రాజ్యసభ సచివాలయం
టాంజానియాలో జరిగే 153వ ఐపీయూ మహాసభలకు భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించనున్న శ్రీ హరివంశ్
నాడు పోస్టు చేయడమైనది:
03 OCT 2026 12:56PM by PIB Hyderabad
న్యూఢిల్లీ, 2026 అక్టోబర్ 3: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ నాయకత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం 2026 అక్టోబర్ 5 నుంచి 9 వరకు టాంజానియా యునైటెడ్ రిపబ్లిక్‌లోని అరుషాలో జరగనున్న ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) 153వ అసెంబ్లీ, సంబంధిత సమావేశాల్లో పాల్గొనేందుకు బయలుదేరింది.
“అందరికీ సమ్మిళితత్వం, విశ్వాసం, అవకాశాల ద్వారా సుపరిపాలనను మెరుగుపరచడం, సమాజాలను సాధికారపరచడం” అనే ఇతివృత్తంపై జరిగే 153వ ఐపీయూ అసెంబ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంటేరియన్లు హాజరై చర్చలు నిర్వహించనున్నారు.
భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ (ప్రతినిధి బృందం నాయకుడు), లోక్‌సభ సభ్యులు శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, లోక్‌సభ ఎంపీ శ్రీమతి అపరాజిత సారంగి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సస్మిత్ పాత్ర, లోక్‌సభ ఎంపీ డాక్టర్ సంజయ్ జైస్వాల్, ఎంపీ శ్రీమతి కమల్‌జీత్ సెహ్రావత్, ఎంపీ డాక్టర్ లతా వాంఖడే, లోక్‌సభ ఎంపీ శ్రీమతి బిజులి కలితా మేధి, లోక్‌సభ ఎంపీ శ్రీ ఎన్‌కే ప్రేమచంద్రన్ ఉన్నారు.
ఈ ప్రతినిధి బృందం సమకాలీన ప్రపంచ ప్రాధాన్యత కలిగిన పలు అంశాలపై నిర్వహించే వివిధ సమావేశాలు, ప్యానెల్ చర్చలు, వర్క్‌షాప్‌లలో పాల్గొని, ఆయా అంశాలపై భారత్ దృక్పథాలను వెల్లడించనుంది.
పాలక మండలి, సాధారణ చర్చ, అత్యవసర అంశంపై చర్చ, ఐపీయూ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులతో నిర్వహించే సమావేశంలో శ్రీ హరివంశ్ పాల్గొంటారు.
భారత ప్రతినిధి బృందంలోని సభ్యులు ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి, అంతర్జాతీయ భద్రత, సుస్థిర అభివృద్ధి, మహిళల భాగస్వామ్యం, శాస్త్ర, సాంకేతికత, ఉగ్రవాద నిరోధం, ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధ, భవిష్తత్తు ఉపాధి, సముద్ర భద్రత, వాతావరణ మార్పు, పర్వతాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ తదితర అంశాలపై జరిగే చర్చల్లో పాల్గొంటారు.
భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం పాల్గొనడం ద్వారా ఐపీయూతో భారత్ కొనసాగిస్తున్న సన్నిహిత భాగస్వామ్యం, పార్లమెంటరీ దౌత్యం, బహుపాక్షిక చర్చలు, ప్రపంచ శాంతి, అభివృద్ధి, ప్రజాస్వామ్యం, సామాజిక సాధికారతకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్ల మధ్య సహకారం పట్ల భారత్ నిబద్ధత ప్రతిబింబిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2318639)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5