నాడు పోస్టు చేయడమైనది:
26 OCT 2026 1:50PM by PIB Hyderabad
ఎగుమతి ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం) ద్వారా రిలీఫ్ (ఎగుమతులను సులభతరం చేసేందుకు చేపట్టిన సుస్థిర, రవాణా చర్యలు) పథకంలోని కాంపోనెంట్ II గడువును మార్చి 31, 2027 వరకు వాణిజ్య శాఖ పొడిగించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గల్ఫ్, పరిసర ప్రాంతాల్లో సముద్ర రవాణాపై ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ 30, 2026 నాటి నోటిఫికేషన్ నెం. 37/2026-27 ద్వారా ఈ పొడిగింపును ప్రకటించింది.
నిర్దిష్ట ప్రాంతాలకు భవిష్యత్తులో జరిగే ఎగుమతులకు సంబంధించి 95 శాతం రిస్క్ కవరేజ్‌ను అందించటం ద్వారా ఎగుమతిదారులు ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీజీసీ) బీమాను పొందేలా ప్రోత్సహించటాన్ని ఇది లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 16, 2026, ఆ తర్వాత పొందిన స్టాండ్‌అలోన్ పాలసీలు, హోల్ టర్నోవర్ పాలసీలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఈ విభాగం ద్వారా అర్హులైన ఎగుమతిదారులు చెల్లించవలసిన ప్రీమియం, నిర్ణీత కాలంలో అంతకుముందున్న స్థాయిలను మించి పెరగకుండా కాపాడుతుంది. ఇంధన రవాణా మినహా, పూర్తి కంటైనర్ లోడ్ (ఎఫ్‌సీఎల్), పాక్షిక కంటైనర్ లోడ్ (ఎల్‌సీఎల్), రిఫ్రిజిరేటెడ్ (రీఫర్) కంటైనర్లు బీమా కార్గో వర్గాల్లో ఉన్నాయి.
రిలీఫ్ పథకం ద్వారా కవరేజ్ కోరుకునే ఎగుమతిదారులు www.ecgcltd.in. లోని ఈసీజీసీ కస్టమర్ పోర్టల్ ద్వారా క్లైమ్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను జనరేట్ చేయటం, ఎగుమతిదారుల రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయటం, ఈ పథకం ద్వారా క్లైమ్స్ సమర్పించటంపై మార్గదర్శకత్వం కోసం ఈసీజీసీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ @ecgcltd7016లో ప్రత్యేక వీడియో ట్యుటోరియల్స్ అందుబాటులో ఉన్నాయి.
మార్చి 19, 2026న ప్రారంభించిన రిలీఫ్… గల్ఫ్, పశ్చిమాసియా సముద్ర కారిడార్‌లో ఏర్పడిన అంతరాయాల కారణంగా సరకు రవాణా వ్యయం విపరీతంగా పెరగటం, అధిక బీమా ప్రీమియంలు, యుద్ధ సంబంధిత ఎగుమతి నష్టాలను ఎదుర్కొంటున్న భారత ఎగుమతిదారులకు మద్దతిచ్చేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం.
కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ, సముద్ర రవాణా అనిశ్చితుల మధ్య ఎగుమతుల స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు, వాణిజ్య కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చూసేందుకు, భారత ఎగుమతిదారులకు మద్దతిచ్చేందుకు ప్రభుత్వానికున్న నిబద్ధతను రిలీఫ్ పొడిగింపు స్పష్టం చేస్తుంది.
***