వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత కృత్రిమ మేధ యాత్రను ముందుకు నడపాలని యువతకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపు

బలమైన సరఫరా వ్యవస్థలు, న్యాయమైన వాణిజ్య పద్ధతులు
అంతర్జాతీయ పెట్టుబడి గమ్యస్థానంగా భారత్‌ను బలోపేతం చేస్తాయి: శ్రీ గోయల్

భవిష్యత్తులో ఉపాధి అవకాశాల కోసం జీవనపర్యంతం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉండటం,
సరికొత్త సాంకేతికతలు, సైబర్‌భద్రతపై భారత్ యువత దృష్టి కేంద్రీకరించాలన్న మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 15 OCT 2026 3:06PM by PIB Hyderabad

భారత యువత ఎప్పటికప్పుడు కొత్తగా తెర మీదకు వచ్చే సాంకేతికతలపై పట్టును సాధించి, తమ నైపుణ్యాలకు నిరంతరాయంగా పదును పెట్టుకుంటూ 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం పురోగమించడానికి తోడ్పాటును అందించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ‘‘వికసిత్ భారత్‌‌ గమ్యాన్ని చేరుకొనేందుకు మన ముందున్న మార్గాలు’’ అంశంపై ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది సమావేశ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. తయారీ, సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి రంగాలలో పెట్టే పెట్టుబడులు భారత యువతీయువకులకు అవకాశాలను అందించడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానాన్ని పటిష్టపరుస్తాయని మంత్రి స్పష్టం చేశారు.
రాజకీయ స్థిరత్వం, ప్రతికూల పరిస్థితులకు తట్టుకొని నిలిచే సరఫరా వ్యవస్థలు, న్యాయమైన, పారదర్శకత్వంతో కూడిన వాణిజ్య విధానాల ఆధారంగా తయారీకి, పెట్టుబడులు పెట్టడానికి అనువైన గమ్యస్థానాలుగా దేశాల విషయంలో ఓ అంచనాకు వచ్చే ధోరణి అంతకంతకు పెరుగుతూ పోతోందని శ్రీ గోయల్ అన్నారు. పెట్టుబడులను ఆకట్టుకునే, తయారీ సామర్థ్యాన్ని విస్తరించే, కొత్త సాంకేతికతలను అనుసరించే అవకాశాలు భారత్‌కు ఉన్నాయని, ఫలితంగా దేశంలో ఉద్యోగకల్పనతో పాటు ఆర్థిక అభివృద్ధికి అపారమైన అవకాశాలు లభించగలవని ఆయన అన్నారు.
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఏఐ), సైబర్ భద్రత, సరికొత్త సాంకేతికతలను రోజువారీ వ్యవహారాలలో వర్తింపచేసుకోవడం.. వీటిలో ప్రావీణ్యాన్ని సంపాదించి, ఉపాధికల్పన ముఖచిత్రంలో చోటు చేసుకుంటున్న మార్పులకు తగినట్లు యువత తమను తాము సన్నద్ధపరుచుకోవాలంటూ మంత్రి పిలుపిచ్చారు. లార్జ్ లాంగ్వేజ్ మాడళ్లను, ఇతర ఏఐ వ్యవస్థలను ఆచరణసాధ్య ఉపకరణాలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని, వాణిజ్య సంస్థలే కాక సాధారణ ప్రజలు కూడా ఉపయోగించడానికి అనువుగా ఈ ఉపకరణాలు ఉండాలని శ్రీ గోయల్ తెలిపారు. సమాచార సాంకేతికత రంగంలో 1990వ దశకంలోను, 2000వ దశకంలోను భారత్ సాధించిన వృద్ధిని మంత్రి ప్రస్తావిస్తూ, యువత కొత్త సాంకేతికతలను అనుసరించడానికే పరిమితం కాకుండా కొత్త సాంకేతికతలను అభివృద్ధిపరచడం, కొత్త సాంకేతికతలను ఉపయోగించడంలో సారథ్య బాధ్యతను స్వీకరించాలన్నారు.
నిరంతరం నేర్చుకుంటూ ఉండటానికి, వ్యక్తిగత సామర్థ్యాలను పెంపొందింపచేసుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిందిగా కూడా శ్రీ గోయల్ సూచించారు. నైపుణ్యాలకు సాన పట్టుకోవడాన్ని జీవిత పర్యంతం బాధ్యతగా తీసుకోవాలని, వాణిజ్య వృద్ధికి, వ్యాపార నిర్వహణ సౌలభ్యానికి, జీవన సౌలభ్యానికి తోడ్పాటును ఇచ్చే ప్రక్రియల్లో పాలుపంచుకోవాలని మంత్రి విద్యార్థులను ఉత్సాహపరిచారు. సాంకేతిక పురోగతిని వివిధ రంగాల్లో ఆచరణాత్మకంగా వినియోగించుకొనేటట్లు చూడటంలో భారతీయ యువత ప్రధాన పాత్రను పోషించగలదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
‘2047 కల్లా వికసిత్ భారత్’ను ఆవిష్కరించాలన్న దృష్టికోణాన్ని శ్రీ గోయల్ ప్రస్తావిస్తూ, భారత్ స్వాతంత్య్రాన్ని సాధించి వంద సంవత్సరాలు పూర్తి అయ్యే సరికల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలనేది 140 కోట్ల మంది భారతీయుల ఉమ్మడి నిబద్ధత అన్నారు. ఆత్మన్యూనతాభావనను, ఓటమి తప్పదన్న భావజాలాన్ని అధిగమించాల్సిందిగా పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ఇచ్చిన పిలుపును మంత్రి ఉదాహరిస్తూ, ఆత్మవిశ్వాసం, మహత్వకాంక్ష, సానుకూల జాతీయ దృక్పథం మనకు ఎంతైనా అవసరమని స్పష్టం చేశారు.
దేశ భవితకు రూపురేఖలను దిద్దడంలో భారత సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం పోషించవలసిన పాత్రను కూడా శ్రీ గోయల్ ప్రస్తావించారు. పౌరులలో కర్తవ్య నిర్వహణ భావనతో పాటు అంతా కలిసికట్టుగా ప్రయత్నాలు చేయాలనే అంశానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించాలని శ్రీ గోయల్ చెప్పారు. గొప్ప లక్ష్యాలను పెట్టుకోవాలని, వ్యక్తిగత ఆకాంక్షలను నిర్వచించుకోవాలంటూ విద్యార్థులను ఆయన ప్రోత్సహించారు. ప్రజలందరి సామూహిక ప్రయత్నాలు భారత్ ఒక ప్రధాన అంతర్జాతీయ శక్తిగా మారడానికి దోహదం చేస్తాయని ఆయన అన్నారు.
భారతీయ యువతలోని ఔత్సాహిక పారిశ్రామికత్వ స్ఫూర్తిని, మరీ ముఖ్యంగా అంకుర సంస్థల వ్యవస్థాపకుల్లో ఉన్న ఈ ఉత్సాహాన్ని శ్రీ గోయల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు రిస్క్ తీసుకుంటున్నారని, సవాళ్లను పరిష్కరిస్తున్నారని, కొత్త కొత్త సేవలను అందించేందుకు తపిస్తున్నారని ఆయన అన్నారు. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో ఉత్సాహం, దృఢసంకల్పం, తపన మారుతున్న భారత్ ఆకాంక్షలను చాటుతున్నాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత్ అనుబంధం అంతకంతకు విస్తరించడంలో తోడ్పడుతున్నాయని మంత్రి అన్నారు.
రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఉంటుందన్న నమ్మకాన్ని శ్రీ గోయల్ వ్యక్తం చేశారు. దీనికి.. యువకుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశ జనాభా, పని చేయగలిగిన వారి నిష్పత్తి ఎక్కువగా ఉండటం, దేశీయంగా భారీ కొనుగోలు శక్తి,  ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జోరు కారకాలుగా నిలుస్తాయన్నారు. అంతర్జాతీయ వాణిజ్య సంస్థలకు, సాంకేతిక పురోగతికి, శాస్త్రీయ పరిశోధనలకు భారత వృత్తినిపుణులు తోడ్పాటును అందిస్తున్నారని, ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక, సాంకేతిక ముఖచిత్రాలకు రూపురేఖలను సంతరించడంలో భారత్ పాత్ర రోజురోజుకు పెరుగుతోందనడానికి అద్దం పడుతోందని మంత్రి అన్నారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై మంత్రి మాట్లాడుతూ, ‘‘అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు అయిందని, తుది మెరుగులు దిద్దే, చట్టపరమైన ముసాయిదా రూపకల్పనకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. పోటీపడుతున్న దేశాలపై పైచేయిని సాధించిన తరువాత మేం త్వరలోనే తుది రూపును ఇచ్చి అమల్లోకి తీసుకురాగలమని ఆశిస్తున్నాం’’ అన్నారు.
శ్రీ గోయల్ తన ప్రసంగం ముగింపులో, విద్యార్థులను వారి విద్య పట్ల బాధ్యతను స్వీకరించడమే కాక వినూత్న సాంకేతికతలను ఔపాసన పడుతూ దేశాభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరారు. నిరంతర ప్రయత్నాలు, ఉన్నత లక్ష్యాలు, కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సుముఖత.. ఇవి 2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు వేయడానికి భారతదేశ యువత తమ వంతు పాత్రను నిభాయించగలిగేటట్లు చేయడమే కాకుండా, రాబోయే తరాలకు మెరుగైన అవకాశాలను అందించడంలో కూడా సహకరిస్తాయని ఆయన అన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2324002) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Kannada