ఆయుష్
వేగంగా వృద్ధి చెందుతున్న సేవారంగాల్లో ఒకటిగా ఆయుష్ ఆవిర్భావం: 36.92 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆర్ఐఎస్ అధ్యయనం అంచనా
ఆర్థిక సంవత్సరం 23 నుంచి 16.91 శాతం సీఏజీఆర్ నమోదు చేసిన ఆయుష్ సేవల రంగం
1.76 మిలియన్ల మందికి జీవనోపాధి, 1.77 బిలియన్ అమెరికన్ డాలర్ల వైద్య విలువ ఆధారిత పర్యాటక ఆదాయం
వికసిత్ భారత్ సాధనలో ప్రధాన భాగస్వామిగా ఆవిర్భవిస్తూ... 2047 నాటికి 216 బిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 318 బిలియన్ అమెరికన్ డాలర్లకు ఆయుష్ సేవల రంగం చేరుకుంటుందని అంచనా
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2026 12:38PM by PIB Hyderabad
అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం పరిశోధన సమాచార వ్యవస్థ (ఆర్ఐఎస్) చేపట్టిన తాజా అధ్యయనం ప్రకారం భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సేవారంగాల్లో ఒకటిగా ఆయుష్ ఆవిర్భవించింది. ఆర్థిక సంవత్సరం 2024-25లో దీని ఆర్థిక పరిమాణం 36.92 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం 2022-23 నుంచి 16.91 శాతం సీఏజీఆర్‌ను ఈ రంగం నమోదు చేసింది. ఆరోగ్యసేవలు, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి కల్పన, వైద్య విలువ ఆధారిత పర్యాటకం ద్వారా భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ఈ రంగం వాటా పెరుగుతోంది. 2047 నాటికి ఆయుష్ సేవల ఆర్థికవ్యవస్థ 216 బిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 318 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దోహదపడటంలో ఈ రంగానికున్న అపారమైన సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తోంది. సెప్టెంబర్ 23న నాగపూర్‌లో జరిగిన 11వ ఆయుర్వేద దినోత్సవాల్లో ఈ నివేదికను అధికారికంగా విడుదల చేశారు.
ఆయుష్ రంగానికి ఉన్న ఆర్థిక సామర్థ్యాన్ని గుర్తించడంలో ఈ అధ్యయన ఫలితాలు ముఖ్యమైన మైలురాయిని సూచిస్తున్నాయని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్ అన్నారు. ‘‘ఆయుష్ కేవలం సాంస్కృతిక వారసత్వం మాత్రమే కాదని, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన వృద్ధి చోదకమని ఈ అధ్యయనం ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఆరోగ్యసేవలు, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి కల్పన, ప్రపంచ ఆర్థిక భాగస్వామ్యంలో ఆయుష్ రంగం ముఖ్యమైన పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉంది. అదే సమయంలో ఆరోగ్యకరమైన, ఆత్మనిర్భర భారత్ అనే మన లక్ష్యానికి తోడ్పాటునందిస్తోంది’’ అని మంత్రి అన్నారు.
‘‘అన్ని ప్రధాన ఆయుష్ వ్యవస్థల్లోనూ... సంస్థాగత ప్రాతిపదికన దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వే ద్వారా ఆయుష్ సేవల రంగం అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని తొలిసారి లెక్కించారు’’ అని ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా తెలిపారు. భవిష్యత్ పెట్టుబడులు, విధాన ప్రణాళిక, సంస్కరణలకు మార్గనిర్దేశం చేసే బలమైన ఆధారంగా ఈ నివేదిక నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘భారతదేశ ఆయుష్ సేవల ఆర్థిక వ్యవస్థపై సాక్ష్యం ఆధారిత అవగాహనను అందించడంలో ఈ అధ్యయనం కీలకంగా నిలుస్తుంది. మొత్తం ఆరు ఆయుష్ వ్యవస్థల్లో ఉన్న 15,914 సంస్థలపై జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వే ఆధారంగా చేపట్టిన ఈ అధ్యయనం ఫలితాలు... ఈ ఆర్థిక వ్యవస్థ విలువ 36.92 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుందని తెలియజేస్తున్నాయి. అలాగే ప్రతి ఏటా దాదాపు 17 శాతం వృద్ధిని సాధిస్తూ, 1.76 మిలియన్ల మందికి జీవనోపాధిని కల్పిస్తోందని తెలియజేస్తున్నాయి. అలాగే ఈ రంగం ఇకపై అప్రాధాన్య రంగం కాదు. అభివృద్ధి చెందుతున్న, జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ’’ అని ఆర్ఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ సచిన్ కుమార్ శర్మ తెలియజేశారు.
ఆర్థిక సంవత్సరం 25లో ఆయుష్ సేవల ఆర్థిక వ్యవస్థ విలువ 36.92 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఈ అధ్యయనం అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం 23 నుంచి సమగ్ర వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 16.91 శాతం నమోదు చేసింది. వ్యవస్థీకృత ఆరోగ్య సేవల పంపిణీ, ఆరోగ్య సంరక్షణ సేవలు, నాణ్యమైన మౌలికవసతులు, అంతర్జాతీయ ప్రచారం ద్వారా మరింత విస్తరించేందుకు గణనీయ అవకాశం ఉన్న, భారతీయ సేవా ఆర్థికరంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంగా ఆయుష్ సేవలు ఆవిర్భవించాయని ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి.
ఆయుష్ సేవల ఆర్థికరంగంలో క్లినిక్‌లు, డేకేర్ సెంటర్లు ప్రధాన భాగంగా ఉన్నాయని ఈ అధ్యయనం తెలియజేస్తోంది. ఈ రెండింటికీ ఈ రంగం మొత్తం ఆదాయంలో 71 శాతానికి పైగా వాటా ఉంది. క్లినిక్‌ల నుంచి 16.21 బిలియన్ అమెరికన్ డాలర్లు, డేకేర్ సెంటర్ల నుంచి 10.13 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయం వచ్చింది. ఈ రంగంలో అత్యంత ఎక్కువ ఆదాయం ఆర్జించిన విభాగంగా ఆయుర్వేదం నిలిచింది. ఈ రంగం మొత్తం ఆదాయంలో 17.73 బిలియన్ అమెరికన్ డాలర్లు లేదా సుమారుగా 48 శాతం వాటాను ఆయుర్వేద విభాగం నమోదు చేసింది.
ఆయుష్ ఆధారిత సేవలను అందించే యోగా సెంటర్లు, స్పాలు, రిసార్టులతో సహా ఆయుష్ వెల్‌నెస్ విభాగానికి గణనీయ స్థాయిలో పెరుగుతున్న ఆర్థిక భాగస్వామ్యాన్ని కూడా ఈ నివేదిక తెలియజేస్తోంది. ఈ విభాగం 21.29 శాతం సీఏజీఆర్‌ను నమోదు చేసింది. గడచిన రెండేళ్లలో ఆదాయంలో సుమారు 75 శాతం వృద్ధిని యోగా కేంద్రాలు నమోదు చేశాయి. ఇది నివారణ ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ, సమగ్ర సంరక్షణ సేవలకు పెరుగుతున్న డిమాండును ప్రతిబింబిస్తోంది.
ఆయుష్ సేవల రంగం ముఖ్యమైన ఉపాధి వనరుగా ఆవిర్భవించిందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ రంగం 1.76 మిలియన్ల మందికి ప్రత్యక్ష జీవనోపాధికి తోడ్పాటును అందిస్తోంది. వీటిలో ఒక మిలియన్‌కు పైగా ఉద్యోగాలు స్థానిక, ప్రత్యేక క్లినిక్‌ల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఆయుష్ సేవల సిబ్బందిలో 43 శాతం మహిళలే ఉన్నారు. అనేక వ్యవస్థీకృత విభాగాల్లో మహిళల భాగస్వామ్యం 50 శాతానికి పైగా ఉంది. ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో (స్పాలు, రిసార్టులు) 60 శాతానికి పైగా, విద్యా సంస్థల్లో 58 శాతం, డేకేర్ సెంటర్లలో 57 శాతం, ఆసుపత్రుల్లో 53 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారు.
వైద్య విలువ ఆధారిత పర్యాటకం(ఎంవీటీ)లో పెరుగుతున్న ఆయుష్ సామర్థ్యాన్ని ఈ అధ్యయనం తెలియజేస్తోంది. ఆర్థిక సంవత్సరం 25లో 1.77 బిలియన్ అమెరికన్ డాలర్ల ఎంవీటీ ఆదాయాన్ని ఈ రంగం నమోదు చేసింది. మొత్తం రోగుల సంఖ్యలో విదేశీయుల సంఖ్య సుమారుగా 5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ వీరి వాటా ఆసుపత్రుల ఆదాయంలో 15 నుంచి 25 శాతంగా ఉంది. పంచకర్మ, రెసిడెన్షియల్ యోగాతో సహా ఆయుష్ అందిస్తున్న చికిత్సా కార్యక్రమాల్లో రోగులు ఎక్కువ కాలం బస చేస్తున్నారని అధ్యయనం గుర్తించింది. ఈ సగటు కాలం 5 నుంచి 11రోజులుగా ఉందని పేర్కొంది.
అంతర్జాతీయంగా రోగులను ఆకర్షించడంలో డిజిటల్ ప్రచారం, నాణ్యత గుర్తింపు కీలకంగా మారాయి. అధ్యయనం ప్రకారం, ప్రత్యేకంగా వెబ్‌సైట్ నిర్వహిస్తున్న సంస్థలు 3.6 రెట్లు ఎక్కువగా విదేశీ రోగులను ఆకర్షించే అవకాశాలున్నాయి. అలాగే ఎన్ఏబీహెచ్, ఐఎస్‌వో లాంటి గుర్తింపు పొందిన నాణ్యతా ధ్రువీకరణ ఉంటే ఈ అవకాశాలు రెట్టింపు అవుతాయని అధ్యయనం తెలియజేస్తోంది.
వికసిత్ భారత్-2047 లక్ష్యం దిశగా దేశం ముందడుగు వేస్తున్న తరుణంలో ఈ రంగం గణనీయమైన వృద్ధిని సాధించే అవకాశం ఉందని అధ్యయనం అంచనా వేసింది. మౌలికవసతులను, నాణ్యతా వ్యవస్థలను, నైపుణ్యాలను, డిజిటల్ సామర్థ్యాలను, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను బలోపేతం చేయడంపై ఆధారపడి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 36.92 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయుష్ సేవల ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 216 బిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 318 బిలియన్ అమెరికన్ డాలర్లకు విస్తరించే అవకాశం ఉంది.
ఆయుష్ విజ్ఞాన వ్యవస్థ, వ్యాపార సంస్థలు-వ్యవస్థాగత సామర్థ్యాలు, ప్రపంచ స్థాయి పోటీతత్వం-విలువ ఆధారిత వైద్య పర్యాటకం, డిజిటల్ సాంకేతికతలు-కృత్రిమ మేధ ద్వారా చేపట్టే ఆవిష్కరణలు అనే నాలుగు ప్రధానాంశాలపై ఆధారపడిన వ్యూహాత్మక విశ్లేషణను ఈ అధ్యయనం అందిస్తుంది. ఇది విస్తృతమైన నాణ్యతా గుర్తింపు, డిజిటల్ ఆరోగ్య రికార్డులు, సిబ్బంది నైపుణ్యాలు, అంతర్జాతీయ సన్నద్ధత, నూతన సాంకేతిక పరిజ్ఞానాల బాధ్యతాయుతమైన వినియోగానికి ఉన్న ఆవశ్యకతను ఇది తెలియజేస్తుంది.
ఆయుష్ కేవలం ఆరోగ్య సేవలు, ఆరోగ్య, సంరక్షణ వ్యవస్థగానే కాకుండా ఉపాధి కల్పన, ఔత్సాహిక పారిశ్రామిక, సేవా ఆధారిత ఆర్థిక వృద్ధిలో భాగస్వామిగా ఎదుగుతోందని ఈ అధ్యయన ఫలితాలు స్పష్టం చేశాయి. సంప్రదాయ, అనుబంధ వైద్య రంగంలో ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలు బలోపేతం కావడంలో కూడా విస్తరిస్తున్న ఆయుష్ పాత్రను ఇవి పునరుద్ఘాటించాయి.
విస్తరిస్తున్న ఆయుష్ సేవల వ్యవస్థపై సాక్ష్యం ఆధారిత మదింపును ఆర్ఐఎస్ అధ్యయనం అందిస్తుంది. భవిష్యత్తులో భారతదేశ వైద్యం, ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి ప్రాధాన్యాలకు ఈ రంగం అందించే తోడ్పాటును మరింత బలోపేతం చేసేందుకు గల అవకాశాలను కూడా ఇది గుర్తించింది.
***
(రిలీజ్ ఐడి: 2317396)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7