సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
సాధన శృంఖల 2026: ప్రాంతీయ స్థాయిలో శిక్షణ సంస్థల రూపాంతరం దిశగా కొత్త కార్యక్రమం
శిక్షణ సంస్థల నుంచి సామర్థ్య నిర్మాణ సంస్థల దిశగా మార్పు
పౌర కేంద్రీకృత (నాగరిక్ దేవో భవ) స్ఫూర్తితో పాలన సూత్రాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం
విజయవాడ (ఆంధ్రప్రదేశ్), గువాహటి (అస్సాం), లక్నో (ఉత్తరప్రదేశ్), పూణేలో (మహారాష్ట్ర) నాలుగు ప్రాంతీయ వర్క్‌షాప్‌ల నిర్వహణ
నాడు పోస్టు చేయడమైనది:
28 SEP 2026 10:47AM by PIB Hyderabad
మిషన్ కర్మయోగి కింద శిక్షణ సంస్థలను వ్యూహాత్మక, సామర్థ్య నిర్మాణ సంస్థలుగా మార్చడానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సీబీసీ) దేశవ్యాప్తంగా ‘సాధన శృంఖల 2026’ పేరుతో ప్రాంతీయ సదస్సులను నిర్వహిస్తోంది. సాధన అంటే జాతీయ అభివృద్ధి కోసం అనుకూల అభివృద్ధి, మానవీయ సామర్థ్యాలను బలోపేతం చేయడం అని అర్థం. గత ఏప్రిల్ 2 నుంచి 8 వరకు జరిగిన సాధన సప్తాహ్ 2026, మే 15న జరిగిన ‘‘సంస్థాగత సామర్థ్య పెంపుదల: శిక్షణ నుంచి పనితీరు-ఆధారిత పాలన వరకు’’ జాతీయ శిఖరాగ్ర సదస్సుల్లో చర్చించిన అంశాల ఆధారంగా ఈ సాధన శృంఖలను రూపకల్పన చేశారు.

ఈ సాధన శృంఖల ప్రాంతీయ వర్క్‌షాప్‌లు ఒకటిన్నర రోజుల కార్యక్రమంగా రూపొందించారు. ఈ కార్యక్రమానికి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీనియర్ అధికారులు, శిక్షణ సంస్థల అధిపతులు, అధ్యాపకులు, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), పరిశ్రమ భాగస్వాములు, విషయ నిపుణులు, అంకుర సంస్థల ప్రతినిధులు ఒకే వేదికపైకి రానున్నారు.
ఈ ప్రాంతీయ సదస్సులు సెప్టెంబర్ 29, 30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో దక్షిణ ప్రాంత వర్క్‌షాప్‌తో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత అక్టోబర్ 9,10 తేదీల్లో అస్సాంలోని గువాహటిలో ఈశాన్య ప్రాంతం, అక్టోబర్ 23, 24 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉత్తర ప్రాంతం, నవంబర్ 16,17 తేదీల్లో (ఖరారు కావాల్సి ఉంది) మహారాష్ట్రలోని పూణేలో పశ్చిమ ప్రాంత వర్క్‌షాప్‌లు జరుగుతాయి. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో, ఆతిథ్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ఈ వర్క్‌షాప్‌లు ప్రారంభమవుతాయి.
విజయవాడలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు, శిక్షణా సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.
సంస్థాగత పరివర్తనపై జరుగుతున్న జాతీయ చర్చను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చడానికి, కార్యాచరణలోకి తీసుకురావడానికి ఈ సాధన శృంఖల ఆయా ప్రాంతాలకు తీసుకెళ్తోంది. శిక్షణ సంస్థలు కేవలం శిక్షణ ఇచ్చే సాధారణ సంస్థల నుంచి వ్యూహాత్మక, నైపుణ్య ఆధారిత సామర్థ్య నిర్మాణ సంస్థలుగా మారడానికి ఒక సమగ్ర మార్గదర్శక వ్యవస్థ అవసరమని గతంలో జరిగిన చర్చలు స్పష్టం చేశాయి.
వివిధ రాష్ట్రాలు, శిక్షణ సంస్థలు, ఇతర భాగస్వామ్య వర్గాలను భాగస్వాములను చేస్తూ, వివిధ సంస్థల అవసరాలకు శిక్షణ సంస్థలను సామర్థ్య నిర్మాణ సంస్థలుగా తీర్చిదిద్దడమే ఈ ప్రాంతీయ వర్క్‌షాప్‌ల ప్రధాన ఉద్దేశం. ఇందులో సామర్థ్య నిర్మాణ ప్రణాళికలు (సీబీపీలు) కీలకంగా ఉంటాయి. ప్రభుత్వంలో వివిధ బాధ్యతలు నిర్వహించే సిబ్బందికి అవసరమైన నైపుణ్యాలను గుర్తించి, వాటికి అనుగుణంగా సంస్థలు చేపట్టాల్సిన చర్యలను ఈ ప్రణాళికలు నిర్దేశిస్తాయి. “సరైన పాత్రకు, సరైన సమయంలో, సరైన సామర్థ్య నిర్మాణం” అందించడమే దీని లక్ష్యం. ఈ సమావేశాల్లో సంస్థల పాలన, నాయకత్వాన్ని మెరుగుపరిచే విధానాలు, సంస్థల పనితీరు, పరస్పర సహకారం, కర్మయోగి నాణ్యతా విధానానికి (కేక్యూఎఫ్) అనుగుణంగా శిక్షణ నాణ్యతను పెంచడం, బోధకులు, సిబ్బంది నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, డిజిటల్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను క్రమబద్ధంగా వినియోగించడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ఈ సంస్థాగత పరివర్తన అమలును ఏకీకృత నూతన తరం జాతీయ శిక్షణా కార్యక్రమం (యూఎన్ఎన్ఏటీఐ- ఉన్నతి) వేదిక ద్వారా ముందుకు తీసుకెళ్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 900కు పైగా శిక్షణ సంస్థలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం ద్వారా, ఈ ఫ్రేమ్‌వర్క్ లక్ష్యాలను ఉన్నతి వేదిక ఆచరణలోకి తెస్తుంది. ఇది సంస్థల మధ్య స్పష్టతను, సహకారాన్ని పెంపొందించడమే కాకుండా డాటా ఆధారంగా నిరంతర అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే ఉన్నతి ఎక్స్ఛేంజ్ వ్యవస్థ ద్వారా వివిధ శిక్షణా కోర్సులు, అధ్యాపకులు, మౌలిక వసతులను అన్ని శిక్షణా సంస్థలు పరస్పరం పంచుకోవడానికి, వినియోగించుకోవడానికి వీలు కలుగుతుంది.
ఈ ప్రాంతీయ సదస్సుల ద్వారా వచ్చే విలువైన సూచనలు, అభిప్రాయాలు శిక్షణా సంస్థల పరివర్తన ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేయడానికి ఎంతగానో దోహదపడతాయి. ఇది వికసిత్ భారత్ @ 2047 దిశగా ఆశా కార్యకర్తల నుంచి కార్యదర్శుల వరకు ప్రభుత్వంలోని అన్ని స్థాయిల అధికారులను పౌరులకు మెరుగైన సేవలు అందించేలా సన్నద్ధం చేయడంలో మిషన్ కర్మయోగి అంకితభావాన్ని తెలియజేస్తుంది.
ఈ సాధన శృంఖల కార్యక్రమం నాగరిక్ దేవో భవ (పౌరుడే దేవుడు) అనే పౌర కేంద్రీకృత స్పూర్తి ఆధారంగా సుపరిపాలన మూల సూత్రాలను ముందుకు తీసుకెళ్తుంది. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు జన భాగస్వామ్య స్ఫూర్తిని విస్తరిస్తూ... మిషన్ కర్మయోగి కింద అత్యంత వేగవంతమైన, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పనిచేసే ఒక సమగ్ర సామర్థ్య నిర్మాణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2315986)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7