ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉజ్బెకిస్తాన్.. కిర్గిజ్ రిపబ్లిక్‌ పర్యటనకు బయల్దేరిన నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 29 AUG 2026 8:45AM by PIB Hyderabad

   ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్‌లలో సెప్టెంబరు 1వ తేదీ వరకూ పర్యటించేందుకు నేనివాళ బయల్దేరాను. ఇందులో భాగంగా ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షుడు షవ్‌కత్ మీర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ఈ నెల 29, 30 తేదీలలో తాష్కెంట్‌ను సందర్శిస్తాను. ఇటీవలి కాలంలో భారత్-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం గణనీయ ప్రగతి సాధించింది. వాణిజ్యం-పెట్టుబడులు, డిజిటల్ సంధానం, రక్షణ, ఇంధన రంగాల్లో మా సహకార విస్తృతి, ‘వికసిత భారత్’, ‘యాంగీ ఉజ్బెకిస్తాన్’ సంయుక్త ఆకాంక్షలను నెరవేర్చడం కూడా ఈ పర్యటనలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఈ ఉమ్మడి సంకల్పంపై అధ్యక్షుడు మీర్జియోయెవ్‌తో చర్చలకు నేను సిద్ధమయ్యాను. రెండు దేశాలను పెనవేసే సన్నిహిత సాంస్కృతిక, ప్రజా సంబంధాలకు ‘తాష్కెంట్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌’ ఒక నిదర్శనం. ఈ మేరకు అక్కడి శాస్త్రి మెమోరియల్, మహాత్మా గాంధీ సెంటర్‌ను కూడా నేను సందర్శిస్తాను.

తాష్కెంట్‌ పర్యటన అనంతరం కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవనీయ శ్రీ సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో నేను పర్యటిస్తాను. ప్రపంచంలో కీలక ప్రాధాన్యం గల షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)కు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బిష్కెక్ నగరంలో నిర్వహించే 26వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు నేను వెళ్తాను. భారత్‌ 2017 నుంచి ‘ఎస్‌సీఓ’లో చురుకైన-ప్రగతిశీల పాత్ర పోషించే దేశంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భద్రత, అనుసంధానం, అవకాశాలపై ఆధారపడిన ఈ ప్రాంతం కోసం భారత దృక్కోణం అమలుకు నేను కృషి చేస్తాను. అలాగే, పొరుగు దేశాల్లోనే కాకుండా ఆ పరిధికి మించి ఇతర దేశాల్లోనూ శాంతి, స్థిరత్వాలను దెబ్బతీసే ప్రతికూల శక్తులపై పోరుకు భారత్‌ తనవంతు ప్రయత్నాలు చేస్తుంది. తదనుగుణంగా ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాదం వంటి మహమ్మారుల నుంచి విముక్తి దిశగా సభ్యదేశాలతో సమష్టిగా శక్తివంచన లేకుండా పనిచేస్తాం.

ఈ పర్యటనలో అధ్యక్షుడు జపరోవ్‌తోపాటు ‘ఎస్‌సీఓ’ నాయకులతో సమావేశం కావడానికి నేనెంతో ఆసక్తితో ఉన్నాను. మరోవైపు భారత్‌ ఎంతగానో గౌరవించే మధ్యాసియా చైతన్యపూరిత వారసత్వ వేడుక ‘6వ ప్రపంచ సంచార క్రీడల’ ప్రారంభోత్సవంలో అంతే ఉత్సాహంతో పాలుపంచుకుంటాను.

మధ్యాసియాలో భారత వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఈ పర్యటన బలోపేతం చేస్తుందని, ఈ ప్రాంతంతో మన నాగరిక సంబంధాన్ని మరింత విస్తృతం చేయగలదని నేను ఆశిస్తున్నాను. ప్రపంచంతో భారత్‌ సంబంధాలకు మూలస్తంభాలైన శాంతి, స్థిరత్వం, సౌభాగ్యం దిశగా మా ఉమ్మడి లక్ష్య సాధనలో ముందంజ వేయగలమని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.

 

***


(రిలీజ్ ఐడి: 2316859) సందర్శకుల సూచీ సంఖ్య : : 19