జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పత్తి రైతులకు సాధికారత కల్పించి పారదర్శకతతో భారత్‌ పత్తి విలువ శ్రేణిని బలోపేతం చేయడమే లక్ష్యంగా సంస్కరణలకు ప్రాధాన్యం

డిజిటల్ కొనుగోలు విధానం, నాణ్యతా ప్రమాణాల పెంపు, ఉత్పత్తి సమాచార పర్యవేక్షణ, హెచ్‌డీపీఎస్, కస్తూరి కాటన్ ప్రాజెక్టులపై ప్రదర్శన
సంస్కరణల ద్వారా సాధించిన ఫలితాలను, అనుభవాలను పరస్పరం పంచుకోనున్న రైతులు, పరిశ్రమ భాగస్వాములు, విధానకర్తలు

నాడు పోస్టు చేయడమైనది: 04 OCT 2026 7:01PM by PIB Hyderabad

సంస్కరణల ఉత్సవం (రిఫార్మ్ ఉత్సవ్ 2026) లో భాగంగా కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ భారత పత్తి సంస్థ (సిసిఐ) అక్టోబర్ 6, 2026న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పత్తి కొనుగోలు వ్యవస్థను రైతు సంక్షేమ ఆధారితంగా, అత్యంత పారదర్శకంగా, సాంకేతిక పరిజ్ఞానంతో వేగవంతంగా మార్చేందుకు జౌళి మంత్రిత్వ శాఖతో కలిసి సిసిఐ చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు.

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, రైతులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు, పత్తి, జౌళి రంగాలకు చెందిన ఇతర భాగస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. క్షేత్రస్థాయిలో సంస్కరణలు తెచ్చిన మార్పులను ప్రముఖంగా తెలియజేయడానికి, పత్తి విలువ శ్రేణిలోని ప్రధాన భాగస్వాముల మధ్య అనుభవాల మార్పిడికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలవనుంది.

 

గత కొన్ని సంవత్సరాలుగా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) పత్తి సేకరణ, రైతుల నమోదు, డిజిటల్ స్లాట్ బుకింగ్, నేరుగా ఖాతాల్లోకి చెల్లింపులు, నాణ్యత నిర్ధారణ, ఉత్పత్తుల సమాచార పర్యవేక్షణ, పత్తి విక్రయాలు, భాగస్వాముల అనుసంధానం వంటి అంశాలలో అనేక సాంకేతిక, సంస్థాగత సంస్కరణలను చేపట్టింది. సులభ వ్యాపార నిర్వహణను మెరుగుపరచడం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం, పత్తి రైతులకు మరింత సమర్థవంతంగా సేవలను అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు తోడ్పడుతున్నాయి.

 

ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా సీసీఐ చేపట్టిన కీలక సంస్కరణలు, కార్యక్రమాలపై ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది. వాటి అమలు, ప్రభావాన్ని ప్రతిబింబించే లఘు చిత్రాన్ని కూడా ప్రదర్శిస్తారు. డిజిటల్‌ సాంకేతికతలు, ప్రక్రియల పునర్వ్యవస్థీకరణ ద్వారా సంప్రదాయ విధానాలు ఏ విధంగా మార్పు చెందుతున్నాయి, రైతులు, సీసీఐ, జిన్నర్లు, వస్త్ర పరిశ్రమ మధ్య మరింత మెరుగైన సమన్వయం ఎలా ఏర్పడుతోంది - అనే అంశాలను ఈ ప్రదర్శన వివరిస్తుంది.

ఈ కార్యక్రమంలో పత్తి రైతులు, పరిశ్రమకు చెందిన భాగస్వాములు తమ అనుభవాలను పంచుకోనున్నారు. సంస్కరణల అమలులో భాగస్వాములుగా ఉన్నవారు, వాటి ద్వారా ప్రయోజనం పొందుతున్నవారి అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. పత్తి నాణ్యత మెరుగుదల, అధిక సాంద్రత మొక్కల పెంపకం విధానం (హై డెన్సిటీ ప్లాంటింగ్‌ సిస్టమ్‌ - హెచ్డీపీఎస్) కస్తూరి కాటన్‌ భారత్‌, పత్తి సేకరణలో డిజిటలీకరణ, పత్తి విలువ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చేపడుతున్న ఇతర చర్యలపై చర్చలు జరుగుతాయి.

 

ప్రధానంగా ప్రదర్శించనున్న కార్యక్రమాల్లో కపాస్‌ కిసాన్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ఒకటి. రైతుల నమోదు, స్లాట్‌ బుకింగ్‌, పత్తి సేకరణకు సంబంధించిన సమాచార మార్పిడి, ఆధార్‌ ఆధారిత చెల్లింపులు వంటి పత్తి సేకరణ ప్రక్రియలోని వివిధ దశలను ఈ ప్లాట్‌ఫామ్‌ డిజిటల్‌ విధానాల ద్వారా ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాలను పారదర్శకతను పెంపొందించడం, ప్రక్రియలోని సంక్లిష్టతలను తగ్గించడం, పత్తి సేకరణ ప్రక్రియపై రైతులకు మరింత స్పష్టమైన అవగాహన కల్పించడం లక్ష్యంగా చేపడుతున్నారు.

 

ఈ కార్యక్రమంలో భారత పత్తి నాణ్యతను మెరుగుపరచడం, దాని ఉత్పత్తి నుంచి సేకరణ వరకు వివరాలను గుర్తించే ట్రేసబిలిటీని బలోపేతం చేయడం కోసం సీసీఐ చేపడుతున్న చర్యలను కూడా ప్రదర్శించనున్నారు. ఇందులో కలుషితాలను నియంత్రించడం, డిజిటల్‌ ట్రేసబిలిటీ, కస్తూరి కాటన్‌ భారత్‌ కార్యక్రమం కింద అత్యుత్తమ నాణ్యత కలిగిన పత్తిని ప్రోత్సహించడం వంటి చర్యలు ఉన్నాయి. ఈ చర్యల ద్వారా భారతీయ పత్తికి ప్రత్యేక గుర్తింపు కల్పించడం, నాణ్యతను పెంచడం, మార్కెట్‌లో దాని స్థాయిని మెరుగుపరచడం, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ పత్తికి మరింత ఆదరణ లభించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

ఈ ప్రదర్శనలో హై డెన్సిటీ ప్లాంటింగ్‌ సిస్టమ్‌ తో పాటు, సంబంధిత వ్యవసాయ సంస్థల సహకారంతో ప్రోత్సహిస్తున్న ఉత్పాదకత పెంపు చర్యలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. భారతీయ పత్తి ఉత్పాదకతలో ఉన్న అంతరాన్ని తగ్గించడం, రైతు స్థాయిలో ఆదాయాన్ని మెరుగుపరచడం, మొత్తంగా భారతీయ పత్తి రంగం పోటీతత్వాన్ని పెంచడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యాలు.

 

భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర సిల్క్ బోర్డు (సీఎస్బీ) డిజిటల్‌ సేవల అందజేత, మిషన్‌ ప్రాతిపదికన సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, వినూత్న అవగాహన కార్యక్రమాల ద్వారా పట్టు పరిశ్రమలో కీలక సంస్కరణలను అమలు చేస్తోంది. దీంతో భారతీయ పట్టు పరిశ్రమను మరింత సులభతరం, సమర్థవంతం, భాగస్వాముల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది.

1. సిల్క్‌ మార్క్‌ సేవల డిజిటలీకరణ - వ్యాపార నిర్వహణ సులభతరం: 2004 నుంచి సిల్క్‌ మార్క్‌ పథకాన్ని అమలు చేస్తున్న సిల్క్‌ మార్క్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్ఎంఓఐ), సిల్క్‌ మార్క్‌ ద్వారా స్వచ్ఛమైన పట్టు ఉత్పత్తుల కచ్చితత్వానికి హామీ ఇస్తోంది. 2022 - 23 నుంచి ఎస్ఎంఓఐ రిజిస్ట్రేషన్‌, పునరుద్ధరణ, పత్రాల ప్రాసెసింగ్‌, ముందస్తు తనిఖీ, చెల్లింపులు, లేబుల్‌ ఇండెంటింగ్‌, లేబుళ్ల జారీ, రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవలను దశలవారీగా డిజిటలీకరించింది.

 

ప్రస్తుతం ఈ డిజిటల్‌ వ్యవస్థ ద్వారా 7,000 మందికి పైగా అధీకృత వినియోగదారులు సేవలు పొందుతున్నారు. ఏటా 500 మందికి పైగా కొత్తగా నమోదు అవుతున్నారు. నిర్దేశిత నిబంధనలు, అవసరాలను పూర్తి చేసినట్లయితే, దరఖాస్తులను సాధారణంగా 1 - 2 పని దినాల్లో ప్రాసెస్‌ చేయవచ్చు. ఈ సంస్కరణతో పత్రాల ఆధారిత పనిభారం, కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు పారదర్శకత, ట్రేసబిలిటీ, పరిపాలనా సామర్థ్యం మెరుగుపడ్డాయి. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు, పట్టు రంగానికి చెందిన భాగస్వాములకు ఈ విధానం మరింత ప్రయోజనం చేకూరుస్తోంది.

 

2. మేరా రేషమ్‌ మేరా అభిమాన్‌ - భారీ పట్టు పరిశ్రమ సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ప్రచారం: కేంద్ర సిల్క్ బోర్డు 2025లో మేరా రేషమ్‌ మేరా అభిమాన్‌ (ఎంఆర్ఎంఏ) కార్యక్రమాన్ని 100 రోజుల భారీ పట్టు పరిశ్రమ సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ప్రచారంగా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 129 జిల్లాల్లో రైతులతో నేరుగా అనుసంధానం, ప్రదర్శనలు, శిక్షణ, క్షేత్రస్థాయి కార్యక్రమాల ద్వారా ఇప్పటికే నిరూపితమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయికి’ తీసుకెళ్లింది. ఎంఆర్ఎంఏ 1.0 ద్వారా 1,400 పైగా కార్యక్రమాలు నిర్వహించి, 75,000 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది.

 

ఎంఆర్ఎంఏ 1.0 సాధించిన విజయాలు, అందించిన అనుభవాల ఆధారంగా ఎంఆర్ఎంఏ 2.0ను మరింత అభివృద్ధి చెందిన, క్రమబద్ధమైన, ఫలితాలపై దృష్టి సారించే కార్యక్రమంగా రూపొందించారు. దేశంలో ముడి పట్టు ఉత్పత్తిలో 95 శాతానికి పైగా వాటా కలిగిన 218 కీలక పట్టు పరిశ్రమ జిల్లాలను ఇది కవర్‌ చేస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక సర్వేలు, భాగస్వాములతో సంప్రదింపులు, జిల్లా పట్టు పరిశ్రమ అభివృద్ధి ప్రణాళికలు, లక్ష్య ఆధారిత, అవసరాల ప్రాతిపదికన రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలు, చురుకైన ఇంటరాక్టివ్‌ ఎంఆర్ఎంఏ వెబ్‌ పోర్టల్‌ను సమగ్రంగా అనుసంధానించారు. ఇప్పటివరకు 1,700కు పైగా కార్యక్రమాలు నిర్వహించి, నేరుగా 73,000 మందికి పైగా రైతులను, డిజిటల్‌ వేదికల ద్వారా సుమారు లక్ష మంది భాగస్వాములను చేరుకున్నారు.

 

3. సెరి - టూరిజం - పొలం నుంచి పట్టు దారం వరకు అనుభూతి: పట్టు పరిశ్రమ, పర్యాటకం, విద్య, స్థానిక ఆర్థికాభివృద్ధిని సమన్వయం చేసేలా కేంద్ర సిల్క్ బోర్డు సెరి - టూరిజం కార్యక్రమాన్ని రూపొందించింది. మ్యూజియంలు, ప్రత్యక్ష ప్రదర్శనలు, పట్టు పురుగుల ఆహార మొక్కలు - చిమ్మటల పార్కులు, సాంకేతిక పరిజ్ఞాన ప్రదర్శనలు, పట్టు ఉత్పత్తుల విక్రయ కేంద్రాల ద్వారా నేల నుంచి పట్టు వరకు పూర్తి ప్రయాణాన్ని సందర్శకులకు పరిచయం చేయడం దీని లక్ష్యం.

 

జమ్మూ కాశ్మీర్‌లోని మానస్‌బల్‌ ప్రాంతంలోని సీఎస్బీ - పీ 4 బేసిక్‌ సీడ్‌ ఫామ్‌, అసోంలోని టోపటోలిలోని సీఎస్బీ - ఈఆర్ఐ బేసిక్‌ సీడ్‌ ఫామ్‌లను సెరి - టూరిజం హబ్‌ లుగా అభివృద్ధి చేస్తున్నారు. వీటి ద్వారా పట్టు వైవిధ్యం, జన్యు వనరుల పరిరక్షణ, పట్టు పురుగుల పెంపకం, పట్టు కాయల ఉత్పత్తి, పట్టు దారం తీయడం, నేత, రంగులు అద్దడం, సిల్క్‌ మార్క్‌పై అవగాహన వంటి పట్టు పరిశ్రమకు సంబంధించిన వివిధ దశలను సందర్శకులకు పరిచయం చేయనున్నారు.

కొత్త దిశ

ఈ సంస్కరణలన్నీ కలిసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన, పట్టు పరిశ్రమకు చెందిన భాగస్వాముల అవసరాలకు అనుగుణమైన సమగ్ర వ్యవస్థను రూపొందిస్తున్నాయి. ఇందులో సేవలు డిజిటల్‌ విధానంలో అందుబాటులోకి రావడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానం క్షేత్రస్థాయి వరకు చేరుతోంది. భారతదేశ పట్టు వారసత్వాన్ని ప్రత్యక్ష అనుభూతిని కలిగించే సంపదగా మలుస్తూ, రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు, కళాకారులు, వ్యాపారవేత్తలు, స్థానిక సమాజాలకు కొత్త అవకాశాలను కూడా కల్పిస్తోంది.

 

సంస్కరణ్ ఉత్సవ్‌ 2026లో ప్రదర్శిస్తున్న సంస్కరణలు బలమైన, మరింత సమగ్ర వస్త్ర విలువ వ్యవస్థను నిర్మించాలన్న ప్రభుత్వ విస్తృత దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ విలువ వ్యవస్థ పంట నుంచి పట్టు దారం వరకు, పట్టు దారం నుంచి కర్మాగారం వరకు, కర్మాగారం నుంచి ఫ్యాషన్‌ వరకు, ఫ్యాషన్‌ నుంచి విదేశీ మార్కెట్ల వరకు కొనసాగుతుంది.

 

హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమం విధానపరమైన, సంస్థాగత చర్యల నుంచి క్షేత్రస్థాయి ఫలితాల వరకు సంస్కరణల ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. రైతులు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, విజ్ఞాన సంస్థల మధ్య మరింత విస్తృతమైన భాగస్వామ్యం, సమన్వయాన్ని కూడా ప్రోత్సహించనుంది. 

 

ఈ సంస్కరణల ద్వారా సీసీఐ భారతదేశ పత్తి ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సంస్థాగత ఆధారంగా తన పాత్రను మరింత బలోపేతం చేస్తోంది. రైతులకు మద్దతు అందించడం, పత్తి సేకరణ వ్యవస్థలను మెరుగుపరచడం, నాణ్యత పెంపునకు తోడ్పడటం ద్వారా మరింత పారదర్శకమైన, సమర్థవంతమైన, సుస్థిరమైన, ప్రపంచ స్థాయిలో పోటీతత్వం కలిగిన పత్తి, వస్త్ర పరిశ్రమ వ్యవస్థ రూపుదిద్దుకునేందుకు సీసీఐ దోహదపడుతోంది.

 

సంస్కరణ్ ఉత్సవ్‌ 2026 జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థలు, వ్యవస్థలు చేపట్టిన మార్పుదాయక సంస్కరణలను ప్రదర్శించడంతో పాటు, వాటి ద్వారా పౌరులు, రైతులు, పరిశ్రమలు, విస్తృత వస్త్ర పరిశ్రమ వ్యవస్థపై కలిగిన ప్రభావాన్ని వివరించేందుకు మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమంలో భాగం.

 

***


(రిలీజ్ ఐడి: 2318950) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati