జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వరల్డ్‌స్కిల్స్ షాంఘై 2026లో రెండు రజతాలు,

ఒక ప్రావీణ్య పతకంతో సత్తా చాటిన ఎన్ఐఎఫ్‌టీ విద్యార్థులు

ఫ్యాషన్ సాంకేతికత, డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్, రిటైల్ అమ్మకాలు, విజువల్ మర్కండైజింగ్‌లో రాణించిన ఎన్ఐఓఫ్‌టీ

వరల్డ్‌స్కిల్స్ 2026తో ఎన్ఐఓఫ్‌టీ భాగస్వామ్యం.. ప్రపంచ ప్రమాణాలు, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల దిశగా అడుగులు

నాడు పోస్టు చేయడమైనది: 29 SEP 2026 12:11PM by PIB Hyderabad

షాంఘై వేదికగా జరుగుతున్న 48వ వరల్డ్‌స్కిల్స్ పోటీలు-2026లో జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ (ఎన్ఐఎఫ్‌టీ) గణనీయమైన విజయాన్ని నమోదు చేసింది. ఫ్యాషన్ సాంకేతికత, డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్, రిటైల్ అమ్మకాలు, విజువల్ మర్కండైజింగ్ వంటి కీలక ఫ్యాషన్, సృజనాత్మక నైపుణ్య విభాగాల్లో ఎన్ఐఎఫ్‌టీ విద్యార్థులు, నిపుణులు భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

చైనాలోని షాంఘైలో 2026 సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు వరల్డ్‌స్కిల్స్ షాంఘై-2026 పోటీలు నిర్వహించారు. ఇందులో సుమారు 68 దేశాలు, ప్రాంతాల నుంచి 64 నైపుణ్య విభాగాల్లో 1,400 మందికి పైగా యువ పోటీదారులు పాల్గొన్నారు. భారత్ తొలిసారి 63 నైపుణ్య విభాగాల్లో ఇప్పటి వరకు లేనంతగా 70 మంది పోటీదారులతో పాల్గొని భారత్ 6 రజత పతకాలు, 20 అత్యుత్తమ ప్రతిభ (ప్రావీణ్యం) పతకాలతో 10వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఈ పోటీల్లో ఎన్ఐఎఫ్‌టీ ఫ్యాషన్ సాంకేతికత, విజువల్ మర్కండైజింగ్, రిటైల్ అమ్మకాలు, డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్ వంటి నాలుగు నైపుణ్య విభాగాలకు ప్రాతినిధ్యం వహించింది. సృజనాత్మక, డిజిటల్, రిటైల్ ఆధారిత నైపుణ్య విభాగాల్లో ఫ్యాషన్ విద్యకు పెరుగుతున్న ప్రాధాన్యతను ఈ భాగస్వామ్యం ప్రతిబింబించింది. ఎన్ఐఎఫ్‌టీ విద్యార్థులు మూడు నైపుణ్య విభాగాల్లో 2 రజత పతకాలు, ఒక ప్రావీణ్య పతకం సాధించడంతో ఈ విజయంలో ఎన్ఐఎఫ్‌టీ భాగస్వామ్యం గణనీయంగా దోహదపడింది.

వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో ఫ్యాషన్ టెక్నాలజీ విభాగంలో ఎన్ఐఎఫ్‌టీకి సుదీర్ఘ భాగస్వామ్యం ఉంది. 2011 నుంచి ఈ నైపుణ్య విభాగంలో ఎన్ఐఎఫ్‌టీ పాల్గొంటోంది. షాంఘై-2026లో ఎన్ఐఎఫ్‌టీ గాంధీనగర్ నుంచి ఫ్యాషన్ డిజైన్‌లో పట్టభద్రురాలైన శ్రీమతి విధి నీరవ్‌కుమార్ సుతార్ ఫ్యాషన్ టెక్నాలజీ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి, ప్రావీణ్య పతకాన్ని అందుకున్నారు.

భారతీయ నిపుణురాలు, ప్రొఫెసర్ (డాక్టర్) మోనికా గుప్తా, ఎన్ఐఎఫ్‌టీ శిక్షణ బృందం మార్గదర్శకత్వంలో విధికి ఎన్ఐఎఫ్‌టీ న్యూఢిల్లీలో నాలుగు నెలలపాటు ప్రత్యేకంగా శిక్షణను అందించారు. ఫ్యాషన్ డిజైన్, వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో విస్తృత అనుభవం ఉన్న ప్రొఫెసర్ గుప్తా, శిక్షణ కాలమంతా విధికి ప్రత్యేక శిక్షణ, మార్గదర్శకత్వాన్ని అందించారు. సాంకేతిక నైపుణ్యం, కచ్చితత్వం, అంతర్జాతీయ ప్రమాణాల పాటింపు, వరల్డ్‌స్కిల్స్ పోటీల పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందించడంపై ఈ శిక్షణలో ప్రధానంగా దృష్టి సారించారు.

 

డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్ విభాగంలో ఎన్ఐఎఫ్‌టీ ముంబయికి చెందిన కోవిద్ అజయ్ గాంగ్రడే రజత పతకం సాధించారు. రిటైల్ అమ్మకాల విభాగంలో ఎన్ఐఎఫ్‌టీ పంచకులాకు చెందిన సానియా జోషి రజత పతకం గెలుచుకున్నారు. వరల్డ్‌స్కిల్స్ షాంఘై-2026లో కొత్తగా అభివృద్ధి చెందుతున్న నైపుణ్య విభాగాల్లో రిటైల్ అమ్మకాలు, డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్ కూడా ఉండటంతో వీరి విజయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫ్యాషన్, సృజనాత్మక పరిశ్రమల్లో వస్తున్న మార్పులు, సాంకేతికత, డిజిటల్ వేదికలు, వినియోగదారుల అనుభవం ఈ రంగంతో మరింతగా అనుసంధానమవుతున్న తీరును ఈ విభాగాలు ప్రతిబింబిస్తున్నాయి.

 

ఎన్ఐఎఫ్‌టీ భాగస్వామ్యం విజువల్ మెర్చండైజింగ్ విభాగానికీ విస్తరించింది. ఈ నైపుణ్య విభాగంలో ఎన్ఐఎఫ్‌టీ బెంగళూరుకు చెందిన అనూజ అజయ్ వారే భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

 

ఎన్ఐఎఫ్‌టీ దృష్టిలో వరల్డ్‌స్కిల్స్ ప్రయాణం కేవలం అంతర్జాతీయ పోటీలో పాల్గొనడం మాత్రమే కాదు. దీని ద్వారా విద్యార్థులకు ప్రపంచ స్థాయి వృత్తిపరమైన ప్రమాణాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, అంతర్జాతీయ ప్రమాణాలు, పరిశ్రమ అంచనాలపై పూర్తి అవగాహన లభిస్తుంది. ఈ అనుభవం ద్వారా ఎన్ఐఎఫ్‌టీ తన శిక్షణ పద్దతులను నిరంతరం మెరుగుపరుచుకోవడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తమ విద్యా, నైపుణ్యాభివృద్ధి వ్యవస్థలో చేర్చుకునే అవకాశం లభిస్తుంది.

 

వరల్డ్‌స్కిల్స్ షాంఘై-2026లో ఎన్ఐఎఫ్‌టీ విద్యార్థులు సాధించిన విజయాలు.. ఫ్యాషన్, సాంకేతికత, సృజనాత్మకత, రిటైల్, డిజిటల్ నైపుణ్యాలను సమన్వయం చేస్తూ, అత్యున్నత అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగల నిపుణులను తయారు చేయడంలో సంస్థకు ఉన్న నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. 

 

వరల్డ్‌స్కిల్స్ షాంఘై-2026లో పాల్గొన్న విద్యార్థులు, నిపుణులు, శిక్షకులు, అధికారులు, జౌళి మంత్రిత్వ శాఖతో పాటు వారి శిక్షణ, సన్నద్ధత, భాగస్వామ్యంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎన్ఐఎఫ్‌టీ అభినందనలు తెలిపింది.

****

 


(రిలీజ్ ఐడి: 2316743) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Khasi , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Manipuri , Tamil