జల శక్తి మంత్రిత్వ శాఖ
స్వచ్ఛ భారత్ దివస్ 2026 సందర్భంగా ప్రత్యేక గ్రామ సభ కార్యక్రమానికి నేతృత్వం వహించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన ప్రత్యేక గ్రామ సభల్లో పాల్గొన్న డీడీడబ్ల్యూఎస్ సీనియర్ అధికారులు
నాడు పోస్టు చేయడమైనది:
03 OCT 2026 2:32PM by PIB Hyderabad
గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లా చిక్లీ బ్లాక్‌లోని మజిగామ్ గ్రామంలో 2026 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో కేంద్ర మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ పాల్గొన్నారు. ఈ ప్రత్యేక గ్రామసభకు గుజరాత్ ప్రభుత్వ మంత్రి శ్రీ నరేశ్ పటేల్, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) సంయుక్త కార్యదర్శి, మిషన్ డైరెక్టర్, శ్రీమతి ఐశ్వర్య సింగ్, జిల్లా కలెక్టర్, జిల్లా అభివృద్ధి అధికారి, రాష్ట్ర, జిల్లా పరిపాలనకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రత్యేక గ్రామసభ సందర్భంగా పారిశుధ్య కార్మికులను కేంద్ర మంత్రి సత్కరించారు. పరిశుభ్రతను కేవలం ఒక్కరోజు నిర్వహించే ప్రచార కార్యక్రమంగా కాకుండా, సమష్టి సంకల్పంగా మార్చుకోవాలని, దానిని మన దైనందిన జీవితం, ప్రవర్తన, సమష్టి బాధ్యతలో అంతర్భాగంగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. “మనం చెత్త వేయకూడదు, ఇతరులు కూడా చెత్త వేయకుండా చూడాలి” అనే సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆయన అన్నారు.
‘స్వాతంత్య్రం’తో పాటు ‘స్వచ్ఛత’కు మహాత్మా గాంధీ ఇచ్చిన ప్రాధాన్యతను కేంద్రమంత్రి గుర్తుచేశారు. స్వాతంత్య్రం అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో స్వచ్ఛత కోసం అత్యంత విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ రూపంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన జన్ ఆందోళన్ (ప్రజా ఉద్యోమం) గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులను పూర్తిగా మార్చివేసిందని తెలిపారు. స్వచ్ఛ భారత్ కోసం కొనసాగుతున్న ఈ ప్రజా భాగస్వామ్యం క్షేత్రస్థాయిలో మిషన్‌ను ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు.
ప్రత్యేక గ్రామసభలో ఇతర అంశాలతో పాటు స్వచ్ఛతా హీ సేవా (ఎస్‌హెచ్‌ఎస్) 2026 సాధించిన పురోగతి, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026, గ్రామపంచాయతీ స్థాయిలో నిర్వహించే వార్షిక డిజిటల్ స్వీయ మూల్యాంకన వ్యవస్థ ‘స్వచ్ఛ సేవా ఆంకలన్’పై చర్చలు జరిగాయి. స్వచ్ఛ సేవా ఆంకలన్‌పై సంయుక్త కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ (జేఎస్,ఎండీ) ప్రజెంటేషన్ ఇచ్చారు.
అంతకుముందు కేంద్ర మంత్రి గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన “వ్యర్థాల నుంచి కళాఖండాలు” ప్రదర్శనను సందర్శించారు. పనికిరాని వస్తువులను సృజనాత్మకంగా పునర్వినియోగించడాన్ని ఈ ప్రదర్శన ద్వారా చూపించారు. తద్వారా సమాజంలో బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ విధానాలను ప్రోత్సహించే సందేశాన్ని అందించారు.
‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ సీఆర్ పాటిల్, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) సంయుక్త కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం ప్రముఖులు, గ్రామసభలో పాల్గొన్నవారు కలిసి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు.
2026 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా 2026లో కీలక కార్యక్రమంగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. స్థానిక పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన చర్యలను సమీక్షించేందుకు గ్రామపంచాయతీలు, గ్రామీణ సమాజాలకు ఈ గ్రామసభలు వేదికగా నిలిచాయి. ఎస్‌హెచ్‌ఎస్ 2026 ఫలితాలను చర్చించడం, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, 2026కు అనుగుణంగా వ్యర్థాలను నాలుగు రకాలుగా వేరు చేసే విధానం అమలు స్థితిని సమీక్షించడం, అధిక పరిమాణంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే సంస్థలు, వ్యక్తులను గుర్తించి నమోదు చేయడం, ఓడీఎస్ ప్లస్ (మోడల్) గ్రామపంచాయతీల్లో స్వచ్ఛ సేవా ఆంకలన్‌పై చర్చించడం వంటి అంశాలు ఇందులో చేపట్టారు.
ప్రత్యేక గ్రామసభ ద్వారా లోటుపాట్లను గుర్తించి, అవసరమైన చర్యలను పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల్లో, ముఖ్యంగా గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికల్లో (జీపీడీపీ) సమగ్రపరచేందుకు ఒక అవకాశాన్ని, వేదికను అందించింది. తద్వారా క్షేత్రస్థాయిలో సమన్వయంతో కార్యక్రమాలను అమలు చేయడానికి వీలు కలుగుతుంది.
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభలు, పారిశుధ్య కార్యక్రమాల్లో డీడీడబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
· దాద్రా, నగర్ హవేలీలోని సాయిలీ గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో డీడీడబ్ల్యూఎస్ డిప్యూటీ సెక్రటరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా 2026, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, 2026పై చర్చలు జరిగాయి. స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయడంతో పాటు పారిశుధ్య కార్మికులను సత్కరించారు. ఈ పర్యటనలో మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్‌టీపీ) సందర్శన, ‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం కూడా నిర్వహించారు.
· జార్ఖండ్‌లోని రాంచీ జిల్లా నామ్‌కుమ్ బ్లాక్, సిథియో గ్రామపంచాయతీ పరిధిలోని పిండర్‌కోమ్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో డీడీడబ్ల్యూఎస్ డిప్యూటీ సెక్రటరీ పాల్గొన్నారు. ఈ గ్రామసభలో స్వచ్ఛ సేవా ఆంకలన్ ముసాయిదా, గుర్తించిన లోటుపాట్లను పరిష్కరించే ప్రక్రియపై చర్చించారు. పారిశుధ్య కార్మికులను సత్కరించడం, స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయడం, ‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద మొక్కలు నాటడం, పారిశుధ్య మౌలిక వసతుల పరిశీలన వంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు.
· హర్యానా పల్వాల్ జిల్లాలోని పల్వాల్ బ్లాక్‌లోని రతీపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో డీడీడబ్ల్యూఎస్ డిప్యూటీ సెక్రటరీ పాల్గొన్నారు. ఈ పర్యటనలో మొక్కలు నాటే కార్యక్రమం, వ్యర్థాల వేరు చేసే షెడ్ పరిశీలన, స్వచ్ఛ సేవా ఆంకలన్, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026, స్థానిక పారిశుధ్య కార్యక్రమాలపై ప్రజలతో చర్చలు జరిగాయి.
· మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలోని ఫాండా బ్లాక్‌లోని ముగలియా హాట్, జిర్నియా గ్రామపంచాయతీల్లో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలకు డీడీడబ్ల్యూఎస్ అసిస్టెంట్ అడ్వైజర్ హాజరయ్యారు. గ్రామసభల సందర్భంగా పాల్గొన్నవారు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛతా హీ సేవా 2026, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026, స్వచ్ఛ సేవా ఆంకలన్‌పై చర్చించారు. ఈ పర్యటనలో మొక్కలు నాటే కార్యక్రమం, వ్యర్థాల విభజన కేంద్రం పరిశీలన కూడా చేపట్టారు.
****
(రిలీజ్ ఐడి: 2318662)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6