సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
నేషనల్ ఫిలిం ఆర్కైవ్ ఆఫ్ ఇండియాకు విరాళంగా
శివాజీ గణేషన్ నటించిన మూడు తమిళ చిత్రాల ప్రింట్లు
ఈ సేకరణలో భాగంగా ఎన్‌ఎఫ్‌ఏఐకి తొలిసారి లభించిన ‘తిరువరుట్చెల్వర్’ కాపీ
నాడు పోస్టు చేయడమైనది:
08 OCT 2026 11:40AM by PIB Hyderabad
దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ నటించిన, ఏపీ నాగరాజన్ దర్శకత్వం వహించిన మూడు 35 ఎంఎం తమిళ సినిమా పాత చలన చిత్రాలను పూణేలోని ఎన్ఎఫ్‌డీసీ–నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్‌డీసీ–ఎన్ఎఫ్ఏఐ)కి అప్పగించారు. వీటిని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ)లో ఫిల్మ్ రీసెర్చ్ అధికారిణి అపర్ణా సుబ్రమణియన్ సేకరించారు.
తిరువరుట్చెల్వర్ (1967), థిల్లానా మోహనాంబల్ (1968), తిరువిళైయాడల్ (1965) చిత్రాలు జాతీయ ఆర్కైవ్స్‌లోకి చేరాయి. ఇప్పటి వరకు 'తిరువరుట్చెల్వర్' చిత్రం ఏ రూపంలోనూ ఎన్‌ఎఫ్‌ఏఐ వద్ద లేదు. ఈ విరాళంతో ఆ లోటు భర్తీ చేసినట్లయింది. అలాగే థిల్లానా మోహనాంబల్, తిరువిళైయాడల్ చిత్రాలకు సంబంధించి మిగిలి ఉన్న రెండో రిలీజ్ ప్రింటు కూడా లభించింది. ఫలితంగా తమిళ సినిమాలో ముఖ్యమైన ఈ రెండు చిత్రాల పరిరక్షణ మరింత సులభతరమయింది.
మూడు చిత్రాలను సేకరించడానికి మాత్రమే ఈ కార్యక్రమం పరిధి పరిమితం కాలేదు. రెండో ప్రింటు అందుబాటులోకి రావడంతో ఎన్ఎఫ్ఏఐకి ఈ చిత్రాల పరిరక్షణ, నిర్వహణ మరింత సులభతరమవుతుంది. ఇప్పటికే ఉన్న ఒక ప్రింట్‌ను సురక్షితంగా భద్రపరుస్తూనే... మరోదాన్ని రిఫరెన్స్, సాంకేతిక పరిశీలన, డిజిటైజేషన్, తులనాత్మక అధ్యయనం లాంటి అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.
image.png
ఫిలిం రీలును ఎన్ఎఫ్‌డీసీ ఎండీ శ్రీ ప్రకాశ్ మగ్దుమ్‌కు అప్పగిస్తున్న అపర్ణా సుబ్రమణియన్. చిత్రంలో ఎన్ఎఫ్‌డీసీ–ఎన్ఎఫ్ఏఐ అధికారులు భవేష్ ప్రతాప్ సింగ్, లీనాలి ఖైర్నార్
ఈ సందర్భంగా జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ), మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాశ్ మగ్దుమ్ మాట్లాడారు. ‘‘సంస్థాగతంగా చేపట్టే సేకరణ మాత్రమే కాకుండా పాతకాలం నాటి చలనచిత్ర సామగ్రిని భద్రపరిచేందుకు వ్యక్తులు, సంస్థలు చేసే ప్రయత్నాలపై కూడా భారతీయ చలనచిత్ర వారసత్వ పరిరక్షణ ఆధారపడి ఉంటుంది. ముఖ్యమైన ఈ మూడు తమిళ చిత్రాలను నేషనల్ ఫిలిం ఆర్కైవ్ ఆఫ్ ఇండియాలో చేర్చడం ద్వారా జాతీయ భాండాగారం మరింత బలోపేతమవుతుంది. భారతీయ సినిమాలో గుర్తింపు పొందిన కళాఖండాలను భావితరాలకు అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ ప్రింట్లను సేకరించి నేషనల్ ఆర్కైవ్‌లో చేర్చేందుకు చేపట్టిన కృషిని అభినందిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.
ఈ చిత్రాల కాపీలను విరాళంగా అందించడం గురించి అపర్ణా సుబ్రమణియన్ వివరించారు. ‘‘నేను గత మూడున్నర సంవత్సరాలుగా ఫిలిం ప్రింట్లను సేకరిస్తూ.. వాటిని భద్రపరుస్తున్నాను. ఈ ఏడాది ఆరంభంలో, అంటే 2026 జనవరిలో ఎన్ఎఫ్ఏఐకి రత్తకన్నీర్ (1954) చిత్రాన్ని విరాళంగా అందించాను. నేను సేకరించిన చిత్రాలను అప్పగించడం కూడా ఈ ప్రయత్నంలో భాగమే. సరైన పరిరక్షణ సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ ఆర్కైవ్‌లో ఈ ప్రింట్లను భద్రపరచడమే నా లక్ష్యం.”
థిల్లానా మోహనాంబాల్ చిత్రానికి సంబంధించిన వివిధ రకాల కాపీలు ఎన్ఎఫ్ఏఐ పరిరక్షణలో ఉన్నాయి. కానీ తిరువిళయాడల్ చిత్రానికి సంబంధించి ఒక్కటే కాపీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇప్పుడు విరాళంగా వచ్చిన తిరువిళయాడల్ ప్రింట్.. సినిమాస్కోప్ ఫార్మాట్‌కు అనుగుణంగా ఆప్టికల్ మార్పులు చేసిన ప్రతిగా కనిపిస్తోంది.
సంస్థాగత సేకరణలో చిత్రానికి సంబంధించి పరిరక్షిస్తున్న కాపీ ఒక్కటే మిగిలినప్పుడు దాన్ని పాడవకుండా చూసేందుకు దాని వినియోగాన్ని జాగ్రత్తగా నియంత్రించాల్సి ఉంటుంది. రెండో కాపీ కూడా అందుబాటులో ఉంటే అసలైన అనలాగ్ ఫిల్మ్‌ను సురక్షితంగా ఉంచుతూనే పరిశీలన, సాంకేతిక అంచనా, డిజిటైజేషన్, తులనాత్మక అధ్యయనం లాంటి పనులను చేపట్టడానికి ఆర్కైవ్‌కు మరింత వెసులుబాటు లభిస్తుంది. కాబట్టి ఆర్కైవల్ పరిరక్షణ కోణంలో ఒకటి కంటే ఎక్కువ కాపీలు అందుబాటులో ఉంచేందుకు అధిక ప్రాధాన్యమిస్తారు.
image.png
థిల్లానా మోహనాంబల్ (1968) చిత్రం ఫ్రేములు
కొత్తగా సేకరించిన మూడు ప్రింట్లలోనూ మజెంటా కలర్ ఫేడింగ్, వెర్టికల్ ప్రొజెక్టర్ గీతలు ఉన్నాయి. ఇవి ఉష్ణ వాతావరణంలో, ప్రతికూల పరిస్థితుల్లో దశాబ్దాల పాటు ఉపయోగించడం, భద్రపరచడం వల్ల ఎదురైన ప్రభావాలను ప్రతిబింబిస్తున్నాయి. ఇలాంటి పాత ఫిల్మ్ కాపీలను సంస్థాగత ఆర్కైవల్ సేకరణల్లో భద్రపరచడం ఎంత కీలకమో వీటి ప్రస్తుత పరిస్థితి స్పష్టం చేస్తోంది.
ఆగస్టు 2026లో అందిన సమాచారంతో ఈ ప్రింట్ల సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. చెన్నైలో లభ్యమైన థిల్లానా మోహనాంబాల్ ప్రింట్‌ను ఎఫ్‌టీఐఐ పూర్వ విద్యార్థి సాయి సంజయ్ సహకారంతో సేకరించి, పూణేకు తరలించారు. ఆ తర్వాత అందిన మరిన్ని వివరాలతో తిరువిళయాడల్, తిరువరుట్చెల్వర్ చిత్రాల ప్రింట్లు లభ్యమయ్యాయి. ఎన్‌ఎఫ్‌ఏఐ వద్ద తిరువరుట్చెల్వర్ కాపీ లేదని తెలుసుకున్న సుబ్రమణియన్.. ఆ ప్రింట్‌ను ఆర్కైవ్ కోసం భద్రపరచడానికే మొదటి ప్రాధాన్యమిచ్చారు. ఈ మూడు ప్రింట్లను 2026 సెప్టెంబర్ 13న చెన్నైలో సేకరించి, అనంతరం ఎన్‌ఎఫ్‌ఏఐకి అప్పగించారు.
లభ్యమవుతున్న పాత ఫిల్మ్ కాపీలను గుర్తించి, సేకరించి, భద్రపరిచేందుకు ఎన్ఎఫ్‌డీసీ–ఎన్‌ఎఫ్‌ఏఐ నిరంతరం చేస్తున్న కృషికి ఈ సేకరణ మరింత బలాన్ని చేకూరుస్తుంది. భారతీయ సినీ వారసత్వ జాతీయ ఆర్కైవ్స్‌ను సుసంపన్నం చేస్తుంది. ఈ ప్రింట్లు భవిష్యత్తులో పరిరక్షణ, పరిశోధన, డిజిటైజేషన్‌కు ఉపయోగించడంతో పాటు అందరికీ అందుబాటులోకి వస్తాయి. అలాగే భారతీయ చలనచిత్ర చరిత్రలో ఈ ముఖ్యమైన కళాఖండాలు శాశ్వతంగా నిలిచిపోయేలా చేస్తాయి.
***
(రిలీజ్ ఐడి: 2320969)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6