వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బెర్లిన్‌లో జర్మన్ పారిశ్రామిక నాయకులు, పరిశోధన సంస్థలతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమావేశం

శ్రీ గోయల్ బెర్లిన్ పర్యటనలో భారత్-జర్మనీ ఆర్థిక సహకారంపై దృష్టి

నాడు పోస్టు చేయడమైనది: 24 OCT 2026 11:40AM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ జర్మనీలో తన రెండు రోజుల అధికారిక పర్యటనను 2026 అక్టోబర్‌ 23న ముగించారు. బెర్లిన్‌లో ఆయన జర్మనీ ప్రభుత్వ ఉన్నతాధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు, ప్రవాస భారతీయులతో వరుస సమావేశాలు నిర్వహించారు. భారత్‌–జర్మనీ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, అధునాతన తయారీ రంగం, పరిశోధన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారు.

 

జర్మనీ ఫెడరల్‌ ఛాన్సలరీలో ఆర్థిక, ఆర్థిక విధాన సలహాదారుగా, జీ7/జీ20 షెర్పాగా వ్యవహరిస్తున్న లెవిన్‌ హోల్లేతో పీయూష్‌ గోయల్‌ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. భారత్‌–జర్మనీ మధ్య ఆర్థిక సహకారం, ఆర్థిక సంబంధాలు, పెట్టుబడుల బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉన్న అవకాశాలపై ఇరువురూ చర్చించారు.

 

సీమెన్స్‌ హెల్తినీర్స్‌ ఏజీ సీఈఓ బెర్న్డ్‌ మోంటాగ్‌, బెర్టెల్స్‌మన్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుడు, బెర్టెల్స్‌మన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సీఈఓ కార్స్టెన్‌ కోస్ఫెల్డ్‌, వోక్స్‌వ్యాగన్‌ ఏజీ సీఎఫ్‌ఓ, స్కోడా ఆటో సీఈఓ హోల్గర్‌ పీటర్స్‌తో మంత్రి విడివిడిగా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యాపార భాగస్వామ్యాలు, పెట్టుబడులు, పారిశ్రామిక సహకారాన్ని విస్తరించే అవకాశాలను ఈ సమావేశాల్లో పరిశీలించారు.

 

అధునాతన పారిశ్రామిక సాంకేతిక పరిజ్ఞానాలు, ఆవిష్కరణల రంగాల్లో సహకారంపై చర్చించేందుకు ప్రముఖ జర్మన్‌ పారిశ్రామిక పరిశోధనా సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలోనూ శ్రీ పీయూష్‌ గోయల్‌ పాల్గొన్నారు. ఆయనతో పాటు పర్యటించిన భారతీయ వ్యాపార ప్రతినిధి బృందం సభ్యులు జర్మన్‌ పారిశ్రామిక రంగ ప్రతినిధులు, వివిధ రంగాల సంఘాలతో నిర్వహించిన ప్రత్యేక రౌండ్‌టేబుల్‌ సమావేశాల్లో పాల్గొని, ఇరు దేశాల మధ్య వ్యాపార సహకారాన్ని విస్తరించే అవకాశాలను పరిశీలించారు.

 

బెర్లిన్‌లోని  ప్రవాస భారతీయులతో శ్రీ పీయూష్‌ గోయల్‌ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడారు.

 

పరిశోధన, ఆవిష్కరణల రంగానికి సంబంధించి చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా జర్మనీలో ఉన్న భారతీయ శాస్త్ర, సాంకేతిక పరిశోధకులు, విద్యార్థులతో శ్రీ పీయూష్‌ గోయల్‌ సంభాషించారు. ఎంపిక చేసిన ఫ్రాన్‌హోఫర్‌ పరిశోధనా సంస్థల అధిపతులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సూక్ష్మ ఎలక్ట్రానిక్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, లాజిస్టిక్స్‌, స్మార్ట్‌ తయారీ, పారిశ్రామిక ఆవిష్కరణలు, బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానాలు వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. భారత్‌–జర్మనీ మధ్య పరిశోధనా సహకారాన్ని బలోపేతం చేయడం, పరిశ్రమలు–విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాలను విస్తరించడం వంటి అవకాశాలపై చర్చించారు.

 

వాణిజ్యం, పెట్టుబడులు, అధునాతన తయారీ, శాస్త్ర, సాంకేతికత, పరిశోధన, పారిశ్రామిక సహకారం వంటి రంగాల్లో భారత్‌–జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ఉన్న అవకాశాలను ఈ పర్యటనలోని కార్యక్రమాలు స్పష్టం చేశాయి.

***


(రిలీజ్ ఐడి: 2327922) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Malayalam