వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ హెక్టారుకు 20 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అవకాశాలు చూపుతున్న మెరుగైన సోయాబీన్ రకాలు ఎన్‌ఆర్‌సీ 200-68, ఎన్ఆర్‌సీ 200-70
భవిష్యత్తులో ఉత్పాదకత పెరుగుదలను అంచనా వేసేందుకు దిగుబడి గణాంకాల సేకరణ: డాక్టర్ ఎంఎల్ జాట్
ఇండోర్‌లోని ఐసీఏఆర్-జాతీయ సోయాబీన్ పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో సోయాబీన్ పంట కోత దినోత్సవ నిర్వహణ
ఉత్పాదకత పెంపుదల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి దిగుబడి గణాంకాలపై శాస్త్రీయ విశ్లేషణ
నాడు పోస్టు చేయడమైనది:
13 OCT 2026 3:12PM by PIB Hyderabad
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) పరిధిలోని ఇండోర్‌లో ఉన్న జాతీయ సోయాబీన్ పరిశోధనా సంస్థ 2026 అక్టోబర్ 9న సోయాబీన్ పంట కోత దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా సంస్థ అభివృద్ధి చేసిన ఎన్‌ఆర్‌సీ 200-68, ఎన్‌ఆర్‌సీ 200-70 మెరుగైన సోయాబీన్ రకాల దిగుబడి సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఈ రెండు రకాల కింద ఒక్కో ఎకరంలో పంటను కోసిన అనంతరం సేకరించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం, హెక్టారుకు సుమారు 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలు కనిపించాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మెరుగైన వంగడాల పనితీరును అర్థం చేసుకోవడానికి, దేశంలో సోయాబీన్ ఉత్పాదకతను పెంచే అవకాశాలను అంచనా వేయడానికి ఈ పరిశీలన కీలకంగా నిలుస్తుంది. ప్రస్తుతం భారత్‌లో సగటు ఉత్పాదకత హెక్టారుకు సుమారు 10–11 క్వింటాళ్లుగా ఉంది.
ఐసీఏఆర్–జాతీయ సోయాబీన్ పరిశోధనా సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలు, ప్రయోగాలతో పాటు సోయాబీన్‌పై అఖిల భారత సమన్వయ పరిశోధనా ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అధ్యయనాలు.. మెరుగైన వంగడాలు, తగిన పంట ఉత్పత్తి సాంకేతిక పద్ధతులను అనుసరించడం ద్వారా హెక్టారుకు 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చని సూచిస్తున్నాయి. అనుకూల పరిస్థితుల్లో ఈ దిగుబడి హెక్టారుకు సుమారు 22 నుంచి 25 క్వింటాళ్ల వరకు చేరే అవకాశం ఉంది.
ఈ ప్రాథమిక ఫలితాలపై వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగం (డీఏఆర్ఈ) కార్యదర్శి, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంఎల్ జాట్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సోయాబీన్ ఉత్పాదకతను పెంచడంలో మెరుగైన వంగడాలు, శాస్త్రీయ పంట ఉత్పత్తి సాంకేతిక పద్ధతులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్‌ఆర్‌సీ 200-68, ఎన్‌ఆర్‌సీ 200-70 రకాల ద్వారా హెక్టారుకు సుమారు 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చే సూచనలు కనిపించడం ఎంతో ప్రోత్సాహకరమని పేర్కొన్నారు. ఈ గణాంకాలను శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా భవిష్యత్తులో సోయాబీన్ ఉత్పాదకతను పెంచేందుకు అనుసరించాల్సిన పరిశోధనా వ్యూహాలకు మార్గదర్శకత్వం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఇండోర్‌లోని ఐసీఏఆర్-జాతీయ సోయాబీన్ పరిశోధనా సంస్థ డైరెక్టర్ మాట్లాడుతూ.. సోయాబీన్ పంట కోత దినోత్సవం సందర్భంగా సేకరించిన గణాంకాల ప్రాధాన్యం ఒక్క ఏడాది దిగుబడిని అంచనా వేయడానికే పరిమితం కాదని తెలిపారు. అనేక సంవత్సరాల పాటు గణాంకాలను క్రమపద్ధతిలో సేకరించి, విశ్లేషించడం ద్వారా వివిధ ప్రాంతాలు, వంగడాలు, పంట ఉత్పత్తి పరిస్థితులను బట్టి ఉత్పాదకతలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. దీనివల్ల ప్రతి ఏడాది ఉత్పాదకతలో సాధిస్తున్న మెరుగుదలను శాస్త్రీయంగా అంచనా వేయడంతో పాటు, భవిష్యత్తులో దిగుబడిని మరింత పెంచే అవకాశాలను గుర్తించేందుకు ఆధారం లభిస్తుందని వివరించారు. దీర్ఘకాలిక గణాంకాలు పరిశోధనల ఫలితాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసే కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేయడానికి కూడా ఉపయోగపడతాయని తెలిపారు.
వివిధ సోయాబీన్ వంగడాల వాస్తవ దిగుబడి సామర్థ్యాన్ని అంచనా వేయడం, మెరుగైన సాంకేతిక పద్ధతుల ప్రభావాన్ని తెలుసుకోవడం, అధిక దిగుబడినిచ్చే వంగడాలు, శాస్త్రీయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ఈ సంస్థ క్రమం తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ప్రయత్నాల ద్వారా సోయాబీన్ పరిశోధన, వ్యవసాయ విస్తరణ సేవలు, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసే కార్యక్రమాల మధ్య సమన్వయం మరింత బలోపేతం కానుంది.
మెరుగైన సోయాబీన్ వంగడాల దిగుబడి సామర్థ్యాన్ని అంచనా వేయడం, దిగుబడి గణాంకాలను క్రమపద్ధతిలో సేకరించడం ద్వారా ఉత్పాదకతను పెంచేందుకు శాస్త్రీయ ప్రాతిపదికను ఏర్పాటు చేయడం సోయాబీన్ పంట కోత దినోత్సవం ప్రధాన లక్ష్యం. పంట కోత ద్వారా సేకరించిన గణాంకాలను మరింత విశ్లేషించి, వివిధ వంగడాల పనితీరు, భిన్నమైన పంట ఉత్పత్తి పరిస్థితుల ప్రభావంపై మెరుగైన అవగాహన పెంపొందించనున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2322862)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5