పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విత్తన రంగం నుంచి సమకూరిన ప్రయోజనాల భాగస్వామ్య (ఏబీఎస్) నిధుల్లో రూ.2.02 కోట్లను జీవవైవిధ్య పరిరక్షణ, క్షేత్రస్థాయిలో సమాజ సంక్షేమానికి విడుదల చేసిన జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ

నాడు పోస్టు చేయడమైనది: 10 OCT 2026 7:18PM by PIB Hyderabad

జీవవైవిధ్య పరిరక్షణ, జీవ వనరుల సుస్థిర వినియోగం, స్థానిక సమాజాల జీవనోపాధి బలోపేతానికి మద్దతుగా జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బీఏ) రూ.2.02 కోట్లను 27 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసింది. జీవ వనరుల వినియోగానికి సంబంధించి విత్తన రంగ సంస్థల నుంచి అందిన ప్రయోజనాల భాగస్వామ్య (యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ -ఏబీఎస్) నిధుల్లో ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రావాల్సిన వాటాలుగా ఈ నిధులు విడుదల చేశారు.

వరి, వంకాయ, కాలీఫ్లవర్, దోసకాయ, మిరప, సొరకాయ, కాకరకాయ, టమాటా, బెండ వంటి వ్యవసాయ జీవ వనరుల వినియోగం ద్వారా సమకూరిన ఏబీఎస్ నిధుల్లో పలు రకాల వంగడాలు, హైబ్రిడ్‌ రకాలకు సంబంధించిన వాటాలు ఉన్నాయి. ఈ నిధులను ఈస్ట్ వెస్ట్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సింజెంటా ఇండియా లిమిటెడ్, దేవ్‌జెన్ సీడ్స్ అండ్ క్రాప్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, లిమాగ్రెయిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బేయర్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్, నన్‌హెమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎంజా జాడెన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు అందించాయి.

మార్కెట్లు లేదా వ్యాపారుల ద్వారా జీవ సంపదలను సేకరించినప్పుడు  వాటి నుంచి ప్రయోజనం పొందేందుకు అర్హులైన వ్యక్తులను గుర్తించడం సాధ్యం కాని సందర్భాల్లో జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బీఏ) నిపుణుల కమిటీ సిఫార్సు చేసి, ప్రాధికార సంస్థ ఆమోదించిన పంపిణీ విధానాన్ని అనుసరించింది. దీని ప్రకారం, సంబంధిత జీవసంపదల సాగు విస్తీర్ణం ఆధారంగా రాష్ట్ర జీవ వైవిధ్య మండళ్లు (ఎస్‌బీబీలు), కేంద్రపాలిత ప్రాంతాల జీవవైవిధ్య మండళ్లకు (యూటీబీసీలు) కేటాయించాల్సిన నిధుల వాటాను నిర్ణయించింది. ఇందుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రచురించిన వ్యవసాయ గణాంకాలను ప్రామాణికంగా తీసుకుంది. 27 రాష్ట్ర జీవవైవిధ్య మండళ్లు (ఎస్‌బీబీలు), 3 కేంద్రపాలిత ప్రాంతాల జీవవైవిధ్య మండళ్లకు (యూటీబీసీలు) మొత్తం రూ.2.02 కోట్ల ఏబీఎస్ నిధులను పంపిణీ చేయగా, అందులో రూ.1.43 కోట్ల వాటా దక్కిన తొలి 10 రాష్ట్రాల వివరాలు: 

వరస నెం.

రాష్ట్రం

నిధుల మొత్తం ( రూ.లలో)

1

మధ్యప్రదేశ్

23,81,072.00

2

వెస్ట్ బెంగాల్

23,32,913.00

3

ఒడిశా

19,75,559.00

4

బీహార్

17,28,852.00

5

గుజరాత్

13,29,870.00

6

ఛత్తీస్గఢ్

11,37,521.00

7

ఉత్తరప్రదేశ్

9,80,038.00

8

ఆంధ్రప్రదేశ్

9,34,864.00

9

కర్ణాటక

7,87,392.00

10

మహారాష్ట్ర

7,16,971.00

11

ఇతరులు

58,94,948.00

మొత్తం 

2,02,00,000.00

ఈ  నిధుల విడుదలతో, జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బీఏ) ఇప్పటివరకు పంపిణీ చేసిన మొత్తం ఏబీఎస్ నిధులు రూ.202 కోట్లకు చేరాయి. జీవసంపదల వినియోగం ద్వారా లభించే ప్రయోజనాలను సమానంగా పంచుకోవడం, ఆ ప్రయోజనాలను తిరిగి జీవవైవిధ్య పరిరక్షణకు, సమాజ సంక్షేమానికి వినియోగించడం పట్ల భారత్  చూపుతున్న నిబద్ధతకు ఇది నిదర్శనం.

ఏబీఎస్ విధానం ద్వారా ఆర్థిక వనరులను సమీకరించి, వాటిని జీవవైవిధ్య పరిరక్షణ, సుస్థిర వినియోగం, స్థానిక అభివృద్ధి దిశగా మళ్లించేందుకు వీలవుతుంది. రాష్ట్ర జీవవైవిధ్య మండళ్లు, కేంద్రపాలిత ప్రాంతాల జీవవైవిధ్య మండళ్లకు నిధుల పంపిణీ ద్వారా పలు కార్యక్రమాలకు తోడ్పాటు లభిస్తుంది. వీటిలో జీవవైవిధ్య నిర్వహణ కమిటీలను బలోపేతం చేయడం, ప్రజల జీవవైవిధ్య రిజిస్టర్లను నవీకరించడం, సంప్రదాయ పంట రకాలు, ఔషధ మొక్కలను పరిరక్షించడం, ఆవాసాలను పునరుద్ధరించడం, క్షేత్రస్థాయిలో జీవసంపదల సుస్థిర నిర్వహణను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ చర్యల ద్వారా సంస్థాగత సామర్థ్యాలు మరింత బలోపేతమవుతాయి. జీవవైవిధ్య నిర్వహణలో రైతులు, స్థానిక సమాజాలు, ఇతర వాటాదారుల భాగస్వామ్యం కూడా పెరుగుతుంది.

ఏబీఎస్ నిధులతో చేపట్టే కార్యక్రమాలు ప్రభుత్వానికి చెందిన సంబంధిత పథకాలు, కార్యక్రమాలకు తోడ్పాటుగా నిలుస్తాయి. ముఖ్యంగా గిరిజన సంక్షేమం, సుస్థిర జీవనోపాధులు, సహజ వనరుల ఆధారిత వ్యాపారాలను ప్రోత్సహించే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం - జన్మన్), ప్రధానమంత్రి జనజాతీయ వికాస్ మిషన్, ప్రధానమంత్రి వన్ ధన్ యోజన వంటి పథకాలతో సమన్వయం సాధించడానికి వీలవుతుంది. ఈ విధమైన సమన్వయం ద్వారా ఇప్పటికే అందుబాటులో ఉన్న సంస్థాగత వ్యవస్థలను సమర్థంగా వినియోగించుకుంటూ, సమాజాల ఆధ్వర్యంలో జీవవైవిధ్య పరిరక్షణను బలోపేతం చేయడం సాధ్యమవుతుంది. జీవసంపదల సుస్థిర వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు, స్థానిక ప్రజలకు జీవనోపాధి అవకాశాలను కూడా విస్తరించవచ్చు.

భారతదేశంలో అమలవుతున్న జీవసంపదల వినియోగ ప్రయోజనాల భాగస్వామ్య (ఏబీఎస్) విధానం జీవవైవిధ్య చట్టం - 2002, జాతీయ జీవవైవిధ్య వ్యూహం, కార్యాచరణ ప్రణాళిక (ఎన్‌బీఎస్ఏపీ) 2024. - 2030 అమలుకు దోహదపడుతోంది. జన్యు వనరులు, వాటికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా లభించే ప్రయోజనాలను న్యాయబద్ధంగా, సమానంగా పంచుకోవడంపై కున్మింగ్‌ - మాంట్రియల్‌ ప్రపంచ జీవవైవిధ్య ప్రణాళికలోని లక్ష్యం - 13 అమలుకు ఈ విధానం తోడ్పడుతోంది. అలాగే, వనరుల సమీకరణకు సంబంధించిన లక్ష్యం - 19 సాధనకు కూడా సహకరిస్తోంది. జీవవైవిధ్య పరిరక్షణ, సహజ వనరుల సుస్థిర వినియోగం, జీవనోపాధులకు తోడ్పాటు, సంస్థల మధ్య సహకారం ద్వారా ఈ విధానం పలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు కూడా దోహదపడుతోంది. వీటిలో లక్ష్యం - 2 (ఆకలి లేని ప్రపంచం), లక్ష్యం - 8 (గౌరవప్రదమైన ఉపాధి, ఆర్థిక వృద్ధి), లక్ష్యం - 12 (బాధ్యతాయుత వినియోగం, ఉత్పత్తి), లక్ష్యం - 15 (భూమిపై జీవవైవిధ్య పరిరక్షణ), లక్ష్యం - 17 (లక్ష్యాల సాధనకు భాగస్వామ్యాలు) ఉన్నాయి.

జీవవైవిధ్యంపై ఐక్యరాజ్యసమితి ఒప్పందానికి సంబంధించిన వర్గాల 17వ సమావేశం (సీఓపీ - 17) 2026 అక్టోబర్ 19న ఆర్మేనియాలోని యెరెవాన్‌లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు భారత్ సిద్ధమవుతున్న తరుణంలో, దేశంలో అమలవుతున్న ఏబీఎస్ విధానం జీవవైవిధ్య పరిరక్షణ, జీవసంపదల సుస్థిర వినియోగం, వాటి వినియోగం ద్వారా లభించే ప్రయోజనాలను న్యాయబద్ధంగా, సమానంగా పంచుకోవడం భారతదేశ నిరంతర నిబద్ధతను చాటుతోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2321955) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Punjabi , English , Gujarati , हिन्दी , Marathi