వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత సాంస్కృతిక వారసత్వాన్ని, స్థానిక చేతివృత్తి కళాకారులను ప్రోత్సహించడానికి ‘ఆభార్ కలెక్షన్’కు ప్రాచుర్యం కల్పిస్తున్న జీఈఎమ్


‘ఆభార్ కలెక్షన్‌’లో 10 రాష్ట్రాలు, కేంద్రీయ చేనేత హస్తకళల ఎంపోరియములకు చెందిన 294 వస్తువులు

నాడు పోస్టు చేయడమైనది: 26 OCT 2026 2:42PM by PIB Hyderabad

‘ఆభార్ కలెక్షన్’ పేరిట ఒక ప్రత్యేక డిజిటల్ స్టోర్‌‌ను ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లేస్ (జీఈఎమ్) ప్రోత్సహిస్తోంది.  సుసంపన్న భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు, స్థానిక చేతివృత్తి కళాకారులు, నేత కార్మికులు, గ్రామీణ వాణిజ్య సంస్థలకు సహకారాన్ని అందించడం ఈ డిజిటల్ స్టోర్ ఉద్దేశం. ‘ఆభార్ కలెక్షన్’ దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన అద్వితీయ కానుకలు, హ్యాంపర్లు, చేనేత ఉత్పాదనలు, చేతులతో తీర్చిదిద్దిన కళారూపాలను ఒకే వేదిక మీదకు తీసుకువస్తున్నది. ‘ఒక జిల్లా, ఒక ఉత్పాదన’ (ఓడీఓపీ) కార్యక్రమం, భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్‌ పరిధిలోకి వచ్చే ఉత్పాదనలకు ఈ కలెక్షన్‌లో చోటు కల్పిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలుదారులకు ప్రాంతీయ ప్రత్యేకతలు కలిగిన ఉత్పాదనలను ఇట్టే కొనుగోలు చేయడంలో ఈ డిజిటల్ వేదిక తోడ్పడుతోంది. దీంతో స్థానిక కళాకారులు, నేతకారులు, గ్రామీణ వాణిజ్య సంస్థలతో పాటు మహిళల నాయకత్వంలోని వాణిజ్య సంస్థలకు అమ్మకం అవకాశాలు పెంపొందుతున్నాయి.
‘ఆభార్ కలెక్షన్’లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 10 హ్యాండిక్రాఫ్ట్ ఎంపోరియములకు చెందిన 294 ఉత్పాదనలను ప్రస్తుతానికి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. వీటిలో సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియముకు చెందిన ‘కాటేజ్’, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంఘానికి చెందిన ‘ఖాదీ ఇండియా’, గర్వీ గుర్జారీ (గుజరాత్), హిమ్‌క్రాఫ్ట్స్ (హిమాచల్ ప్రదేశ్), ఝార్ క్రాఫ్ట్ (జార్ఖండ్), కావేరీ (కర్నాటక), మృగనయనీ (మధ్యప్రదేశ్), మరాఠీ (మహారాష్ట్ర), పూర్వాశ్రీ (ఈశాన్య ప్రాంతాలు)తో పాటు పూంపుహార్ (తమిళనాడు) ఉన్నాయి.
మరో ఏడు ప్రభుత్వ ఎంపోరియములు, సంస్థలు ఎంపోరియమ్ విక్రేతల రూపంలో నమోదు పూర్తి చేసుకొనే ప్రక్రియను చేపట్టాయి. దీంతో అవి త్వరలో తమ ఉత్పాదనలను ‘ఆభార్ కలెక్షన్’లో చేర్చుకోగలుగుతాయి. ఈ సంస్థల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాఫీ బోర్డు, మంజూషా, బిశ్వ బంగ్లా,  జమ్మూ కాశ్మీరుకు చెందిన జమ్మూ కాశ్మీర్ హ్యాండ్‌లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (జేకేహెచ్‌హెచ్ఎమ్‌సీ), నాగాలాండుకు చెందిన మెరాకాయీ, ఒడిశాకు చెందిన ఉత్కళిక, మణిపూర్‌కు చెందిన పంథోయిబీ ఉన్నాయి. వీటి చేరికతో దేశంలో వివిధ ప్రాంతాల ఉత్పాదనలకు ప్రాతినిధ్యం లభించనుంది. అంతేకాక ఈ కలెక్షన్‌లో అందుబాటులోకి వచ్చే వస్తువుల వైవిధ్యం కూడా విస్తరించనుంది.
ఈ కలెక్షన్‌లో హస్తకళారూపాలు, చేనేతలు, సాంప్రదాయిక ఆహార పదార్థాలు, వంటగది ఉత్పాదనలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పాదనలు ఉన్నాయి. అధికారిక కార్యక్రమాలు, సభలు, విదేశీ ప్రతినిధి వర్గాల పర్యటనలు, ఉద్యోగుల అభినందన కార్యక్రమాలు, పదవీవిరమణ వేళ నిర్వహించే కార్యక్రమాలు, పండుగల వేళల్లో బహుమతుల రూపంలో పంచేందుకు ప్రభుత్వ సంస్థలు ఈ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
‘ఆభార్ కలెక్షన్-2026’ కార్యక్రమాన్ని జీఈఎమ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ మిహిర్ కుమార్ ఆరంభించిన సందర్భంగా, ‘‘ఈ కలెక్షన్ స్వదేశీ కళలు, శిల్పాలకు విశాల మార్కెట్‌లో గుర్తింపును ఇచ్చే దిశగా తీసుకున్న కీలక నిర్ణయం. భారత వివిధ వారసత్వాలను, సంస్కృతులను కళ్లకు కడుతూ, కేంద్రంతో పాటు రాష్ట్రాల్లోని హస్తకళా, చేనేత ఎంపోరియముల నెట్‌వర్కును వినియోగించుకుంటూ అంతగా ఆదరణకు నోచుకోని అమ్మకందారులకు ఆర్థికంగా సాధికారత కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం’’ అని వివరించారు.
‘ఆభార్ కలెక్షన్’ను 2024 జులై లో ప్రారంభించి, ఇప్పటి వరకు కొనసాగించుకుంటూ రావడం వెనుక ఉన్న ముఖ్య కారణాన్ని జీఈఎమ్ అదనపు ముఖ్య కార్యనిర్వహణ అధికారి, సోషల్ ఇంక్లూజన్ ఇంచార్జి శ్రీ అజీత్ బి. చవాన్ వివరించారు. ‘‘దేశంలో చేతివృత్తి కళాకారుల సమూహాన్ని జీఈఎమ్ వేదికలోని వోకల్ ఫర్ లోకల్ స్టోర్‌ఫ్రంట్ ద్వారా సార్వజనిక కొనుగోలు వ్యవస్థతో జోడించి సమర్థమైన సరఫరా వ్యవస్థకు ప్రభావవంతమైన మార్కెట్ సదుపాయాన్ని అందించాలని సంకల్పించాం’’ అని ఆయన అన్నారు.
ఈ కలెక్షన్‌ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), ఇతర ప్రభుత్వ కొనుగోలుదారు సంస్థలకు స్థానిక ఉత్పాదనలతో పాటు స్థానిక ఉపాధి మార్గాలను ప్రోత్సహిస్తూ, తమ కానుకల సంబంధిత అవసరాలను తీర్చుకోవడంలో తోడ్పడుతుందని కూడా ఆయన వివరించారు.
ప్రభుత్వ కొనుగోలుదారు సంస్థలు ఈ కలెక్షన్‌ను   https://gem.gov.in/Aabhar లో పరిశీలించవచ్చు. అలాగే వోకల్ ఫర్ లోకల్ (#VocalForLocal) గిఫ్ట్ హ్యాంపర్ కలెక్షన్ ద్వారా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని, స్థానిక వాణిజ్య సంస్థలను ప్రోత్సహించడంలో తమ వంతు తోడ్పాటును అందించవచ్చు.

 

***


(రిలీజ్ ఐడి: 2328606) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Kannada