రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ రహదారి వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో టోల్ ప్లాజా ఫీడ్‌బ్యాక్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన ఎన్‌హెచ్‌ఏఐ

నాడు పోస్టు చేయడమైనది: 19 OCT 2026 4:43PM by PIB Hyderabad

టోల్ ప్లాజాల వద్ద వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచే దిశగా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కీలక కార్యక్రమం చేపట్టింది. జాతీయ రహదారి ప్రయాణికులు టోల్ ప్లాజాలకు సంబంధించిన అనుభవాన్ని పంచుకునేందుకు వీలుగా రాజ్‌మార్గ్ యాత్ర మొబైల్ యాప్‌లో “టోల్ ప్లాజా ఫీడ్‌బ్యాక్” ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పౌరుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటం, జాతీయ రహదారులపై ప్రయాణాలను మరింత సురక్షితంగా, సాఫీగా, సౌకర్యవంతంగా మార్చే ప్రయత్నాలకు మద్దతివ్వటం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

 

 సులభతరమైన, వినియోగదారులకు అనుగుణంగా ఉండే ఫీడ్‌బ్యాక్ ప్రక్రియ

 

టోల్ ప్లాజాల వద్ద సేవల పంపిణీని మెరుగుపరిచేందుకు వినియోగదారుల అభిప్రాయాలను పంచుకునేలా ఎన్‌హెచ్‌ఏఐ ప్రోత్సహిస్తోంది. జాతీయ రహదారి టోల్ ప్లాజాను దాటిన తర్వాత వార్షిక పాస్ ఉన్న వినియోగదారులు టోల్ ప్లాజా అనుభవాన్ని పంచుకోవాలని ఆహ్వానిస్తూ రాజ్‌మార్గ్ యాత్ర యాప్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. అదనంగా, ఏ టోల్ ప్లాజా గురించైనా అభిప్రాయాన్ని తెలియజేసేందుకు యాప్‌లోని మెనూ విభాగంలో ఉన్న "టోల్ ప్లాజా ఫీడ్‌బ్యాక్" ఫీచర్‌ను వినియోగదారులందరూ ఉపయోగించుకోవచ్చు. అనుభవానికి రేటింగ్ ఇవ్వటంతో పాటు, ప్రయాణానికి సంబంధించిన ఆప్షన్లను వినియోగదారులు ఎంచుకోవచ్చు. ఏవైనా సూచనలు, సమస్యలను కూడా తెలియజేయవచ్చు.

 

అనుభవాలను తెలియజేసేందుకు, దృష్టి సారించాల్సిన సమస్యలను ప్రస్తావించేందుకు జాతీయ రహదారి వినియోగదారులకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. టోల్ ప్లాజా సేవల్లో మెరుగుపరచాల్సిన విభాగాలను గుర్తించి, పర్యవేక్షించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ప్రయత్నాలకు కూడా ఇది మద్దతునిస్తుంది.

 

ఈ టోల్ ప్లాజా ఫీడ్‌బ్యాక్ ఫీచర్‌ను వినియోగించుకోవాలని, రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా అనుభవాలను పంచుకోవాలని జాతీయ రహదారి వినియోగదారులను ఎన్‌హెచ్‌ఏఐ ప్రోత్సహిస్తోంది. పౌరుల భాగస్వామ్యం వల్ల వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు, జాతీయ రహదారుల వ్యవస్థ వ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద సేవల పంపిణీని మరింత మెరుగుపరిచే దిశగా పనిచేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐకి అవకాశం లభిస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2325303) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Kannada , Malayalam