హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాదకద్రవ్యాలపై మోదీ ప్రభుత్వ ఉక్కుపాదం: అస్సాం, మిజోరం, మణిపూర్‌ రాష్ట్రాల్లో 38 ప్రాంతాల్లో ఏకకాలంలో 'ఆపరేషన్ ట్రైడెంట్' దాడులు నిర్వహించిన ఎన్సీబీ

అస్సాం, మిజోరం, మణిపూర్ రాష్ట్రాల్లోని 38 ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించి అంతర్జాతీయ నార్కో-కార్టెల్‌ను నిర్మూలించిన మన ఏజెన్సీలు: కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా

ఈ వినూత్న దాడి 31 డిసెంబర్ 2029 నాటికి మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను పూర్తిగా తుడిచిపెట్టాలనే దిశగా భారత్ తీసుకున్న భారీ ప్రతిజ్ఞకు సజీవ సాక్ష్యం

కేంద్ర ఏజెన్సీలు, మూడు రాష్ట్రాల పోలీసు బలగాలతో కూడిన మాదకద్రవ్యాల నిరోధక బృందానికి అభినందనలు తెలియజేసిన కేంద్ర హోం మంత్రి

ఈ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి వచ్చిన రూ. 100 కోట్ల విలువైన హవాలా లావాదేవీలు.. 1424 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంతో పాటు రూ. 17.82 కోట్ల విలువైన ఆస్తుల జప్తు

500 డిటోనేటర్లు, రూ. 12 లక్షల నగదును స్వాధీనంతో పాటు ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న 18 మంది అరెస్టు

'డెత్ ట్రయాంగిల్ కారిడార్' ద్వారా భారత్, మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తోన్న ముఠాలు

మాదకద్రవ్యాల నియంత్రణ విజన్ డాక్యుమెంట్ (2026-2029) మార్గదర్శకాలకు అనుగుణంగా సీమాంతర అంతర్జాతీయ ముఠాలను వేళ్లతో సహా పెకలించివేయడానికి కేవలం మాదకద్రవ్యాల స్వాధీనానికే పరిమితం కాకుండా నెట్‌వర్క్ నిర్మూలన, ఆర్థికంగా ధ్వంసం చేసే దిశగా సాధించిన వ్యూహాత్మక మార్పునకు నిదర్శనంగా నిలుస్తోన్న ఈ ఆపరేషన్

మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లు పూర్తిగా నాశనం అయ్యే వరకు ఈ దాడులను నిరంతరాయంగా కొనసాగించనున్న భారత్

నాడు పోస్టు చేయడమైనది: 25 OCT 2026 3:22PM by PIB Hyderabad

మోదీ ప్రభుత్వం మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ విషయంలో 'ఆపరేషన్ ట్రైడెంట్'ను ప్రారంభించిన ఎన్సీబీ.. ఇందులో భాగంగా అస్సాం, మిజోరం, మణిపూర్‌లలో ఏకకాలంలో 38 బృందాల ద్వారా 38 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మాదకద్రవ్యాల పట్ల మోదీ ప్రభుత్వం పాటిస్తున్న ఎట్టి పరిస్థితుల్లో సహించని (జీరో టాలరెన్స్) విధానానికి, కేవలం స్వాధీనానికే పరిమితం కాకుండా నెట్‌వర్క్ నిర్మూలన దిశగా తీసుకొచ్చిన వ్యూహాత్మక మార్పునకు అనుగుణంగా ఎన్సీబీ ఈ 'ఆపరేషన్ ట్రైడెంట్'ను చేపట్టింది. అస్సాం, మిజోరం, మణిపూర్ రాష్ట్రాల్లో సరిహద్దు దాటి పనిచేస్తున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల ఆర్థిక ముఠాలపై మూడు రాష్ట్రాల బహుళ ఏజెన్సీలు కలిసికట్టుగా ఈ భారీ దాడులు నిర్వహించాయి. మాదకద్రవ్యాల నియంత్రణ విజన్ డాక్యుమెంట్ (2026-2029) మార్గదర్శకాలకు అనుగుణంగా అంతర్జాతీయ సాయుధ, ఆర్థిక నెట్‌వర్క్‌లను మూలాల నుంచి పెకలించివేయడానికి స్వాధీనం ఆధారిత విధానం నుంచి నెట్‌వర్క్ ఆధారిత, ఆర్థికంగా ఛిన్నభిన్నం చేసే నూతన అధ్యాయానికి ఈ ఆపరేషన్ నిదర్శనంగా నిలుస్తోంది.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి.. "మాదకద్రవ్యాల విషయంలో మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మన ఏజెన్సీలు అక్టోబర్ 23న అస్సాం, మిజోరం, మణిపూర్‌లోని 38 ప్రాంతాల్లో ఏకకాలంలో విరుచుకుపడి దాడులు నిర్వహించి అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాను ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్ ద్వారా రూ. 100 కోట్ల విలువైన హవాలా లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి.. 1424 బ్యాంకు ఖాతాలు స్తంభించాయి.. రూ. 17.82 కోట్ల విలువైన ఆస్తులు జప్తు అయ్యాయి. ఇది 500 డిటోనేటర్లు, రూ. 12 లక్షల నగదు స్వాధీనంతో పాటు 18 మంది అరెస్టుకు దారితీసింది.

 

ఈ నెట్‌వర్క్ 'డెత్ ట్రయాంగిల్ కారిడార్' ద్వారా భారత్, మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తోంది. 31 డిసెంబర్ 2029 నాటికి ప్రతి మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యాన్ని సాధించడానికి భారత్ పూనిన భారీ ప్రతిజ్ఞకు ఈ సాయుధ దాడి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మాదకద్రవ్యాల ముఠాల శవపేటికకు చివరి మేకు దిగే వరకు భారత్ ఈ దాడులను నిరంతరాయంగా కొనసాగిస్తుంది. కేంద్ర ఏజెన్సీలు, మూడు రాష్ట్రాల పోలీసు బలగాలతో కూడిన మాదకద్రవ్యాల నిరోధక బృందానికి నా హృదయపూర్వక అభినందనలు” అని వ్యాఖ్యానించారు. 

‘ఆపరేషన్ ట్రైడెంట్’

 

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) 2026 అక్టోబర్ 23 తెల్లవారుజామున 'ఆపరేషన్ ట్రైడెంట్'ను ప్రారంభించింది. బహుళ ఏజెన్సీల అసాధారణ సమన్వయానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆపరేషన్‌లో ఎన్సీబీ.. మిజోరం పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో (ఈడీ) కలసికట్టుగా పనిచేస్తూ ఒక ప్రధాన అంతర్జాతీయ మాదకద్రవ్యాల రవాణా ముఠా కార్యాచరణ, ఆర్థిక వ్యవస్థల వెన్నెముకను విరిచేందుకు ఏకకాలంలో భారీ దాడులు నిర్వహించింది. ఆపరేషన్ ట్రైడెంట్ అనేది మిజోరంలోని డ్రగ్స్ సూత్రధారులు, వారి సహచరులను లక్ష్యంగా చేసుకోవడానికి నిఘా సమాచార మార్పిడి, వ్యూహాత్మక ప్రణాళికల రూపకల్పనలో వ్యవస్థాగత ఐక్యతకు ఒక కొత్త దిక్సూచిగా నిలిచింది. కేంద్ర, రాష్ట్ర రక్షణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల మధ్య కొద్దిరోజులుగా సాగిన రహస్య నిఘా సమాచార క్రోడీకరణ, సంయుక్త లక్ష్యాల గుర్తింపు, ఉన్నత స్థాయి వ్యూహాత్మక సమీక్షల అనంతరం ఈ ఆపరేషన్ రూపుదిద్దుకుంది. సిండికేట్‌ల లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లను, వాటి అక్రమ ఆర్థిక మూలాలను ఏకకాలంలో దెబ్బతీసేలా ఈ దాడులను పక్కాగా రూపొందించారు. 

 

ఏకీకృత కమాండ్ వ్యవస్థ కింద పక్కా వ్యూహంతో ఈశాన్య భారతంలోని అస్సాం, మిజోరం, మణిపూర్ రాష్ట్రాల పరిధిలోని ముందస్తుగా గుర్తించిన 38 ప్రాంతాలలో 38 బహుళ-ఏజెన్సీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. మిజోరంలోని ఐజ్వాల్, ఛంపై వంటి పట్టణ ప్రాంతాలు.. వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ఇండో-మయన్మార్ సరిహద్దు వాణిజ్య పట్టణం జోఖావ్థార్‌లతో పాటు, మణిపూర్‌లోని చురాచంద్‌పూర్, అస్సాంలోని కాచర్ రవాణా కారిడార్‌లలోని అనుబంధ కార్యాచరణ కేంద్రాలను ఆయా బృందాలు చుట్టుముట్టాయి. అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులు, విస్తృతమైన ప్రాంతీయ వ్యాప్తి ఉన్నప్పటికీ శాఖల మధ్య నిలకడైన అసాధారణ సమన్వయం వల్ల అన్ని తనిఖీలు, విచారణలు, ఆర్థిక ఆడిట్‌లు ఏకకాలంలో జరిగాయి. ఇది నిందితులు పరారవ్వకుండా, అక్రమ ఆస్తులను దాచకుండా సమర్థవంతంగా నిరోధించింది.

 

సంక్షిప్త నేపథ్యం: అంతర్జాతీయ నార్కో-కార్టెల్ గుట్టురట్టు

 

మిజోరం పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లతో (ఈడీ) కలిసి అన్ని కోణాల్లో ఎన్సీబీ నిర్వహించిన సమగ్ర దర్యాప్తులో భాగంగా నిఘా ఆధారిత ముందస్తు (బ్యాక్వర్డ్), తదుపరి(ఫార్వర్డ్) లింకేజ్ విచారణల ఫలితంగా ఈ బహుళ-రాష్ట్ర ఆపరేషన్ ప్రారంభమైంది. నిరంతర విచారణ ద్వారా మయన్మార్ కేంద్రంగా పనిచేస్తున్న సూత్రధారి థాంగ్‌సిన్‌తుయాంగ్ అలియాస్ చిన్‌తుయాంగ్ అలియాస్ ట్లుఅంగా (ఎన్సీబీ, ఛంపై పోలీసులు, మిజోరం ఎక్సైజ్ శాఖలలో 10కి పైగా ఎన్‌డీపీఎస్ కేసుల్లో నిందితుడు) నేతృత్వంలోని అంతర్జాతీయ సిండికేట్ గుట్టురట్టయింది. ఈ ముఠా మయన్మార్– మిజోరం– మణిపూర్– అస్సాం– త్రిపుర కారిడార్ ద్వారా మెథాంఫెటమైన్, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను భారత ప్రధాన భూభాగంతో పాటు బంగ్లాదేశ్‌కు అక్రమంగా రవాణా చేస్తోంది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఈ మాదకద్రవ్యాల ముఠా ముఖ్య సూత్రదారులను అదుపులోకి తీసుకున్నారు:

 

థాంగ్‌సిన్‌తుయాంగ్ అలియాస్ చిన్‌తుయాంగ్ అలియాస్ ట్లుఅంగా (ప్రధాన సూత్రధారి): సుదీర్ఘ అంతర్రాష్ట్ర నిఘా, వ్యూహాత్మక ఆపరేషన్ల అనంతరం ఢిల్లీలో అరెస్టు చేశారు. 

 

వుంగ్‌ఖాన్‌థావ్నా (ప్రధాన అనుసంధానకర్త): మయన్మార్ నుంచి వచ్చే మాదకద్రవ్యాల సరుకు రవాణా, పంపిణీని పర్యవేక్షించే నిందితుడు. ఇతడిని అరెస్టు చేసి కఠినమైన 'పీఐటీఎన్‌డీపీఎస్' చట్టం కింద నిర్బంధించారు.

 

లాల్‌రాంపరి (ప్రధాన హవాలా నిర్వాహకురాలు): ఈమెను 08.08.2024న ఎన్సీబీ అరెస్టు చేసింది. దర్యాప్తులో ఈ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్న దాదాపు రూ. 100 కోట్ల అక్రమ హవాలా లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. దీని ఆధారంగా ఈడీతో కలిపి సంయుక్త చర్యలు చేపట్టారు… అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్తంభింపజేశారు.

 

అబూ సలేహ్ అలియాస్ సైఫుద్దీన్ (అస్సాం కారిడార్ లాజిస్టిక్స్ హెడ్): ఇతడిని 20.11.2025న అస్సాంలోని కాచర్ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఇతను అస్సాం కారిడార్ గుండా మాదకద్రవ్యాల రవాణాను పర్యవేక్షించే ప్రధాన భారతీయ నిర్వాహకుడు, అనేక ఎన్‌డీపీఎస్ కేసులతో సంబంధం కలిగి ఉన్నాడు.

 

ఈ అరెస్టుల ఆధారంగా చేపట్టిన క్షుణ్ణమైన ఆర్థిక విశ్లేషణ, డిజిటల్ ఫోరెన్సిక్స్ విచారణ ద్వారా ఇతర సహకార నెట్‌వర్క్‌లు, షెల్ కంపెనీలు, మనీ మ్యూల్స్‌తో కూడిన విస్తృతమైన అక్రమ వలయం బయటపడింది. ఇది చివరకు 'ఆపరేషన్ ట్రైడెంట్' అనే భారీ, ఏకకాల సమన్వయ దాడుల నిర్వహణకు ప్రాతిపదికగా నిలిచింది.

***


(రిలీజ్ ఐడి: 2328262) సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , Odia , Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Punjabi , Gujarati , Tamil , Malayalam