నాడు పోస్టు చేయడమైనది:
22 OCT 2026 9:32PM by PIB Hyderabad
అందరికీ శుభాకాంక్షలు! ఇది పండుగల సమయం. దేశమంతా ఉత్సాహం, సంబరాలు, సరికొత్త శక్తితో నిండిపోయింది. ఈ ఆనందోత్సాహాల వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలపై చర్చించడానికి ఈ ఎన్డీటీవీ సదస్సును నిర్వహిస్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ నూతన ప్రపంచ క్రమం గురించి చర్చిస్తున్నారు. ఈ పరిణామాలు సామాన్య మానవుడి దైనందిన జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి కాబట్టి ఇటువంటి ప్రపంచ సదస్సుల ప్రాముఖ్యత మరింతగా పెరుగుతోంది.
మిత్రులారా,
'ది వరల్డ్ బిట్వీన్ ఆర్డర్స్' గురించి మాట్లాడుకునేటప్పుడు మనం రెండు కీలక అంశాలను అర్థం చేసుకోవాలి. మొదటిది.. ప్రపంచ క్రమం ఎందుకు మారుతోంది? నేటి సవాళ్లకు పాత ప్రపంచ క్రమం ఎందుకు పరిష్కారాలను చూపలేకపోతోంది? రెండోది.. ఈ మారుతున్న ప్రపంచంలో భారతదేశ పాత్ర ఏమిటి?
మిత్రులారా,
మొదటి అంశాన్ని మరింత వివరంగా పరిశీలిస్తే ఈ మార్పు ఎంతో సహజమైంది, స్వయంచాలకమైనది. రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచానికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. ఒక అంతర్జాతీయ వ్యవస్థ కేవలం అధికారం, బలం, స్వప్రయోజనాల ఆధారంగా మాత్రమే నడవలేదని ప్రపంచం గ్రహించింది. నిరంతర చర్చలు, సహకారం, వివాదాల పరిష్కారం అత్యంత ఆవశ్యకమని గుర్తించింది. ఈ భావనే ఐక్యరాజ్యసమితి ఆవిర్భావానికి పునాది వేసింది. దశాబ్దాల పాటు అంతర్జాతీయ సహకారాన్ని, ప్రపంచ శాంతిని పెంపొందించడంలో ఐక్యరాజ్యసమితి కీలక పాత్ర పోషించింది. అయితే కాలక్రమేణా ప్రపంచం మారుతూ వచ్చింది. నూతన ఆకాంక్షలు ఉద్భవించాయి. కొత్త ఆర్థిక వ్యవస్థలు, నూతన శక్తి కేంద్రాలు రూపుదిద్దుకున్నాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా గతంలో కంటే ఎంతో సంక్లిష్టంగా మారాయి. సాంకేతికత.. సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను, అధికార మూలాల స్వభావాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. తొలిసారిగా ప్రపంచ క్రమం ఏర్పడిన సమయంలో నిర్ణయాధికార పీఠాలపై లేని అనేక దేశాలు నేడు తమ సొంతంగా ప్రధాన పాత్ర పోషిస్తూ ముందుకు వచ్చాయి. అటువంటప్పుడు ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏంటంటే.. ఈ పరిణామాలకు అనుగుణంగా ప్రపంచ క్రమం కూడా అదే వేగంతో మారిందా? అంటే.. దానికి సమాధానం 'లేదు' అనే వస్తుంది. అంతర్జాతీయ వ్యవస్థ మారలేదు. అలాగని ప్రపంచ సంస్థలు ఆ వేగానికి అనుగుణంగా తమను తాము సవరించుకోలేకపోయాయి. ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలకు వాటి చారిత్రాత్మక పాత్ర ఉంది. అయినప్పటికీ నేటి ఆధునిక సవాళ్ల ముందు వాటి పరిమితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నూతన శక్తి కేంద్రాలు వేగంగా ఎదుగుతున్నాయి. కొత్త గొంతుకలు తమకు దక్కాల్సిన న్యాయమైన స్థానాన్ని డిమాండ్ చేస్తున్నాయి. నూతన సవాళ్లు కొత్త తరహా పరిష్కారాలను కోరుకుంటున్నాయి. ప్రపంచ వాస్తవికత మారినప్పటికీ నిర్ణయాధికార పద్ధతులు మార్పు లేకుండా పాతబడిపోతే వ్యవస్థకు, వాస్తవ పరిస్థితులకు నడుమ ఉన్న వ్యత్యాసం మరింత పెరగటం ప్రారంభమవుతుంది. సరిగ్గా నేడు మనం చూస్తున్నది ఇదే. దశాబ్దాల పాటు అంతర్జాతీయ వాణిజ్యం వివిధ దేశాలను అనుసంధానించింది.. సాంకేతికత దూరాలను తగ్గించింది.. సముద్ర మార్గాలు ఆర్థిక వ్యవస్థలను ఒకదానితో ఒకదానిని కలిపాయి. సాంస్కృతిక సంబంధాలు, ప్రజల రాకపోకలు భిన్న సమాజాలను దగ్గర చేశాయి. కానీ నేడు ఇవే అనుసంధాన లింకులు తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. వాణిజ్యం ఒక ఆయుధంగా మారుతోంది. సాంకేతికత నూతన పోటీకి, వివాదాలకు ప్రధాన వేదికగా పరిణమిస్తోంది. సముద్ర మార్గాలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. కాబట్టి నేడు ఎదురవుతున్న సవాలు కేవలం ఒక నూతన ప్రపంచ క్రమం ఆవిర్భవించడం గురించే కాదు. అసలైన ప్రశ్న ఏంటంటే.. ఈ మారుతున్న ప్రపంచంలో కొత్త వాస్తవికతలకు తగిన స్థానం లభించేలా అంతర్జాతీయ సంస్థలు మరింత క్రియాశీలకంగా మారేలా దేశాల మధ్య సహకార భావన మరింత బలపడేలా ఒక నూతన ప్రపంచ క్రమం మనం ఎలా నిర్మించాలి? సరిగ్గా దీనిలోనే భారత్ పాత్ర ఏమిటనే ప్రశ్న తెరపైకి వస్తుంది.
మిత్రులారా,
భారత్ పాత్ర గురించి వివరంగా చర్చించే ముందు నేను మిమ్మల్ని ఒక 7, 8 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తాను. కోవిడ్ మహమ్మారి సమయంలో ఏం జరిగిందో మనమందరం కళ్లారా చూశాం. ప్రపంచానికి పరస్పర సహకారం అత్యంత ఆవశ్యకమైన ఆ సమయంలో ప్రపంచం పూర్తిగా విభజించినట్లు కనిపించింది. ప్రపంచీకరణ గురించి గొప్పలు చెప్పుకున్న దేశాలు సంక్షోభ సమయంలో తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చుకున్నాయి. ఆ విచ్ఛిన్నకర వాతావరణంలో ఒకరినొకరు అనుమానాస్పదంగా చూసుకున్నారు.. అంతర్జాతీయ విశ్వసనీయత అట్టడుగు స్థాయికి పడిపోయింది. సరిగ్గా అప్పుడే 2020లో జీ20 వేదిక నుంచి నేను ప్రపంచం ముందు ఒక ఆలోచనను ఉంచాను. అదే ‘మానవాళి సమగ్ర సంక్షేమం కోసం ఒక నూతన ప్రపంచ క్రమం’.. అంటే మానవత్వాన్ని తన కేంద్ర బిందువుగా ఉంచుకునే వ్యవస్థ. అదే సంవత్సరం యూఎన్జీఏ వేదికగా.. ‘శతాబ్దం మారినప్పుడు మనం మారకపోతే మార్పును తీసుకురాగల మన సామర్థ్యం కూడా బలహీనపడుతుంది’ అని నేను చెప్పాను.
మిత్రులారా,
నేడు ప్రపంచ క్రమం మారుతున్నదనేది నిజమైనప్పటికీ అసలైన ప్రశ్న ఏంటంటే.. పాత అంతర్జాతీయ వ్యవస్థ మారుతున్న తరుణంలో మనం కలసికట్టుగా ఎలాంటి నూతన ప్రపంచ క్రమాన్ని నిర్మించాలనుకుంటున్నాం? బహుళ పక్ష అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యంత ఆవశ్యకం. గ్లోబల్ సౌత్ దేశాలకు వాటికి దక్కాల్సిన న్యాయమైన స్థానాన్ని, గొంతుకను అందించడం చారిత్రక అవసరం. అంతర్జాతీయ సహకారం అనేది కేవలం అనుకూల సమయాలకే పరిమితం కాకూడదు.. సంక్షోభ సమయాల్లో కూడా అది అంతే క్రియాశీలకంగా పనిచేయాలి. దీనికోసం భాగస్వామ్య పక్షాలన్నింటి మధ్య అర్థవంతమైన సమగ్ర అంగీకారం ఏర్పడటం అత్యంత ప్రధానం.
మిత్రులారా,
మన ప్రాచీన సాంస్కృతిక వారసత్వాన్ని తీసుకుంటే.. చాణక్యుడు తన అర్థశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నాడు.. ‘అప్రణీతః తు మత్స్య-న్యాయమ్ ఉద్-భావయతి’ అంటే పరిపాలనా వ్యవస్థ సడలినప్పుడు లేదా బలహీనపడినప్పుడు ‘మత్స్య న్యాయం’ రాజ్యమేలుతుంది. మత్స్య న్యాయం ప్రకారం పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుంది. ప్రపంచానికి అటువంటి దుస్థితి కలగకుండా నిరోధించే ఒక సమగ్ర వ్యవస్థ నేడు అత్యంత ఆవశ్యకం. ఇదే భారతదేశ ఆశయం. సరిగ్గా భారత్ ఆచరణలో చేస్తున్నది కూడా ఇదే. మహమ్మారి తీవ్ర సంక్షోభ సమయంలో భారత్ పోషించిన ఈ విశిష్ట పాత్రను ప్రపంచమంతా ప్రత్యక్షంగా చూసింది. అగ్రరాజ్యాలు, సమర్థవంతమైన దేశాలు కేవలం తమ స్వప్రయోజనాల గురించే ఆలోచిస్తున్న తరుణంలో భారత్ ధైర్యంగా ముందుకు వచ్చి అవసరంలో ఉన్న ప్రతి దేశానికి వ్యాక్సిన్లను అందించడమే కాకుండా 100 కంటే ఎక్కువ దేశాలకు నాణ్యమైన ఔషధాలను సరఫరా చేసింది.
మిత్రులారా,
‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే ప్రాథమిక సూత్రం ద్వారా మార్గనిర్దేశం పొందుతూ భారత్ ఒక ‘విశ్వ-బంధు’గా తన బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది. మీరు దీనిని ప్రత్యక్షంగా చూశారు. భారతదేశ అధ్యక్షతన జీ20 సదస్సు, భారత్ నాయకత్వంలో బ్రిక్స్ సదస్సు ఘనంగా జరిగాయి. ఈ రెండు అంతర్జాతీయ సదస్సుల నిర్వహణపై మొదట్లో ఎన్ని సందేహాలు వెలువడ్డాయో మనందరికీ తెలుసు! ఉమ్మడి ప్రకటనలపై అన్ని దేశాల మధ్య సమగ్ర అంగీకారాన్ని సాధించడం అసాధ్యమని అంతా భావించారు. అయితే భారత్.. విభేదాలను తొలగించి మైత్రి వంతెనలను నిర్మించింది.. నిరంతర సంభాషణలకు ప్రాధాన్యతనిచ్చింది. ఆ క్రమంలో ఢిల్లీ ప్రకటనకు అన్ని దేశాల ఏకగ్రీవ అంగీకారంతో ఆమోదం లభించింది. అత్యంత ప్రత్యర్థులుగా భావించే దేశాలు సైతం భారత్ అందించిన ఐక్యతా వేదికపైకి వచ్చి ఒకటయ్యాయి. ఇది కేవలం కాకతాళీయం కాదు. ఒక 'విశ్వ-బంధు'గా అంతర్జాతీయ వేదికపై భారత్ పాత్ర పట్ల ప్రపంచ దేశాలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి ఇది ప్రతీక.
మిత్రులారా,
భారత్ ఎంతగా శక్తివంతమై సాధికారత సాధిస్తుందో మానవాళికి అంతగా ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకంటే భారతదేశ విధానాలు, నిర్ణయాలు యుగయుగాల అనుభవం, నాగరికతా విలువల నుంచి స్ఫూర్తి పొందాయి. తాత్కాలిక స్వప్రయోజనాలకు లోనై భారత్ నిర్ణయాలు తీసుకోదు. అందుకే భారత్ ప్రపంచ స్థిరత్వానికి హామీగా, పురోగతికి భరోసాగా నిలుస్తోంది. 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) సాధన కోసం మన సంకల్పం కూడా ఈ దివ్యమైన భావననే పెంపొందిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఒక అంతర్జాతీయ సదస్సులో నేను ‘పవర్ టు ఎంపవర్’ అనే దృక్పథాన్ని ప్రపంచం ముందు ఉంచాను. అభివృద్ధి చెందిన భారత్ అనేది కేవలం మన ప్రయోజనాల కోసమే కాదు.. అది సమగ్ర ప్రపంచ సంక్షేమానికి ఒక గొప్ప పూచీకత్తు. భారత్ ఆత్మనిర్భరత వైపు అడుగులు వేస్తున్నప్పుడు అది ప్రపంచ సరఫరా గొలుసులను మరింత బలపరుస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందినప్పుడు అది ప్రపంచానికి నూతన ఆర్థిక పురోగతి పై నమ్మకాన్ని ఇస్తుంది. భారతదేశ యువత నైపుణ్యం, సామర్థ్యాలు కలిగి ఉన్నప్పుడు.. అది అంతర్జాతీయ ఆవిష్కరణలు, ఉత్పాదకతపై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసాన్ని నింపుతుంది. అనగా నేడు భారత్ తన సొంత సామర్థ్యాలను పెంపొందించుకుంటోంది. తద్వారా సమగ్ర ప్రపంచ సామర్థ్యం, ప్రగతి కూడా పెరుగుతాయి.
మిత్రులారా,
భారతదేశం ప్రపంచంలోనే టాప్-3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించడానికి తన పూర్తి శక్తియుక్తులతో కృషి చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులను చూసినప్పుడు మన ఆత్మవిశ్వాసం మరింత బలపడుతోంది. ఎందుకంటే ఇటువంటి క్లిష్ట సమయాల్లో కూడా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. నేడు హరిత ఇంధన రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశాల సరసన నిలిచింది. కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థ, స్టార్టప్ రంగాలు రెండింటిలోనూ భారత్ ప్రపంచంలోనే టాప్-3 స్థానాల్లో కొనసాగుతోంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్ అతిపెద్ద శక్తిగా ఎదిగింది. ఇక రియల్-టైమ్ డిజిటల్ చెల్లింపుల విషయానికి వస్తే భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో సగర్వంగా నిలిచింది.
మిత్రులారా,
నేటి భారత్ వివిధ రంగాల్లో తన సామర్థ్యాలను పెంచుకుంటోంది. మన దేశం అనేక చారిత్రాత్మక విజయాలను తొలిసారిగా సాధిస్తోంది. భారతదేశపు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ మొదటిసారిగా క్రిటికాలిటీని సాధించింది. భారత ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణను తొలిసారిగా డిజిటల్ సాంకేతికతతో అనుసంధానించింది. ఇదే సమయంలో భారతదేశపు మొదటి హైడ్రోజన్ రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి శిలాజేతర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో భారత్ తొలిసారిగా 300 గిగావాట్ల మార్కును అధిగమించింది.
మిత్రులారా,
నేను మీకు మరో ఉదాహరణ ఇస్తాను. కొద్ది రోజుల క్రితం ఆసియా క్రీడల నుంచి తిరిగి వచ్చిన యువ క్రీడాకారులతో సమావేశమయ్యే అవకాశం నాకు లభించింది. భారత్ ఈసారి 85 పతకాలను సాధించి అనేక చారిత్రాత్మక ఘనతలను తొలిసారిగా నెలకొల్పింది. మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు టీమ్ విభాగంలోనూ, వ్యక్తిగత విభాగంలోనూ మొదటిసారిగా స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. అలాగే బాక్సింగ్ విభాగంలో భారత్ ఒకే ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణ పతకాలను సాధించింది. ఇది కూడా మన క్రీడా చరిత్రలో ప్రథమం.
మిత్రులారా,
ఇప్పుడు నేను ఒక క్రీడా పదాన్ని చెబుతాను. ఈ హాలులోని చాలామంది ఈ పదాన్ని వినే ఉంటారని భావిస్తున్నాను. ఆ పదం.. సెపాక్ టక్రా. సెపాక్ టక్రా.. మీరు ఎప్పుడైనా ఈ పదాన్ని విన్నారా? ఇది తెలియని వారి కోసం నేను చెప్తున్నాను. ఇది ఒక ప్రత్యేకమైన క్రీడ పేరు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దీనిని ఆడుతూ పతకాలు సాధిస్తున్నాయి. ఇది ప్రాథమికంగా ఫుట్‌బాల్, వాలీబాల్ కలయికతో కూడిన ఒక హైబ్రిడ్ క్రీడ. దీనిని కాళ్లతో ఆడతారు కానీ ప్రతిపాదనలు నెట్‌కు ఇరువైపులా సాగుతాయి. ఇటీవలి ఆసియా క్రీడలో ఈ క్రీడకు సంబంధించిన పురుషుల క్వాడ్రంట్ విభాగంలో భారత్ తొలిసారిగా ఒక పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.
మిత్రులారా,
మారుతున్న భారతదేశానికి ఇదియే నిజమైన నిదర్శనం. ప్రతి రంగంలోనూ నూతనమైన, అపూర్వమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అంటే భారత్ సాంప్రదాయ బలాలు మరింత సుదృఢమవుతున్నాయి. అలాగే ఒకప్పుడు మనం అంతగా బలంగా లేని రంగాల్లో కూడా నేడు నూతన శక్తిగా ఆవిర్భవిస్తున్నాం. ఇవేవీ కూడా యాదృచ్ఛికంగా లేదా విడిగా జరుగుతున్న పరిణామాలు కావు. ఇది 'సంస్కరణ, పనితీరు, రూపాంతరం’ అనే విధానానికి ప్రత్యక్ష నిదర్శనం, పరిణామం.
మిత్రులారా,
ఒకప్పుడు విద్యుత్ వినియోగం పెరిగిన క్షణాన దేశవ్యాప్తంగా పవర్ గ్రిడ్లు కుప్పకూలిపోయిన రోజులను ఈ దేశం చూసింది. కానీ ఒక దేశం అపారమైన మనోబలంతో మేల్కొని పురోగమ బాట పట్టినప్పుడు పవర్ గ్రిడ్లు కుప్పకూలవు. పైగా అదే పవర్ గ్రిడ్ దేశ ప్రగతికి, ప్రజల ఆత్మవిశ్వాసానికి గొప్ప మహోన్నత శక్తిగా విద్యుత్‌ను అందిస్తుంది.
మిత్రులారా,
నేడు మన యువశక్తి, మహిళాశక్తి, రైతులు, మత్స్యకారులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు అత్యంత ఉత్సాహం, నిబద్ధతతో 'వికసిత్ భారత్' నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. నేడు మన చుట్టూ ఒక్కసారి పరిశీలించండి. భారతదేశ ఎగుమతులు నూతన రికార్డులను సృష్టిస్తున్నాయి. ఒక్క సెప్టెంబరు నెల విషయానికే వస్తే.. గత సంవత్సరంతో పోలిస్తే వస్తువులు, ఉత్పత్తుల ఎగుమతులు దాదాపు 25 శాతం పెరిగాయి. గత 12 సంవత్సరాల్లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి. మన గ్రామాల్లో 3.5 కోట్లకు పైగా మహిళలు 'లఖ్పతి దీదీలు'గా మారారు. మేం 6 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద అతి తక్కువ సమయంలోనే దాదాపు 70 లక్షల నూతన ఉద్యోగాల సృష్టి జరిగింది. మధ్యతరగతి ప్రజలకు రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్నును సున్నా చేశాం. ఈ విషయాన్ని మీకు పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. వచ్చిన దానిని తీసుకుని అలా ఊరుకుంటే సరిపోదు. దేశవ్యాప్తంగా జీవన సౌలభ్యం వేగంగా మెరుగుపడుతోంది.. నూతన ఉపాధి అవకాశాల సృష్టి నిరంతరం జరుగుతోంది.
మిత్రులారా,
ఒకప్పుడు ప్రపంచం భారత్‌ను ‘ప్రపంచపు బ్యాక్ ఆఫీస్’ అని పిలిచే రోజులు ఉండేవి. కానీ నేటి భారత్ కేవలం ఒక సేవా ప్రదాత మాత్రమే కాదు. మనం ప్రపంచం కోసం నూతన పరిష్కారాలను, వినూత్న సాంకేతికతలను ఆవిష్కరిస్తున్నాం.. రూపకల్పన చేస్తున్నాం.. సృష్టిస్తున్నాము. ఒక్క పరిశోధనా రంగాన్ని మాత్రమే తీసుకుంటే.. నేడు పరిశోధనా పత్రాల ప్రచురణలో ప్రపంచంలోనే మనం మూడో స్థానంలో నిలిచాం. 2025వ సంవత్సరంలో దాదాపు 1.5 లక్షల పేటెంట్లు దాఖలయ్యాయి. ఒకే ఒక్క సంవత్సరంలో 1.5 లక్షల పేటెంట్లు నమోదయ్యాయి. భారత్‌లో పరిశోధన, ఆవిష్కరణలకు ఉన్న అపారమైన సామర్థ్యానికి ఇది ఒక నిదర్శనం.
మిత్రులారా,
సెమికండక్టర్ రంగాన్ని కూడా పరిశీలిస్తే.. ప్రపంచంలోని మొత్తం చిప్-డిజైన్ ఉద్యోగుల్లో దాదాపు 20 శాతం మంది భారత్‌లోనే ఉన్నారు. మన దేశంలోని భారతీయ ఇంజనీర్లు అత్యంత ఆధునికమైన 2- 3 నానోమీటర్ చిప్ డిజైన్లపై పనిచేస్తున్నారు. ఈ మానవ వనరుల సమూహాన్ని మరింత పెంచేందుకు నేడు దేశంలో అవసరమైన ప్రతి సదుపాయాన్ని కల్పిస్తున్నాం. భారతీయ విద్యా సంస్థల్లోని మన విద్యార్థులు ఇప్పటివరకు 325 కంటే ఎక్కువ చిప్‌లను స్వయంగా రూపకల్పన చేశారు.
మిత్రులారా,
మరొక నిదర్శనం.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు. ప్రపంచంలోని మొత్తం క్యాపబిలిటీ సెంటర్లలో సగానికి పైగా భారత్‌లోనే ఉన్నాయి. ఇది కేవలం సంఖ్యకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. వాటి పనితీరు, స్వభావంలో వస్తున్న మార్పు ప్రధానమైంది. ఒకప్పుడు అనేక సెంటర్లు కేవలం సపోర్ట్ సేవలకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ నేడు అవి కృత్రిమ మేధ, క్లౌడ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, అనలైటిక్స్, ప్రాడక్ట్ డెవలప్మెంట్ వంటి ఉన్నత సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్నాయి. అంటే.. భారత్ పాత్ర మారుతోంది. భారతీయ గుర్తింపు రూపాంతరం చెందుతోంది. మనం 'టాలెంట్ ఎట్ స్కేల్' దశ నుంచి 'థింకింగ్ ఎట్ స్కేల్' స్థాయికి ఎదిగాం. ఒకప్పుడు భారత్ మానవ వనరులపై నమ్మకముంచిన ప్రపంచం నేడు భారతీయ మేధోశక్తిపై కూడా అంతే అచంచలమైన విశ్వాసాన్ని ఉంచుతోంది. ఫలితంగా మనం ప్రపంచంతో కలసి కేవలం ఒక 'బ్యాక్ ఆఫీస్'గా మాత్రమే కాకుండా ఒక 'బ్రెయిన్ ఆఫీస్'గా కలసి పనిచేస్తున్నాం.
మిత్రులారా,
ఏ రంగంలోనైనా ప్రభుత్వం ఒక విధానాన్ని రూపకల్పన చేసినప్పుడు లేదా పెట్టుబడి నిర్ణయం తీసుకున్నప్పుడు దాని వెనుక స్పష్టమైన, సుదీర్ఘమైన వ్యూహాత్మక ఆలోచన ఉంటుంది.. భారత్ ఏ ఏ రంగాల్లో తన సొంత సామర్థ్యాలను పెంపొందించుకోవాలి, ఏ ఏ విషయాలలో ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి, భవిష్యత్తులో రాబోయే సంక్షోభాలకు నేటి నుండే ఎలా సన్నాహాలు చేసుకోవాలి. ప్రతి నిర్ణయంలోనూ మేం ఈ అంశాలను నిరంతరం దృష్టిలో ఉంచుకుంటాం. ప్రభుత్వం చేసే అనేక పెట్టుబడుల ప్రయోజనాలు ప్రత్యక్షంగా కనిపించడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టొచ్చు కానీ దేశ భవిష్యత్తుకు అవి అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. దీనికి సంబంధించి నేను ఒక ఆసక్తికరమైన ఉదాహరణను మీతో పంచుకుంటాను. భారతదేశపు ఔషధ తయారీ సామర్థ్యాల గురించి మీకందరికీ బాగా తెలుసు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు భారత్ ముడి సరుకులు (ఏపీఐ), ప్రాథమిక ఔషధాల కోసం విదేశ దిగుమతులపై తీవ్రంగా ఆధారపడేది. కానీ నేడు దేశం ఈ పరిస్థితిని వేగంగా మారుస్తోంది. యాంటీబయోటిక్స్ తయారీకి అత్యంత ఆవశ్యకమైన 'పెన్సిలిన్ జీ' గురించి మీరు వినే ఉంటారు. గత రెండు-మూడు దశాబ్దాలుగా భారత్‌లో దీని స్వదేశీ ఉత్పత్తి దాదాపుగా నిలిచిపోయింది. మేం దీనిని 'ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక' (పీఎల్ఐ) పథకం కిందికి తీసుకువచ్చాం. నేడు అనేక సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో 'పెన్సిలిన్ జీ' స్వదేశీ ఉత్పత్తి పునఃప్రారంభమైంది.
మిత్రులారా,
'పెన్సిలిన్ జీ' అనేది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఔషధ తయారీకి ఆవశ్యకమైన ప్రాథమిక ముడి సరుకులైన ఎపీఐ (యాక్టీవ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్) కోసం భారత్‌లో మేం సంపూర్ణ స్వదేశీ సరఫరా వ్యవస్థను నిర్మిస్తున్నాం. అందుకే ఈ రంగాన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం పరిధిలోకి తీసుకొచ్చాం. దీని ద్వారా ఇప్పటివరకు రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటికే దాదాపు 40 ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పురోగమిస్తోంది. ఇటువంటి విధానాలు, నిర్ణయాలే భారత్‌ను స్వయంసమృద్ధి దిశగా సమర్థవంతంగా నడిపిస్తున్నాయి.
మిత్రులారా,
దేశీయంగా సాధించిన ఎన్నో చారిత్రాత్మక విజయాల గురించిన చర్చల మధ్య మన మీడియా మిత్రులు ఒక చిన్న ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.. అందరి గురించీ చెప్పారు కానీ తమ పనితీరు గురించి ఏమీ మాట్లాడలేదని! ఎన్డీటీవీ ఇంత మహోన్నతమైన సదస్సును నిర్వహిస్తోంది. ఇక మన మూలసూత్రం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’.. అందులో మీడియా వికాసం కూడా అంతర్భాగమే! కాబట్టి బహుశా మీరు కొన్ని నిష్కపటమైన, తీపి-వగరు మిశ్రమ వ్యాఖ్యలను కూడా ఆహ్వానిస్తారని భావిస్తున్నాను.
మిత్రులారా,
ప్రపంచం నూతన ప్రపంచ క్రమం కోసం అన్వేషిస్తున్న తరుణంలో కొందరు వ్యక్తులు భారత్‌లో అస్థిరత, గందరగోళాన్ని నింపాలని కలలు కంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో అల్లకల్లోలం నెలకొన్న నేటి కాలంలో ఒక బలమైన, సుదృఢమైన భారతదేశ ప్రతిబింబం ప్రపంచానికి స్పష్టంగా వ్యక్తమవ్వాలి. కానీ ఈ వ్యక్తులు భారత్ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. భారత్‌ను అవమానించడానికి, విదేశీ జోక్యాన్ని కోరేందుకు వారు విదేశాలకు పయనమవుతున్నారు. తమ విఫలమైన నాయకుడిని రీలాంచ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రయోజనాలను ఇంకెన్నాళ్లు పణంగా పెడుతుందో అర్ధం కావడం లేదు. ఒక మొత్తం సంవత్సరంలో శ్రీహరికోట కూడా ఇన్ని రాకెట్ ప్రయోగాలను చేయదేమో! కాంగ్రెస్ తన నాయకుడిని రీలాంచ్ చేయడానికి చేసే విఫల యత్నాలు శ్రీహరికోట ప్రయోగాల కంటే ఎక్కువగా ఉన్నాయి!
మిత్రులారా,
కాంగ్రెస్ పార్టీ తనంతట తానుగా తెచ్చుకోవాలని కోరుకునే ఏ పతనమైనా సంపూర్ణంగా దాని వ్యక్తిగత విషయం. దానితో మనకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఒక నిర్దిష్ట కుటుంబానికి పదే పదే ఎదురవుతున్న వైఫల్యాల మరకల నుంచి వారిని రక్షించడానికి భారతదేశపు విజయాలను, శక్తులను, ప్రగతిని బోనులో నిలబెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. ‘ద్రాక్ష పండ్లు పుల్లన’ అన్నట్లుగా పరిస్థితి తయారవ్వడంతో కాంగ్రెస్ ఏకంగా ద్రాక్షతోటనే నరికివేయడానికి పూనుకుంది! వాస్తవానికి ఈ కుటుంబం తమ సొంత పార్టీకే ఒక పెను భారంగా పరిణమించింది. ఈ విషయాన్ని ఆ పార్టీలోని సీనియర్ పెద్దలు గ్రహించారు. అంతేకాకుండా మా వద్ద వ్యక్తిగత చర్చల్లో దీనిని అంగీకరిస్తారు కూడా... కానీ వారు తమ అవమానాన్ని దిగమింగుకుని నిశ్శబ్దంగా ఉండిపోతున్నారు.
మిత్రులారా,
కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఈ ప్రవర్తన ప్రభుత్వంపై నిజాయితీతో కూడిన విమర్శలు చేసేవారికి కూడా తీవ్ర హాని కలిగిస్తోంది. ఇది ప్రజాస్వామ్యంలో భారీ మూల్యాన్ని చెల్లింపజేస్తోంది. దీనివల్ల వాస్తవంగా విమర్శించేవారు ఎంతో నష్టపోతున్నారు. ప్రజాస్వామ్యబద్ధమైన రీతిలో ప్రభుత్వంపై తమ విమర్శలను వినిపించాలనుకునే వారి గొంతులను కాంగ్రెస్ అలజడులు, గందరగోళం నడుమ నొక్కివేస్తున్నాయి. నిజమైన విమర్శకుల స్వరాలు అణచివేతకు గురవుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని, జాతీయ ప్రయోజనాలను నిజంగా కాంక్షించేవారు ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకులు అయినప్పటికీ.. కాంగ్రెస్ చేసే గోల, కేకల మధ్య మాట్లాడే అవకాశాన్ని కోల్పోతున్నారు. మనం పార్లమెంటులో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రతిపక్ష పార్టీల్లో ఎంతో మంది ప్రతిభావంతులైన యువ ఎంపీలు ఉన్నారు. వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ సభను అడ్డుకుంటూ ఇతరులకు ఆ అవకాశం రాకుండా చేస్తోంది. కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ప్రచారంలో ఉంచాలనే కాంగ్రెస్ తాపత్రయం వల్ల... ప్రతిపక్షానికి చెందిన యువ ఎంపీలకు కాంగ్రెస్ తీవ్రమైన అన్యాయం చేస్తోంది.
మిత్రులారా,
ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత అవసరమైన నిర్మాణాత్మక సంస్కరణలను నిజాయితీగా కోరుకునే సహజ సిద్ధమైన ఉద్యమాలను కూడా కాంగ్రెస్ నాశనం చేస్తోంది. కాంగ్రెస్ ఇతరులెవ్వరినీ పురోగమించనివ్వని ఒక 'పరాన్నజీవి'లా మారింది. మేధోపరమైన నక్సలైట్లు కాంగ్రెస్ ఆలోచనా విధానాన్ని ఎంతగా ఆక్రమించారంటే... కాంగ్రెస్ తన సొంత ఆలోచనా శక్తిని, విచక్షణా జ్ఞానాన్ని సంపూర్ణంగా కోల్పోయింది. ఒకప్పుడు అడవులలో విధ్వంసాన్ని సృష్టించిన శక్తులు నేడు కాంగ్రెస్‌లోకి చొరబడి దేశం మొత్తమ్మీద వినాశనాన్ని సృష్టించేందుకు పూనుకున్నాయి.
మిత్రులారా,
ఈ సవాళ్లన్నింటి మధ్య. ‘వికసిత్ భారత్’ అనే మహోన్నత లక్ష్యం మన కళ్లముందు నిలిచి ఉంది. దేశ ప్రజల ఆకాంక్షలకు హద్దులు లేవు. అందుకే నేడు భారతదేశవ్యాప్తంగా ఒకే ఒక్క ఆత్మవిశ్వాస నినాదం మారుమోగుతోంది.. అదే: ‘మనం సాధించి తీరుతాం, మనం సాధించి తీరుతాం’. మనం పెద్ద ఎత్తున కలలు కంటాం. ఎదురయ్యే ప్రతి సవాలును ఒక గొప్ప అవకాశంగా మలుచుకుంటాం. ప్రతీ సంకల్పాన్ని ప్రత్యక్ష సత్యంగా మార్చి చూపుతాం. మన ఆత్మవిశ్వాసమే మన అసలైన బలం. 140 కోట్ల మంది భారత ప్రజల కలలే మన నిరంతర స్ఫూర్తిప్రదాతలు. మనం నూతన ఆవిష్కరణలు చేస్తాం.. నూతన బాటలు వేస్తాం.. నూతన శిఖరాలను అధిరోహిస్తాం.. భారతదేశ విజయాలను ప్రపంచ శ్రేయస్సుతో అనుసంధానిస్తాం. ఈ వరల్డ్ సదస్సు ద్వారా వెలువడే సారం ఈ జాతీయ భావనను మరింత బలోపేతం చేస్తుందని, మన దృఢ సంకల్పాలకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని, భారతదేశపు మహోన్నత ఆకాంక్షలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు!
ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి హిందీలో మాట్లాడారు.
***