హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన న్యూఢిల్లీలో బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశానికి భారత్ ఆతిథ్యం
బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశానికి ఆతిథ్యమివ్వడం దేశానికి ఎంతో గర్వకారణం, గౌరవప్రదం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో... 'విశ్వమిత్ర' స్ఫూర్తితో ముందుకు సాగుతోన్న భారత్
శాంతి, సహజీవనం, మానవ సంక్షేమానికి సదా కట్టుబడి ఉన్న భారత్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా... సమ్మిళిత అభివృద్ధి, భద్రతకు నమూనాగా బిమ్స్టెక్ను తీర్చిదిద్దడం హోంమంత్రులుగా మన బాధ్యత
అంతర్జాతీయ ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో సహకారం కోసం ఉద్దేశించిన బిమ్స్టెక్ ఒప్పంద సంపూర్ణ అమలుకు మేం కట్టుబడి ఉన్నాం
ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించని విధానంతో ముందుకుసాగుతున్న భారత్
ఈ రీజియన్లోని ఏ భాగంలోనూ ఉగ్రవాద నెట్వర్క్లు ఆశ్రయం పొందడానికి, సభ్యులను నియమించుకోవడానికి, శిక్షణ పొందడానికి, నిధులు సమీకరించడానికి లేదా పొరుగు దేశాలపై కార్యకలాపాలు నిర్వహించడానికి ఎలాంటి అవకాశం లేకుండా చేయడం మన ఉమ్మడి సంకల్పం కావాలి
కీలకమైన అయిదు సహకార రంగాల ప్రాముఖ్యతను స్పష్టం చేసిన కేంద్ర హోంమంత్రి
మాదకద్రవ్యాల నియంత్రణ, ఉగ్రవాద నిరోధం-న్యాయపరమైన సహకారం, పరారీలో ఉన్న నేరస్థులను స్వదేశానికి రప్పించడం, సైబర్ భద్రత-సైబర్ నేరాల దర్యాప్తు, సంస్థాగత సహకారం-సామర్థ్య నిర్మాణం
మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఓ రకంగా ‘మరణంతో వ్యాపారం’... ఇందులో గొప్పదనం ఏమీ లేదు...
ఇది కేవలం మాదకద్రవ్యాల వ్యాపారం మాత్రమే కాదు... మన యువత, సమాజం, సంస్కృతి, భావి తరాల భవితపై జరుగుతున్న దాడి...
మాదకద్రవ్యాల ముప్పును ఎదుర్కోవడం లక్ష్యంగా "రీజియన్ అంతా కలిసి పనిచేసే" విధానాన్ని అవలంబించాలి
ఒక సభ్య దేశం భద్రత మొత్తం రీజియన్ భద్రతను బలోపేతం చేస్తుందనే సూత్రానికి అనుగుణంగా... శాంతియుత, సురక్షిత, సుసంపన్న బంగాళాఖాత రీజియన్ కోసం భారత్ కట్టుబడి ఉంది: శ్రీ అమిత్ షా
నాడు పోస్టు చేయడమైనది:
13 OCT 2026 6:44PM by PIB Hyderabad
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఈ రోజు న్యూఢిల్లీ వేదికగా జరిగిన బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశానికి భారత్ ఆతిథ్యమిచ్చింది. బంగాళాఖాత రీజియన్ వ్యాప్తంగా ప్రాంతీయ భద్రత, పరస్పర విశ్వాసం, సహకారం బలోపేతం పట్ల బిమ్స్టెక్ సభ్య దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ సమావేశం పునరుద్ఘాటించింది.
సమావేశంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ... బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశానికి ఆతిథ్యమివ్వడం భారత్కు ఎంతో గర్వకారణం, గౌరవప్రదమైన విషయమని పేర్కొన్నారు. ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక సహకారం, సామూహిక భద్రత కోసం బిమ్స్టెక్ కీలక వేదికగా మారిందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో... భారత్ 'విశ్వమిత్ర' స్ఫూర్తితో ముందుకు సాగుతోందని తెలిపారు. శాంతి, సహజీవనం, మానవ సంక్షేమం కోసం భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు.
2025 ఏప్రిల్ 4న బ్యాంకాక్లో జరిగిన 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ... "మాకు బిమ్స్టెక్ కేవలం ఒక ప్రాంతీయ సంస్థ మాత్రమే కాదు. ఇది మా సమ్మిళిత అభివృద్ధికి, భద్రతకు నమూనా." అంటూ చేసిన వ్యాఖ్యలను శ్రీ అమిత్ షా ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళుతూ... మన పౌరుల భద్రతను, మన సంస్థల సామర్థ్యాలను బలోపేతం చేసే ఆచరణాత్మక విధానాలుగా మన సహకారాన్ని మలచుకోవడం హోంమంత్రులుగా మన బాధ్యత అని శ్రీ షా అన్నారు.
ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించని విధానాన్ని భారత్ అనుసరిస్తున్నదని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. ఉగ్రవాదం, సరిహద్దుల గుండా జరిగే వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, కొత్తగా తలెత్తుతున్న సైబర్ ముప్పులను ఎదుర్కోవడంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నేరస్థులు, ఉగ్రవాదులను న్యాయస్థానం ముందు నిలబెట్టడం కోసం... సకాలంలో నిఘా సమాచారాన్ని పంచుకోవడం, ఆర్థికపరమైన దర్యాప్తులు, పరస్పర న్యాయ సహాయం, నేరస్థుల అప్పగింత వంటి చర్యల ప్రాముఖ్యతనూ ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రాంతంలోని ఏ ప్రదేశం నుంచైనా ఉగ్రవాద నెట్వర్క్లు సురక్షిత ఆశ్రయాలు పొందకుండా, సభ్యులను నియమించుకోకుండా, శిక్షణ ఇవ్వకుండా, నిధులు సమీకరించకుండా, లేదా పొరుగు దేశాలపై కార్యకలాపాలు నిర్వహించకుండా నిరోధించడమే మనందరి ఉమ్మడి సంకల్పంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. జాతీయ చట్టాలు, వర్తించే ఒప్పందాలకు అనుగుణంగా పరస్పర న్యాయ సహాయం, నేరస్థుల అప్పగింతలో సహకారం... నేరస్థులను న్యాయస్థానం ఎదుట నిలిపే మన ప్రయత్నాలను బలోపేతం చేయగలదని శ్రీ అమిత్ షా అన్నారు.
మాదకద్రవ్యాల నియంత్రణ, ఉగ్రవాద నిరోధం-న్యాయపరమైన సహకారం, పరారీలో ఉన్న నేరస్థులను స్వదేశానికి రప్పించడం, సైబర్ భద్రత-సైబర్ నేరాల దర్యాప్తు, సంస్థాగత సహకారం-సామర్థ్య నిర్మాణం అనే అయిదు కీలక సహకార రంగాల ప్రాముఖ్యతనూ కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. అక్రమ ఆర్థిక లావాదేవీలు, ఉగ్రవాదానికి నిధుల సమీకరణను ఎదుర్కోవడానికి సమన్వయంతో కూడిన ప్రాంతీయ విధానం అవసరాన్నీ ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. చట్టాలను అమలు చేసే సంస్థలు, నిఘా సంస్థలు, సరిహద్దు నిర్వహణ సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతనూ ఆయన ఉద్ఘాటించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ప్రాథమికంగా 'మృత్యు రవాణా'గా భారత్ విశ్వసిస్తోందని శ్రీ అమిత్ షా తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో 'గొప్పదనం' ఏమీ లేదనీ ఆయన పునరుద్ఘాటించారు. ‘ఇది కేవలం మాదకద్రవ్యాల వ్యాపారం మాత్రమే కాదు... మన యువత జీవితాలు, సమాజం, సంస్కృతి, రాబోయే తరాల భవిష్యత్తుపై జరుగుతున్న దాడి’ అని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం ఒకే దేశపు ప్రయత్నాలతోనే దీనిని ఎదుర్కోలేమని కేంద్ర హోంమంత్రి అన్నారు. మనం 'సమగ్ర ప్రాంత' విధానాన్ని అవలంబించాలి. మాదకద్రవ్యాల నుంచి వచ్చే అక్రమ ఆదాయం... వ్యవస్థీకృత నేరాలకు ఆర్థిక శక్తిని అందిస్తుందనీ, దానిని ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికీ ఉపయోగించుకోవచ్చని శ్రీ షా పేర్కొన్నారు. ముడి రసాయనాల మళ్లింపు, డార్క్ వెబ్ ద్వారా జరిగే లావాదేవీలు ఈ సవాలును మరింత క్లిష్టతరం చేస్తున్నాయని ఆయన తెలిపారు.
బిమ్స్టెక్ రీజియన్ వ్యాప్తంగా విపత్తు నిర్వహణలో సహకారం తమ అత్యంత ప్రాధాన్యాల్లో ఒకటని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం సందర్భంలో... భారత్లో “బిమ్స్టెక్ విపత్తు నిర్వహణ కేంద్రాన్ని” ఏర్పాటు చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదనను ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ కేంద్రాన్ని గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయాలని యోచిస్తుండడం పట్ల శ్రీ షా సంతోషం వ్యక్తం చేశారు. ఈ రీజియన్ వ్యాప్తంగా విపత్తు నిర్వహణలో 'మొదటి ప్రతిస్పందనదారు'గా భారత్ పోషిస్తున్న ఆదర్శప్రాయమైన పాత్రను ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది. ప్రతిపాదిత కేంద్రాన్ని కార్యాచరణలోకి తీసుకురావడంలో సభ్య దేశాలు చురుగ్గా పాలుపంచుకోవాలని ఆయన కోరారు.
ఒక సభ్య దేశం భద్రత... మొత్తం రీజియన్ భద్రతను బలోపేతం చేస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు. శాంతియుతమైన, సురక్షితమైన, సంపన్నమైన బంగాళాఖాత రీజియన్ కోసం సభ్య దేశాలన్నింటితో పరస్పర విశ్వాసం, గౌరవం, సహకారాన్ని పెంపొందించుకోవడానికి... ఈ సమావేశం ద్వారా నిర్దిష్టమైన ఫలితాలను సాధించడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
బిమ్స్టెక్ హోంమంత్రుల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి కేంద్ర హోంమంత్రి నాయకత్వం వహించగా... కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఉన్నతాధికారుల సమావేశానికి నాయకత్వం వహించారు. బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ వంటి బిమ్స్టెక్ సభ్య దేశాల ప్రతినిధి బృందాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి.
అధికారుల స్థాయి సమావేశం అనంతరం జరిగిన బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం... భద్రతా రంగంలో బిమ్స్టెక్ చేపట్టిన వివిధ కార్యక్రమాలను సమీక్షించడానికి, తలెత్తుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రాంతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసే భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడానికి విలువైన అవకాశాన్ని కల్పించింది.
బిమ్స్టెక్ సభ్య దేశాల హోంమంత్రులు కింది వాటిని ఆమోదించారు:
1. మానవ అక్రమ రవాణా నివారణ, ఈ నేరానికి పాల్పడే వారిని శిక్షించడం, బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు వారికి పునరావాసం కల్పించడంలో సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా గల బిమ్స్టెక్ మానవ అక్రమ రవాణా వ్యతిరేక ఒప్పందం.
2. మత్తుపదార్థాలు, మానసిక స్థితిని ప్రభావితం చేసే రసాయనాలు, వాటి తయారీకి వాడే ముడి రసాయనాల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా రూపొందించిన 'బిమ్స్టెక్ మత్తుపదార్థాల నియంత్రణ కార్యాచరణ ప్రణాళిక'
3. మనీలాండరింగ్, ఉగ్రవాద నిధుల నిరోధానికి సంబంధించి బిమ్స్టెక్ దేశాల మధ్య సామర్థ్యాలను పెంపొందించడం లక్ష్యంగా కుదిరిన అవగాహనా ఒప్పందం... ఇది నిపుణులకు శిక్షణనివ్వడం, ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడం, ఆర్థిక నేరాలు, ఆర్థిక నిఘా సమాచారం, విచారణలు, అక్రమ ఆస్తుల స్వాధీనం, మనీలాండరింగ్ నిరోధక చర్యలు, ఉగ్రవాదానికి అందే ఆర్థిక సహాయాన్ని అడ్డుకోవడం, వినాశకర ఆయుధాల వ్యాప్తికి నిధులు అందకుండా చేయడం వంటి రంగాల్లో విస్తృతమైన సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా కుదిరిన ఒప్పందం.
4. బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీల మూలాలను, అందులోని ముప్పును, వాటి మార్గాలనూ గుర్తించడంతో పాటు... వాటిని సమర్థంగా నిరోధించడం లక్ష్యంగా రూపొందించిన 'బిమ్స్టెక్ చట్టవిరుద్ధ ఆర్థిక లావాదేవీల నిరోధక కార్యాచరణ ప్రణాళిక'.
5. బంగాళాఖాత రీజియన్ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి సంసిద్ధతను, సమన్వయాన్ని పెంపొందించే కార్యాచరణ ప్రణాళిక, ప్రాంతీయ ముప్పు ప్రణాళిక, ఉమ్మడి విన్యాసాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, విపత్తు మ్యాపింగ్, శిక్షణా కేంద్రాలు, సమాచార భాగస్వామ్యం, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణ, సునామీ ముప్పు తగ్గింపులో సభ్య దేశాల సమన్వయ ప్రయత్నాలను ప్రతిపాదించే ప్రణాళిక.
బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఢిల్లీ డిక్లరేషన్నూ ఆమోదించింది. బిమ్స్టెక్ కింద భద్రతా సహకారానికి మార్గనిర్దేశం చేసే వివిధ సూత్రాలను ఈ డిక్లరేషన్ వివరిస్తుంది. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఆమోదించిన ఢిల్లీ డిక్లరేషన్లో... ప్రాంతీయ శాంతి, భద్రత, అభివృద్ధి కోసం సహకారాన్ని బలోపేతం చేయడం పట్ల తమ నిబద్ధతను సభ్య దేశాలు పునరుద్ఘాటించాయి. సరిహద్దు ఉగ్రవాదం, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, రాడికలైజేషన్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలను సమష్టిగా ఎదుర్కోవాలని ఈ డిక్లరేషన్ స్పష్టం చేసింది. ఇది సమాచార భాగస్వామ్యం, పరస్పర న్యాయ సహాయం, నేరస్థుల అప్పగింత, సామర్థ్య నిర్మాణం, ఇప్పటికే కుదిరిన ఒప్పందాలు, కార్యాచరణ ప్రణాళికల సమర్థ అమలుకు ప్రాధాన్యమిచ్చింది. ఆన్లైన్ మోసాల బారిన పడిన, మానవ అక్రమ రవాణా బాధితులకు రక్షణ కల్పించాలనీ ఇది స్పష్టం చేసింది. ప్రాంతీయ భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత్ నాయకత్వాన్ని ఈ డిక్లరేషన్ ప్రశంసించింది.
పోలీసు శిక్షణ, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, ఫోరెన్సిక్ దర్యాప్తుల్లో తన నైపుణ్యాన్ని పంచుకోవడం పట్ల తన నిబద్ధతను భారత్ పునరుద్ఘాటించింది. గుజరాత్లోని జామ్నగర్లో ప్రతిపాదిత బిమ్స్టెక్ విపత్తు నిర్వహణ కేంద్రం ఏర్పాటు సహా, విపత్తు నిర్వహణలో సహకారాన్నీ ఈ సమావేశం ప్రముఖంగా ప్రస్తావించింది.
బిమ్స్టెక్ ప్రాంతాన్ని మరింత సురక్షితంగా, సుసంపన్నంగా మార్చే దిశగా ఈ సమావేశం కీలక ముందడుగు.
బంగాళాఖాతం రీజియన్లో బహుళ రంగ సాంకేతిక, ఆర్థిక సహకార కార్యక్రమం (బిమ్స్టెక్)... దక్షిణ, ఆగ్నేయాసియా సబ్-రీజియన్స్ మధ్య కీలక సంస్థాగత అనుసంధానంగా పనిచేస్తుంది. ఇది బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ దేశాల మధ్య బహుముఖ సహకారం, సామూహిక భద్రత, ఆర్థిక భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తుంది.
2018లో జరిగిన నాలుగో బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో... సహకారం, సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు బిమ్స్టెక్ దేశాల హోంమంత్రుల స్థాయి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రాంతీయ భద్రతా సహకారాన్ని మరింత పటిష్ఠం చేసే దిశగా కీలక ముందడుగు వేస్తూ... ఆరో బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి భారత్ తరఫున సంపూర్ణ మద్దతును ప్రకటించారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశానికి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ కట్టుబడి ఉందని ఆయన తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2323125)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5