వ్యవసాయ మంత్రిత్వ శాఖ
2026 రబీ సీజన్ పై న్యూఢిల్లీలో రేపటి నుంచి రెండు రోజుల జాతీయ సదస్సు
కేంద్ర - రాష్ట్ర సమన్వయాన్ని బలోపేతం చేయడం,
ఫలితాల ఆధారిత వ్యవసాయ వ్యూహాన్ని రూపొందించడంపై సదస్సులో చర్చ
రాబోయే రబీ సీజన్‌కు సంబంధించిన కీలక ప్రాధాన్య అంశాలు, సన్నద్ధతపై చర్చించనున్న రాష్ట్ర వ్యవసాయ శాఖల మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్, ఇతర భాగస్వాములు
నాడు పోస్టు చేయడమైనది:
27 SEP 2026 10:19AM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో 2026 రబీ సీజన్ కోసం జాతీయ వ్యవసాయ సదస్సును సెప్టెంబర్ 28, 29 తేదీల్లో న్యూఢిల్లీలోని పూసా, ఎన్ఏఎస్‌సీ కాంప్లెక్స్‌లో ఉన్న భారతరత్న సి. సుబ్రమణ్యం ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్‌కు సంబంధించిన కీలక ప్రాధాన్య అంశాలు, సన్నద్ధతపై చర్చించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖల మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్, ఇతర భాగస్వాములు ఈ సదస్సులో పాల్గొంటారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత, సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన, ఫలితాల ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై దృష్టి సారించనున్నారు. ఇటీవల నిర్వహించిన జోనల్ వ్యవసాయ సదస్సుల్లో వెలువడిన ముఖ్యమైన అనుభవాలు, ఫలితాలను కూడా ఈ చర్చల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
సదస్సు తొలి రోజున మూడు విస్తృత అంశాలపై ఒకే సమయంలో మూడు విడతల్లో అంశాల ఆధారిత (థీమాటిక్) గ్రూప్ చర్చలు నిర్వహించనున్నారు. వీటిలో ఆత్మనిర్భరత, పంటల వైవిధ్యీకరణ, ఉత్పత్తి పెంపు, సుస్థిరత, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరులు, విపత్తుల నిర్వహణ అంశాలు ఉన్నాయి. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఆయిల్ పామ్‌లో ఆత్మనిర్భరత సాధించే మిషన్, ఉద్యానవన పంటలు, పత్తి, విత్తనాల లభ్యత, విత్తన విలువ శ్రేణిలో సంస్కరణలు, ప్రకృతి వ్యవసాయం, నేల ఆరోగ్యం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతు ఉత్పత్తిదారులసంస్థ (ఎఫ్‌పీఓ) లకు ఆర్థిక సహాయం, మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ సంస్కరణలు, పీఎం ధన్–ధాన్య కృషి యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు పరిధి, డిజిటల్ వ్యవసాయం, పీఎం ఫసల్ బీమా యోజన, మొక్కల సంరక్షణ, వ్యవసాయ గణాంకాలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.
రబీ సీజన్‌లో అమలు చేయాల్సిన కీలక అంశాలు, రాష్ట్రాల వారీ ప్రాధాన్యాలు, ఆచరణాత్మక వ్యూహాలను గుర్తించడం ఈ అంశాల వారీ చర్చల ప్రధాన ఉద్దేశం. వివిధ పథకాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం, సేవలను అందచేసే వ్యవస్థలను బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు సమర్థంగా సాధించేలా చూడడంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
జోనల్ వ్యవసాయ సదస్సుల్లో వెలువడిన ముఖ్యమైన అనుభవాలు, తొలిరోజు నిర్వహించిన థీమాటిక్ చర్చల ఫలితాలపై సదస్సు రెండో రోజున దృష్టి సారించనున్నారు. రబీ సీజన్‌కు సంబంధించిన వాతావరణ అంచనాలు, ఎరువుల లభ్యత, ఎరువులను సమతుల్యంగా వినియోగించడం, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, రైతు రిజిస్ట్రీ, డిజిటల్ క్రాప్ సర్వే, అగ్రిస్టాక్, పప్పుధాన్యాల్లో ఆత్మనిర్భరత సాధించే మిషన్, వంట నూనెలపై జాతీయ మిషన్, పంటలు, విత్తనాల పరిస్థితి, పంట రకాల స్వీకరణ, పీఎం ధన్ - ధాన్య కృషి యోజన, మార్కెటింగ్ సంస్కరణలు, ఏటీఎంఏ, కేవీకేల ద్వారా వ్యవసాయ ప్రణాళికల రూపకల్పన వంటి అంశాలు రెండో రోజు ఎజెండాలో ఉంటాయి.
రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు తమ అభిప్రాయాలు, అనుభవాలు, రాష్ట్రాల ప్రాధాన్య అంశాలు, వ్యవసాయ అభివృద్ధి, రబీ సీజన్ సన్నద్ధతకు సంబంధించిన సూచనలను పంచుకునేందుకు ఈ సదస్సు అవకాశం కల్పిస్తుంది. రాష్ట్రాల నుంచి వచ్చే సూచనలు థీమాటిక్ చర్చల్లో వెలువడిన ఫలితాలతో కలిసి 2026 రబీ ప్రచారానికి సమన్వయంతో కూడిన, ఫలితాల ఆధారిత వ్యూహాన్ని రూపొందించేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు.
ముగింపు సమావేశంలో చర్చల సారాంశాన్ని సమన్వయపరచి ఆహార, పోషకాహార భద్రత కోసం ఆత్మనిర్భరత, వికసిత భారత్ ఆశయాన్ని నెరవేర్చడానికి రబీ పంటల ఉత్పత్తిని పెంపొందించడం, రైతులను సాధికారులుగా చేయడం కోసం ఒక సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2315820)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2