యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మై భారత్ - ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యువ సంవాద్ మేళాతో నషా ముక్త్ యువ అభియాన్ మొదటి నెల పూర్తి లక్షా ఆరు వేలమందికి పైగా యువత భాగస్వామ్యం

నాడు పోస్టు చేయడమైనది: 10 OCT 2026 4:35PM by PIB Hyderabad

యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్, జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) సంయుక్తంగా 2026 అక్టోబర్ 9న దేశవ్యాప్తంగా ‘యువ సంవాద్ మేళా’ను విజయవంతంగా నిర్వహించాయి. ‘నా ఆరోగ్యం - నా గర్వం’  ఇతివృత్తంతో చేపట్టిన 100 వారాల సంకల్ప అభియాన్‌లో తొలి నెల ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.mదేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 200 విద్యాసంస్థలు, వాటి పరిధిలోని దత్తత గ్రామాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 1,06,855 మంది భాగస్వాములయ్యారు. మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణపై అవగాహన పెంపొందించడంతో పాటు, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత సమాజ నిర్మాణాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో యువత, స్థానిక సమాజ సభ్యులను ఈ కార్యక్రమం ఒకచోట చేర్చింది.

 

దేశవ్యాప్తంగా 15 ఎన్ఎస్ఎస్ ప్రాంతీయ డైరెక్టరేట్ల పరిధిలో అమలు చేసిన నాలుగో వారం కార్యక్రమం లక్ష్యంగా నిర్దేశించుకున్న 200 విద్యాసంస్థల్లో 100 శాతం అమలును సాధించింది. ఈ కార్యక్రమంలో 93,662 మంది యువత పాల్గొనగా, గ్రామాలు, మురికివాడల్లో ప్రత్యేకంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ద్వారా మరో 13,193 మంది పౌరులకు చేరువయ్యారు. సాధారణంగా నిర్వహించే ప్రతిజ్ఞా కార్యక్రమాలకు భిన్నంగా, ‘యువ సంవాద్ మేళా’లో పరస్పర చర్చలు, ప్రజల్లో అవగాహన కల్పించడం, సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రాధాన్యమిచ్చారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే హానికర ప్రభావాలపై ప్రజలు అవగాహనతో కూడిన చర్చలు జరిపేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి. అవి యువతతో ముఖాముఖి చర్చలు, అవగాహన స్టాళ్లు, సాంస్కృతిక ప్రదర్శనలు. యువ సంవాద్ (సంభాషణ) కార్యక్రమంలో భాగంగా 509 పరస్పర చర్చా సదస్సులు, బహిరంగ చర్చా వేదికలను నిర్వహించారు. వీటిలో 36,086 మంది యువత పాల్గొని మాదకద్రవ్యాల దుర్వినియోగానికి దారితీసే మూలకారణాలు, తోటి వారి ఒత్తిడి, సమాజ భాగస్వామ్యంతో చేపట్టాల్సిన నివారణ చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమాల్లో అధ్యాపకులు, స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.

 

అవగాహన కార్యక్రమంలో భాగంగా, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 396 సమాచార స్టాళ్లు, కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. వ్యసనాల వల్ల కలిగే శారీరక, మానసిక దుష్ప్రభావాలపై సమాచారం అందించడంతో పాటు, అందుబాటులో ఉన్న కౌన్సెలింగ్ సేవల గురించి పాల్గొన్నవారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో 32,909 మంది పాల్గొన్నారు. వీటికి తోడు వీధి నాటకాలు, లఘు నాటికలు, సంగీత ప్రదర్శనలు సహా 587 సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వీటి ద్వారా 24,944 మందికి సందేశాన్ని చేరవేశారు. సృజనాత్మకతకు, స్థానిక పరిస్థితులకు అనుగుణమైన కళారూపాలకు ప్రాధాన్యమిస్తూ, వ్యసనరహిత భారతదేశ నిర్మాణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

ఈ ప్రచార కార్యక్రమంలో అన్ని వర్గాలకు చెందిన యువత క్రియాశీల  భాగస్వామ్యం కనిపించింది. గణాంకాల ప్రకారం మొత్తం 48,269 మంది యువతులు, 45,618 మంది యువకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో యువతుల చురుకైన భాగస్వామ్యాన్ని ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువత తమ భాగస్వామ్యం ద్వారా ఆరోగ్యం, శ్రేయస్సు, సమష్టి బాధ్యతకు సంబంధించిన సందేశాన్ని విద్యాసంస్థలతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లోని సమాజాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారు.

 

క్షేత్రస్థాయిలో చేపట్టిన ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలకు డిజిటల్ వేదికల ద్వారా మరింత ప్రచారం లభించింది. యువ అంబాసిడర్లు #నషాముక్తయువ  హ్యాష్‌ట్యాగ్‌తో 935 సోషల్ మీడియా పోస్టులను రూపొందించి, ప్రచారం నిర్వహించారు. ఈ డిజిటల్ ప్రచారం ద్వారా స్థానికంగా నిర్వహించిన కార్యక్రమాలకు మరింత విస్తృత గుర్తింపు లభించడంతో పాటు, పెద్ద సంఖ్యలో ప్రజల వద్దకు ఈ అభియాన్ సందేశాన్ని చేరవేసేందుకు దోహదపడింది.

100 వారాల సంకల్ప అభియాన్‌లో తొలి నెల విజయవంతంగా ముగియడంతో తదుపరి దశ కార్యక్రమాలకు ప్రాతిపదిక ఏర్పడింది. రెండో నెలలో ‘ఆరోగ్యవంతమైన యువత - వ్యసనరహిత యువత’  ఇతివృత్తంతో శారీరక దృఢత్వం, క్రీడలపై దృష్టి సారించనున్నారు.’యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు, మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణలో శారీరక వ్యాయామం, చురుకైన జీవనశైలి కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించేలా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మైభారత్, ఎన్ఎస్ఎస్, విద్యాసంస్థలు, స్థానిక సమాజాల నిరంతర భాగస్వామ్యంతో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ యువత ఆధ్వర్యంలోని అవగాహన కార్యక్రమాలు, సమాజ భాగస్వామ్యం, సమష్టి కార్యాచరణను మరింత బలోపేతం చేస్తోంది. ఆరోగ్యవంతమైన, సాధికారత కలిగిన, వ్యసనరహిత భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలను కొనసాగిస్తోంది.


(రిలీజ్ ఐడి: 2321959) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Assamese , Tamil , Malayalam