పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కునో జాతీయ పార్కులో 5 కూనలకు జన్మనిచ్చిన చీతా

దేశంలో 60కి చేరిన చీతాల సంఖ్య

దేశంలో తదుపరి తరం చీతాల అభివృద్ధిలో కీలక మైలురాయి: శ్రీ భూపేందర్ యాదవ్

నాడు పోస్టు చేయడమైనది: 05 OCT 2026 2:43PM by PIB Hyderabad

భారత్‌లో పుట్టిన 32 నెలల చీతా ‘కేజీపీ-21’ కునో జాతీయ పార్కులో ఈ రోజు అయిదు కూనలకు జన్మనిచ్చింది. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఈ పిల్ల చీతాలతో భారత్‌లో చీతాల సంఖ్య 60కి చేరింది. వాటిలో 41 భారత్‌లోనే జన్మించడం గమనార్హం. ప్రాజెక్టు చీతాలో మరొక చరిత్రాత్మక ప్రస్థానం.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈ విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. ముఖి, కేజీపీ- 12 తర్వాత పిల్లలకు జన్మనిచ్చిన మూడో భారతీయ సంతతి ఆడ చీతా ‘కేజీపీ-21’ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో తదుపరి తరం చీతాల అభివృద్ధిలో ఇదొక కీలకమైన ప్రస్థానంగా ఆయన అభివర్ణించారు.

ఈ అయిదు పిల్లలకూ బోట్సువానాకు చెందిన మగ చీతా తండ్రి అనీ, దీంతో వాటి జననం భారత్‌లో బోట్సువానా సంతతికి కూడా నాంది పలుకుతోందనీ శ్రీ యాదవ్ తెలిపారు. దీంతో దేశంలో క్రమంగా పెరుగుతున్న చీతాల సంఖ్యకు.. తాజా పరిణామంతో కొత్త జన్యుపరంపర తోడైందన్నారు.

భారత్‌లో జన్మించిన భవిష్యత్ తరం చీతాలుగా కేంద్ర మంత్రి ఈ పరిణామాన్ని అభివర్ణించారు. భారత్‌లో చీతాల పునఃప్రవేశ కథనంలో ఇదొక సరికొత్త అధ్యాయమన్నారు.

ప్రాజెక్ట్ చీతాతో అనుబంధమున్న పశువైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బంది, మేనేజర్లందరికీ శ్రీ యాదవ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వారి అంకితభావం, నిబద్ధత వల్లే చీతాల సంరక్షణలో ఈ పరిణామం సాధ్యమైందన్నారు.  

***


(రిలీజ్ ఐడి: 2319158) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Malayalam