రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

2026 ఆసియా క్రీడల్లో రికార్డు స్థాయిలో 27 పథకాలు సాధించిన సర్వీసెస్ క్రీడాకారులను సత్కరించిన రక్షణ మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 12 OCT 2026 1:52PM by PIB Hyderabad

జపాన్‌లో ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన రక్షణ దళాల క్రీడాకారులను నేడు (అక్టోబర్ 12) రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సత్కరించారు. మొత్తం పతకాల్లో సైనిక క్రీడాకారులు 6 స్వర్ణాలు, 11 రజతాలు, 10 కాంస్యాలు సాధించారు.  ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ క్రీడా పోటీల్లో సాయుధ దళాల క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్‌ జోషి కూడా హాజరయ్యారు.

మూడు సాయుధ దళాలకు చెందిన మొత్తం 92 మంది క్రీడాకారులు 19 క్రీడా విభాగాల్లో పోటీపడ్డారు. పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో నిలవడంలో కీలక పాత్ర పోషించారు. మొత్తం భారత బృందం 85 పతకాలు సాధించగా.. వీటిలో 21 స్వర్ణం, 27 రజతం, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. 

 

న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో క్రీడాకారులతో రక్షణ మంత్రి సంభాషించారు. క్రీడాకారుల విజయానికి క్రమశిక్షణ, కఠోర శ్రమ, జట్టు స్ఫూర్తి, క్రీడా నైపుణ్యమే కారణమని పేర్కొన్నారు. పతకం గెలుచుకునే ప్రయాణంలో అపారమైన అంకితభావం, తెల్లవారుజామున శిక్షణ, జిమ్ కార్యక్రమాలు, గాయాలు, కోలుకోవడం, నిరంతర ప్రయత్నాలు ఉంటాయని, ఇవన్నీ యూనిట్ విధులను, క్రీడా సన్నాహాలను సమతుల్యం చేసుకుంటూ, కుటుంబాలకు దూరంగా ఉంటూ చేయాల్సి వస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

పాల్గొని గెలవలేకపోయిన క్రీడాకారులను ఉద్దేశించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రయత్నాన్ని విరమించుకోవడంలోనే నిజమైన ఓటమి ఉంటుందని చెప్పారు. పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా దేశానికి, రక్షణ దళాలకు గౌరవాన్ని తీసుకురావడంలో తోడ్పడ్డారని ఆయన పేర్కొన్నారు. రక్షణ దళాల క్రీడాకారుల సామర్థ్యంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, వారి విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. 

 

ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం, వారి సామర్థ్యాన్ని పెంపొందించడం, శాస్త్రీయ పద్దతుల్లో శిక్షణ అందించడం, ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలు కల్పించడం, అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడంలో మిషన్‌ ఒలింపిక్‌ విభాగం కీలక పాత్ర పోషించిందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. శిక్షకులు, సహాయక సిబ్బంది, ఫిజియోథెరపిస్టులు, పోషకాహార నిపుణులు, క్రీడాకారుల కుటుంబాలు అందించిన సహకారాన్ని కూడా ఆయన గుర్తించారు. ఒక ఛాంపియన్‌ ఒక్కరి కృషితోనే తయారుకారని, దాని వెనుక ఎంతోమంది సమష్టి కృషి ఉంటుందని స్పష్టం చేశారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలో క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.  క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధునిక శిక్షణ కేంద్రాల ఏర్పాటు, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడంపై నిరంతరం దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో పాల్గొనేవారి సంఖ్యను పెంచడమే కాకుండా, ప్రపంచ క్రీడా రంగంలో భారత్‌ను అగ్రగామి శక్తిగా నిలబెట్టడమే లక్ష్యమని పేర్కొన్నారు. 

 

భారత క్రీడారంగానికి సాయుధ దళాలు అందిస్తున్న గణనీయమైన సేవలను రక్షణమంత్రి ప్రస్తావించారు. శారీరక సామర్థ్యంతో పాటు క్రమశిక్షణ, సహనం, నాయకత్వ లక్షణాలు, క్లిష్ట పరిస్థితుల్లోనూ లక్ష్యాల పట్ల అచంచలమైన నిబద్ధత కలిగిన క్రీడాకారులను రక్షణ దళాలు నిరంతరం తీర్చిదిద్దుతున్నాయని రక్షణ మంత్రి అన్నారు. 

2028లో లాస్‌ ఏంజిల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌ కోసం లక్ష్యంతో కూడిన, క్రమబద్ధమైన కార్యాచరణను అనుసరించాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. క్రీడాకారులకు శిక్షకులు, సహాయక సిబ్బంది అంకితభావంతో, వృత్తిపరమైన నైపుణ్యంతో మార్గనిర్దేశం కొనసాగించాలని కోరారు. మరింత ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, 2028 లాస్‌ ఏంజిల్స్‌లో ఇంతకంటే మెరుగైన ప్రదర్శన కనబరచాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ధీరజ్‌ సేథ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

2026 ఆసియా క్రీడల్లో సైనిక క్రీడాకారులు 

భారత్‌ సాధించిన మొత్తం పతకాల్లో సాయుధ దళాల క్రీడాకారులు 32 శాతం పతకాలను అందించారు. భారత్‌ గెలుచుకున్న స్వర్ణ పతకాలలో 28.57 శాతం పతకాలు వీరి ఖాతాలోనే ఉన్నాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో నాయక్‌ సుబేదార్‌ నీరూ ధండా ఒకరు. అమె రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం సాధించారు. ఆసియా క్రీడల్లో మహిళల వ్యక్తిగత ట్రాప్‌ విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. నాయక్‌ సుబేదార్‌ గుల్వీర్‌ సింగ్‌ రెండు రజత పతకాలు, ఒక కాంస్య పతకం సాధించారు. ఒకే ఆసియా క్రీడల్లో వ్యక్తిగత విభాగాల్లో మూడు పతకాలు గెలిచిన తొలి భారత పురుష ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ క్రీడాకారుడిగా ఆయన ఘనత సాధించారు. హవిల్దార్‌ సావన్‌ బర్వాల్‌ పురుషుల మారథాన్‌లో 2 గంటల 11 నిమిషాల 37 సెకన్ల జాతీయ రికార్డు సమయంతో రజత పతకం సాధించారు. దీంతో ఆసియా క్రీడల్లో మారథాన్‌ పతకం కోసం భారత్‌ 44 ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడింది. నాయక్‌ సుబేదార్‌ సర్వేశ్‌ కుషారే పురుషుల హైజంప్‌ విభాగంలో చారిత్రాత్మక పతకాన్ని సాధించారు. ఈ విభాగంలో భారత్‌కు 56 ఏళ్ల విరామం తర్వాత పతకం లభించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2322298) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil