రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యువతకు నూతన ఉద్యోగావకాశాలు: భారతీయ రైల్వేల్లో 3,548 గ్రాడ్యుయేట్ స్థాయి ఎన్‌టీపీసీ ఖాళీల భర్తీకి విడుదలైన ప్రకటన

గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టుల విభాగంలో అత్యధికంగా 2,750 ఖాళీలు

అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు, రిజర్వేషన్ ప్రయోజనాలు, పరీక్ష రుసుము రీఫండ్ నిబంధనలతో ప్రతిభ ఆధారిత ఎంపిక ద్వారా నియామకాలు

2026 నవంబర్ 6 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ

నాడు పోస్టు చేయడమైనది: 11 OCT 2026 11:16AM by PIB Hyderabad

భారతీయ రైల్వే పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్‌ఆర్‌బీలు) విడుదల చేసిన కేంద్రీకృత నియామక నోటిఫికేషన్ (సీఈఎన్) నంబర్ 06/2026 ద్వారా ఎన్‌టీపీసీ(నాన్‌టెక్నికల్ పాపులర్ కేటగిరీస్)- గ్రాడ్యుయేట్ విభాగం కింద 3,548 పట్టభద్రుల స్థాయి ఖాళీలను ప్రకటించింది. ఈ నియామకం ద్వారా అర్హులైన పట్టభద్రులకు భారతీయ రైల్వేలో ఉద్యోగం చేసేందుకు, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సేవా సంస్థలలో ఒకటైన రైల్వేల సమర్థవంతమైన నిర్వహణలో భాగస్వాములు కావడానికి గొప్ప అవకాశం లభిస్తుంది.

ఈ నియామక ప్రక్రియ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనే నాలుగు రకాల ఉద్యోగ విభాగాలకు వర్తిస్తుంది. ఈ ఉద్యోగాలు వాణిజ్య సేవలు, రైలు కార్యకలాపాలు, ఖాతాలు (అకౌంట్స్), పరిపాలనా విభాగాలలో విస్తృతమైన ఉద్యోగ జీవన అవకాశాలను అందిస్తూ దేశవ్యాప్తంగా రైల్వే సేవల సమర్థవంతమైన నిర్వహణకు తోడ్పడతాయి.

మొత్తం 3,548 ఖాళీలలో అత్యధికంగా 2,750 పోస్టులు గూడ్స్ ట్రైన్ మేనేజర్ విభాగానికి కేటాయించారు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ విభాగంలో 371, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ విభాగంలో 300, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ విభాగంలో 127 ఖాళీలు ఉన్నాయి. ఇవి పట్టభద్రులకు రైల్వే కార్యకలాపాలు, పరిపాలనకు సంబంధించిన వివిధ క్రియాశీల విభాగాలలో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తాయి.

ఏడో కేంద్ర వేతన సంఘం (సీపీసీ) నిబంధనల ప్రకారం ఈ పోస్టులకు ప్రారంభ మూల వేతనం వర్తిస్తుంది. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ పోస్టుకు ఆరో వేతన స్థాయి కింద నెలకు రూ. 35,400 ప్రారంభ మూల వేతనం ఉండగా.. మిగిలిన మూడు విభాగాల పోస్టులకు ఐదో వేతన స్థాయి కింద నెలకు రూ. 29,200 ప్రారంభ మూల వేతనం లభిస్తుంది. వర్తించే అలవెన్సులు, సేవా షరతులు సంబంధిత నిబంధనల ప్రకారం ఉంటాయి. 

ముఖ్యమైన తేదీలు, అర్హతలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 అక్టోబర్ 8న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు 2026 నవంబర్ 6 రాత్రి 11:59 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించొచ్చు. పరీక్ష రుసుము చెల్లించడానికి చివరి తేదీ 2026 నవంబర్ 8 కాగా దరఖాస్తుల సవరణ ఆప్షన్ నవంబర్ 9 నుంచి నవంబర్ 18 వరకు అందుబాటులో ఉంటుంది.

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. పోస్టుల వారీగా కూడా నిర్దేశిత అర్హతలు ఉంటాయి. 2027 జనవరి 1 నాటికి నిర్ణీత వయోపరిమితి 18-33 సంవత్సరాలుగా ఉంది. నిబంధనల ప్రకారం అర్హత గల వర్గాలకు తగిన వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

మెరిట్ ఆధారిత ఎంపిక, అర్హులైన అభ్యర్థులకు మినహాయింపు నిబంధనలు

ఎంపిక ప్రక్రియలో మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ-1), రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ-2) ఉంటాయి. నిబంధనల ప్రకారం ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. మెరిట్, నిర్దేశిత అర్హతల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నియామక నిబంధనలకు అనుగుణంగా వర్తించే రిజర్వేషన్‌లు, వయోపరిమితి సడలింపులతో పాటు అర్హులైన దివ్యాంగ అభ్యర్థులకు సహాయకుడు సదుపాయం, అదనపు సమయం (కాంపెన్సేటరీ టైం) కేటాయింపు నిబంధనలు ఉన్నాయి.

సీఈఎన్ నంబర్ 06/2026 కింద జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత టైపింగ్ స్కిల్ టెస్ట్ (సీబీటీఎస్‌టీ) నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే అభ్యర్థులు ప్రాథమిక కంప్యూటర్, టైపింగ్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఉద్యోగంలో చేరిన తర్వాత దీనిని మూల్యాంకనం చేస్తారు.

అర్హులైన పట్టభద్రులు వివరణాత్మక నోటిఫికేషన్‌ను పరిశీలించి తమకు ఇష్టమైన పోస్టుల కోసం అవసరమైన అర్హతలను సరిచూసుకొని నిర్దేశిత గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా కోరడమైంది.

అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో నియామక వివరాలు

అభ్యర్థులు వివరణాత్మక నోటిఫికేషన్, ఖాళీల తీరు, అర్హతా ప్రమాణాలు, నియామకాలకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందొచ్చు:

ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్: https://rrb.indianrailways.gov.in

ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in

విశ్వసనీయమైన నియామక ప్రకటనలు, అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు కేవలం ఈ అధికారిక ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే సంప్రదించాలని సూచించడమైంది.


(రిలీజ్ ఐడి: 2321945) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati , Kannada , Malayalam