నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2026 5:45PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్లో శ్రీ అనిల్ కె. ఆంటోనీ రచించిన ‘అడ్వాంటేజ్ ఇండియా: రీషేపింగ్ ది ఫ్యూచర్ ఫర్ యాన్ ఈక్విటబుల్ వరల్డ్’ పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఇవాళ ఆవిష్కరించారు.
ఈ పుస్తక ప్రచురణ సందర్భంగా రచయితను, రూపా పబ్లికేషన్స్‌ను ఉపరాష్ట్రపతి అభినందించారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో భారత్ సాధిస్తున్న అద్భుతమైన పరివర్తనను, దేశం ముందున్న అవకాశాలను ఈ పుస్తకం ఆవిష్కరిస్తుందని అన్నారు. సాంకేతికత, వ్యాపారం, ప్రజా విధానాలు వంటి రంగాల్లో తనకున్న అనుభవంతో భారత్‌లో కొత్తగా రూపుదిద్దుకుంటున్న బలాలను, అంతర్జాతీయ వ్యవస్థలో పెరుగుతున్న భారతదేశ పాత్రను శ్రీ ఆంటోనీ విశ్లేషించినట్లు పేర్కొన్నారు.
భారతదేశ ప్రత్యేక బలాలను ప్రస్తావిస్తూ.. దేశ నాగరికత వారసత్వం, ప్రజాస్వామ్య సంప్రదాయాలు, జనాభాపరమైన సానుకూలత, వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, పటిష్టమైన వ్యవస్థలు, విస్తరిస్తున్న సాంకేతిక సామర్థ్యాలన్నీ భారత్‌కు విశిష్ట ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయని ఉపరాష్ట్రపతి తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ పరివర్తనాత్మక ప్రయాణాన్ని ఉపరాష్ట్రపతి ప్రముఖంగా ప్రస్తావించారు. 25 కోట్లకు పైగా ప్రజలు అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. విద్య, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, వైద్యారోగ్యం, ఆహార భద్రతా రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు కోట్లాది మంది పౌరుల ఆత్మగౌరవాన్ని, సామాజిక భద్రతను పెంపొందించాయని ఆయన అన్నారు.
సమ్మిళిత అభివృద్ధి ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ.. మహిళలు, యువత, రైతులు, అణగారిన వర్గాల సాధికారత భారత పురోగతిలో అత్యంత కీలకమని శ్రీ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. మూడు కోట్లకు పైగా లఖ్పతీ దీదీల ఆవిర్భావం మహిళా నేతృత్వంలోని అభివృద్ధి విజయాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. వందేభారత్ రైళ్లు, విమానాశ్రయాలు, రహదారులు, రైల్వేస్టేషన్ల ద్వారా పెద్దఎత్తున అనుసంధానం మెరుగైందని చెప్పారు. కొత్త ఐఐటీలు, ఎయిమ్స్, వైద్య కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల ద్వారా విద్య, వైద్యారోగ్య మౌలిక సదుపాయాల విస్తరణను కూడా ప్రస్తావించారు.
భారతదేశంలో సాంకేతికత పరిణామ క్రమాన్ని గుర్తుచేసుకుంటూ.. కంప్యూటర్ల రాకతో మొదట్లో ఆందోళన కలిగినప్పటికీ తర్వాత ప్రపంచ ఐటీ శక్తిగా భారత్ అవతరించిందని ఉపరాష్ట్రపతి అన్నారు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ వంటి నూతన సాంకేతికతలు అలాంటి అవకాశాలనే నేడు దేశానికి అందిస్తున్నాయని చెబుతూ.. సామాజిక పురోగతి కోసం సాంకేతికతను సద్వినియోగం చేసుకోవటంలో నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను ప్రస్తావిస్తూ.. వివిధ రంగాల్లో స్వదేశీ తయారీలో భారత్ గణనీయమైన పురోగతిని సాధించిందని ఉపరాష్ట్రపతి తెలిపారు. స్వదేశీ బహుళ ప్రయోజక నౌక ఐఎన్ఎస్ సమర్థక్ను ఇటీవల నౌకాదళంలోకి ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. భారత దేశీయ రక్షణ ఉత్పత్తి రంగంలో పెరుగుతున్న సామర్థ్యాలకు ఈ విజయం నిదర్శనమని తెలిపారు.
అంతర్జాతీయంగా విస్తరిస్తున్న భారతదేశ పాత్ర గురించి మాట్లాడుతూ.. మరింత విస్తృత భాగస్వామ్యం, పెరుగుతున్న ప్రభావం, సరికొత్త ఆత్మవిశ్వాసంతో భారత దౌత్య విధానంలో గణనీయమైన మార్పు వచ్చినట్లు ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. జీ20 అధ్యక్ష బాధ్యతల సమయంలో భారత నాయకత్వాన్ని, వసుధైక కుటుంబం అనే తత్వాన్ని ముందుకు తీసుకెళ్లటంలో దేశం పోషించిన పాత్రను గుర్తుచేశారు. జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌కు భాగస్వామ్యం కల్పించటంలో భారత్ చేసిన కృషిని, గ్లోబల్ సౌత్ స్వరంగా భారత్ ఎదగటాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
వసుధైక కుటుంబం... కేవలం నినాదం మాత్రమే కాదని, భారతదేశ మార్గదర్శక తత్వమని ఉపరాష్ట్రపతి అన్నారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో భారత్ స్పందించిన తీరును ఈ సందర్భంగా ఉదహరించారు. భారత్ కేవలం దేశవ్యాప్త టీకా డ్రైవ్‌ను చేపట్టటమే కాక ప్రాణాలను రక్షించే వ్యాక్సిన్లను 100కు పైగా దేశాలకు అందించిందని.. అంతర్జాతీయ సంఘీభావం, మానవాళి సేవపట్ల దేశానికున్న నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
“భారత్‌కు ప్రయోజనం చేకూరితే మానవాళికే మేలు” అని ఉపరాష్ట్రపతి అన్నారు. సార్వభౌమాధికారం గల దేశాలన్నీ సమానమేనని, వాటిని సమానంగానే చూడాలని పేర్కొన్నారు. “ఏ కొత్త ఆవిష్కరణ అయినా, సాంకేతిక పురోగతి అయినా యావత్ మానవాళికి ప్రయోజనం చేకూర్చాలి కానీ, ఏ ఒక్క దేశానికో గుత్తాధిపత్యం కాకూడదు” అని అన్నారు. సాంకేతిక పురోగతి ఫలాలు మానవాళి సమష్టి సంక్షేమం కోసం అందరికీ అందేలా మరింత సమానత్వంతో కూడిన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.
2047 నాటికి వికసిత్ భారత్ సాధించటం... ఆకాంక్ష, బాధ్యత అని ఉపరాష్ట్రపతి అన్నారు. ఇందుకు దేశమే ప్రథమం సూత్రం పట్ల సమష్టి నిబద్ధత అవసరమని తెలిపారు. కేవలం ప్రభుత్వంతోనే దేశ నిర్మాణం సాధ్యం కాదని, ప్రతి పౌరుడి క్రియాశీలక భాగస్వామ్యం అవసరమని స్పష్టం చేశారు.
సాంకేతికత, ప్రజా విధానం, ఆర్థిక శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలు, దేశ నిర్మాణం వంటి అంశాల్లో భారత యువత మరింతగా భాగస్వాములయ్యేందుకు ఈ పుస్తకం స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ... శ్రీ అనిల్ కె. ఆంటోనీని శ్రీ సీపీ రాధాకృష్ణన్ అభినందించారు. రచయితకు, ప్రచురణకర్తకు, ఈ పుస్తక ప్రచురణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ సూద్, ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి సభ్యురాలు డాక్టర్ శమికా రవి, రచయిత శ్రీ అనిల్ కె. ఆంటోనీ, రూపా పబ్లికేషన్స్ మేనేజింగ్ ఎడిటర్ శ్రీ కపిష్ మెహ్రా, దౌత్యవేత్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
***