సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
'స్వచ్ఛత హీ సేవా 2026' ప్రచారాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 4,710 కార్యక్రమాల నిర్వహణ
74,000 మందికి పైగా ప్రజల భాగస్వామ్యంతో నిర్దేశిత లక్ష్యంలో 160 శాతం పూర్తి
నాడు పోస్టు చేయడమైనది:
08 OCT 2026 7:15PM by PIB Hyderabad
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2026 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించిన 'స్వచ్ఛతా హి సేవ-2026' ప్రచారాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రచారం స్వచ్ఛ భారత్ దివస్ రోజున ముగిసింది. "స్వచ్ఛతా మే సబ్‌కీ భాగీదారీ... స్వచ్ఛ భారత్... వికసిత్ భారత్" అనే ఇతివృత్తంతో చేపట్టిన ఈ ప్రచారం... స్వచ్ఛ, వికసిత్ భారత్ ఆశయం, సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి వ్యక్తి సామూహిక పాత్ర, బాధ్యతనూ స్పష్టం చేసింది. ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు-2026 గురించి అవగాహన కల్పించడం, స్వచ్ఛతలో యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, సామూహిక యాజమాన్యం, జన భాగస్వామ్యాన్ని పెంపొందించడం దీని లక్ష్యాలు.
మంత్రిత్వశాఖకు చెందిన అన్ని మీడియా విభాగాలు, వాటి క్షేత్రస్థాయి కార్యాలయాలతో కలిసి... ఈ ప్రచారంలోని వివిధ అంశాల కింద దేశవ్యాప్తంగా 4,710 కార్యక్రమాలను నిర్వహించారు. 2,943 కార్యక్రమాల లక్ష్యంతో చేపట్టిన ఈ చర్యల ద్వారా, నిర్దేశిత లక్ష్యంలో 160 శాతాన్ని సాధించారు. ఈ కార్యక్రమాల్లో మొత్తం 74,483 మంది పాల్గొన్నారు.
'స్వచ్ఛత హీ సేవా' కార్యక్రమంలో భాగంగా ఈ నెల 1న కేంద్ర సమాచార, ప్రసార, రైల్వే, ఎలక్ట్రానిక్స్, సమాచార-సాంకేతిక శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ మూడు మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
అధికారులనుద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ... పరిశుభ్రత కేవలం ప్రచారంగానే మిగిలిపోకూడదన్నారు. అది ప్రజలందరి దైనందిన జీవితంలో, పనిలో సహజ భాగమై... ఒక శాశ్వత అలవాటుగా మారాలని శ్రీ వైష్ణవ్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలోని ప్రతి కార్యాలయానికి, ప్రతి విభాగానికి, చివరికి అతి చిన్న క్షేత్రస్థాయి సంస్థ వరకూ స్వచ్ఛతా సందేశం చేరాలని ఆయన కోరారు.
ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ)లో జరిగిన "ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్" కార్యక్రమంతో పాటు ఇతర కార్యక్రమాల్లో సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ పాల్గొన్నారు. పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమం సందర్భంగా సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి... మీడియా విభాగాల అధిపతులు, నోడల్ అధికారులతో కలిసి కార్యక్రమ పురోగతిని సమీక్షించారు. ఇందులో గరిష్ట స్థాయి ప్రజా భాగస్వామ్యాన్ని సాధించాలని, ఈ ప్రచారం కోసం నిర్దేశించిన లక్ష్యాలను తప్పక పూర్తి చేసేలా చూడాలని వారికి సూచించారు.
ఈ కార్యకలాపాలు పరిశుభ్రత, ప్రజా భాగస్వామ్యానికి సంబంధించిన వివిధ అంశాలను కవర్ చేశాయి. 'పరిశుభ్రతా లక్ష్య యూనిట్ల (సీటీయూల) పరివర్తన - పరిశుభ్రమైన బహిరంగ ప్రదేశాలు' కార్యక్రమం ద్వారా... క్లిష్టమైన, మురికిగా ఉన్న, అధిక జనసంచారం ఉండే బహిరంగ ప్రదేశాలను గుర్తించి, మ్యాప్ చేసి, నిర్దేశిత కాలపరిమితిలోగా శుభ్రం చేశారు. మొత్తం 2,864 సీటీయూల పరివర్తనను పూర్తి చేయడం సహా... బహిరంగ ప్రదేశాలనూ శుభ్రపరిచారు.
‘స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛత కోసం యువత’ కార్యక్రమం కింద... ‘స్వచ్ఛతా జ్ఞాన యాత్ర’, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల సందర్శనలు, ‘స్వచ్ఛతా ఏవమ్ జల్ సంచయ్ సంవాద్’ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, యువతను స్వచ్ఛత సంబంధిత కార్యక్రమాల్లో నిమగ్నం చేసి, చైతన్యపరిచారు. ఈ కార్యక్రమాల్లో స్వచ్ఛత, వర్షపు నీటి సేకరణ, నీటి నిర్వహణపై చర్చలు, సంభాషణలు, పోటీలూ నిర్వహించారు. ఈ విభాగం కింద మొత్తం 219 కార్యక్రమాలు నిర్వహించారు.
'సఫాయిమిత్ర సురక్ష ఏవమ్ సమ్మాన్ శిబిరం' ద్వారా సఫాయి మిత్రలు, స్వచ్ఛాగ్రహీలు, పారిశుధ్య కార్మికుల కోసం ఒకే చోట అన్ని సేవలు అందేలా 'సింగిల్ విండో' శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వారిలో అర్హులైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అనుసంధానించడం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, పీపీఈ కిట్లు, రక్షణ పరికరాలను పంపిణీ చేయడం వంటి పనులు చేపట్టారు. పారిశుధ్యం కోసం వారు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ స్థానిక స్థాయిలో వారిని ఘనంగా సత్కరించారు. ఈ విభాగం కింద మొత్తం 139 కార్యక్రమాలు నిర్వహించారు.
పరిశుభ్రతలో ప్రజా భాగస్వామ్యం అనే విభాగం ప్రధానంగా ఇంటింటికీ అవగాహన ప్రచారం, ప్రజలను భాగస్వామ్యం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా 'ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2026' గురించి అవగాహన కల్పించడం, చెత్తను నాలుగు రకాలుగా వేరు చేయడం, ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేయడాన్ని ప్రోత్సహించారు. 'స్పోర్ట్స్ ఫర్ స్వచ్ఛత', 'స్వచ్ఛ పర్వ్', 'హరిత్ పర్వ్' వంటి కార్యక్రమాలతో పాటు... 'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ విభాగం కింద దేశవ్యాప్తంగా మొత్తం 1,418 కార్యక్రమాలు నిర్వహించారు.
స్వచ్ఛతా సే సమృద్ధి కింద... “కబాడ్ సే జుగాడ్ – వ్యర్థాల నుంచి సంపద”, “కబాడ్ సే కళ – వ్యర్థాల నుంచి కళాకృతులు” వంటి కార్యక్రమాలతో పాటు పాత పుస్తకాలు, బొమ్మలు, బట్టలను దానం చేయడం వంటి కార్యక్రమాల ద్వారా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ విభాగం కింద 70 కార్యక్రమాలు నిర్వహించారు.
'స్వచ్ఛ భారత్ దివస్' సందర్భంగా ఈ నెల 2న అధికారులు, సిబ్బంది స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత నెల 27న 'ప్రపంచ పర్యాటక దినోత్సవం'... ఈ నెల 1న 'ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్' కార్యక్రమాల సందర్భంగా స్వచ్ఛందంగా ఒక గంట పాటు స్వచ్ఛతా సేవను అందించేలా ప్రత్యేక కార్యక్రమాలను మంత్రిత్వ శాఖ నిర్వహించింది.
మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా విభాగాలు, క్షేత్రస్థాయి కార్యాలయాల ద్వారా... దేశవ్యాప్తంగా అధికారులు, సిబ్బంది, యువత, సఫాయి మిత్రలు, పౌరుల చురుకైన భాగస్వామ్యంతో స్వచ్ఛతను ఒక సామూహిక బాధ్యతగా, నిరంతర ప్రజా ఉద్యమంగా ప్రోత్సహించడం పట్ల మంత్రిత్వశాఖ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.
***
(రిలీజ్ ఐడి: 2321024)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5