హోం మంత్రిత్వ శాఖ
దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాతికేళ్ల ‘సేవ-అంకితభావం’ నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కింద నక్సల్ హింస బాధితులు సహా దివ్యాంగులకు పరికరాల పంపిణీ
ముఖ్యమంత్రిగా.. ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా దేశమంతటా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహణ
ఒక్క బస్తర్ నుంచే 1,570 మందికి పైగా లబ్ధిదారులు: ఆ ప్రాంత ప్రజలు అనుభవించిన బాధలు.. వేదనలకు ఇదే నిదర్శనం
“దేశాన్ని నక్సల్ విముక్తం చేశాక నాటి గాయాలను మాన్పి బాధితులంతా గౌరవప్రదంగా జీవించేలా శ్రద్ధ వహించడం నేటి తక్షణావసరం”
“రాజకీయం కోసం నక్సల్స్ ఐఈడీ పేలుళ్లకు పాల్పడి అమాయకులను దివ్యాంగులుగా మార్చారు.. ఇంతకన్నా హక్కుల ఉల్లంఘన ఏముంది?”
“దివ్యాంగులు-బాధితులందరికీ పునరావాస కల్పనపై మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది… ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి అండగా నిలుస్తుంది”
“నక్సలిజాన్ని నిర్మూలించిన తరహాలోనే దాని జాడలను పూర్తిగా తుడిచిపెట్టాల్సి ఉంది”
“ప్రతిపక్ష పాలనలో యాభయ్యేళ్ల పాటు కనీస సేవలందని బస్తర్‌లో నేడు ‘నియద్ నెల్లనార్’ పథకం కింద మౌలిక సదుపాయాలు లభిస్తున్నాయి”
“బస్తర్ ఒలింపిక్స్.. బస్తర్ పండుమ్.. నియద్ నెల్లనార్.. సీఎం కలెక్టివ్ బస్ పథకం’ వగైరాలతో బస్తర్‌ను ఉల్లాస.. ఉత్సాహభరిత ప్రాంతంగా మార్చేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కృషి చేస్తోంది”
“కాల్పులు.. బాంబు పేలుళ్లతో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న బస్తర్‌లో నేడు వేలాది యువత క్రీడలు సహా సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు”
“బస్తర్ పండుమ్’ ద్వారా గిరిజన కళా-సంస్కృతుల పునరుద్ధరణకు అవిరళ కృషి కొనసాగుతోంది”
“మునుపటి 500కు పైగా భద్రత శిబిరాల్లో 200కు పైగా ‘షహీద్ వీర్ గుండాధూర్ సేవా డేరా’లుగా మారనున్నాయి”
“లోగడ ప్రజలకు రక్షణ కల్పించిన జవాన్ల శిబిరాల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు నేడు ప్రగతిశీల బస్తర్‌కు పునాది వేస్తున్నారు”
నాడు పోస్టు చేయడమైనది:
15 OCT 2026 4:23PM by PIB Hyderabad
ప్రజా సేవ-అంకిత భావంతో కూడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్థానంలో 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కింద (నక్సల్ హింస బాధితులు సహా) దివ్యాంగులకు ఇవాళ సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన వారినుద్దేశించి కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఈ రోజు ‘దివ్యాంగ సేవా శిబిరం’ రెండో దశకు శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సేవ-అంకిత భావంతో కూడిన ప్రజాసేవలో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేశారు. దీన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్ హింస బాధితులైన గిరిజన దివ్యాంగులకు జీవన సౌలభ్యం కల్పించడంలో భాగంగా వారికి కృత్రిమ అవయవాలు సహా ఇతర సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ అమిత్ షా మాట్లాడుతూ- రాష్ట్రంలోని జగదల్పూర్లో ఈ నెల 5 నుంచి 7వ తేదీవరకూ 3,600 మందికి పైగా దివ్యాంగులు లబ్ధి పొందారని గుర్తుచేశారు. వీరిలో ఒక్క బస్తర్ ప్రాంత వాసులే 1,570 మందికి పైగా ఉన్నారని పేర్కొన్నారు. నక్సలైట్ల హింసతో ఆ ప్రాంత ప్రజలు ఎంతటి వేదనను అనుభవించారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారు. ఐదు దశాబ్దాల నక్సలిజం ఫలితంగా బస్తర్ పేద గిరిజనం అంతులేని వేదనకు గురయ్యారని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అమాయక పౌరులపై ‘ఐఈడీ’లతో పేలుళ్లు నిర్వహించారని చెప్పారు. ఫలితంగా అసంఖ్యాక గిరిజనులు దివ్యాంగులుగా మారారని, మానవ హక్కుల ఉల్లంఘనలో అత్యంత తీవ్ర ఉదంతం ఏదైనా ఉందంటే అది ఇదేనని పేర్కొన్నారు. దేశంలో నక్సలిజం నిర్మూలనకు మోదీ ప్రభుత్వం దృఢ సంకల్పం పూనడంతో ఆ లక్ష్యం నేడు నెరవేరిందని శ్రీ అమిత్ షా చెప్పారు. అంతమాత్రాన ఐదు దశాబ్దాల బాధలు చెరిగిపోవన్నారు. ఈ హింసాత్మక పరిస్థితులు చేసిన గాయాలను మాన్చాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఆ మేరకు బాధితులు తిరిగి తమ కాళ్లపై తాము నిలబడేలా, ఆత్మగౌరవంతో జీవించేలా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
ఈ దిశగా అవిరళ కృషిలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ, జైపూర్‌లోని ‘భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయతా సమితి’, ‘భారతీయ జైన్ సంఘటన’ సహా మరికొన్ని సంస్థలు పాలుపంచుకుంటున్నాయని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. దివ్యాంగులకు, బాధితులకు పునరావాసం కల్పనపై మోదీ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని, ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి పూర్తి చేయూతనిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. నక్సలిజాన్ని పూర్తిగా తుదముట్టించడం ద్వారా బస్తర్‌ను తిరిగి ఉల్లాస, ఉత్సాహభరిత, ప్రగతిశీల ప్రాంతంగా మార్చాలని శ్రీ అమిత్ షా పిలుపునిచ్చారు. ఈ దిశగా ఇప్పటికే గణనీయ కృషి సాగిన నేపథ్యంలో బస్తర్ సంప్రదాయ గిరిజన నాయకత్వం కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగులకు చక్రాల కుర్చీలు, ట్రైసైకిళ్లు, ఊతకర్రలు, వినికిడి పరికరాలు, స్మార్ట్ వాకింగ్ స్టిక్‌లు, కృత్రిమ అవయవాలు, ఇతర సహాయ పరికరాల పంపిణీ విజయవంతమైందని తెలిపారు. తద్వారా బస్తర్‌లో ఆశాభావం, ఆనందంతో కూడిన నవ శకానికి నాంది పలికామని ఆయన వ్యాఖ్యానించారు.
ఒకనాడు హింసతో తల్లడిల్లిన బస్తర్‌ను తిరిగి ఆనందోత్సాహభరిత ప్రాంతంగా మార్చేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని శ్రీ అమిత్ షా చెప్పారు. ఈ మేరకు ‘బస్తర్ ఒలింపిక్స్’, ‘బస్తర్ పండుమ్’, ‘నియద్ నెల్లనార్’ ‘ముఖ్యమంత్రి సమూహిక్ బస్ యోజన’ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. లోగడ తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో భయాందోళనలు నెలకొన్న బస్తర్‌లో- నేడు వేలాది యువత క్రీడలు సహా తమ సంప్రదాయాలను సజీవంగా నిలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. గిరిజన కళా-సంస్కృతుల పునరుద్ధరణలో ‘బస్తర్ పండుమ్’ కీలక కార్యక్రమంగా నిలిచిందని చెప్పారు. అలాగే, ‘నియద్ నెల్లనార్’ పథకం ద్వారా మౌలిక సదుపాయాల విస్తరణ, అత్యవసర సేవల ప్రదానానికి గణనీయంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. గడచిన యాభయ్యేళ్లుగా ఇతర ప్రభుత్వాల హయాంలో ఈ ప్రాంతం అన్నివిధాలా వెనుకబడిందని, కనీస సదుపాయాలు కూడా కరవయ్యాయని గుర్తుచేశారు.
దేశవ్యాప్తంగా సుమారు 8,526 మంది నక్సలైట్లు లొంగిపోయారని శ్రీ అమిత్ షా వెల్లడించారు. వీరిలో బ్యాంకు ఖాతాలు లేని 7,328 మందికి ఖాతాలు తెరిపించినట్లు ఆయన చెప్పారు. మరోవైపు 1,620 మందికి నగదు బహుమతులు, 7,882 మందికి ప్రోత్సాహకాలు అందజేశామని తెలిపారు. మరో 455 మందికి ఉపాధి కల్పించగా, 129 మందికి భూమి కేటాయించారు. దీంతోపాటు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద 4,014 మందికి పక్కా ఇళ్లు సమకూర్చారు. ఇక గిరిజనులలో 2,308 మందికి పైగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందారని ఆయన వివరించారు. అంతేకాకుండా 6,763 కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, 2,808 కుటుంబాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామని, 372 కొత్త రహదారి ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఆ ప్రాంతంలో ప్రస్తుతం 670 చిన్న వంతెనల నిర్మాణం కొనసాగుతున్నదని చెప్పారు. మొత్తం 48,526 మందికి ఆధార్ కార్డులు జారీ చేయగా, ‘ఇల్వాడ్ పంచాయతీ అవార్డు’ కింద 44 పంచాయతీలను గుర్తించినట్లు పేర్కొన్నారు.
చివరగా- బస్తర్ ప్రాంతంలో లోగడ 500కు పైగా భద్రత శిబిరాలను ఏర్పాటు చేసినట్లు శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. వీటిలో 200కు పైగా ఇప్పుడు ‘షహీద్ వీర్ గుండాధూర్ సేవా డేరా’లుగా మారుతాయని తెలిపారు. ఈ శిబిరాల్లో ఒకప్పుడు ప్రజల రక్షణ కోసం భద్రత సిబ్బంది ఉండేవారని, నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ప్రగతి ప్రణాళికలు రచిస్తున్నారని తెలిపారు. దీంతో ప్రగతిశీల బస్తర్‌కు పునాదులు పడతాయన్నారు. ఆ విధంగా పురోగమన బస్తర్‌పై ప్రభుత్వ సంకల్ప సాకారంలో ఈ ప్రజా సేవా కేంద్రాలు తమ వంతు పాత్ర పోషిస్తాయని పేర్కొంటూ ఆయన తన ప్రసంగం ముగించారు.
***
(రిలీజ్ ఐడి: 2324184)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15