లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో ఈ నెల 26 - 27 తేదీల్లో 12వ బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరం సమావేశం: లోక్‌సభ స్పీకర్‌

· సమావేశంలో పాల్గొని సందర్శనకు వచ్చిన ప్రతినిధి బృందాల నాయకులతో భేటీ కానున్న ప్రధానమంత్రి: స్పీకర్‌

· పార్లమెంట్లకు సంబంధించిన వ్యూహాత్మక ప్రాధాన్యతలపై చర్చించనున్న బ్రిక్స్‌ సభ్య, భాగస్వామ్య దేశాల పార్లమెంట్ల సభాపతులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రముఖులు: లోక్‌సభ స్పీకర్‌

· ప్రజాకేంద్రిత అభివృద్ధి ఇతివృత్తంగా భారత్‌ అధ్యక్షతన న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న సదస్సుకు హాజరు కానున్న ప్రపంచ దేశాల పార్లమెంటరీ నేతలు: లోక్‌సభ స్పీకర్‌

· సంస్థాగత స్థిరత్వం, నైతిక కృత్రిమ మేధ, డిజిటల్‌ మార్పు, ప్రపంచ పాలనలో సంస్కరణలు, సుస్థిర అభివృద్ధి అంశాల్లో పార్లమెంట్ల పనితీరుపై చర్చలు: లోక్‌సభ స్పీకర్‌

· పార్లమెంటరీ దౌత్యం, సామర్థ్యాల పెంపు, ఉత్తమ విధానాల పరస్పర మార్పిడిపై చర్చించనున్న బ్రిక్స్‌ సభ్య, భాగస్వామ్య దేశాల అంతర్జాతీయ వ్యవహారాల కమిటీలు: లోక్‌సభ స్పీకర్‌

నాడు పోస్టు చేయడమైనది: 22 OCT 2026 4:03PM by PIB Hyderabad

12వ బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరమ్‌కు 2026 అక్టోబర్‌ 26, 27 తేదీల్లో సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో భారత పార్లమెంటు ఆతిథ్యమివ్వనుంది. ఈ సదస్సు అక్టోబర్‌ 26న ప్రారంభమవుతుంది.

లోక్‌సభ స్పీకర్‌ శ్రీ ఓం బిర్లా ఈ రోజు పార్లమెంట్‌ హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ సదస్సు భారత పార్లమెంటరీ దౌత్య చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని తెలిపారు. ఈ సదస్సులో బ్రిక్స్‌ సభ్య, భాగస్వామ్య దేశాలకు చెందిన సభాపతులు, పార్లమెంటరీ నేతలు, కేంద్ర మంత్రులు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ శ్రీ హరివంశ్‌, రాష్ట్ర శాసనసభల సభాపతులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సమావేశంలో పాల్గొని పర్యటనకు వచ్చిన ప్రతినిధి బృందాల నాయకులతో సమావేశమవుతారని లోక్‌సభ స్పీకర్‌ తెలిపారు.

విదేశాల నుంచి విచ్చేసిన ప్రతినిధి బృందాల నాయకులతోనూ, పార్లమెంటరీ మైత్రీ బృందాలతోనూ  ఈ సదస్సు వేదికగా ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు. 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ సంయుక్త ప్రకటనను ఖరారు చేసేందుకు గాను సదస్సు ప్రతినిధి బృందాల కార్యదర్శుల సమావేశం 2026 అక్టోబర్ 25న జరుగుతుందని ఆయన తెలిపారు.

కార్యక్రమ ప్రధాన ఇతివృత్తాన్ని వివరిస్తూ, “ప్రజాకేంద్రిత అభివృద్ధి కోసం పార్లమెంట్లను బలోపేతం చేయడం” అనే విస్తృత అంశంపై ఈ ఫోరమ్‌లో చర్చలు జరుగుతాయని స్పీకర్  తెలిపారు.

బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరమ్‌ గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, 12వ బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరమ్‌ నాలుగు ఉన్నతస్థాయి సమావేశాల ద్వారా ఏకాభిప్రాయ ఆధారిత చర్చలకు వేదికగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఆ నాలుగు సమావేశాలు ఇవి:

(i) స్థిరత్వం: మెరుగైన భవిష్యత్తుకు భరోసా కల్పించేలా సంస్థలను బలోపేతం చేయడంలో పార్లమెంట్ల కీలక పాత్ర.

(ii) ఆవిష్కరణ: పార్లమెంట్ల ద్వారా కృత్రిమ మేధస్సు, డిజిటల్‌ సాంకేతికతల్లో మానవకేంద్రిత ఆవిష్కరణలను  ప్రోత్సహించడం.

(iii) సహకారం: పార్లమెంటరీ సహకారం ద్వారా ప్రపంచ పాలనలో మరింత ప్రాతినిధ్యంతో కూడిన వ్యవస్థను నిర్ధారించడం.

(iv) సుస్థిరత: మన దేశాలకు సుస్థిరమైన, సమ్మిళిత భవిష్యత్తును అందించడంలో పార్లమెంట్ల పాత్ర.

బ్రిక్స్‌ సభ్య, భాగస్వామ్య దేశాల పార్లమెంట్ల అంతర్జాతీయ వ్యవహారాల కమిటీల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ దౌత్యం, సామర్థ్యాల పెంపు, ఉత్తమ విధానాల పరస్పర మార్పిడిపై చర్చించనున్నారు.

ఉన్నతస్థాయి ప్లీనరీ సమావేశాలు, సమాంతర సమావేశాలు, ద్వైపాక్షిక చర్చలతో పాటు సాంస్కృతిక కార్యక్రమం కూడా సదస్సులో భాగంగా ఉంటుందని శ్రీ బిర్లా తెలిపారు. విశిష్ట అతిథుల గౌరవార్థం భారత ఉపరాష్ట్రపతి విందు ఏర్పాటు చేయనున్నారు.

ప్రతినిధి బృందాల సభ్యులు భారత పార్లమెంటును సందర్శించడంతో పాటు, ఢిల్లీలోని సాంస్కృతిక ప్రదేశాలను కూడా సందర్శిస్తారు. ఈ సదస్సు అక్టోబర్‌ 27న ముగుస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2327273) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Tamil , Kannada , Gujarati , Assamese , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Malayalam