సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఐఐఎమ్‌సీలో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యకలాపాల్లో పాలుపంచుకున్న కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్
స్వచ్ఛత ప్రతిజ్ఞ పాఠాన్ని చదివించిన మంత్రి..
మొక్కలు నాటే కార్యక్రమం, శ్రమదానంలో పాలుపంచుకున్న మంత్రి
సంస్థలు, బహిరంగ స్థలాల్లో పరిశుభ్రత కార్యక్రమాల్లో తోడ్పడాల్సిందిగా విద్యార్థులకు, అధికారులకు పిలుపునిచ్చిన మంత్రి
ఐఐఎమ్‌సీ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమాలు ఉమ్మడి బాధ్యత భావనకు అద్దం పట్టాయి
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2026 4:09PM by PIB Hyderabad
‘స్వచ్ఛతా హీ సేవా’ ప్రచార ఉద్యమంలో భాగంగా న్యూఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎమ్‌సీ)లో నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో కేంద్ర సమాచార, ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ పాల్గొన్నారు.
విద్యార్థులను, అధికారులను, సిబ్బందిని ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. స్వచ్ఛత పరిరక్షణను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో ‘స్వచ్ఛ్ భారత్ ఉద్యమా’న్ని 2014లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారని మంత్రి గుర్తు చేశారు.
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2014లో ‘స్వచ్ఛ్ భారత్ ఉద్యమా’న్ని ప్రారంభించిన తరువాత, దేశం నలు మూలలా ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్తులయ్యారు. కార్యాలయాల్లో, సంస్థల్లో పరిశుభ్రత పరిరక్షణ కార్యకలాపాలను చేపట్టారు. ఈ రోజు ఐఐఎమ్‌సీలో అధికారులు, విద్యార్థులతో పాటు స్వచ్ఛత ప్రతిజ్ఞ స్వీకరించాను. మనం సాధ్యమైన చోట్లల్లా.. అంగన్‌వాడీలు, దేవాలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ స్థలాల్లోనూ స్వచ్ఛత సేవా కార్యక్రమానికి తోడ్పాటును అందించాలి. స్వచ్ఛతా ప్రచారం ఉద్యమాన్ని సెప్టెంబర్ 17 నుంచి ముందుకు తీసుకుపోతున్నాం. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను శుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత’’ అని మంత్రి అన్నారు.
స్వచ్ఛత ప్రతిజ్ఞను స్వీకరించడంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులే కాకుండా శిక్షణలో ఉన్నఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరిట మొక్కను నాటే కార్యక్రమం)లోనూ మంత్రి పాల్గొన్నారు. ఐఐఎమ్‌సీ పరిసరాల్లో ఒక మొక్కను ఆయన నాటి నీరు పోశారు. విద్యార్థులతో మంత్రి మాట్లాడారు. మొక్కలను నాటడమే కాక వాటిని నిరంతరం సంరక్షించడానికి కూడా శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఉద్బోధించారు.
కార్యక్రమంలో భాగంగా, మంత్రి ఐఐఎమ్‌సీలో విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, తదితరులతో కలిసి గంట సేపు శ్రమదానంలో పాల్గొన్నారు. చెత్తను ఎత్తి పారబోయడం, నిర్మాణ వ్యర్థాలను తొలగించడం వంటి పనులు పూర్తి చేశారు.
పర్యటనలో భాగంగా మంత్రి.. ఇటీవలే నిర్మాణం పూర్తి అయిన తరగతి గదులతో పాటు టీచింగ్ బ్లాకు వంటి విద్యాబోధనకు సంబంధించిన ఇతర మౌలిక సదుపాయాలను, నవీకరించిన గ్రంథాలయ భవనాన్ని, నిర్మాణంలో ఉన్న వసతిగృహాన్ని పరిశీలించారు. సంస్థలో వివిధ రాష్ట్రాల విద్యార్థులతోను, వివిధ విభాగాల వారితోను ఆయన మాట్లాడారు.
ఐఐఎమ్‌సీ సంస్థాగత నాయకత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి ప్రశంసించారు. మరీముఖ్యంగా స్వచ్ఛత, పర్యావరణ చైతన్యం, క్యాంపస్ అభివృద్ధి, విద్యార్థుల భాగస్వామ్యం బాగున్నాయన్నారు.
ఐఐఎమ్‌సీ వైస్-చాన్స్‌లర్ డాక్టర్ ప్రజ్ఞ పాలీవాల్ గౌర్, రిజిస్ట్రార్, డీజీ ట్రయినింగ్ శ్రీ ఎల్. మధు నాగ్, సీనియర్ ఎకనామిక్ అడ్వయిజర్ శ్రీ ఆర్.కె. జేనాలతో పాటు అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, సంస్థలో శిక్షణ పొందుతున్న అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘స్వచ్ఛతా హీ సేవా’ ప్రచార ఉద్యమంలో భాగంగా ఐఐఎమ్‌సీ నిర్వహిస్తున్న కార్యకలాపాల్లో ఈ కార్యక్రమం ఓ భాగంగా ఉంది. దీంతో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, బాధ్యతాయుత పౌరసత్వం అంశాల్లో సామూహిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు
****
(రిలీజ్ ఐడి: 2318137)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11