పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మరింత వేగంగా భారత కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగ అభివృద్ధ

గోబర్ధన్ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ

కొనుగోళ్లకు కచ్చితమైన హామీ, స్థిరమైన ధరలు, పెట్టుబడి సహాయం, పైప్‌లైన్ అనుసంధానం, రుణాల మద్దతు, వ్యవస్థాగత అభివృద్ధిని ఒకే గొడుగు కిందకు తేనున్న సమగ్ర కేంద్ర ప్రభుత్వ రంగ పథకం

పథకం అమలు సులభంగా, పారదర్శకంగా జరిగేందుకు మద్దతుగా గోబర్ధన్ హ్యాండ్‌బుక్ ఆవిష్కరణ... ఏకీకృత గోబర్ధన్ పోర్టల్ ప్రారంభం...

నాడు పోస్టు చేయడమైనది: 01 OCT 2026 8:27PM by PIB Hyderabad

కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) రంగాన్ని పటిష్ఠం చేసేందుకు ఉద్దేశించిన కేంద్ర రంగ పథకం 'గోబర్ధన్'ను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు.

 

కేంద్ర క్యాబినెట్ 2026 ఆగస్టు 6న రూ. 23,731 కోట్ల భారీ వ్యయంతో ఆమోదించిన ఈ పథకం... దేశంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి ఆర్థిక సంవత్సరం 2026–27 నుంచి 2035–36 వరకు పదేళ్ల సుదీర్ఘ విధాన ప్రణాళికను అందిస్తుంది. ఈ దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుబడిదారులకు, రుణాలిచ్చే బ్యాంకులకు భరోసానిస్తుంది. దేశీయ బయోగ్యాస్ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు (సుమారు 5 ఎంఎంఎస్‌సీఎండీకి) పెంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.

 

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగానికి చెందిన కీలక భాగస్వాములంతా ఒకే వేదికపైకి వచ్చారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు సీబీజీ డెవలపర్లు, ఆయిల్-గ్యాస్ కంపెనీలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, ఆర్థిక సంస్థలు, సహకార సంఘాలు, సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఈ ప్రారంభోత్సవంలో భాగంగా భాగస్వాములు, ప్రాజెక్ట్ డెవలపర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలకు పథకంపై సంపూర్ణ అవగాహన కల్పించే సమగ్ర మార్గదర్శిని 'గోబర్ధన్ హ్యాండ్‌బుక్'ను ఆవిష్కరించారు. దరఖాస్తు ప్రక్రియను సరళతరం చేయడానికి, వివిధ విభాగాల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా చేయడానికి, పథకం అమలులో పారదర్శకతను పెంపొందించడానికి ఏకైక కేంద్రీకృత డిజిటల్ ప్లాట్‌ఫారమ్ 'ఏకీకృత గోబర్ధన్ పోర్టల్'నూ ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ మాట్లాడుతూ... పెరుగుతున్న భారత ఇంధన అవసరాలను తీర్చడానికి స్వదేశంలో లభించే ఇంధన వనరులను మరింత ఎక్కువగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో ఇంధన లభ్యత, అందరికీ అందుబాటులో ఉండే ధరలు, పర్యావరణ స్థిరత్వం అనే మూడు ప్రధాన లక్ష్యాలను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు.

భారత సీబీజీ రంగం ఎంతో కీలకమైనదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పంట వ్యర్థాలు, పశువుల పేడ, ఇతర సేంద్రీయ వనరులను స్వదేశీ పరిశుద్ధ ఇంధనంగా మార్చడమే కాకుండా... నాణ్యమైన సేంద్రీయ ఎరువుల ఉత్పత్తికి, గ్రామీణ ప్రాంతాల్లో సరికొత్త ఆర్థిక అవకాశాల సృష్టికీ ఇది తోడ్పడుతుందని ఆయన వివరించారు. ముడి పదార్థాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్ వంటి అన్ని దశల్లో రైతులు, సహకార సంఘాలు, గోశాలలు, స్థానిక పరిశ్రమలు భాగస్వాములు కావడం ద్వారా వ్యవసాయం, ఇంధన రంగాల మధ్య పరస్పర అనుసంధానం మరింత బలోపేతమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

 

ఈ వినూత్న విధాన ప్రణాళికను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా... క్షేత్రస్థాయిలో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు, నిరంతర ఇంధన ఉత్పత్తి కోసం వినియోగించుకోవాలని పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సహకార సంఘాలు, సాంకేతిక నిపుణులకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. తద్వారా భారత ఇంధన భద్రతను, గ్రామీణ సంపదనూ పెంపొందించాలన్నారు. 'వ్యర్థాల నుంచి సంపద', 'అన్నదాత నుంచి ఇంధన ప్రదాత' అనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేయడంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కోరారు.

 

పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ... భారత్ ప్రస్తుతం తన సహజ వాయువు అవసరాల్లో దాదాపు సగానికి పైగా ఇతర దేశాల నుంచి దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోందని గుర్తుచేశారు. ఈ తరుణంలో, మన దేశంలో లభించే సేంద్రీయ వ్యర్థాలను స్వదేశీ గ్యాస్ వనరుగా మార్చుకోవడానికి కంప్రెస్డ్ బయోగ్యాస్ అద్భుత అవకాశాన్ని కల్పిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

 

ఈ రంగానికి సంబంధించిన గత అనుభవాలు.. ఆదాయంలో అస్థిరత, అరకొర మద్దతు, దీర్ఘకాలిక విధానాలపై స్పష్టత లేకపోవడం వంటి సమస్యలను ఎత్తిచూపాయని డాక్టర్ నీరజ్ మిట్టల్ పేర్కొన్నారు. ముడిపదార్థాల లభ్యతపై నమ్మకం లేకపోవడం, సేంద్రీయ ఎరువుల విక్రయాలు, పెట్టుబడులు, రుణాలను సాధించడంలో ఉన్న ఇబ్బందులనూ ఆయన గుర్తుచేశారు. ఈ సవాళ్లన్నింటికీ 'గోబర్ధన్' పథకం సంపూర్ణ పరిష్కారం చూపుతుందని ఆయన స్పష్టం చేశారు. దీనికి పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ ఏకైక నోడల్ మంత్రిత్వశాఖగా వ్యవహరిస్తుందని డాక్టర్ మిట్టల్ తెలిపారు. ముందుగానే అంచనా వేయగల స్థిరమైన ధరలు, గ్యాస్ కొనుగోలుకు బలమైన భరోసా లభిస్తాయన్నారు. పెంచిన పెట్టుబడి సహాయం, ఏకీకృత ప్రక్రియలు, పూర్తి స్థాయి డిజిటల్ పర్యవేక్షణ వంటి సదుపాయాలూ అందుబాటులోకి వస్తాయని డాక్టర్ మిట్టల్ వివరించారు.

జాతీయ స్థాయి ప్రణాళికలను క్షేత్రస్థాయిలో విజయవంతమైన ప్రాజెక్టులుగా మార్చడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఎంతో కీలకమైనదని డాక్టర్ నీరజ్ మిట్టల్ స్పష్టం చేశారు. రాష్ట్రాల స్థాయిలో అనుకూలమైన సీబీజీ విధానాలను రూపొందించడం, ముడి పదార్థాల లభ్యతను అంచనా వేయడం, తగిన భూ బ్యాంకులను సిద్ధం చేయడం, ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేయడం, అవసరమైన మౌలిక సదుపాయాల మద్దతును అందించడం ద్వారా రాష్ట్రాలు ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు.

 

సీబీజీ రంగం కోసం సమగ్ర విధాన ప్రణాళిక

 

ఈ సదస్సులో 'గోబర్ధన్' గురించిన ప్రెజెంటేషన్ ద్వారా ఈ పథకాన్ని రూపొందించిన తీరును... ఇప్పటివరకు విడివిడిగా ఉన్న వివిధ రకాల చిన్న చిన్న కార్యక్రమాలను పక్కన పెట్టి, ఈ రంగాన్ని ఒకే సమగ్ర విధాన ప్రణాళిక కిందకి తీసుకువస్తున్న విధానాన్నీ స్పష్టంగా వివరించారు. సీబీజీ కొనుగోలుకు హామీ, సీబీజీ ధరల కోసం విధాన ప్రణాళిక, మూలధన సహాయం, పైప్‌లైన్ మౌలికవసతుల అభివృద్ధి, క్రెడిట్ గ్యారంటీ మద్దతు, సీబీజీ ఎకోసిస్టమ్ ఛాలెండ్ ఫండ్ వంటి ఆరు సదుపాయాలను ఈ గోబర్ధన్ పథకంలో చేర్చారు.

 

ఈ కొనుగోలు ఒప్పంద విధివిధానాల కింద, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను నిర్దేశిత సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ భౌగోళిక ప్రాంతాలతో లేదా ప్రత్యేక సీబీజీ క్లస్టర్లతో అనుసంధానం చేస్తారు. తద్వారా ఉత్పత్తి అయిన గ్యాస్‌ను అమ్ముకోవడానికి ఒక నమ్మకమైన మార్కెట్ సౌకర్యం లభిస్తుంది. 'సీబీజీ అబ్లిగేషన్' నిబంధనల ప్రకారం... ఈ బయోగ్యాస్‌ను కొనుగోలు చేయాల్సిన పూర్తి బాధ్యత సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలపైనే ఉంటుంది. ఈ సంస్థలు రవాణా రంగంలో వాడే సీఎన్‌జీ, గృహ అవసరాలకు వినియోగించే పీఎన్‌జీ విభాగాల్లో... ఆర్థిక సంవత్సరం 2026–27లో 3 శాతం, ఆర్థిక సంవత్సరం 2027–28లో 4 శాతం, ఆర్థిక సంవత్సరం 2028–29 నుంచి 5 శాతం చొప్పున బయోగ్యాస్‌ను కచ్చితంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

 

ఈ పథకం ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిదారులకు నమ్మకమైన ఆదాయం లభించేందుకు వీలుగా ప్రభుత్వం నిర్ణయించిన స్థిర ధరగా ప్రతీ ఎంఎంబీటీయూ (మిలియన్ మెట్రిక్ బ్రిటిష్ థర్మల్ యూనిట్)కు రూ. 2,110 చొప్పున చెల్లిస్తారు. ఈ పథకానికి అర్హతగల గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులు, ప్లాంట్ యంత్రాలు, ఫీడ్‌స్టాక్ సమీకరణ, ఎఫ్‌వోఎమ్/ఎల్ఎఫ్‌వోఎమ్ ప్రాసెసింగ్, ఎరువుల విలువ జోడింపు పరికరాల కోసం మద్దతు సహా.. ఏర్పాటు చేసిన ప్రతి సీబీజీ సామర్థ్యం కోసం ప్రతి టీపీడీకి గరిష్టంగా రూ. 2 కోట్ల వరకు పెట్టుబడి సహాయాన్నీ అందిస్తారు.

 

గ్యాస్ రవాణా, సరఫరాలో తలెత్తే ఇబ్బందులను అధిగమించడం కోసం, సీబీజీ క్లస్టర్లను ప్రధాన ట్రంక్ పైప్‌లైన్ నెట్‌వర్క్‌లతో అనుసంధానించే పైప్‌లైన్ల నిర్మాణానికి అయ్యే అర్హత గల పెట్టుబడి వ్యయంలో గరిష్టంగా 80 శాతం వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. స్వతంత్రంగా ఉన్న ప్లాంట్లను సీజీడీ నెట్‌వర్క్‌లతో అనుసంధానించే పైప్‌లైన్ల ఏర్పాటుకు 50 శాతం వరకు ఆర్థిక సహాయాన్ని ఈ పథకం ద్వారా అందిస్తారు.

 

ఈ పథకం కింద అర్హత కలిగిన ఎంఎస్ఎంఈ ఆధారిత సీబీజీ ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా క్రెడిట్ గ్యారెంటీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా లోన్ తిరిగి చెల్లించని పక్షంలో నిర్దేశిత ప్రాజెక్ట్ పరిమితులకు లోబడి బకాయి ఉన్న మొత్తంలో గరిష్టంగా 85 శాతం వరకు రుణ భరోసాను ప్రభుత్వం కల్పిస్తుంది. సాధారణ ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుల విషయంలో ప్రతీ ప్రాజెక్టుకు గరిష్టంగా రూ. 20 కోట్ల వరకు, మహిళల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుల విషయంలో ప్రతీ ప్రాజెక్టుకు గరిష్టంగా రూ. 25 కోట్ల వరకు ఈ రుణ గ్యారెంటీ పరిమితి వర్తిస్తుంది. ఇది సీబీజీ రంగంలోకి వచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు మరింత ఊతమిచ్చేలా అదనపు మద్దతునూ అందిస్తుంది.

ఈ పథకం కింద ఏర్పాటు చేసిన 'సీబీజీ ఎకోసిస్టమ్ ఛాలెంజ్ ఫండ్' సరికొత్త సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి, మానవ వనరుల సామర్థ్యాల మెరుగుదలకు, ముడిపదార్థాల లభ్యత అంచనా, సేకరణకూ తోడ్పడుతుంది. జిల్లా స్థాయిల్లో బయోగ్యాస్ వ్యవస్థాగత అభివృద్ధికి, ప్లాంట్ల నుంచి వచ్చే సేంద్రీయ ఎరువుల నాణ్యతను మెరుగుపరచి వాటికి అదనపు విలువను చేకూర్చడానికీ ఈ ప్రత్యేక నిధి సహాయం అందిస్తుంది.

 

భారత సీబీజీ రంగం భవిష్యత్తు వృద్ధికి ఇప్పటికే బలమైన పునాది వేసింది. దీని ప్రకారం 2026 ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 217కు పైగా బయోగ్యాస్ ప్లాంట్లను ప్రారంభించారు. వాటి మొత్తం ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 1,700 టన్నుల (టీపీడీ) కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ సమగ్ర పథకం... దాని పదేళ్ల అమలు కాలంలో దేశీయ బయోగ్యాస్ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

 

ఈ పథకం ద్వారా దేశానికి భారీ ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలు చేకూరనున్నాయి. దీని వల్ల దేశానికి రూ. 40,000 కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా, జీడీపీకి రూ. 75,000 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరనుంది. 1.5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలూ లభించనున్నాయి. పర్యావరణ పరంగా 10 మిలియన్ టన్నుల శిలాజ ఇంధనాల స్థానంలో స్వచ్ఛమైన గ్యాస్ అందుబాటులోకి రానుంది. కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు 40 మిలియన్ టన్నులకు పైగా తగ్గనున్నాయి. 250 మిలియన్ టన్నుల సేంద్రీయ ఎరువుల ఉత్పత్తికీ ఈ పథకం ఎంతగానో దోహదపడనుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2318343) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Assamese , Bengali , Gujarati , Tamil