సమావేశాన్ని ముగించారు. త్రివిధ దళాల మధ్య పరస్పర మార్పిడిని మరింత ముందుకు తీసుకెళ్లటం, సముద్రయాన భద్రతా సహకారాన్ని బలోపేతం చేయటం, రక్షణ రంగంలో సరఫరా వ్యవస్థసలను మరింత బలోపేతం చేయటంపై చర్చలు జరిగాయి.
సమావేశం అనంతరం రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ... భారత్-అమెరికాల మధ్య బలమైన ఈ భాగస్వామ్యం స్వేచ్ఛాయుత, బహిరంగ, సురక్షిత ఇండో-పసిఫిక్ ప్రాంతానికి కీలక ఆధారంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
***