ఉప రాష్ట్రపతి సచివాలయం
ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా కౌమరకాన్-2026 ప్రారంభం, అఖిల భారత ఆయుర్వేద సంస్థ డిజిటల్ కార్యక్రమాలకు శ్రీకారం
‘‘ఎయిమ్స్ స్థాయికి ఏఐఐఏను అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి దార్శనికత కార్యరూపం దాలుస్తోంది’’: ఉపరాష్ట్రపతి
‘‘సంప్రదాయ వైద్య విధానాలకు ప్రపంచవ్యాప్త ఆమోదం లభించాలంటే వాటి శాస్త్రీయ ప్రాతిపదికను పరిశోధనలు నిరూపించాలి’’: ఉపరాష్ట్రపతి
‘‘మెరుగైన వైద్య ఫలితాల కోసం సంప్రదాయ విజ్ఞానాన్ని శాస్త్రీయ పరిశోధనతో అనుసంధానించాలి’’: ఉపరాష్ట్రపతి
‘‘భారత్ ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యాల్లో చిన్నారుల ఆరోగ్యానికి కీలక స్థానం కల్పించాలి’’: ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
15 OCT 2026 2:01PM by PIB Hyderabad
ఆయుర్వేదంపై శాస్త్రీయ పరిశోధనలను మరింత విస్తరించాలని ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణణ్ పిలుపునిచ్చారు. సంప్రదాయ వైద్య విధానాల సమర్థతను నిరూపించడం, వాటిపై రోగుల్లో విశ్వాసాన్ని పెంపొందించడం, భారత్ సంప్రదాయ వైద్య విధానాలకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించేలా చేయడం కోసం పరిశోధనలు అవసరమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ) నిర్వహించిన ఆయుర్వేదంలోని కౌమారభృత్య విభాగంపై మూడో అంతర్జాతీయ సదస్సు ‘కౌమారకాన్-2026’ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అఖిల భారత ఆయుర్వేద సంస్థను ఎయిమ్స్ స్థాయికి అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాధించే దిశగా సంస్థ ముందుకు సాగుతోందని ఉపరాష్ట్రపతి తెలిపారు. అఖిల భారత ఆయుర్వేద సంస్థ పదో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలిపిన ఆయన.. సంస్థ పత్రిష్ఠను మరింత బలోపేతం చేసేందుకు పరిశోధన, ఆవిష్కరణలు, విద్యా ప్రమాణాల అత్యుత్తమతలో నిరంతర కృషి అవసరమని చెప్పారు.
భారత్కు చెందిన సంప్రదాయ వైద్య విధానాలు దేశ నాగరికతా విజ్ఞానం, శతాబ్దాలుగా కొనసాగుతున్న జ్ఞాన సంప్రదాయాల్లో పాతుకుపోయిన విలువైన వారసత్వమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 2014లో ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. విద్యను బలోపేతం చేయడం, ఆరోగ్య సేవలను విస్తరించడం, శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడం కోసం ఆ శాఖ చేపడుతున్న చర్యలను వివరించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), సీఎస్ఐఆర్, డీబీటీ, డీఎస్టీ, ఎయిమ్స్ వంటి సంస్థల మధ్య జరుగుతున్న అంతరశాఖ సహకారాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
ప్రముఖ వైద్య సంస్థల్లో ఆయుష్ సేవలను అనుసంధానించడాన్ని ఉప రాష్ట్రపతి ప్రస్తావించారు. ఇలాంటి కార్యక్రమాలు సంప్రదాయ వైద్య విధానాలు, ఆధునిక, వైద్య విధానాలు, ఆధునిక వైద్య సేవల మధ్య చర్చలకు, పరస్పర సహకారానికి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. యెగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం, జామ్నగర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంప్రదాయ వైద్య విధానాలపై ప్రపంచ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం.. భారత్ సంప్రదాయ విజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో కీలక విజయంగా ఆయన పేర్కొన్నారు.
చిన్నారుల ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ.. ‘‘చిన్నారుల ఆరోగ్య భవిష్యత్తుకు రూపకల్పన: కౌమారభృత్యంలో ప్రపంచ దృక్పథాలు, పరిశోధన ఆవిష్కరణలు, వైద్య రంగంలోని నూతన అవకాశాలు” అనే సదస్సు ఇతివృత్తం ప్రతి చిన్నారికి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎదిగేలా చూడాల్సిన ఉమ్మడి బాధ్యతను ప్రతిబింబిస్తోందని ఉపరాష్ట్రపతి అన్నారు. చిన్నారుల పోషణ, ఎదుగుదల, అభివృద్ధి, వ్యాధుల నివారణ, భావోద్వేగ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని చెప్పారు.
2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి చిన్నారుల ఆరోగ్యం, మానవ వనరుల నాణ్యతపై నిరంతరం దృష్టి సారించడం కూడా అవసరమని ఉపరాష్ట్రపతి తెలిపారు. సంప్రదాయ విజ్ఞానాన్ని పరిరక్షించాలని, శాస్త్రీయ పరిశోధనల ద్వారా దానికి మరింత బలం చేకూర్చాలని చెప్పారు. తమ ప్రయత్నాల్లో చిన్నారుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పరిశోధకులు, వైద్య నిపుణులకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆయుష్ స్టార్టప్ వేదిక, ఏఐఐఏ-ఐసీఏఐఎన్ఈ వెబ్సైట్, ఆయుర్వేద డిజిటల్ ఆవిష్కరణలు, వెంచర్ యాక్సిలరేషన్ సదుపాయాలను (ఆయుదివా) ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. వీటితోపాటు వామన యాప్, పంచకర్మ అంచనా యాప్లను కూడా ప్రారంభించారు. ఉప రాష్ట్రపతి సమక్ష్యంలో అమెరికాలోని మహర్షి అంతర్జాతీయ విశ్వవిద్యాలయం (ఎంఐయూ), న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ) మధ్య అంతర్జాతీయ అవగాహన ఒప్పంద మార్పిడి జరిగింది.
అంతకుముందు అఖిల భారత ఆయుర్వేద సంస్థ ఆసుపత్రి సదుపాయాలను, ధన్వంతరి వాటికను ఉపరాష్ట్రపతి సందర్శించారు. ప్రజారోగ్య రంగానికి సంస్థ అందిస్తున్న సేవల గురించి, వాటికలో ప్రదర్శించిన వివిధ ఔషధ మొక్కలు, మూలికలు, రాళ్ల ఆయుర్వేద ప్రాముఖ్యత గురించి అధికారులు ఆయనకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆయుష్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల సహాయ మంత్రి శ్రీ ప్రతాప్రావ్ జాదవ్, ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేష్ కోటెచా, ఆయుష్ మంత్రిత్వ, భారతీయ వైద్య విధానాల జాతీయ కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ మనీషా ఉపేంద్ర, న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ పీకే ప్రజాపతి, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2323859)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14