హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వీహెచ్‌పీ మాజీ అధ్యక్షుడు అశోక్‌ సింఘాల్‌ శతజయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా


త్యాగం, నిరాంబడరత్వం, అసమాన దేశభక్తి, ధర్మ నిబద్ధత, పోరాట స్ఫూర్తి వంటి సద్గుణాల సమ్మిళితం అశోక్‌ జీ జీవితం - ఆయన శత జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశమవ్వడం మనకందరికీ గర్వకారణం.

విద్యార్థిగా, స్వయంసేవక్‌గా, ప్రచారక్‌గా మొదలుకొని విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ అధ్యక్షుడిగా సేవలందించే వరకు జీవితంలోని ప్రతి దశలో ఆదర్శంగా నిలిచిన అశోక్‌ జీ - జీవితాన్ని పూర్తిగా హిందూత్వానికి అంకితం చేసి చివరి శ్వాస వరకు ఆ సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నారు

సంపన్నమైన, గౌరవప్రతిష్ఠలు కలిగిన కుటుంబంలో జన్మించినప్పటికీ వీహెచ్‌పీ కార్యాలయంలోని చిన్న గదిలో నివసిస్తూ 20 ఏళ్ల పాటు సేవలందించిన అశోక్ జీ- ఆ రెండు దశాబ్దాల ఆయన జీవితం యువ కార్యకర్తలకు కూడా నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంది

అశోక్‌ జీ వ్యక్తిగా గాక ఒక సంస్థగా ప్రదర్శించిన త్యాగం, నిరాడంబరత, అంకితభావం ఈ శతజయంతి సంవత్సరంలో కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయి

అనారోగ్యంతో పాటు వయసు మీద పడిన దశలోనూ ఆయన రోజుకు 16 గంటల పాటు పని చేసేలా ప్రేరేపించిన ఏకైక శక్తి ఆయన ఆదర్శప్రాయమైన దేశభక్తే

హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, భారతీయ సంస్కృతి, సాధుసంతుల సంప్రదాయంపై అశోక్‌ జీకి అపారమైన గౌరవం - వాటి పరిరక్షణ, ప్రచారం కోసం ఆయన తన జీవితాంతం సంపూర్ణ అంకితభావంతో పనిచేశారు

హిందువులు మాత్రమే హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని కాదు - యావత్‌ ప్రపంచ సంక్షేమం గురించి ఆలోచించే ధర్మం హిందూ ధర్మం ఒక్కటే కాబట్టి దానిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని అశోక్‌ జీ తరచూ చెప్పేవారు

రామ జన్మభూమి ఉద్యమం ఆయన ఆలోచనల్లో బలంగా నాటుకుపోయింది. విదేశీ పాలన కాలం నాటి అవశేషాలను తొలగించి, భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించినప్పుడే భారత్‌ ప్రపంచంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతుందని ఆయన విశ్వసించేవారు

ఆయన వ్యక్తిగత జీవితం, ప్రజా జీవితం మధ్య ఎలాంటి భేదం ఉండేది కాదు. దేశం కోసం జీవించాలనే మంత్రాన్ని ఆచరించిన ఆయన, తన వ్యక్తిగత జీవితాన్ని ఈ మహత్తర లక్ష్యంతో మమేకం చేసుకున్నారు. సంస్థ కార్యాన్ని ఒక ఆధ్యాత్మిక సాధనగా భావించి దానికి పూర్తిగా అంకితమయ్యారు

సమాజం తన వీరులను, మహనీయులను మరచిపోయినప్పుడు ఒక భావజాల శూన్యత ఏర్పడుతుంది. దీంతో యువత తమ ఆదర్శాలను సుదూర నాగరికతల్లో వెతుక్కోవడం ప్రారంభిస్తుంది. అందుకే అశోక్‌ జీ జీవితానికి, ఆయన శతజయంతి ఉత్సవాలకు ఎంతో ప్రా

నాడు పోస్టు చేయడమైనది: 27 SEP 2026 7:40PM by PIB Hyderabad

విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) మాజీ అధ్యక్షుడు అశోక్‌ సింఘాల్‌ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించిన శతజయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

శ్రీ అమిత్‌ షా మాట్లాడుతూ, పూజ్యనీయులైన అశోక్‌ జీ శతజయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ గర్వకారణమని అన్నారు. అశోక్‌ జీ వందేళ్ల కిందట జన్మించారని, తన జీవితంలోని ప్రతి దశలోనూ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. విద్యార్థిగా రాణించారని, స్వయంసేవక్‌గా విశిష్ట సేవలందించారని, ప్రచారక్‌గా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారని తెలిపారు. విశ్వ హిందూ పరిషత్‌ బాధ్యతలు అప్పగించిన తర్వాత, చివరి శ్వాస వరకు ఆయన అచంచలమైన నిబద్ధతతో హిందూత్వానికి అంకితమైన జీవితాన్ని కొనసాగించి తన లక్ష్యాన్ని సాధించారని అన్నారు. ఇలాంటి వ్యక్తిత్వాలు అరుదుగా కనిపిస్తాయని శ్రీ షా పేర్కొన్నారు. త్యాగం, నిరాడంబరత, అసామాన్య దేశభక్తి, ధర్మ నిబద్ధత, స్వయంసేవక్‌ ఆదర్శాల పట్ల అంకితభావం, పోరాట స్ఫూర్తి మొదలైన సద్గుణాలన్నీ అశోక్‌ జీ జీవితంలో సమాహారమై ఉన్నాయని శ్రీ షా అన్నారు. అత్యంత గౌరవప్రతిష్ఠలు, సంపద కలిగిన కుటుంబంలో జన్మించినప్పటికీ శ్రీ అశోక్ తన జీవన విధానంలో నిరాడంబరతను చివరి వరకు పాటించారని, దాని ఫలితాన్ని నేడు మనం చూస్తున్నామని శ్రీ అమిత్ షా అన్నారు. ఐదున్నర శతాబ్దాలుగా మొత్తం హిందూ సమాజం త్యాగాలు చేస్తూ, పోరాడుతూ, ఏకమై ఎదురుచూసిన రామ జన్మభూమి మందిర నిర్మాణాన్ని మనం నేడు సాకారం చేసుకున్నామని శ్రీ షా అన్నారు. అశోక్‌ జీ తన జీవితంలో 20 సంవత్సరాలు గడిపిన వీహెచ్‌పీ కార్యాలయంలోని గది నేడు దాదాపు కార్యకర్తలకు ఒక స్ఫూర్తిదాయక ప్రదర్శనశాలగా మారిందని తెలిపారు. అంతటి నిరాడంబరమైన జీవితం గడుపుతూ, ఆదర్శప్రాయమైన దేశభక్తిని నిలబెట్టుకోవడం నిజంగా అరుదైన విషయమని శ్రీ షా పేర్కొన్నారు.

వయసు మీద పడిన తరువాత కూడా అశోక్‌ జీ రోజుకు పదహారు గంటలు పనిచేసేవారని శ్రీ అమిత్‌ షా అన్నారు. ఆయనకు ఏకైక ప్రేరణ ఆదర్శప్రాయమైన దేశభక్తేనని పేర్కొన్నారు. హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, భారతీయ సంస్కృతి, సాధు సంతుల సంప్రదాయం పట్ల అశోక్‌ జీకి అపారమైన గౌరవం ఉండేదని తెలిపారు. జీవితాంతం వీటన్నింటి పట్ల ఆయన లోతైన భక్తి, గౌరవభావాలను కొనసాగించారని అన్నారు. సమస్త విశ్వ సంక్షేమానికి ఎవరైనా లేదా ఏదైనా తోడ్పడగలిగితే అది హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులేనని ఆయన విశ్వసించేవారని శ్రీ షా పేర్కొన్నారు. శాంతి మంత్రాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, హిందూ ధర్మ ప్రతిష్ఠను పెంచి, దానిని ప్రపంచవ్యాప్తంగా స్థాపించాలన్న లక్ష్యం కేవలం మనం హిందువులం కాబట్టి కాదని, హిందూ ధర్మం సమస్త విశ్వ సంక్షేమాన్ని కాంక్షిస్తుంది కాబట్టేనని ఆయన స్పష్టం చేశారు. గురు గోల్వాల్కర్‌ చెప్పినట్లుగా మన లక్ష్యానికి పునాది నిస్వార్థమైన, స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే కావాలని, మరేదీ కాదని ఆయన పేర్కొన్నారు. అలాంటి ఉన్నత వ్యక్తిత్వం తోనే ఆయన జీవితాంతం స్వయంసేవక్‌గానే కొనసాగారని అన్నారు. అశోక్‌ జీ ఎలాంటి ప్రశంసలు, ప్రచారం కోరుకోకుండా ప్రచారక్‌ జీవితంలోని ప్రతి నియమాన్ని నిబద్ధతతో పాటించారని శ్రీ షా తెలిపారు.

పోరాటం విషయానికి వస్తే అశోక్‌ జీ పోరాట స్ఫూర్తి గురించి అందరికీ తెలుసునని అన్నారు. రామ జన్మభూమి ఉద్యమం ఆయన హృదయంలో, ఆలోచనల్లో బలంగా నాటుకుపోయిందని పేర్కొన్నారు. బానిసత్వపు కళంకాన్ని తొలగించి, భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించినప్పుడే భారత్‌ ప్రపంచంలో వైభవం, గౌరవప్రతిష్ఠలు కలిగిన స్థానాన్ని పొందగలదని ఆయన దృఢంగా విశ్వసించారని తెలిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి ఆయన తన జీవితాన్నంతటినీ అంకితం చేశారని అన్నారు. అప్పటి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం లాఠీచార్జికి ఆదేశించినప్పుడు, అశోక్‌ జీ మారువేషంలో ముందు వరుసలోకి వెళ్లారని శ్రీ షా తెలిపారు. ఆ లాఠీచార్జిలో ఆయన కూడా గాయపడ్డారని పేర్కొన్నారు. అశోక్‌ జీ తన ముఖం నుంచి కారుతున్న రక్తాన్ని గమ్ఛాతో తుడుచుకుంటున్న దృశ్యం రాబోయే వందేళ్ల పాటు యువత జ్ఞాపకాల్లో చెరగని ముద్రగా నిలవాలని అన్నారు. నిజమైన అంకితభావం అంటే ఏమిటో అశోక్‌ జీ జీవితం, ఆయన కార్యాచరణ స్పష్టంగా తెలియజేస్తాయని శ్రీ షా పేర్కొన్నారు.

సాధు సంతుల సంస్థ విశ్వ హిందూ పరిషత్‌, రామ జన్మభూమి ఉద్యమం, రామ మందిర నిర్మాణం, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ వంటి అంశాలు అశోక్‌ జీ హృదయానికి అత్యంత సన్నిహితమైనవని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ అంశాలపై ఆయన ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడటంతో పాటు, వాటి అభివృద్ధి, పురోగతి కోసం కృషి చేశారని తెలిపారు. ఈ సంస్థలు, ఉద్యమాలన్నీ క్రమంగా ఆయన వ్యక్తిత్వానికి ప్రతిరూపాలుగా మారాయని పేర్కొన్నారు. అశోక్‌ జీ స్వయంగా ఒక సంస్థగా నిలిచారని శ్రీ షా అన్నారు. అశోక్ జీ శత జయంతి వేడుకలు అనేకమంది యువకులకు వారి జీవితాంతం స్ఫూర్తినిచ్చే మూలంగా నిలుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన జీవిత సారం, ఆయన తపస్సు, ఆయన సరళత, ఆయన అంకితభావం, కృషి ప్రతి యువకుడూ ఆదర్శంగా తీసుకోవాల్సిన సద్గుణాలని అన్నారు. అశోక్‌ జీ జీవితం సహజంగానే యువతలో స్ఫూర్తిని రగిలిస్తూ, వారిని నిరంతరం ప్రేరేపిస్తుందని శ్రీ షా పేర్కొన్నారు.

అశోక్‌ జీ వ్యక్తిగత జీవితం, ప్రజా జీవితం మధ్య ఎలాంటి భేదం ఉండేది కాదని అన్నారు. దేశం కోసం జీవించాలనే ఆదర్శాన్ని ఆయన తన జీవితంలో అంతర్భాగంగా చేసుకుని తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా ఆ సూత్రంతో మమేకం చేశారని పేర్కొన్నారు. సంస్థ పనులను ఒక ఆధ్యాత్మిక సాధనగా భావించి స్వీకరించారని తెలిపారు. అశోక్ జీ పేరును కేవలం గుర్తుంచుకోవడమే ఈ కార్యక్రమ ఉద్దేశం కాదని, ఆయన విశిష్ట గుణాలను ప్రతి ఇంటికి, ముఖ్యంగా యువత వద్దకు తీసుకెళ్లడమే ఈ శత జయంతి సంవత్సర ప్రయత్నమని చెప్పారు. ప్రచారాన్ని కోరుకోని వ్యక్తికి శత జయంతి వేడుకలను జరపాల్సిన అవసరం ఏమిటని కొందరు కొందరు అడుగుతున్నారని, “కృతజ్ఞత అనేది కేవలం ఒక భావోద్వేగం కాదు; అది జాతీయ అవసరం” అని శ్రీ షా అన్నారు. అశోక్‌ జీ పట్ల దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తమ కృతజ్ఞతను వ్యక్తం చేసేందుకు ఆయన శతజయంతి నిర్వహించడం అవసరమని శ్రీ అమిత్‌ షా అన్నారు. ఒక దేశం, సమాజం తమ మహనీయులను స్మరించుకోకుండా, వారి జీవితాలు, బోధనలను యువతకు చేరవేయడంలో విఫలమైనప్పుడు భావజాల శూన్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఆదర్శంగా తీసుకునే వ్యక్తులు, అనుసరించాల్సిన దిశ, స్ఫూర్తిని పొందేందుకు ఆధారం లేనప్పుడు ప్రజలు వేల కిలోమీటర్ల దూరంలోని ఇతర నాగరికతల్లో తమ ఆదర్శాలను వెతుక్కోవడం ప్రారంభిస్తారని తెలిపారు. అందువల్ల సమాజంలో భావజాల శూన్యత ఏర్పడకుండా చూడటం, ప్రజల ముందు అనుసరణీయమైన ఆదర్శాలను ఉంచడం, అశోక్‌ జీ జీవితం నుంచి దిశానిర్దేశం, స్ఫూర్తి పొందేలా చేయడం ఎంతో అవసరమని శ్రీ షా పేర్కొన్నారు. అందుకే ఆయన శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం అత్యంత ముఖ్యమని అన్నారు.

హిందూత్వ సారాన్ని ప్రతిబింబించే పలు సేవా కార్యక్రమాల ప్రదర్శనలను నేడు వీక్షించామని శ్రీ షా అన్నారు. సంత్‌ రవిదాస్‌, మహర్షి వాల్మీకి ఆలయాల్లో ప్రార్థనలు, ప్రయాగ్‌రాజ్‌లో గంగా హారతి, గంగా పరిరక్షణ, గోమాత సేవ, రామసేతు ఉద్యమ స్మరణ, అయోధ్యలో కృత్రిమ అవయవాల పంపిణీ వంటి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయని తెలిపారు. అలాగే, 11 శ్రీరామ స్తంభాలను డిజిటల్‌గా ప్రారంభించామని శ్రీ షా పేర్కొన్నారు. వనవాస సమయంలో శ్రీరాముడు సాగిన మార్గానికి ఈ స్తంభాలు గుర్తుగా నిలుస్తాయని తెలిపారు. ఒక్క మాట కూడా పలకకుండానే, ఈ స్తంభాలు రాబోయే తరాలకు రామ వనగమన మార్గం, శ్రీరాముని సద్గుణాల సందేశాన్ని చేరవేస్తాయని అన్నారు.

రామ జన్మభూమి ఉద్యమం కోసం తనను పూర్తిగా అంకితం చేసుకున్న అశోక్‌ జీ భూమిపూజను చూడలేకపోవడం, ఆలయ నిర్మాణం పూర్తవడాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేకపోవడం బాధాకరమని అన్నారు. అయితే, తన కృషి ఫలితాన్ని తన జీవితకాలంలోనే చూడాలన్న ఉద్దేశంతో ఆయన ఎప్పుడూ పనిచేయలేదని పేర్కొన్నారు. ఇది తరతరాలుగా కొనసాగే పోరాటమని ఆయన ఎప్పుడూ చెప్పేవారని తెలిపారు. ఎందరో పోరాడతారని, అనేక తరాలు గడిచిన తర్వాతే విజయం సాధ్యమవుతుందని అశోక్‌ జీ చెప్పేవారని శ్రీ షా అన్నారు. 2014లో దేశంలో చోటుచేసుకున్న మార్పు పాలన దిశనే మార్చిందన్న విషయాన్ని అశోక్‌ జీ ఆత్మ ఎక్కడ ఉన్నా తప్పకుండా అనుభూతి చెందుతూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కేవలం ఐదేళ్లలోనే ప్రభుత్వపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయని, ఎలాంటి రక్తపాతం లేకుండా ప్రభు శ్రీరాముని భవ్యమైన ఆలయం నిర్మితమైందని ఆయన అన్నారు. ఇది దేశానికి మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముని భక్తులందరికీ శాంతి, సంతృప్తిని కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు.

రామ మందిర నిర్మాణం భారత్‌ ప్రగతికి కొత్త మార్గాన్ని తెరుస్తుందన్న అశోక్‌ జీ విశ్వాసాన్ని తాను కూడా పంచుకుంటున్నానని అన్నారు. మన ఆలోచనలు, మన సంస్కృతి, మన ధర్మం, దాని సద్గుణాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరుతాయని పేర్కొన్నారు. హిందూత్వ సూత్రాలకు కట్టుబడి ఉండాలని అశోక్‌ జీ విశ్వసించేవారని, హిందూత్వ ఆదర్శాల ఆధారంగానే సమస్త విశ్వ సంక్షేమం సాధ్యమవుతుందని ఆయన నమ్మేవారని శ్రీ షా తెలిపారు. రాబోయే తరాల్లోనూ దేశ యువత అశోక్‌ జీ వ్యక్తిత్వం, జీవితం, సేవలు, మాటల నుంచి విలువలను, స్ఫూర్తిని పొందుతూనే ఉంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2315825) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati