హోం మంత్రిత్వ శాఖ
మాదకద్రవ్యాల అక్రమ రవాణా కీలక సూత్రధారి నవ్‌ప్రీత్ సింగ్‌ను టర్కీ నుంచి బహిష్కరించేలా చేసి, కీలక చరిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసిన ఏజెన్సీలకు కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అభినందనలు
నవాబ్ విర్క్ పేరుతో నకిలీ గుర్తింపు ద్వారా టర్కీ పౌరసత్వం పొందిన నవ్‌ప్రీత్ సింగ్... అఫ్గానిస్తాన్ నుంచి భారత్‌కు హెరాయిన్, మెథాంఫెటమైన్ అక్రమ రవాణా
డ్రగ్స్ అక్రమ రవాణా, ఇతర నేరాల కేసులకు సంబంధించి భారత్‌కు తీసుకువచ్చి కారాగారంలో పెట్టిన అధికారులు
డిసెంబర్-2029 నాటికి మాదకద్రవ్యాల ముఠాలను అంతం చేసేందుకు కట్టుబడి ఉన్న మోదీ ప్రభుత్వం
2019 నుంచి ఆగస్టు 2026 వరకు 36 దేశాల నుంచి మొత్తం 288 మంది పరారీలో ఉన్న వ్యక్తులను తిరిగి తీసుకురావటంలో విజయం సాధించిన మోదీ ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
03 OCT 2026 12:18PM by PIB Hyderabad
మాదకద్రవ్యాల అక్రమ రవాణా కీలక సూత్రధారి నవ్‌ప్రీత్ సింగ్‌ను టర్కీ నుంచి భారత్‌కు రప్పించటంలో చరిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసిన భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అభినందించారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు. "నవాబ్ విర్క్ అనే నకిలీ పేరుతో టర్కీ పౌరసత్వాన్ని పొందిన నవ్‌ప్రీత్ సింగ్ కుట్రలను ఛేదించి, మోదీ ప్రభుత్వం చరిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. అతన్ని టర్కీ నుంచి బహిష్కరించేలా చేసి, భారత్‌కు రప్పించింది. నకిలీ గుర్తింపు ముసుగులో తలదాచుకున్న అతను, అఫ్ఘానిస్తాన్ నుంచి భారత్‌కు హెరాయిన్, మెథాంఫెటమైన్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నాడు. మన భద్రతా ఏజెన్సీలు అతడి అడుగుజాడలను పసిగట్టి, అసలు గుర్తింపును వెలికితీసి, అతను బహిష్కరణకు గురయ్యేలా చేశాయి. నేడు అతడిని భారత్‌కు రప్పించి డ్రగ్స్ అక్రమ రవాణా, ఇతర నేరాల కేసులకు సంబంధించి జైల్లో పెట్టారు. ఈ విజయం సాధించిన ఏజెన్సీలన్నింటికీ అభినందనలు. డిసెంబర్- 2029 నాటికి మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలను పూర్తిగా అంతం చేయటమే మోదీ ప్రభుత్వ లక్ష్యం" అని అన్నారు.
పరారైన నేరస్థులను దేశానికి రప్పించేందుకు మోదీ ప్రభుత్వం సమన్వయ ప్రచారాన్ని ప్రారంభించింది. 2019 నుంచి 2026 ఆగస్టు నాటికి మొత్తం 36 దేశాల నుంచి 288 మంది పరారైన నేరస్థులను భారత్‌కు రప్పించింది.
పరారైన నిందితులను వెనక్కి తీసుకువచ్చేందుకు గత ప్రభుత్వాలకు రాజకీయపరమైన శక్తి లేదు. నేరస్థుల అప్పగింతను 'జాతీయ ప్రాధాన్యత'గా మోదీ ప్రభుత్వం మార్చింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టికి అనుగుణంగా కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా... పరారైన నేరస్థులపై త్రిముఖ వ్యూహాలైన ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు, బలమైన సమన్వయం, క్రియాశీల దౌత్యనీతి గురించి వివరించారు. దేశ సార్వభౌమాధికారం, ఆర్థిక స్థిరత్వం, శాంతిభద్రతలు, జాతీయ భద్రతతో పరారైన నేరస్థుల సమస్య ముడిపడి ఉంటుందని శ్రీ అమిత్ షా అన్నారు.
2019లో ఎన్‌ఐఏ (సవరణ) చట్టం, యూఏపీఏ (సవరణ) చట్టాలను మోదీ ప్రభుత్వం ఆమోదించింది. దీనితో 2020 నుంచి పరారై విదేశాల్లో ఉన్న నిందితులను భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రత్యేక మిషన్‌గా చేపట్టింది. ఫలితంగా, చట్టవిరుద్ధమైన సంస్థలపై మాత్రమే నిఘాను పరిమితం చేయకుండా, విదేశాల్లో ఆశ్రయం పొందిన ఉగ్రవాదులు, హ్యాండ్లర్లు, నిధుల సేకరణ వ్యవస్థలు, వారికి సహకారం అందిస్తున్న వ్యవస్థల దిశగా చర్యల పరిధిని విస్తరించారు. ఇది పరారీలో ఉన్న వారిపై నిఘా పెట్టటంలో, వారి వ్యవస్థలను కూల్చివేయటంలో భారత్ సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేసింది.
భారత్, ప్రపంచ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థల మధ్య సమన్వయం, అనుసంధానం, సమాచార భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా 2025 జనవరిలో 'భారత్‌పోల్' ప్రారంభించారు. సీబీఐ, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయాలు (ఇంటర్‌పోల్ లైజన్ ఆఫీసర్లు - ఐఎల్‌ఓలు), జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాలను అనుసంధానించటం ద్వారా భారత్‌పోల్ సమగ్ర సమాచార మౌలిక సదుపాయాలను కల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర, కేంద్ర సంస్థలకు చెందిన 1,400లకు పైగా యూనిట్లు ఈ పోర్టల్‌తో అనుసంధానమయ్యాయి. తద్వారా సమాచారాన్ని సులభంగా సేకరించవచ్చు. ఫలితంగా సీబీఐ, ఇతర లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థల మధ్య సమాచార మార్పిడికి పట్టే సమయం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం సీబీఐ కోరిన సమాచారాన్ని ఇతర లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు సాధారణంగా 10 నుంచి 20 రోజుల్లోపు, కొన్ని సందర్భాల్లో 3 నుంచి 10 రోజుల్లోపు అందిస్తున్నాయి. ఇది విచారణలు, అప్పగింత సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరిచింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని (పీఎంఎల్‌ఏ) మోదీ ప్రభుత్వం మరింత కఠినంగా అమలు చేస్తోంది. దీనిద్వారా మోదీ ప్రభుత్వం 2019-2026 మధ్య కాలంలో పరారీలో ఉన్న నేరస్థులకు సంబంధించిన రూ. 17,874 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.
గత మూడేళ్లలో పరారీలో ఉన్న 401 మంది నేరస్థులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. జూలై 2026 నాటికి 182 రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.
***
(రిలీజ్ ఐడి: 2318627)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8