వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ పరిశోధన, విద్య, సాంకేతిక పరిజ్ఞాన బదిలీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చారిత్రాత్మక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన భారత్, ఘనా
పంట దిగుబడులు, కోత అనంతర మౌలిక సదుపాయాలు, వాణిజ్యీకరణను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఐసీఏఆర్, సీఎస్ఐఆర్ - సీఆర్ఐ (ఘనా) మధ్య భాగస్వామ్యం; ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమక్షంలో ఘనంగా ఒప్పంద వేడుక
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 6:04PM by PIB Hyderabad
వ్యవసాయ పరిశోధన, విద్య, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ రంగాల్లో భారత్ - ఘనా దేశాల మధ్య సహకారం మరింత బలోపేతమైంది. న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా మండలి, ఘనా రాజధాని అక్రాలోని క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఐఆర్ - సీఆర్ఐ) మధ్య అవగాహన ఒప్పందం ( ఎంఓయూ) పై సంతకాలు జరగడంతో ఈ భాగస్వామ్యం మరింత విస్తరించింది. ఈ ఎంఓయూ ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారంతో పాటు భారత్ - ఆఫ్రికా సహకారానికి భారత్ మరింత ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ ఎంఓయూ సంతకాల కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, ఘనా విదేశాంగ మంత్రి శ్రీ శామ్యూల్ ఒకుడ్జెటో అబ్లక్వా హాజరయ్యారు.
ఈ ఐదేళ్ల అవగాహన ఒప్పందం ఉమ్మడి వ్యవసాయ పరిశోధన, శాస్త్రీయ - సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, సామర్థ్య పెంపుదల, వ్యవసాయ సాంకేతికతల వినియోగం, వాణిజ్యీకరణ రంగాలలో సహకారానికి సమగ్రమైన యంత్రాంగాన్ని అందిస్తుంది. ఈ యంత్రాంగం కింద నిర్దిష్ట పరిశోధన, వాణిజ్యీకరణ కార్యకలాపాలకు సంబంధించి సిఎస్ఐఆర్ - సిఆర్ఐ వాణిజ్య భాగస్వామిగా గుర్తింపు పొందిన ఘనాకు చెందిన అరిమా ఫార్మ్స్ లిమిటెడ్ ఈ ద్వైపాక్షిక సహకారానికి అనుసంధానకర్తగా వ్యవహరించింది
తొలి దశ భాగస్వామ్యంలో భాగంగా ప్రధానంగా కూరగాయల సాగుపై ముఖ్యంగా టమాటా పంట పరిశోధన, అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నారు. ఘనాలో టమాటా దిగుబడిని, స్వయంసమృద్ధిని పెంచేందుకు వీలుగా అత్యధిక దిగుబడినిచ్చే నాణ్యమైన టమాటా రకాలను అందుబాటులోకి తెచ్చేందుకు, అలాగే ఉత్తమమైనవిగా నిరూపితమైన వ్యవసాయ సాంకేతికతలను పెద్ద ఎత్తున అమలు చేసేందుకు ఐసిఎఆర్ పూర్తి సహకారం అందించనుంది.
ఈ భాగస్వామ్యంలో కర్రపెండలం, కంద తదితర దుంప పంటల ప్రాసెసింగ్, విలువ జోడింపుపై కూడా దృష్టి సారించనున్నారు. వ్యవసాయ విలువ శ్రేణులను మరింత బలోపేతం చేయడం ఈ చర్యల ప్రధాన లక్ష్యం. పంట అనంతర నష్టాలను తగ్గించేందుకు కోల్డ్ స్టోరేజీ, శీతలీకృత రవాణా, వేరు చేయడం, నాణ్యత/పరిమాణం ఆధారంగా గ్రేడింగ్, ప్రాసెసింగ్ సాంకేతికతలు వంటి రంగాల్లో సాంకేతిక సహాయం, సామర్థ్య పెంపుతో కూడిన పంట అనంతర నిర్వహణపైనా ఇరు దేశాలు సహకారం అందించనున్నాయి.
ఈ అవగాహన ఒప్పందంలో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల పరస్పర మార్పిడి, (వంశవృద్ధి జన్యు వనరులు (జెర్మ్‌ప్లాజమ్), బ్రీడింగ్ మెటీరియల్, శాస్త్రీయ సమాచారం, పరిశోధనా పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం పరస్పరం పంచుకోవడానికి అవకాశం కల్పించారు. అలాగే సంయుక్త పరిశోధనా ప్రాజెక్టుల రూపకల్పన, అమలుకు కూడా వీలు కల్పించారు. ఇరు దేశాలకు చెందిన సంబంధిత పరిశోధనా సంస్థలు, కేంద్రాల మధ్య సంస్థాగత అనుసంధానాలను ఏర్పాటు చేయడం ద్వారా దీర్ఘకాలికంగా కొనసాగించే శాస్త్రీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ ఎంఓయూ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ భాగస్వామ్యాన్ని ఐసీఏఆర్, సిఎస్ఐఆర్ - సిఆర్ఐ ప్రతినిధులతో కూడిన సంయుక్త కార్యాచరణ బృందం పర్యవేక్షిస్తుంది. ఈ బృందం సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు, ఒప్పందం అమలు తీరుకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఈ సంయుక్త కార్యాచరణ బృందం న్యూఢిల్లీ, అక్రా నగరాల్లో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించనుంది.
ఈ భాగస్వామ్యం ద్వారా వ్యవసాయ పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, సామర్థ్య పెంపు, వాణిజ్య అనువర్తనాల మధ్య అనుసంధానం మరింత బలోపేతం కానుంది. తద్వారా సంబంధిత వ్యవసాయ సాంకేతికతలను విస్తృతంగా స్వీకరించేందుకు అవకాశం ఏర్పడటంతో పాటు, ఘనాలో సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి, ప్రజల జీవనోపాధి మెరుగుదలకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2320430)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3