ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
యూఎన్ ఉన్నతస్థాయి సమావేశంలో ప్రపంచ మహమ్మారిపై సంసిద్ధతను, ప్రతిస్పందనను బలపరిచేందుకు భారత్ నిబద్ధతను స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ
ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారి ఒప్పందం ద్వారా వ్యాధికారక క్రిములకు సంబంధించిన సమాచారాన్ని న్యాయమైన పద్ధతిలో పొందటం, ప్రయోజనాలను పంచుకునేందుకు శ్రీమతి శ్రీ వాత్సవ పిలుపు
కొవిడ్-19 సమయంలో సుమారు 100 దేశాలకు 30 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులను, 150కి పైగా దేశాలకు వైద్య సహాయం అందించిన భారత్: శ్రీమతి పుణ్య సలీలా శ్రీ వాత్సవ
మహమ్మారిని ఎదుర్కోవటం అందరి బాధ్యత... సమానత్వం, ప్రపంచ ఐక్యత అత్యంత కీలకమన్న శ్రీమతి శ్రీ వాత్సవ
ప్రపంచ మహమ్మారి సన్నద్ధతను బలోపేతం చేయటానికి అత్యవసర చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చిన డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గెబ్రెయేసస్
నాడు పోస్టు చేయడమైనది:
26 SEP 2026 9:16AM by PIB Hyderabad
న్యూయార్క్‌లో సెప్టెంబర్ 25న 'మహమ్మారి నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందన'పై ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత్ తరఫున కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ ప్రాతినిధ్యం వహించారు. అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రపంచ ఆరోగ్య భద్రతను బలోపేతం చేసేందుకు భారత్ నిబద్ధతతో ఉన్నట్లు స్పష్టం చేశారు. కొవిడ్-19 మహమ్మారి నేర్పిన పాఠాలను నిరంతర పెట్టుబడులు, సంస్థాగత సామర్థ్యం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలుగా మలచాల్సిన అవసరాన్ని తెలియజేశారు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి శ్రీమతి శ్రీవాత్సవ ప్రసంగిస్తూ... మహమ్మారి నివారణ, ప్రతిస్పందన కోసం ప్రభుత్వం, సమాజ భాగస్వామ్యంతో కూడిన భారతదేశ సమన్వయ విధానాన్ని వివరించారు. ఇది ఆరోగ్య అత్యవసర పరిస్థితులను విస్తృతంగా కవర్ చేస్తుంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు సమర్థవంతంగా స్పందించేలా వ్యవస్థలు సిద్ధంగా ఉండేలా చూడటానికి ప్రయోగశాలల వ్యవస్థలు, అత్యవసర సమన్వయం, ఆరోగ్య కార్యకర్తలు, నిల్వలు, క్లినికల్ కేర్ సామర్థ్యాన్ని విస్తరించేందుకు దేశం చేస్తున్న ప్రయత్నాల గురించి ఆమె మాట్లాడారు.
ఈ ప్రయత్నాలు దేశీయ ఆరోగ్య వ్యవస్థలు, అభివృద్ధి ప్రణాళికలు, స్వదేశీ నిధులపై ఆధారపడి ఉండాలని, దేశీయ బాధ్యతకు అంతర్జాతీయ సహాయం తోడ్పాటుగా ఉండాలని ఆమె పేర్కొన్నారు.
కొవిడ్-19 సమయంలో భారత్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను ప్రపంచ ఉమ్మడి సంపదగా గుర్తించాలని శ్రీమతి శ్రీవాత్సవ కోరారు. మహమ్మారి సమయంలో నిఘా, టీకాలు వేయటం, ప్రమాదాల గురించి ముందస్తుగా హెచ్చరించటం, సరఫరా వ్యవస్థలు, ఆరోగ్య సేవల నిరంతర నిర్వహణలో డిజిటల్ పరిష్కారాలు కీలక పాత్ర పోషించాయని ఆమె తెలిపారు.
సమైక్యత ప్రాముఖ్యతను, అత్యవసర ఆరోగ్య ఉత్పత్తులను అందరూ సమానంగా పొందేలా చూడాల్సిన అవసరాన్ని ఆమె స్పష్టం చేశారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో దాదాపు 100 దేశాలకు, రెండు యూఎన్ సంస్థలకు 300 మిలియన్ల వాక్సిన్ డోసులను భారత్ సరఫరా చేసిందని, 150కి పైగా దేశాలకు వైద్య సహాయాన్ని అందించినట్లు చెప్పారు. ఇది "ఒకే ప్రపంచం, ఒకే ఆరోగ్యం" సూత్రం పట్ల, గ్లోబల్ సౌత్ దేశాల పట్ల భారత్ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు.
మే-2025లో ఆమోదించిన డబ్ల్యూహెచ్‌ఓ మహమ్మారి ఒప్పందాన్ని కీలక ఘట్టంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అభివర్ణించారు. సమర్థవంతమైన పాథోజెన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ (పీఏబీఎస్) వ్యవస్థపై దీని విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. జాతీయ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ, వ్యాధికారక క్రిములు, జీవ వనరులను అందించే దేశాలకు సకాలంలో టీకాలు, నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు, సాంకేతికతలు, ఇతర ప్రయోజనాలు అందాలని అన్నారు.
పీఏబీఎస్ అనుబంధ అంశాలపై జరుగుతున్న ప్రస్తుత చర్చలను ఈ రాజకీయ ప్రకటన ముందుగానే ప్రభావితం చేయకూడదని... దేశ పరిస్థితులు, సామర్థ్యాలకు అనుగుణంగా దీన్ని అమలు చేయాలని శ్రీమతి శ్రీవాత్సవ తెలిపారు. 'వన్ హెల్త్' విధానానికి వస్తే దేశీయ చట్టాలు, అంతర్జాతీయ చట్టాలు, దేశ పరిస్థితులకు అనుగుణంగా తగిన విధంగా దీన్ని అమలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
మహమ్మారి నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందన సాధనాలు, అంచనాలు, డేటాను సమీక్షించి బలోపేతం చేయటంలో సభ్య దేశాల పాత్ర ఎంత ముఖ్యమో ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రక్రియల వల్ల విధానపరమైన ప్రభావాలు ఉంటాయని, సభ్య దేశాలతో సంప్రదించి మాత్రమే వాటిని చేపట్టాలని ఆమె పేర్కొన్నారు.
సంసిద్ధతతో ఉండటం అందరి బాధ్యతని.. భవిష్యత్తులో వచ్చే మహమ్మారులు, వ్యాప్తిని ఎదుర్కొనే ప్రయత్నాల్లో సమానత్వం కేంద్రంగా ఉండాలని శ్రీమతి శ్రీవాత్సవ అన్నారు. "ప్రపంచ ఐక్యత కేవలం మాటల్లో కాకుండా చేతల్లో కనిపించాలి" అని చెబుతూ ఆమె ప్రసంగాన్ని ముగించారు.
కొవిడ్-19 తర్వాత ప్రపంచ ఆరోగ్య భద్రతా విధానంలో సాధించిన పురోగతిని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ ప్రస్తావించారు. ఇందులో డబ్ల్యూహెచ్‌ఓ మహమ్మారి ఒప్పందం, అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలకు చేసిన సవరణలున్నాయి. పీఏబీఎస్ వ్యవస్థపై చర్చలను త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆలస్యం జరిగితే భవిష్యత్తులో మహమ్మారులను ఎదుర్కొనే ప్రపంచ సామర్థ్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు.
కొవిడ్-19 మహమ్మారి తర్వాత ఏమరుపాటుగా ఉండకూడదని, ఈ సమస్యపై రాజకీయంగా నిరంతరం దృష్టి పెట్టాలని ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మహమ్మద్ హెచ్చరించారు. ముప్పును ముందుగానే గుర్తించి, తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా కమ్యూనిటీ ఆధారిత ముందస్తు గుర్తింపు... నిఘా, సమాచార వ్యవస్థల ప్రాముఖ్యతను ఆమె స్పష్టం చేశారు.
సభ్య దేశాలు, భాగస్వాములు కలిసి భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు, పటిష్టమైన, సమానమైన, సుస్థిరమైన వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా పురోగతిని సమీక్షించటానికి, సవాళ్లను గుర్తించటానికి, ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు ఈ ఉన్నత స్థాయి సమావేశం వేదికగా నిలిచింది.
***
(రిలీజ్ ఐడి: 2315386)
సందర్శకుల సూచీ సంఖ్య : : 26